‘ ఆయనను తెలంగాణ జాతిపితగా ప్రకటించాలి’
హైదరాబాద్: తొలిదశ ఉద్యమ నాయకుడు ఆచార్య కొండా లక్ష్యణ్ బాపూజీని తెలంగాణ జాతిపితగా ప్రకటించాలని బాపూజీ స్మారక కమిటీ డిమాండ్ చేసింది. అంతేకాక ఆసిఫాబాద్ జిల్లాకు బాపూజీ పేరు పెట్టాలని అన్నారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో కమిటీ కన్వీనర్ ఎం. రామరాజు, జాయింట్ కన్వీనర్‌లు జి. శ్రీహరి, మన్నారపు నాగరాజులు మాట్లాడారు. స్వరాష్ట్రం కోసం మంత్రి పదవినే త్యాగం చేసిన మహాననుభావుడు బాపూజీ అని కొనియాడారు.
ఆయన జయంతి ఉత్సవాలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని పేర్కొన్నారు. ట్యాంక్‌బండ్‌పై విగ్రహం ఏర్పాటు చేయాలని తెలిపారు. జలదృశ్యంలో బాపూజీ స్మారక భవన్ నిర్మించాలన్నారు. బాపూజీ జీవిత చర్రితను పాఠ్యాంశాల్లో చేర్చాలని, నగరంలో ఏదైనా రోడ్, బ్రిడ్జికి ఆయన పేరు పెట్టాలని డిమాండ్ చేశారు. ఈ డిమాండ్లపై ప్రభుత్వానికి నివేదిక పంపుతామన్నారు. స్పందించని పక్షంలో పోరాటం చేస్తామని హెచ్చరించారు. కమిటీ ప్రతినిధులు రామ్‌దాస్, పి.జె. సూరి, శంకర్ తదితరులు పాల్గొన్నారు.