
సాక్షి, హైదరాబాద్: స్వాతంత్య్ర సమరయోధుడు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతిని పురస్కరించుకుని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆయనకు ఘన నివాళి అర్పించారు. సోమవారం జరగనున్న బాపూజీ 106వ జయంతి సందర్భంగా ఆయన చేసిన స్ఫూర్తిదాయక నిస్వార్థ సేవలను సీఎం స్మరించుకున్నారు. సాయుధ పోరాట కాలంలో చాకలి ఐలమ్మతో సహా పలువురికి న్యాయవాదిగా సేవలందించి వారి తరఫున న్యాయపోరాటం చేసిన ప్రజాస్వామిక వాది బాపూజీ అని కొనియాడారు.
దేశ స్వాతంత్రోద్యమంలో పాల్గొని, ప్రత్యేక తెలంగాణ కోసం సాగిన అన్ని పోరాటాల్లో అదే స్ఫూర్తిని కొనసాగించిన కొండా లక్ష్మణ్ బాపూజీ, దేశం గర్వించదగ్గ గొప్ప నేత అని ఆదివారం ఒక ప్రకటనలో కొనియాడారు. అణగారిన వర్గాల హక్కుల సాధనకు, సహకార రంగాల పటిష్టతకు తన జీవితకాలం కృషి చేశారన్నారు. బహుజన నేతగా.. దేశవ్యాప్తం గా పద్మశాలీలను సంఘటితం చేసిన ఘనత కొండా లక్ష్మణ్ బాపూజీకే దక్కిందన్నారు. బా పూజీ జయంతి, వర్ధంతులను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్నదన్నారు.