సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సాధనలో అసలైన ఉద్యమకారుడు కొండా లక్ష్మణ్ బాపూజీ అని.. అలాంటి వ్యక్తిని బీఆర్‌ఎస్ నేత కె.చంద్రశేఖర్‌రావు తీవ్రంగా అవమానించారని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి విమర్శించారు. త్యాగమనే పదం కొండా లక్ష్మణ్‌కే చెల్లుతుందని, కేసీఆర్ త్యాగాలు చేశానంటూ చెప్పుకోవడం ఏమా త్రం సరికాదని వ్యాఖ్యానించారు. సోమవారం హైదరాబాద్ నాంపల్లిలోని లలితకళాతోరణంలో జరిగిన కార్యక్రమంలో ‘ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ (ఐఐహెచ్‌టీ)ని సీఎం రేవంత్ లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం మాట్లాడారు. వివరాలు రేవంత్ మాటల్లోనే..
‘‘తెలంగాణ ఉద్యమంలో భాగంగా కేసీఆర్‌కు నీడనిచ్చిన వ్యక్తి కొండా లక్ష్మణ్. ఆయన సొంత ఇల్లు (జలదృశ్యం)ను కేసీఆర్‌కు ఇస్తే.. కనీసం మర్యాద కూడా ఇవ్వకుండా కేసీఆర్ వ్యవహరించారు. ఉద్యమం పేరుతో రాజకీయ రాజీనామాలు చేశారు. ఎలక్షన్, సెలెక్షన్, కలెక్షన్ అనే మార్గంలో భారీగా లబ్ధి పొందాడు. ఉద్యమం కోసం త్యాగం చేసిన కొండా లక్ష్మణ్‌కు ఎలాంటి ఆస్తులు లేవు. కానీ కేసీఆర్, ఆయన కుటుంబం మాత్రం టీవీ చానళ్లు, పత్రికలు, బిల్డింగులు, ఫాంహౌజ్‌లు, ఇతర ఆస్తులు సంపాదించుకున్నారు.
రాష్ట్రంలోనే చేనేత టెక్నాలజీ చదువు కోసం..
పదేళ్లపాటు అధికారంలో ఉన్న కేసీఆర్ ప్రభుత్వం ఎనాడూ చేనేతల అభివృద్ధి కోసం ఆలోచించలేదు. రాష్ట్ర విద్యార్థులు హ్యాండ్లూమ్ టెక్నాలజీ కోర్సులో చేరాలంటే.. ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు వెంకటగిరికో, ఒడిశా రాష్ట్రానికో పోవాల్సిన పరిస్థితి. రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం ఏర్పాటు కాగానే ఈ అంశం నా దృష్టికి వచ్చింది. వెంటనే ఉప ముఖ్యమంత్రి భట్టితో కలిసి ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌లకు వినతిపత్రం ఇచ్చాం.
వారు సానుకూలంగా స్పందించి ఐఐహెచ్‌టీని మంజూరు చేశారు. వెంటనే దీనిని అందుబాటులోకి వచ్చేలా అధికారులు చకచకా ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం తెలుగు యూనివర్సిటీలో తరగతులు ప్రారంభిస్తున్నా.. త్వరలో స్కిల్ యూనివర్సిటీ ప్రాంగణంలో దీనిని ఏర్పాటు చేస్తాం.
చేనేతల సంక్షేమం కోసం..
చేనేత ఉత్పత్తులంటే గత ప్రభుత్వంలో సినీతారల తళుకుబెళుకులే ఉండేవి. ఒక్క చేనేత కార్మికుడికి కూడా ప్రయోజనం కలగలేదు. గతంలో బతుకమ్మ చీరల పేరిట చేనేత కార్మికులకు పనికలి్పస్తామంటూ ఆర్భాటం చేశారే తప్ప నిధులు విడుదల చేయలేదు. మా ప్రభుత్వం తక్షణమే రూ.290కోట్ల బకాయిలు విడుదల చేసింది. బతుకమ్మ చీరల కంటే మెరుగైన నాణ్యతతో కూడిన చీరెలను 63 లక్షల మంది స్వయం సహాయక సంఘాల(ఎస్‌హెచ్‌జీ) సభ్యులకు ఇవ్వాలని నిర్ణయించాం.
ఏటా ఒక్కొక్కరికి రెండు చీరల చొప్పున పంపిణీ చేస్తాం. ఏడాదికి దాదాపు 1.30కోట్ల ఈ చీరల ఆర్డర్‌ను నేతన్నలకు ఇస్తాం. చేనేత రుణాల భారం రూ.30కోట్లను తప్పకుండా మాఫీ చేస్తాం. ప్రజా ప్రభుత్వానికి రైతన్న ఎంత ముఖ్యమో నేతన్న కూడా అంతే ముఖ్యం. ఏ సమస్య వచ్చినా పెద్దన్నలా ముందుండి పరిష్కరిస్తా..’’అని రేవంత్ చెప్పారు. కార్యక్రమంలో మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఈరవత్రి అనిల్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
మాది మాటలతో మభ్య పెట్టే ప్రభుత్వం కాదు: మంత్రి తుమ్మల
రాష్ట్రంలో అధికారంలో ఉన్న ప్రజా ప్రభుత్వం మాటలతో మభ్యపెట్టేది కాదని.. ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తున్నామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. చేనేత కార్మీకుల కోసం ప్రభుత్వం అమలు చేసే పథకాలు సమర్థవంతంగా అందేలా చూసేందుకు ముఖ్య కార్యదర్శి స్థాయిలో ఉన్న శైలజా రామయ్యర్‌కు ఆ శాఖ బాధ్యతలను అదనంగా అప్పగించామని తెలిపారు. చేనేత కార్మీకులు ఎలాంటి సమస్యలున్నా ఆమెకు నేరుగా వివరించాలన్నారు.
కాళోజీకి సీఎం రేవంత్ నివాళి
ప్రజాకవి, పద్మ విభూషణ్ కాళోజీ నారాయణరావు జయంతి సందర్భంగా సోమవారం ఆయనకు రేవంత్‌రెడ్డి నివాళులు అర్పించారు. జూబ్లీహిల్స్ నివాసంలో కాళోజీ చిత్రపటానికి పూలమాల వేసి అంజలి ఘటించారు. తెలంగాణ భాషా సాహిత్యానికి కాళోజీ చేసిన సేవలను స్మరించుకున్నారు.
ఐఐహెచ్‌టీకి కొండా లక్ష్మణ్ పేరు
తెలంగాణ ఉద్యమానికి ఎంతో స్ఫూర్తినిచ్చిన కొండాలక్ష్మణ్ బాపూజీ పేరు ఐఐహెచ్‌టీకి పెడుతున్నామని సీఎం రేవంత్ ప్రకటించారు.అనంతరం ఐఐహెచ్‌టీలో వివిధ కోర్సులు నేర్చుకుంటున్న విద్యార్థులకు నెలకు రూ.2,500 ప్రోత్సాహకాన్ని చెక్కుల రూపంలో అందించారు.
Comments
Please login to add a commentAdd a comment