Konda laxman bapuji
-
త్యాగమనే మాటే కేసీఆర్‌కు నప్పదు: సీఎం రేవంత్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సాధనలో అసలైన ఉద్యమకారుడు కొండా లక్ష్మణ్ బాపూజీ అని.. అలాంటి వ్యక్తిని బీఆర్ఎస్ నేత కె.చంద్రశేఖర్‌రావు తీవ్రంగా అవమానించారని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి విమర్శించారు. త్యాగమనే పదం కొండా లక్ష్మణ్‌కే చెల్లుతుందని, కేసీఆర్ త్యాగాలు చేశానంటూ చెప్పుకోవడం ఏమా త్రం సరికాదని వ్యాఖ్యానించారు. సోమవారం హైదరాబాద్ నాంపల్లిలోని లలితకళాతోరణంలో జరిగిన కార్యక్రమంలో ‘ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ (ఐఐహెచ్‌టీ)ని సీఎం రేవంత్ లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం మాట్లాడారు. వివరాలు రేవంత్ మాటల్లోనే.. ‘‘తెలంగాణ ఉద్యమంలో భాగంగా కేసీఆర్‌కు నీడనిచ్చిన వ్యక్తి కొండా లక్ష్మణ్. ఆయన సొంత ఇల్లు (జలదృశ్యం)ను కేసీఆర్‌కు ఇస్తే.. కనీసం మర్యాద కూడా ఇవ్వకుండా కేసీఆర్ వ్యవహరించారు. ఉద్యమం పేరుతో రాజకీయ రాజీనామాలు చేశారు. ఎలక్షన్, సెలెక్షన్, కలెక్షన్ అనే మార్గంలో భారీగా లబ్ధి పొందాడు. ఉద్యమం కోసం త్యాగం చేసిన కొండా లక్ష్మణ్‌కు ఎలాంటి ఆస్తులు లేవు. కానీ కేసీఆర్, ఆయన కుటుంబం మాత్రం టీవీ చానళ్లు, పత్రికలు, బిల్డింగులు, ఫాంహౌజ్‌లు, ఇతర ఆస్తులు సంపాదించుకున్నారు. రాష్ట్రంలోనే చేనేత టెక్నాలజీ చదువు కోసం.. పదేళ్లపాటు అధికారంలో ఉన్న కేసీఆర్ ప్రభుత్వం ఎనాడూ చేనేతల అభివృద్ధి కోసం ఆలోచించలేదు. రాష్ట్ర విద్యార్థులు హ్యాండ్లూమ్ టెక్నాలజీ కోర్సులో చేరాలంటే.. ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు వెంకటగిరికో, ఒడిశా రాష్ట్రానికో పోవాల్సిన పరిస్థితి. రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం ఏర్పాటు కాగానే ఈ అంశం నా దృష్టికి వచ్చింది. వెంటనే ఉప ముఖ్యమంత్రి భట్టితో కలిసి ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌లకు వినతిపత్రం ఇచ్చాం. వారు సానుకూలంగా స్పందించి ఐఐహెచ్‌టీని మంజూరు చేశారు. వెంటనే దీనిని అందుబాటులోకి వచ్చేలా అధికారులు చకచకా ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం తెలుగు యూనివర్సిటీలో తరగతులు ప్రారంభిస్తున్నా.. త్వరలో స్కిల్ యూనివర్సిటీ ప్రాంగణంలో దీనిని ఏర్పాటు చేస్తాం. చేనేతల సంక్షేమం కోసం.. చేనేత ఉత్పత్తులంటే గత ప్రభుత్వంలో సినీతారల తళుకుబెళుకులే ఉండేవి. ఒక్క చేనేత కార్మికుడికి కూడా ప్రయోజనం కలగలేదు. గతంలో బతుకమ్మ చీరల పేరిట చేనేత కార్మికులకు పనికలి్పస్తామంటూ ఆర్భాటం చేశారే తప్ప నిధులు విడుదల చేయలేదు. మా ప్రభుత్వం తక్షణమే రూ.290కోట్ల బకాయిలు విడుదల చేసింది. బతుకమ్మ చీరల కంటే మెరుగైన నాణ్యతతో కూడిన చీరెలను 63 లక్షల మంది స్వయం సహాయక సంఘాల(ఎస్‌హెచ్‌జీ) సభ్యులకు ఇవ్వాలని నిర్ణయించాం. ఏటా ఒక్కొక్కరికి రెండు చీరల చొప్పున పంపిణీ చేస్తాం. ఏడాదికి దాదాపు 1.30కోట్ల ఈ చీరల ఆర్డర్‌ను నేతన్నలకు ఇస్తాం. చేనేత రుణాల భారం రూ.30కోట్లను తప్పకుండా మాఫీ చేస్తాం. ప్రజా ప్రభుత్వానికి రైతన్న ఎంత ముఖ్యమో నేతన్న కూడా అంతే ముఖ్యం. ఏ సమస్య వచ్చినా పెద్దన్నలా ముందుండి పరిష్కరిస్తా..’’అని రేవంత్ చెప్పారు. కార్యక్రమంలో మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఈరవత్రి అనిల్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. మాది మాటలతో మభ్య పెట్టే ప్రభుత్వం కాదు: మంత్రి తుమ్మల రాష్ట్రంలో అధికారంలో ఉన్న ప్రజా ప్రభుత్వం మాటలతో మభ్యపెట్టేది కాదని.. ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తున్నామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. చేనేత కార్మీకుల కోసం ప్రభుత్వం అమలు చేసే పథకాలు సమర్థవంతంగా అందేలా చూసేందుకు ముఖ్య కార్యదర్శి స్థాయిలో ఉన్న శైలజా రామయ్యర్‌కు ఆ శాఖ బాధ్యతలను అదనంగా అప్పగించామని తెలిపారు. చేనేత కార్మీకులు ఎలాంటి సమస్యలున్నా ఆమెకు నేరుగా వివరించాలన్నారు. కాళోజీకి సీఎం రేవంత్ నివాళి ప్రజాకవి, పద్మ విభూషణ్ కాళోజీ నారాయణరావు జయంతి సందర్భంగా సోమవారం ఆయనకు రేవంత్‌రెడ్డి నివాళులు అర్పించారు. జూబ్లీహిల్స్ నివాసంలో కాళోజీ చిత్రపటానికి పూలమాల వేసి అంజలి ఘటించారు. తెలంగాణ భాషా సాహిత్యానికి కాళోజీ చేసిన సేవలను స్మరించుకున్నారు. ఐఐహెచ్‌టీకి కొండా లక్ష్మణ్ పేరుతెలంగాణ ఉద్యమానికి ఎంతో స్ఫూర్తినిచ్చిన కొండాలక్ష్మణ్ బాపూజీ పేరు ఐఐహెచ్‌టీకి పెడుతున్నామని సీఎం రేవంత్ ప్రకటించారు.అనంతరం ఐఐహెచ్‌టీలో వివిధ కోర్సులు నేర్చుకుంటున్న విద్యార్థులకు నెలకు రూ.2,500 ప్రోత్సాహకాన్ని చెక్కుల రూపంలో అందించారు. -
కొండా లక్ష్మణ్ బాపూజీకి సీఎం కేసీఆర్ నివాళి
సాక్షి, హైదరాబాద్: స్వాతంత్య్ర సమరయోధుడు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతిని పురస్కరించుకుని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆయనకు ఘన నివాళి అర్పించారు. సోమవారం జరగనున్న బాపూజీ 106వ జయంతి సందర్భంగా ఆయన చేసిన స్ఫూర్తిదాయక నిస్వార్థ సేవలను సీఎం స్మరించుకున్నారు. సాయుధ పోరాట కాలంలో చాకలి ఐలమ్మతో సహా పలువురికి న్యాయవాదిగా సేవలందించి వారి తరఫున న్యాయపోరాటం చేసిన ప్రజాస్వామిక వాది బాపూజీ అని కొనియాడారు. దేశ స్వాతంత్రోద్యమంలో పాల్గొని, ప్రత్యేక తెలంగాణ కోసం సాగిన అన్ని పోరాటాల్లో అదే స్ఫూర్తిని కొనసాగించిన కొండా లక్ష్మణ్ బాపూజీ, దేశం గర్వించదగ్గ గొప్ప నేత అని ఆదివారం ఒక ప్రకటనలో కొనియాడారు. అణగారిన వర్గాల హక్కుల సాధనకు, సహకార రంగాల పటిష్టతకు తన జీవితకాలం కృషి చేశారన్నారు. బహుజన నేతగా.. దేశవ్యాప్తం గా పద్మశాలీలను సంఘటితం చేసిన ఘనత కొండా లక్ష్మణ్ బాపూజీకే దక్కిందన్నారు. బా పూజీ జయంతి, వర్ధంతులను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్నదన్నారు. -
సామాజిక తెలంగాణే లక్ష్మణ్ బాపూజీ లక్ష్యం: కృష్ణయ్య
సాక్షి, హైదరాబాద్: సామాజిక తెలంగాణ సాధించడమే లక్ష్యంగా కొండా లక్ష్మణ్ బాపూజీ పనిచేశారని, తెలంగాణ సమాజానికి మహోన్నత వ్యక్తిగా నిలిచిన బాపూజీ విగ్రహాన్ని ట్యాంక్‌బండ్‌పై ప్రతిష్టించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని జాతీయ బీసీ సంక్షేమసంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య అన్నారు. బాపూజీ 106వ జయంతి వేడుకలను ట్యాంక్‌బండ్ వద్ద జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించారు. అనంతరం కృష్ణయ్య మీడియాతో మాట్లాడుతూ సబ్బండ వర్గాలు అభివృద్ధి చెందడమే బాపూజీకి అసలైన నివాళి అని వ్యాఖ్యానించారు. అనంతరం జాతీయ బీసీ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ దాసు సురేశ్ మాట్లాడుతూ లక్ష్మణ్ బాపూజీని కొన్ని వర్గాలకు నాయకుడిని చేసే ప్రయత్నం ప్రభుత్వం చేస్తోందని విమర్శించారు. కార్యక్రమంలో సంఘం నేతలు గుజ్జ కృష్ణ, వెంకటేశ్, జయంతి, ఉదయ్, అంజి, రాజు పాల్గొన్నారు. -
బహుజనుల దార్శనికుడు బాపూజీ
