అక్కర్లేని విగ్రహాలు తొలగిస్తాం | Requiring the statues will be deleted | Sakshi
Sakshi News home page

అక్కర్లేని విగ్రహాలు తొలగిస్తాం

Published Sun, Sep 28 2014 1:00 AM | Last Updated on Sat, Sep 2 2017 2:01 PM

అక్కర్లేని విగ్రహాలు తొలగిస్తాం

అక్కర్లేని విగ్రహాలు తొలగిస్తాం

ట్యాంక్‌బండ్‌పై తెలంగాణ ఉద్యమకారుల విగ్రహాలు ఏర్పాటు చేస్తాం
ఇతరుల విగ్రహాలను కూల్చబోం..గౌరవంగా పంపిస్తాం
కొండా లక్ష్మణ్ బాపూజీ శత జయంతి వేడుకల్లో సీఎం కేసీఆర్

 
హైదరాబాద్: హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్‌పై కొండా లక్ష్మణ్ బాపూజీ, ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహాలను ఏర్పాటు చేస్తామని తెలంగాణ సీఎం చంద్రశేఖర్‌రావు చెప్పారు. అక్కడ అక్కర్లేని విగ్రహాలను తొలగించాల్సి ఉందని.. ఆ స్థానంలో తెలంగాణ కోసం పోరాడిన వారి విగ్రహాలను ఏర్పాటు చేస్తామని అన్నారు. అయితే తమకు అవసరంలేని విగ్రహాలను కూల్చబోమని, వాటిని తీసి గౌరవంగా పంపిస్తామని తెలిపారు. ఏపీ ప్రభుత్వంతో బీజేపీకి స్నేహం ఉంటే ఉండవచ్చని.. విగ్రహాల విషయంలో మాత్రం బీజేపీ తమతో సహకరించాలని కేసీఆర్ వ్యాఖ్యానించారు. నారాయణగూడ పద్మశాలిభవన్ వద్ద ఏర్పాటు చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహాన్ని సీఎం కేసీఆర్ శనివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... నిర్బంధం, వ్యతిరేక పరిస్థితులు, ఒడిదుడుకుల్లోనూ తెలంగాణ ఉద్యమాన్ని బతికించింది కొండా లక్ష్మణ్ బాపూజీ, ప్రొఫెసర్ జయశంకర్‌లేనని పేర్కొన్నారు. ‘‘తెలంగాణలో ఎవరు సభలు పెట్టినా వారు వెళ్లేవారు. వాటికి వచ్చే కొద్దిమందితో ఏం చేస్తారని నేను ప్రశ్నించినపుడు.. ‘ఎవరైనా నీలాంటి వారు ముందుకొచ్చి ఉద్యమం చే యాలనుకున్నపుడు వీరంతా ఉపయోగపడతార’ని నాకు చెప్పారు. అందుకే తెలంగాణ సమాజానికి వారిద్దరిని మించిన గొప్పవారు లేరు..’’ అని ఆయన పేర్కొన్నారు. కొండా లక్ష్మణ్ బాపూజీ శత జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహిస్తామని చెప్పారు.

అందులో భాగంగా నెలకో కార్యక్రమం చొప్పున ఏడాది పాటు నిర్వహించేందుకు చర్యలు చేపడుతామన్నారు. తెలుగు యూనివర్సిటీకి లేదా మరేదైన మంచి సంస్థకు బాపూజీ పేరు పెడతామన్నారు. చేనేత కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక మిషన్‌ను అమలుచేస్తామన్నారు. ఆ మిషన్‌కు కొండా లక్ష్మణ్ పేరు పెడతామన్నారు. టీఆర్‌ఎస్ బాపూజీ ఇంట్లో (జల దృశ్యంలో)నే ఏర్పాటైందని గుర్తుచేసుకున్నారు. తెలంగాణ ఉద్యమానికి, పార్టీకి పుట్టినిల్లు అయిన బాపూజీ ఇంటిని కక్ష గట్టి కూలగొట్టారని కేసీఆర్ పేర్కొన్నారు. టీఆర్‌ఎస్ ఆవిర్భావానికి ఆశ్రయం ఇచ్చినందునే ఈ పని చేశారని చెప్పారు. ఆ తరువాత పార్టీ కార్యాలయానికి స్థలం ఇవ్వలేదని, ఈ విషయాలపై తాను సమీక్షిస్తానని కేసీఆర్ తెలిపారు. కార్యక్రమంలో ఎంపీలు రాపోలు ఆనందభాస్కర్, దత్తాత్రేయ, టీఆర్‌ఎస్ నేత కె.కేశవరావు, బాపూజీ కుమార్తె పవిత్రారాణి, అఖిల భారత పద్మశాలి సంఘం అధ్యక్షుడు రామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు.
 
న్యాయవ్యవస్థను ఆదర్శంగా తీర్చిదిద్దుతాం

హైదరాబాద్: న్యాయవ్యవస్థలో దశలవారీగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి దేశంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దుతామని తెలంగాణ సీఎం చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. న్యాయవాదులు, న్యాయమూర్తుల సహకారంతో పటిష్టమైన చట్టాలను రూపొందించుకుని ముందుకు సాగుతామని చెప్పారు. అన్ని రంగాల్లో తెలంగాణ వివక్షకు గురైనట్లే న్యాయవ్యవస్థకూ అన్యాయం జరిగిందని వ్యాఖ్యానించారు. హైదరాబాద్ సిటీ కోర్టులు ఏర్పాటు చేసి 150 ఏళ్లయిన సందర్భంగా నిర్వహిస్తున్న వేడుకల్లో భాగంగా శనివారం నిర్వహించిన కార్యక్రమానికి కేసీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తెలంగాణ మలిదశ ఉద్యమంలో న్యాయవాదుల పాత్రపై రూపొందించిన ఫొటోల ఆల్బంను ఆవిష్కరించిన అనంతరం ఆయన ప్రసంగించారు. న్యాయ వ్యవస్థ స్వతంత్ర ప్రతిపత్తిని నిజాం నవాబు ఆనాడే గుర్తించారని.. కోర్టులు ఇచ్చే తీర్పులకు తాను బద్ధుడినై ఉంటానని ప్రకటించారని కేసీఆర్ చెప్పారు. సమైక్య రాష్ట్రంలో తెలంగాణ న్యాయవాదులకు తీరని అన్యాయం జరిగిందన్నారు. ప్రత్యేక హైకోర్టు ఏర్పాటుపై కేంద్ర ప్రభుత్వం స్పందించకపోతే మరో ఉద్యమానికి సిద్ధమవుతామని పేర్కొన్నారు. సివిల్, క్రిమినల్ కోర్టుల్లో జిల్లాల వారీగా ఉత్తమ న్యాయవాది అవార్డును ఏర్పాటు చేస్తామని కేసీఆర్ చెప్పారు. ‘ఉత్తమ న్యాయవాదికి రూ.లక్ష బహుమతి ఇస్తాం. న్యాయవాదుల సంక్షేమం కోసం ఇప్పటికే ప్రకటించిన రూ. 100 కోట్లను వెంటనే విడుదల చేస్తాం. ప్రభుత్వ ఉద్యోగుల తరహాలో వారికి ఆరోగ్య కార్డులు ఇచ్చే విషయాన్ని పరిశీలిస్తాం. అలాగే ఫ్లాట్లు నిర్మించుకునేందుకు వీలుగా న్యాయవాదుల సొసైటీలకు సిటీకి దగ్గరలో భూమిని కేటాయిస్తాం’ అని చెప్పారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement