Professor Shankar
-
విత్తు జాడేది?
► పుష్కలంగా నీళ్లున్నా రైతన్నను వేధిస్తున్న విత్తన కొరత ► 4.88 లక్షల క్వింటాళ్ల సరఫరా లక్ష్యం.. అందింది 30 వేల క్వింటాళ్లే ► విత్తనాలు దొరక్క రైతుల కష్టాలు.. రబీ సన్నద్ధతలో వ్యవసాయ శాఖ విఫలం సాక్షి, హైదరాబాద్: పుష్కలంగా వానలు పడ్డాయి.. చెరువులు, కుంటలు, ప్రాజెక్టులు కళకళలాడుతున్నాయి.. భూగర్భ జలాలు పైకి వచ్చాయి.. రబీకి గత పదేళ్ల కాలంలో ఇంతటి సానుకూల పరిస్థితి ఎప్పుడూ లేదంటున్నారు.. కానీ ఏం లాభం..? వ్యవసాయశాఖ అందుకు తగ్గట్లుగా సన్నద్ధం కాలేదు. దీంతో రబీ సీజన్ మొదలై 25 రోజులు కావొస్తున్నా విత్తు జాడ కానరావడం లేదు. వేరుశనగ, శనగ, వరి, కంది, మినుములు, మొక్కజొన్న వంటి విత్తనాల కోసం రైతులు అవస్థలు పడుతున్నారు. విక్రయ కేంద్రాల వద్ద బారులు తీరుతున్నారు. పలుచోట్ల రోడ్డెక్కుతున్నారు. రబీకి అన్ని రకాల విత్తనాలు 4.88 లక్షల క్వింటాళ్లు సరఫరా చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకోగా.. ఇప్పటివరకు విక్రయ కేంద్రాల్లో 66,993 క్వింటాళ్లు సిద్ధంగా ఉంచారు. అందులో 30,634 క్వింటాళ్లు మాత్రమే రైతులకు సరఫరా చేశారు. గత్యంతరం లేక ప్రైవేటు వ్యాపారుల వద్ద అధిక ధరలకు విత్తనాలు కొనుగోలు చేస్తూ నష్టపోతున్నారు. అదను తప్పితే అంతే.. ఈ నెల ఒకటో తేదీ నుంచే వివిధ రకాల పంటల సాగు మొదలు పెట్టాలని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం రైతులకు సూచిం చింది. అందుకు సంబంధించి రబీ సీజన్ పం టల సాగు కేలండర్‌ను గత నెలలోనే విడుదల చేసింది. పంటలు వేయాల్సిన గడువు తేదీలను (కట్ ఆఫ్) ప్రకటించింది. ఆ ప్రకారం వేరుశనగ, శనగ, మొక్కజొన్న, పెసర పంటలను ఈ నెల ఒకటో తేదీ నుంచే వేయడం ప్రారంభించాలి. కానీ వేరుశనగ, శనగ, మొక్కజొన్న, పెసర విత్తనాలను అవసరం మేరకు రైతులకు అందించడంలో వైఫల్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. 1.58 లక్షల క్వింటాళ్ల వేరుశనగ విత్తనాలను రైతులకు సరఫరా చేయాల్సి ఉండగా.. ఇప్పటివరకు విక్రయ కేంద్రాల్లో 35,172 క్విం టాళ్లే సిద్ధంగా ఉంచారు. అందులో 17,116 క్వింటాళ్లే రైతులకు సరఫరా చేశారు. 1.22 లక్షల క్వింటాళ్ల శనగ విత్తనాలను సరఫరా చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా.. ఇప్పటివరకు విక్రయ కేం ద్రాలకు 18,363 క్వింటాళ్లు మాత్రమే చేరాయి. అందులో రైతులకు 13,145 క్వింటాళ్లే సరఫరా చేశారు. 3,800 క్వింటాళ్ల పెసర విత్తనాలకు గాను.. విక్రయ కేంద్రాల్లో కేవలం 493 క్వింటాళ్లే సిద్ధంగా ఉన్నాయి. అందులో 187 క్వింటాళ్లు మాత్రమే రైతులకు అందజేశారు. మొక్కజొన్న 24 వేల క్వింటాళ్లకుగాను ప్రభుత్వం ఒక్క క్వింటాలు కూడా సరఫరా చేయడం లేదు. వేరు శనగ, శనగకు మించిన సమయం ఉత్తర తెలంగాణలో వేరుశనగ, పెసర పం టలను ఈ నెల 20 వరకు వేసుకోవచ్చని.. దక్షిణ తెలంగాణలో మాత్రం వేరుశనగను నవంబర్ 15వ తేదీ వరకు వేసుకోవచ్చని శాస్త్రవేత్తలు సూచించారు. ఉత్తర తెలంగాణలో వేరుశనగ, శనగ వేయడానికి సమయం మించిపోయింది. అదను కూడా తప్పింది. ఇలాంటి పరిస్థితుల్లో ఆ విత్తనాలను ఇంకెప్పుడు సరఫరా చేస్తారో అంతుబట్టడంలేదు. అవసరమైన సమయంలో సబ్సిడీ విత్తనాలను సరఫరా చేయకపోవడంపై రైతులు నిలదీస్తున్నారు. -
నిన్నటి భూకంపంకంటే వంద రెట్ల శక్తి దాగుంది : ప్రొఫెసర్ శంకర్
న్యూఢిల్లీ: నిన్న నేపాల్‌లో సంభవించిన భూకంప శక్తి వంద మిలియన్ టన్నుల టీఎన్టీ(ట్రై నైట్రో టోల్యూన్)కి సమానం అని ఖరగ్‌పూర్ ప్రొఫెసర్ శంకర్ చెప్పారు. హిమాలయాల కింద నిన్నటి భూకంప శక్తి కంటే వంద రెట్ల ఎక్కువ శక్తి దాగుందన్నారు. హిందుకేష్ రీజియన్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ వరకు భూకంపం వచ్చే జోన్ అని ఆయన తెలిపారు. ఈ 2500 కిలో మీటర్ల హిమాలయాల పరిధిలో ఎప్పుడైనా భూకంపాలు రావచ్చని ఆయన చెప్పారు. హిమాలయాల పరిధిలో వచ్చే భూకంపాలు ఒక్కోసారి రిక్టర్ స్కేల్‌పై 9 కూడా దాటవచ్చునని ప్రొఫెసర్ శంకర్ చెప్పారు. నేపాల్‌కు మరోభారీ భూకంపం పొంచి ఉందని ఎన్జీఆర్ఐ (నేషనల్ జియోగ్రాఫికల్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్) మాజీ డైరెక్టర్ హరీష్ గుప్తా చెప్పారు. ఇప్పుడు వచ్చింది భారీ భూకంపమే, అయితే మరిన్ని భూకంపాలకు అవకాశం ఉందని ఆయన తెలిపారు. ఇదిలా ఉండగా, నేపాల్‌లో ఈ మధ్యాహ్నం రెండు గంటలకు కూడా మళ్లీ భూకంపం వచ్చింది. రిక్టర్ స్కేల్‌పై 6.7గా నమోదైంది. ఖట్మండుకు 65 కిలో మీటర్ల దూరంలోని కొడారి కేంద్రంగా తాజా భూకంపం సంభవించింది. -
అప్పులు తీర్చలేకే...
* రైతు ఆత్మహత్యలను అంగీకరించిన మంత్రి పోచారం * 65 కుటుంబాలకు పరిహారం చెల్లించామని వెల్లడి * రైతు యూనిట్‌గా బీమాకు అసెంబ్లీ తీర్మానం చేస్తామని స్పష్టీకరణ * 26 నుంచి ‘చేను కబుర్లు’ పేరుతో రేడియో, టీవీ చానల్‌పైనా కసరత్తు * ‘యువరైతు సాగుబడి శిక్షణ’ను ప్రారంభించిన మంత్రి సాక్షి, హైదరాబాద్: వ్యవసాయం కుదేలై అప్పుల్లో కూరుకుపోయిన రైతులు వాటిని తీర్చలేక మనోవేదనతో ఆత్మహత్యకు పాల్పడుతున్నారని రాష్ర్ట వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అంగీకరించారు. అన్నదాతల ఆత్మహత్యలకు కారణాలను గుర్తించి నిరోధించాలని వ్యాఖ్యానించారు. రాజేంద్రనగర్‌లోని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో సోమవారం జరిగిన ‘తెలంగాణ యువరైతు సాగుబడి శిక్షణ’ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతు ఆత్మహత్యలపై ఆయన మాట్లాడారు. ఇప్పటివరకు ఆత్మహత్యలు చేసుకున్న 65 రైతు కుటుంబాలకు లక్షన్నర రూపాయల చొప్పున పరిహారం అందజేశామని మంత్రి తెలిపారు. రాత్రికి రాత్రే అద్భుతాలు చేసే అల్లావుద్దీన్ దీపం తమ వద్ద లేదని వ్యాఖ్యానించారు. రైతు తన కుటుంబానికి మాత్రమే పంట పండించుకుంటే ప్రపంచం అల్లకల్లోలం అవుతుందన్నారు. ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట నష్టపోయిన రైతును యూనిట్‌గా చేసుకొని పరిహారం అందించే విధంగా పంటల బీమాలో మార్పులు చేయాలని కోరుతూ వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. పురుగుమందులు వాడకుండా పంటల దిగుబడి పెంచేలా శాస్త్రవేత్తలు కృషి చేయాలని సూచించారు. రైతు బాగుండాలంటే తక్కువ ధరకే నాణ్యమైన విత్తనాలను అందించాలని, కల్తీ విత్తనాలు అమ్మే వ్యాపారులను జైలుకు పంపించాలని, నష్టపోయిన రైతులకు పరిహారం ఇప్పించాలని, వ్యవసాయ యాంత్రీకరణ జరగాలని మంత్రి అభిప్రాయపడ్డారు. తను పండించిన పంటకు తానే ధర నిర్ణయించే రోజు వచ్చినప్పుడే రైతు జీవితం బాగుపడుతుందన్నారు. కొత్త రాష్ర్టంలో వ్యవసాయాన్ని, రైతాంగాన్ని పటిష్టపరిచేందుకే యువరైతు సాగుబడి శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. రైతును శాస్త్రీయంగా, సాంకేతికంగా బలోపేతం చేసేలా ఈ శిక్షణ ఉంటుందన్నారు. మొదటి విడతలో 330 మందితో ప్రారంభ మవుతోందని, రానున్న రోజుల్లో అన్ని గ్రామాల్లోని యువరైతులకు శిక్షణనిచ్చేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని మంత్రి తెలిపారు. వ్యవసాయ సహాయ విస్తరణాధికారుల(ఏఏఈవో) పోస్టులను త్వరలోనే భర్తీ చేస్తామని చెప్పారు. అలాగే నియోజకవర్గానికో సంచార పశు వైద్యశాలను ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. భూసార పరీక్షలను మూడు ప్రాంతాల్లో ప్రయోగాత్మకంగా ప్రారంభిస్తామన్నారు. అమూల్ పాలు వినియోగదారుడికి చేరే సరికి పది రోజులు పడుతుందని, దీనివల్ల దుష్ఫలితాలు