కొండా లక్ష్మణ్ బాపూజీ అణగారిన వర్గాలకు భీష్మ పితామహుడు. బలహీన వర్గాలకు ఆయన ఇల్లే ఆశ్రయం.. ఖచ్చితత్వం, నిర్మొహమాటం ఆయన తత్వం. నిజాం నిరంకుశ ప్రభుత్వాన్ని ఎదిరించి హైదరాబాద్ సంస్థానపు పోరాట ఉధృత స్వభావాన్ని ఉవ్వెత్తున ఎగిసిపడేలా చేసిన ఉద్యమ కెరటం కొండా లక్ష్మణ్ బాపూజీ.. 1915 సెప్టెంబర్ 27వ తేదీన నేటి ఆసిఫాబాద్ కొమురంభీం జిల్లాలోని వాంకిడి గ్రామంలో జన్మిం చారు. తల్లి అమ్మక్క, తండ్రి పోశెట్టి బాపూజీ. తన మూడవ ఏటనే 1918లో తల్లిని కోల్పోయి బాల్యం లోనే తీవ్ర కష్టాలను ఎదురీదాడు. 1931లో మహారాష్ట్రలోని నాగపూర్‌కి దగ్గరలోని చాందా ప్రాంతంలో అప్పటికే నిజాం ప్రభుత్వ ఉత్తర్వులను ధిక్కరించి రహస్యంగా గాంధీజీ సమావేశానికి హాజ రయ్యారు. తద్వారా భారత స్వతంత్ర పోరాటంపట్ల ఆకర్షితులయ్యారు. భారత జాతీయోద్యమంలో భాగంగా ప్రప్రథమంగా 1938లో అరెస్టయ్యారు. అటుపిమ్మట 1942లో క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నారు. 1947 డిసెంబర్ 4న నిజాంపై జరిగిన బాంబు దాడిలో ప్రధాన సూత్రధారిగా నాయకత్వం వహిం చారు. కొండా లక్ష్మణ్ బాపూజీ న్యాయశాస్త్రంలో పట్టభద్రులయ్యారు. చాకలి ఐలమ్మ భర్త నరసింహ, ఆరుట్ల కమలాదేవి, నల్లా నరసింహులు లాంటి వారి కేసును వాదించి వారిని నిజాం చెర నుండి విడిపించాడు. చిట్యాల (చాకలి)ఐలమ్మ తాను పండించిన పంటకు శిస్తు ఎందుకు చెల్లించాలని కడవెండి (ఇప్పటి జనగామ జిల్లా ప్రాంతం) జమీందార్ విసునూరు రామచంద్రారెడ్డితో విభేదించి ఆంద్ర మహాసభ, కమ్యూనిస్ట్ నాయకులతో కలసి ఎదురుతిరగగా సూటిగా ఏమీ చేయలేక దొర తన మూకలతో కలిసి ఐలమ్మ భర్త నరసింహపై మోసపూరిత కుట్ర అనే అభియోగాన్ని నెరపి జైలుపాలు చేశాడు. దీనితో సైకిల్‌పై ప్రయాణిస్తూ బాపూజీ భువనగిరి కోర్టులో ఉచితంగా వాదించి ఐలమ్మ భర్తను విడిపించాడు. తెలంగాణ సాయుధ పోరాటంలో ఆరుట్ల కమలాదేవి, షేక్ బందగి లాంటి తెలంగాణ సాయుధ పోరాటవీరులను కాపాడి కమ్యూనిస్టుల మన్ననలు పొందారు. నిజాం నియంతృత్వ పాలనకు వ్యతిరేకంగా సాగిన రహస్య కార్యకలాపాలు మొదలుకొని ఆంధ్రమహాసభ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం, హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ ఆ తర్వాత జరిగిన సార్వత్రిక ఎన్నికలు, 1969లో ప్రత్యేక తెలంగాణా రాష్ట్రోద్యమం వెనుకబడిన తరగతుల చేనేత సహకారోద్యమం, మలిదశ తెలం గాణ ఉద్యమం ఇలా అనేక ఉద్యమాలకు నాయకత్వం వహించి బాపూజీ చరిత్ర పుటలకెక్కారు. కొండా లక్ష్మణ్ బాపూజీ వివాహం జూన్ 27, 1948లో డాక్టర్ శకుంతలాదేవితో జరిగింది. వారికి ఇద్దరు అబ్బాయిలు ఒక అమ్మాయి. సురేష్, ఉమేష్, పవిత్ర వాణి. 1962 చైనా యుద్ధ సమయంలో ప్రధాని నెహ్రూ దేశ ప్రజల సహకారం కోరగా డాక్టర్ శకుంతలాదేవి తన బంగారు గాజు లను జాతీయ రక్షణ నిధికి ఇవ్వడంతో పాటు చైనా సరిహద్దు ప్రాంతంలో భారత సైన్యానికి వైద్య సేవలందించారు. హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్‌లో విలీనమయిన తరువాత తెలం గాణ ప్రాంతంలో1952 లో జరిగిన మొదటి శాసనసభ ఎన్నికలలో బాపూజీ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ తరువాత 1956లో బాషా ప్రాతిపదికన ఏర్పాటు అయిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో నిర్వహించిన ఎన్నికలలో గెలుపొంది 1957లో రాష్ట్ర శాసనసభ డిప్యూటీ స్పీకర్‌గా ఎన్నికయ్యారు. 1960లో మూడవ సారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఐదుసార్లు శాసనసభ్యుడిగా, ఒకసారి డిప్యూటీ స్పీకర్‌గా, రెండుసార్లు మంత్రిగా పనిచేశారు. గాంధీజీ మొదలుపెట్టిన హరిజనోద్ధరణ కార్యక్రమంలో పూర్తి స్థాయిలో పాలు పంచుకొన్న కొండా బాపూజీ నాటి ఆంధ్ర మహాసభ నాయకులు రావి నారాయణరెడ్డి అధ్యక్షులుగా ఉన్న హరి జన సేవాసంఘం హైదరాబాద్ కార్యదర్శిగా చురుకైన పాత్ర పోషించారు. కేవలం పద్మశాలీలకే కాకుండా గౌడ, కురుమ, క్షత్రియ, గంగపుత్ర, విశ్వకర్మ హాస్టళ్ల స్థాపనకు అండగా నిలిచారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో బాపూజీ లఘు, మధ్యతరగతి పరిశ్రమల శాఖ మంత్రిగా పనిచేశారు. తెలంగాణ ప్రాంత యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని, పరిశ్రమలు హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో ఏర్పాటుచేయాలనీ పట్టుపట్టి సాధించారు. హైదరాబాద్ లోని బాలానగర్‌లో పారిశ్రామిక వాడల అభివృద్ధికి 750 ఎకరాల భూమిని సేకరించారు. దీంతో హైదరాబాదులో బాలానగర్, జీడిమెట్ల, మియాపూర్ లాంటి పారిశ్రామిక ప్రాంతాలు ఆవిర్భవించాయి. నేడు దేశంలోనే అత్యున్నత పారిశ్రామిక ప్రాంతాలుగా విలసిల్లుతున్న హైదరాబాద్ పారిశ్రామిక కారిడార్లు బాపూజీ దూరదృష్టికి, దార్శనికతకు నిలువెత్తు నిదర్శనాలు.. నాటి కాంగ్రెస్ జాతీయ నాయకులను కూడా ఒప్పించి అనేక కేంద్ర పరిశ్రమలు తెలంగాణలో నెలకొనడానికి కూడా అనితర కృషి సల్పారు. (నేడు కొండా లక్ష్మణ్ బాపూజీ 105వ జయంతి) వ్యాసకర్త: దాసు సురేష్. తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్, జాతీయ బీసీ సంక్షేమ సంఘం మొబైల్ : 91773 58286 -
చేనేత ఆత్మగౌరవం నిలబెడదాం
కోరుట్ల: చేనేత కార్మికుల ఆత్మగౌరవాన్ని కాపాడే దిశలో పోరాటం ఉధృతం చేయాలని రాజ్యసభ సభ్యుడు రాపోలు ఆనందభాస్కర్ అన్నారు. కోరుట్ల పద్మశాలీ సంఘం ప్రమాణ స్వీకారోత్సవం ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చేనేత ఉత్పత్తులకు బహుళ ప్రాచుర్యం కల్పించి కార్మికుల సంక్షేమానికి పాటుపడాలన్నారు. వర్తక, వాణిజ్య రంగాల్లో మార్గదర్శకులుగా ఉన్న పద్మశాలీలు సామాజికంగా, రాజకీయంగా ఉన్నత స్థాయికి ఎదగాలని సూచించారు. కోరుట్ల పద్మశాలీ సంఘం రాష్ట్రంలోనే ఆదర్శంగా నిలవాలని కోరారు. వ్యక్తిగత వైషమ్యాలకు తావివ్వకుండా పద్మశాలీల సంక్షేమానికి పూర్తి సమయం ఇవ్వాలని సూచించారు. మాజీ ఎమ్మెల్యే ఈరవత్రి అనిల్ మాట్లాడుతూ పద్మశాలీలు అన్ని రంగాల్లో రాణించాలని కోరారు. చేనేత కార్మికుల హక్కుల పరిరక్షణకు అలుపెరగకుండా ఉద్యమించాలని కోరారు. రాష్ట్ర ఉపాధ్యక్షుడు రుద్ర శ్రీనివాస్ మాట్లాడుతూ పద్మశాలీలు ఐక్యతకు ప్రతీ ఒక్కరు నిరంతరం పాటుపడాలన్నారు. ఐక్యంగా ముందుకు సాగితేనే సామాజికంగా, రాజకీయంగా తగిన గుర్తింపు వస్తుందన్నారు. నూతన అధ్యక్షుడు గుంటుక శ్రీనివాస్ మాట్లాడుతూ, పద్మశాలీల సేవలో నిరంతరం అందుబాటులో ఉంటానన్నారు. వారి శ్రేయస్సుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ పద్మశాలీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గొసికె యాదగిరి, ఉపాధ్యక్షుడు రుద్ర శ్రీనివాస్, మహిళా సంఘం రాష్ట్ర అధ్యక్షులు గుజ్జ రాజేశ్వరి, పోపా రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్‌రాజ్, ఉద్యోగ సంఘాల అధ్యక్షుడు మార్త రమేశ్, నాయకులు వాసం భూమానందం, సదుబత్తుల హరిప్రసాద్, చెన్న విశ్వనాథం, గుంటుక ప్రసాద్, జక్కుల ప్రసాద్, అల్లె సంగయ్య, జిల్లా ధనుంజయ్, వాసాల గణేష్‌లు పాల్గొన్నారు. కొత్త పాలకవర్గ ప్రమాణస్వీకారం పద్మశాలీ సంఘం నూతన అధ్యక్షుడిగా గుంటుక శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శిగా రుద్ర సుధాకర్, ఉపాధ్యక్షులుగా మచ్చ రమేష్, సహాయ కార్యదర్శిగా జిందం లక్ష్మీనారాయణ, కోశాధికారిగా