* రైతు ఆత్మహత్యలను అంగీకరించిన మంత్రి పోచారం
* 65 కుటుంబాలకు పరిహారం చెల్లించామని వెల్లడి
* రైతు యూనిట్‌గా బీమాకు అసెంబ్లీ తీర్మానం చేస్తామని స్పష్టీకరణ
* 26 నుంచి ‘చేను కబుర్లు’ పేరుతో రేడియో, టీవీ చానల్‌పైనా కసరత్తు
* ‘యువరైతు సాగుబడి శిక్షణ’ను ప్రారంభించిన మంత్రి
సాక్షి, హైదరాబాద్: వ్యవసాయం కుదేలై అప్పుల్లో కూరుకుపోయిన రైతులు వాటిని తీర్చలేక మనోవేదనతో ఆత్మహత్యకు పాల్పడుతున్నారని రాష్ర్ట వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అంగీకరించారు. అన్నదాతల ఆత్మహత్యలకు కారణాలను గుర్తించి నిరోధించాలని వ్యాఖ్యానించారు. రాజేంద్రనగర్‌లోని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో సోమవారం జరిగిన ‘తెలంగాణ యువరైతు సాగుబడి శిక్షణ’ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రైతు ఆత్మహత్యలపై ఆయన మాట్లాడారు. ఇప్పటివరకు ఆత్మహత్యలు చేసుకున్న 65 రైతు కుటుంబాలకు లక్షన్నర రూపాయల చొప్పున పరిహారం అందజేశామని మంత్రి తెలిపారు. రాత్రికి రాత్రే అద్భుతాలు చేసే అల్లావుద్దీన్ దీపం తమ వద్ద లేదని వ్యాఖ్యానించారు. రైతు తన కుటుంబానికి మాత్రమే పంట పండించుకుంటే ప్రపంచం అల్లకల్లోలం అవుతుందన్నారు. ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట నష్టపోయిన రైతును యూనిట్‌గా చేసుకొని పరిహారం అందించే విధంగా పంటల బీమాలో మార్పులు చేయాలని కోరుతూ వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. పురుగుమందులు వాడకుండా పంటల దిగుబడి పెంచేలా శాస్త్రవేత్తలు కృషి చేయాలని సూచించారు. రైతు బాగుండాలంటే తక్కువ ధరకే నాణ్యమైన విత్తనాలను అందించాలని, కల్తీ విత్తనాలు అమ్మే వ్యాపారులను జైలుకు పంపించాలని, నష్టపోయిన రైతులకు పరిహారం ఇప్పించాలని, వ్యవసాయ యాంత్రీకరణ జరగాలని మంత్రి అభిప్రాయపడ్డారు. తను పండించిన పంటకు తానే ధర నిర్ణయించే రోజు వచ్చినప్పుడే రైతు జీవితం బాగుపడుతుందన్నారు. కొత్త రాష్ర్టంలో వ్యవసాయాన్ని, రైతాంగాన్ని పటిష్టపరిచేందుకే యువరైతు సాగుబడి శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు చెప్పారు.
రైతును శాస్త్రీయంగా, సాంకేతికంగా బలోపేతం చేసేలా ఈ శిక్షణ ఉంటుందన్నారు. మొదటి విడతలో 330 మందితో ప్రారంభ మవుతోందని, రానున్న రోజుల్లో అన్ని గ్రామాల్లోని యువరైతులకు శిక్షణనిచ్చేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని మంత్రి తెలిపారు. వ్యవసాయ సహాయ విస్తరణాధికారుల(ఏఏఈవో) పోస్టులను త్వరలోనే భర్తీ చేస్తామని చెప్పారు. అలాగే నియోజకవర్గానికో సంచార పశు వైద్యశాలను ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. భూసార పరీక్షలను మూడు ప్రాంతాల్లో ప్రయోగాత్మకంగా ప్రారంభిస్తామన్నారు. అమూల్ పాలు వినియోగదారుడికి చేరే సరికి పది రోజులు పడుతుందని, దీనివల్ల దుష్ఫలితాలు వస్తాయన్నారు. లీటర్‌కు నాలుగు రూపాయల ప్రోత్సాహకం ఇవ్వడం వల్ల విజయ పాల సేకరణ లక్ష నుంచి 1.96 లక్షల లీటర్లకు పెరిగిందన్నారు.
రైతుల కోసం టీవీ చానల్, రేడియో
‘తెలంగాణ చేను కబుర్లు’ పేరుతో ఈ నెల 26న రేడియోను ప్రారంభిస్తున్నట్లు మంత్రి పోచారం తెలిపారు. రైతులు, వ్యవసాయ వర్సిటీ విద్యార్థులతో దీన్ని నిర్వహిస్తామన్నారు. రైతుల కోసం ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో 12 గంటల టీవీ చానల్ ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నట్లు వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్య తెలిపారు. ప్రపంచీకరణ తర్వాత వ్యవసాయం సంక్షోభంలో పడిపోయిందన్నారు. యువరైతుల కోసం 90 రోజుల శిక్షణ కోర్సు ప్రారంభించామన్నారు. ఇందులో భా గంగా అధ్యయన పర్యటనలూ నిర్వహిస్తామన్నారు. శిక్షణ తీసుకునే ప్రతీ రైతుపై ప్రభుత్వం రూ. 10 వేలు ఖర్చు చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు రైతులు, అధికారులు కూడా మాట్లాడారు.
అప్పులు తీర్చలేకే...
Published Tue, Jan 6 2015 1:57 AM | Last Updated on Sat, Sep 29 2018 7:10 PM
Advertisement