వస్తాయన్నారు. లీటర్‌కు నాలుగు రూపాయల ప్రోత్సాహకం ఇవ్వడం వల్ల విజయ పాల సేకరణ లక్ష నుంచి 1.96 లక్షల లీటర్లకు పెరిగిందన్నారు. రైతుల కోసం టీవీ చానల్, రేడియో ‘తెలంగాణ చేను కబుర్లు’ పేరుతో ఈ నెల 26న రేడియోను ప్రారంభిస్తున్నట్లు మంత్రి పోచారం తెలిపారు. రైతులు, వ్యవసాయ వర్సిటీ విద్యార్థులతో దీన్ని నిర్వహిస్తామన్నారు. రైతుల కోసం ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో 12 గంటల టీవీ చానల్ ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నట్లు వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్య తెలిపారు. ప్రపంచీకరణ తర్వాత వ్యవసాయం సంక్షోభంలో పడిపోయిందన్నారు. యువరైతుల కోసం 90 రోజుల శిక్షణ కోర్సు ప్రారంభించామన్నారు. ఇందులో భా గంగా అధ్యయన పర్యటనలూ నిర్వహిస్తామన్నారు. శిక్షణ తీసుకునే ప్రతీ రైతుపై ప్రభుత్వం రూ. 10 వేలు ఖర్చు చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు రైతులు, అధికారులు కూడా మాట్లాడారు. -
అక్కర్లేని విగ్రహాలు తొలగిస్తాం
ట్యాంక్‌బండ్‌పై తెలంగాణ ఉద్యమకారుల విగ్రహాలు ఏర్పాటు చేస్తాం ఇతరుల విగ్రహాలను కూల్చబోం..గౌరవంగా పంపిస్తాం కొండా లక్ష్మణ్ బాపూజీ శత జయంతి వేడుకల్లో సీఎం కేసీఆర్ హైదరాబాద్: హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్‌పై కొండా లక్ష్మణ్ బాపూజీ, ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహాలను ఏర్పాటు చేస్తామని తెలంగాణ సీఎం చంద్రశేఖర్‌రావు చెప్పారు. అక్కడ అక్కర్లేని విగ్రహాలను తొలగించాల్సి ఉందని.. ఆ స్థానంలో తెలంగాణ కోసం పోరాడిన వారి విగ్రహాలను ఏర్పాటు చేస్తామని అన్నారు. అయితే తమకు అవసరంలేని విగ్రహాలను కూల్చబోమని, వాటిని తీసి గౌరవంగా పంపిస్తామని తెలిపారు. ఏపీ ప్రభుత్వంతో బీజేపీకి స్నేహం ఉంటే ఉండవచ్చని.. విగ్రహాల విషయంలో మాత్రం బీజేపీ తమతో సహకరించాలని కేసీఆర్ వ్యాఖ్యానించారు. నారాయణగూడ పద్మశాలిభవన్ వద్ద ఏర్పాటు చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహాన్ని సీఎం కేసీఆర్ శనివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... నిర్బంధం, వ్యతిరేక పరిస్థితులు, ఒడిదుడుకుల్లోనూ తెలంగాణ ఉద్యమాన్ని బతికించింది కొండా లక్ష్మణ్ బాపూజీ, ప్రొఫెసర్ జయశంకర్లేనని పేర్కొన్నారు. ‘‘తెలంగాణలో ఎవరు సభలు పెట్టినా వారు వెళ్లేవారు. వాటికి వచ్చే కొద్దిమందితో ఏం చేస్తారని నేను ప్రశ్నించినపుడు.. ‘ఎవరైనా నీలాంటి వారు ముందుకొచ్చి ఉద్యమం చే యాలనుకున్నపుడు వీరంతా ఉపయోగపడతార’ని నాకు చెప్పారు. అందుకే తెలంగాణ సమాజానికి వారిద్దరిని మించిన గొప్పవారు లేరు..’’ అని ఆయన పేర్కొన్నారు. కొండా లక్ష్మణ్ బాపూజీ శత జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహిస్తామని చెప్పారు. అందులో భాగంగా నెలకో కార్యక్రమం చొప్పున ఏడాది పాటు నిర్వహించేందుకు చర్యలు చేపడుతామన్నారు. తెలుగు యూనివర్సిటీకి లేదా మరేదైన మంచి సంస్థకు బాపూజీ పేరు పెడతామన్నారు. చేనేత కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక మిషన్‌ను అమలుచేస్తామన్నారు. ఆ మిషన్‌కు కొండా లక్ష్మణ్ పేరు పెడతామన్నారు. టీఆర్ఎస్ బాపూజీ ఇంట్లో (జల దృశ్యంలో)నే ఏర్పాటైందని గుర్తుచేసుకున్నారు. తెలంగాణ ఉద్యమానికి, పార్టీకి పుట్టినిల్లు అయిన బాపూజీ ఇంటిని కక్ష గట్టి కూలగొట్టారని కేసీఆర్ పేర్కొన్నారు. టీఆర్ఎస్ ఆవిర్భావానికి ఆశ్రయం ఇచ్చినందునే ఈ పని చేశారని చెప్పారు. ఆ తరువాత పార్టీ కార్యాలయానికి స్థలం ఇవ్వలేదని, ఈ విషయాలపై తాను సమీక్షిస్తానని కేసీఆర్ తెలిపారు. కార్యక్రమంలో ఎంపీలు రాపోలు ఆనందభాస్కర్, దత్తాత్రేయ, టీఆర్ఎస్ నేత కె.కేశవరావు, బాపూజీ కుమార్తె పవిత్రారాణి, అఖిల భారత పద్మశాలి సంఘం అధ్యక్షుడు రామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు. న్యాయవ్యవస్థను ఆదర్శంగా తీర్చిదిద్దుతాం హైదరాబాద్: న్యాయవ్యవస్థలో దశలవారీగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి దేశంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దుతామని తెలంగాణ సీఎం చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. న్యాయవాదులు, న్యాయమూర్తుల సహకారంతో పటిష్టమైన చట్టాలను రూపొందించుకుని ముందుకు సాగుతామని చెప్పారు. అన్ని రంగాల్లో తెలంగాణ వివక్షకు గురైనట్లే న్యాయవ్యవస్థకూ అన్యాయం జరిగిందని వ్యాఖ్యానించారు. హైదరాబాద్ సిటీ కోర్టులు ఏర్పాటు చేసి 150 ఏళ్లయిన సందర్భంగా నిర్వహిస్తున్న వేడుకల్లో భాగంగా శనివారం నిర్వహించిన కార్యక్రమానికి కేసీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తెలంగాణ మలిదశ ఉద్యమంలో న్యాయవాదుల పాత్రపై రూపొందించిన ఫొటోల ఆల్బంను ఆవిష్కరించిన అనంతరం ఆయన ప్రసంగించారు. న్యాయ వ్యవస్థ స్వతంత్ర ప్రతిపత్తిని నిజాం నవాబు ఆనాడే గుర్తించారని.. కోర్టులు ఇచ్చే తీర్పులకు తాను బద్ధుడినై ఉంటానని ప్రకటించారని కేసీఆర్ చెప్పారు. సమైక్య రాష్ట్రంలో తెలంగాణ న్యాయవాదులకు తీరని అన్యాయం జరిగిందన్నారు. ప్రత్యేక హైకోర్టు ఏర్పాటుపై కేంద్ర ప్రభుత్వం స్పందించకపోతే మరో ఉద్యమానికి సిద్ధమవుతామని పేర్కొన్నారు. సివిల్, క్రిమినల్ కోర్టుల్లో జిల్లాల వారీగా ఉత్తమ న్యాయవాది అవార్డును ఏర్పాటు చేస్తామని కేసీఆర్ చెప్పారు. ‘ఉత్తమ న్యాయవాదికి రూ.లక్ష బహుమతి ఇస్తాం. న్యాయవాదుల సంక్షేమం కోసం ఇప్పటికే ప్రకటించిన రూ. 100 కోట్లను వెంటనే విడుదల చేస్తాం. ప్రభుత్వ ఉద్యోగుల తరహాలో వారికి ఆరోగ్య కార్డులు ఇచ్చే విషయాన్ని పరిశీలిస్తాం. అలాగే ఫ్లాట్లు నిర్మించుకునేందుకు వీలుగా న్యాయవాదుల సొసైటీలకు సిటీకి దగ్గరలో భూమిని కేటాయిస్తాం’ అని చెప్పారు.