ఆడెపు నరేష్కుమార్, యువత అధ్యక్షుడిగా అందె రమేష్, ఉపాధ్యక్షుడిగా కటుకం వినయ్‌కుమార్, ప్రధాన కార్యదర్శిగా జక్కుల ప్రవీన్‌కుమార్, సహాయ కార్యదర్శిగా బండి సురేష్, కోశాధికారిగా చింతకింది ప్రేమ్‌కుమార్‌తో ఎన్నికల అధికారులు కాచర్ల శంకరయ్య, మార్గం రాజేంద్రప్రసాద్, కడకుంట్ల సదాశివ్‌లు ప్రమాణ స్వీకారం చేయించారు. కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహం ఆవిష్కరణ కోరుట్ల పట్టణంలోని కార్గిల్ చౌరస్తా వద్ద కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహాన్ని రాజ్యసభ సభ్యులు రాపోల్ ఆనంద భాస్కర్ ఆవిష్కరించారు. -
కొండా లక్ష్మణ్ సేవలు చిరస్మరణీయం: కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఉద్యమకారుడు, మాజీ మంత్రి కొండా లక్ష్మణ్ బాపూజీ తెలంగాణ సమాజానికి చిరస్మరణీయుడని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. ఈనెల 27న (బుధవారం) కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతిని పురస్కరించుకుని కేసీఆర్ ఆయనను స్మరించుకున్నారు. స్వరాష్ట్రంగా ఆవిర్భవించిన తెలంగాణ అన్ని రంగాల్లో ముందడుగు వేయాలని.. కొండా లక్ష్మణ్ బాపూజీకి మనం అందించే నిజమైన నివాళి అదేనని చెప్పారు. తమ ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తున్నదని పేర్కొన్నారు. -
ట్యాంక్‌బండ్‌పై కొండా లక్ష్మణ్ విగ్రహ ఏర్పాటు
► తెలంగాణ ఎంప్లాయీస్ అసోసియేషన్ తీర్మానం సాక్షి, హైదరాబాద్: ట్యాంక్‌బండ్‌పై కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని తెలంగాణ ఎంప్లాయీస్ అసోసియేషన్ తీర్మానించింది. అసోసియేషన్ ఆధ్వర్యంలో కొండా లక్ష్మణ్ బాపూజీ 5వ వర్ధంతిని గురువారం హైదరాబాద్‌లో నిర్వహించారు. అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు గోపాల్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి సంపత్ కుమారస్వామి తదితరులు ఘనంగా నివాళులర్పించారు. -
‘ ఆయనను తెలంగాణ జాతిపితగా ప్రకటించాలి’
హైదరాబాద్: తొలిదశ ఉద్యమ నాయకుడు ఆచార్య కొండా లక్ష్యణ్ బాపూజీని తెలంగాణ జాతిపితగా ప్రకటించాలని బాపూజీ స్మారక కమిటీ డిమాండ్ చేసింది. అంతేకాక ఆసిఫాబాద్ జిల్లాకు బాపూజీ పేరు పెట్టాలని అన్నారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో కమిటీ కన్వీనర్ ఎం. రామరాజు, జాయింట్ కన్వీనర్లు జి. శ్రీహరి, మన్నారపు నాగరాజులు మాట్లాడారు. స్వరాష్ట్రం కోసం మంత్రి పదవినే త్యాగం చేసిన మహాననుభావుడు బాపూజీ అని కొనియాడారు. ఆయన జయంతి ఉత్సవాలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని పేర్కొన్నారు. ట్యాంక్‌బండ్‌పై విగ్రహం ఏర్పాటు చేయాలని తెలిపారు. జలదృశ్యంలో బాపూజీ స్మారక భవన్ నిర్మించాలన్నారు. బాపూజీ జీవిత చర్రితను పాఠ్యాంశాల్లో చేర్చాలని, నగరంలో ఏదైనా రోడ్, బ్రిడ్జికి ఆయన పేరు పెట్టాలని డిమాండ్ చేశారు. ఈ డిమాండ్లపై ప్రభుత్వానికి నివేదిక పంపుతామన్నారు. స్పందించని పక్షంలో పోరాటం చేస్తామని హెచ్చరించారు. కమిటీ ప్రతినిధులు రామ్‌దాస్, పి.జె. సూరి, శంకర్ తదితరులు పాల్గొన్నారు. -
బాపూజీ పేరుతో హార్టికల్చర్ వర్సిటీ
మెదక్: కొండా లక్ష్మణ్ బాపూజీ పేరుతో హార్టికల్చర్ యూనివర్సిటీని స్థాపిస్తున్నట్టు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు మెదక్ జిల్లా ములుగులో 5 ఎకరాల పొలాన్ని కేటాయిస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. అదే విధంగా సీఎం కేసీఆర్ సొంత నియోజకవర్గం గజ్వేల్‌లో 45 ఎకరాల్లో బాలికలు, బాలుర కోసం వేర్వేరుగా ఎడ్యుకేషనల్ హబ్‌లను ఏర్పాటు చేస్తూ నిర్ణయాలు తీసుకుంది. ఈ ఎడ్యుకేషన్ హబ్‌లు 6వ తరగతి నుంచి డిగ్రీ వరకు బాలురు, బాలికల కోసం ఏర్పాటు చేయనున్నట్టు సీఎం కేసీఆర్ వెల్లడించారు. హైదరాబాద్‌లో మారేడుపల్లిలో నిర్మించనున్న క్రిస్టియన్ భవన్ నమూనాకు సీఎం ఆమోదం తెలిపారు. అదే విధంగా రెండు ఎకరాల్లో నిర్మించనున్న క్రిస్టియన్ భవన్లో అన్ని హంగులూ ఏర్పాటు చేస్తామని ఈ సందర్భంగా కేసీఆర్ తెలిపారు. సికింద్రాబాద్ మారేడుపల్లిలో తెలంగాణ ప్రభుత్వం నిర్మించనున్న క్రిస్టియన్ భవనాల నమూనాలు సికింద్రాబాద్ మారేడుపల్లిలో తెలంగాణ ప్రభుత్వం నిర్మించనున్న క్రిస్టియన్ భవనాల నమూనాలు -
అక్కర్లేని విగ్రహాలు తొలగిస్తాం
ట్యాంక్‌బండ్‌పై తెలంగాణ ఉద్యమకారుల విగ్రహాలు ఏర్పాటు చేస్తాం ఇతరుల విగ్రహాలను కూల్చబోం..గౌరవంగా పంపిస్తాం కొండా లక్ష్మణ్ బాపూజీ శత జయంతి వేడుకల్లో సీఎం కేసీఆర్ హైదరాబాద్: హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్‌పై కొండా లక్ష్మణ్ బాపూజీ, ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహాలను ఏర్పాటు చేస్తామని తెలంగాణ సీఎం చంద్రశేఖర్‌రావు చెప్పారు. అక్కడ అక్కర్లేని విగ్రహాలను తొలగించాల్సి ఉందని.. ఆ స్థానంలో తెలంగాణ కోసం పోరాడిన వారి విగ్రహాలను ఏర్పాటు చేస్తామని అన్నారు. అయితే తమకు అవసరంలేని విగ్రహాలను కూల్చబోమని, వాటిని తీసి గౌరవంగా పంపిస్తామని తెలిపారు. ఏపీ ప్రభుత్వంతో బీజేపీకి స్నేహం ఉంటే ఉండవచ్చని.. విగ్రహాల విషయంలో మాత్రం బీజేపీ తమతో సహకరించాలని కేసీఆర్ వ్యాఖ్యానించారు. నారాయణగూడ పద్మశాలిభవన్ వద్ద ఏర్పాటు చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహాన్ని సీఎం కేసీఆర్ శనివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... నిర్బంధం, వ్యతిరేక పరిస్థితులు, ఒడిదుడుకుల్లోనూ తెలంగాణ ఉద్యమాన్ని బతికించింది కొండా లక్ష్మణ్ బాపూజీ, ప్రొఫెసర్ జయశంకర్లేనని పేర్కొన్నారు. ‘‘తెలంగాణలో ఎవరు సభలు పెట్టినా వారు వెళ్లేవారు. వాటికి వచ్చే కొద్దిమందితో ఏం చేస్తారని నేను ప్రశ్నించినపుడు.. ‘ఎవరైనా నీలాంటి వారు ముందుకొచ్చి ఉద్యమం చే యాలనుకున్నపుడు వీరంతా ఉపయోగపడతార’ని నాకు చెప్పారు. అందుకే తెలంగాణ సమాజానికి వారిద్దరిని మించిన గొప్పవారు లేరు..’’ అని ఆయన పేర్కొన్నారు. కొండా లక్ష్మణ్ బాపూజీ శత జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహిస్తామని చెప్పారు. అందులో భాగంగా నెలకో కార్యక్రమం చొప్పున ఏడాది పాటు నిర్వహించేందుకు చర్యలు చేపడుతామన్నారు. తెలుగు యూనివర్సిటీకి లేదా మరేదైన మంచి సంస్థకు బాపూజీ పేరు పెడతామన్నారు. చేనేత కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక మిషన్‌ను అమలుచేస్తామన్నారు. ఆ మిషన్‌కు కొండా లక్ష్మణ్ పేరు పెడతామన్నారు. టీఆర్ఎస్ బాపూజీ ఇంట్లో (జల దృశ్యంలో)నే ఏర్పాటైందని గుర్తుచేసుకున్నారు. తెలంగాణ ఉద్యమానికి, పార్టీకి పుట్టినిల్లు అయిన బాపూజీ ఇంటిని కక్ష గట్టి కూలగొట్టారని కేసీఆర్ పేర్కొన్నారు. టీఆర్ఎస్ ఆవిర్భావానికి ఆశ్రయం ఇచ్చినందునే ఈ పని చేశారని చెప్పారు. ఆ తరువాత పార్టీ కార్యాలయానికి స్థలం ఇవ్వలేదని, ఈ విషయాలపై తాను సమీక్షిస్తానని కేసీఆర్ తెలిపారు. కార్యక్రమంలో ఎంపీలు రాపోలు ఆనందభాస్కర్, దత్తాత్రేయ, టీఆర్ఎస్ నేత కె.కేశవరావు, బాపూజీ కుమార్తె పవిత్రారాణి, అఖిల భారత పద్మశాలి సంఘం అధ్యక్షుడు రామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు. న్యాయవ్యవస్థను ఆదర్శంగా తీర్చిదిద్దుతాం హైదరాబాద్: న్యాయవ్యవస్థలో దశలవారీగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి దేశంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దుతామని తెలంగాణ సీఎం చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. న్యాయవాదులు, న్యాయమూర్తుల సహకారంతో పటిష్టమైన చట్టాలను రూపొందించుకుని ముందుకు సాగుతామని చెప్పారు. అన్ని రంగాల్లో తెలంగాణ వివక్షకు గురైనట్లే న్యాయవ్యవస్థకూ అన్యాయం జరిగిందని వ్యాఖ్యానించారు. హైదరాబాద్ సిటీ కోర్టులు ఏర్పాటు చేసి 150 ఏళ్లయిన సందర్భంగా నిర్వహిస్తున్న వేడుకల్లో భాగంగా శనివారం నిర్వహించిన కార్యక్రమానికి కేసీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తెలంగాణ మలిదశ ఉద్యమంలో న్యాయవాదుల పాత్రపై రూపొందించిన ఫొటోల ఆల్బంను ఆవిష్కరించిన అనంతరం ఆయన ప్రసంగించారు. న్యాయ వ్యవస్థ స్వతంత్ర ప్రతిపత్తిని నిజాం నవాబు ఆనాడే గుర్తించారని.. కోర్టులు ఇచ్చే తీర్పులకు తాను బద్ధుడినై ఉంటానని ప్రకటించారని కేసీఆర్ చెప్పారు. సమైక్య రాష్ట్రంలో తెలంగాణ న్యాయవాదులకు తీరని అన్యాయం జరిగిందన్నారు. ప్రత్యేక హైకోర్టు ఏర్పాటుపై కేంద్ర ప్రభుత్వం స్పందించకపోతే మరో ఉద్యమానికి సిద్ధమవుతామని పేర్కొన్నారు. సివిల్, క్రిమినల్ కోర్టుల్లో జిల్లాల వారీగా ఉత్తమ న్యాయవాది అవార్డును ఏర్పాటు చేస్తామని కేసీఆర్ చెప్పారు. ‘ఉత్తమ న్యాయవాదికి రూ.లక్ష బహుమతి ఇస్తాం. న్యాయవాదుల సంక్షేమం కోసం ఇప్పటికే ప్రకటించిన రూ. 100 కోట్లను వెంటనే విడుదల చేస్తాం. ప్రభుత్వ ఉద్యోగుల తరహాలో వారికి ఆరోగ్య కార్డులు ఇచ్చే విషయాన్ని పరిశీలిస్తాం. అలాగే ఫ్లాట్లు నిర్మించుకునేందుకు వీలుగా న్యాయవాదుల సొసైటీలకు సిటీకి దగ్గరలో భూమిని కేటాయిస్తాం’ అని చెప్పారు. -
ఏకైక వ్యక్తి కొండా లక్ష్మణ్ బాపూజీ: కేసీఆర్
హైదరాబాద్: స్వాతంత్ర సమరయోధుడు, తెలంగాణవాది కొండా లక్ష్మణ్ బాపూజిపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రశంసల వర్షం కురిపించారు. కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా.. తెలంగాణకు ఆయన చేసిన సేవలను కేసీఆర్ గుర్తు చేసుకున్నారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ.. క్విట్ ఇండియా, స్వాతంత్రోద్యమం, తెలంగాణ ఉద్యమంలో పోరాటం చేసిన ఏకైక వ్యక్తి లక్ష్మణ్ బాపూజీ అని కేసీఆర్ అన్నారు. భావి తరాలు లక్ష్మణ్ బాపూజీ సేవల్ని గుర్తు పెట్టుకుంటాయని కేసీఆర్ తెలిపారు. -
తెలంగాణ ఉద్యమ శిఖరం
ఆదర్శం: బాపూజీ 1969 తెలంగాణ తొలిదశ ఉద్యమంలో చురుగ్గా పాల్గొని, మలిదశ ఉద్యమంలోనూ కీలక భూమిక పోషించారు. జీవితాంతం తాడిత పీడిత ప్రజల పక్షాన్నే నిలిచారు. దేశభక్తిపూరిత వందేమాతర ఉద్యమం నుంచి, ఆత్మగౌరవ పోరాటం తెలంగాణ ఉద్యమం వరకు ఆయన జీవితం ఉద్యమాలతోనే ముడివడి ఉంది. దురదృష్టవశాత్తూ తెలంగాణ కల సాకారమైన రోజు ఆయన మన మధ్య లేకుండా పోయారు. రావుల శంకర్, ఆసిఫాబాద్ బాపూజీ స్వస్థలం అప్పటి హైదరాబాద్ సంస్థానంలోని ప్రస్తుత మహారాష్ట్రలోని రాజూర గ్రామం. 1915 సెప్టెంబర్ 27న ఆయన ఆదిలాబాద్ జిల్లా, ఆసిఫాబాద్ సమీపంలోని వాంకిడిలోని మేనత్త ఇంట్లో జన్మించారు. అమ్మక్క, బాపూజీల చివరి సంతానం లక్ష్మణ్. ముగ్గురు సోదరులు, ఒక సోదరి. మూడేళ్ళకే తల్లి దూరమవ్వడంతో మేనత్త వద్దే పెరిగారు. ఐదేళ్ల వయసులో తండ్రితో పాటు రాజూర వెళ్లాడు. అక్కడే బడికి వెళ్లాడు. లక్ష్మణ్ తండ్రి రాజూరలో పోస్ట్‌మెన్‌గా పనిచేసేవారు. లక్ష్మణ్ బార్ ఎట్ లా చదివారు. మద్రాస్‌కు చెందిన డాక్టర్ శకుంతలా దేవిని వివాహమాడారు. ఆయనకు ఇద్దరు కుమారులు. లక్ష్మణ్ హైదరాబాద్ హైకోర్టులో న్యాయవాదిగా పనిచేశారు. తెలంగాణ ఉద్యమంలో జైలుపాలయిన బడుగు బలహీనుల కేసులను ఎక్కువగా వాదించేవారు. న్యాయస్థానంలో చాకలి ఐలమ్మకు న్యాయం చేసేందుకు కృషిచేశారు. కొండా లక్ష్మణ్ బాపూజీ హైదారాబాద్ సం స్థానం పౌర విమోచనోద్యమంలో 1938లో మొదటి సారి అరెస్టయ్యారు. 1941-42లో ఖద్దరు ఉద్యమంలో, క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నారు. తెలంగాణ సాయుధ పోరాటంలో భాగమయ్యారు. నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ఆలుపెరుగని పోరాటం చేశారు. 1952 ఎన్నికల్లో ఆసిఫాబాద్ తొలి ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీ నుంచి ఘన విజయం సాధించారు. 1957, 62, 67, 72ల్లో నల్లగొండ జిల్లా నుంచి ఎమ్మెల్యేగా వరుసగా నాలుగు సార్లు గెలుపొందారు. మొత్తంమీద బాపూజీ 5 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి డిప్యూటీ స్పీకర్‌గా, రెండు సార్లు రాష్ట్ర మంత్రిగా పని చేశారు. తెలుగుదేశం ప్రభుత్వం అష్టకష్టాలు పెట్టినా నిబ్బరంగా ముందుకెళ్ళారు. నిలువ నీడ లేకుండా చేసినా అద్దె ఇంట్లోనే తలదాచుకుని, తెలంగాణ కోసం తలెత్తుకుని ఉద్యమించారు. పుట్టి పెరిగిన వాంకిడిలో సేవా కార్యక్రమాలు చేపట్టారు. ముఖ్యమైన కొన్ని ఘట్టాలు హెదరాబాద్ సంస్థాన్‌ను విలీనం చేయాలనే ఉద్యమం కారణంగా 13 సార్లు అరెస్టు అయ్యారు. 1950లోనే హైదరాబాద్‌లో బీసీ సంఘాన్ని స్థాపించి, బీసీల అభివృద్ధికై అహర్నిశలు కృషి చేశారు. 1957-60 వరకు రాష్ట్ర క్యాబినేట్లో డిప్యూటీ స్పీకర్‌గా పని చేశారు. 1960-62 వరకు దామోదరం సంజీవయ్య మంత్రివర్గంలో పలు కీలక శాఖలు నిర్వహించారు. 1967-69 వరకు కాసు అప్పటి ముఖ్యమంత్రి బ్రహ్మానంద రెడ్డి హాయంలో కార్మిక మంత్రిగా, సమాచార శాఖ మంత్రిగా పని చేశారు. 1969లో ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొని తెలంగాణ కోసం మంత్రి పదవికి రాజీనామా చేశారు. అదే సమయంలో అప్పటి ప్రభుత్వం కొండా లక్ష్మణ్ బాపూజీని అరెస్టు చేసి రాజమండ్రి జైలుకు తరలించింది. - కొండా లక్ష్మణ్ బాపూజీ -
‘కొండా’ సేవలు మరువలేం
సాక్షి, ముంబై: స్వాతంత్య్ర సమరయోధుడు కొండా లక్ష్మణ్ బాపూజీ చేసిన సేవలు మరువలేమంటూ పలువురు వక్తలు ప్రశంసించారు. ముంబై ప్రాంతీయ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో కొండా లక్ష్మణ్ బాపూజీ 99వ జయంతి వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమం శుక్రవారం సాయంత్రం లోయర్ పరేల్‌లోని ఆర్యసమాజ్ హాలులో జరిగింది. ఈ సందర్భంగా పలువురు వక్తలు ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో ప్రాంతీయ సంఘ ప్రతినిధులతోపాటు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారని నిర్వాహకులు తెలిపారు. కాగా, ప్రధాన కార్యదర్శి యెల్ది సుదర్శన్ ముఖ్య అతిథులకు స్వాగతం పలికారు. సంఘం అధ్యక్షుడు శైవ రాములు లక్ష్మణ్ బాపూజీ జీవిత చరిత్రను వివరించారు. పోతు రాజారాం, యాపురం వెంకటేశ్, వాసాల శ్రీహరి, మంతెన రమేశ్, బుదారపు రాజారాం, నోముల నారాయణ, కోడి చంద్రమౌళి తదితరులు కూడా ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో బోగ సహదేవ్, మచ్చ ప్రభాకర్, సంకు సుధాకర్,తిరందాస్ సత్యనారాయణ, యెల్లప్ప, బడుగు విశ్వనాథ్, కలుకం విజయ, నీత, చిలువేరి విజయ, మచ్చ సుజాత, కొమరం భీమ్ స్మారక సంస్థ అధ్యక్షుడు రుద్ర శంకర్ (హైదరాబాద్) తదితరులు పాల్గొన్నారు.