సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాజకీయాల్లో మరోసారి ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఇంటి వద్ద బీఆర్‌ఎస్ నేతలు ధర్నాకు దిగడంతో పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. దీంతో, అక్కడ హైటెన్షన్ వాతావరణం నెలకొంది.
వివరాల ప్రకారం.. బీఆర్‌ఎస్ నేత, మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఆయన కుమారుడు భాస్కర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. సీఎం రేవంత్ సమక్షంలోనే వారిద్దరూ హస్తం గూటికి చేరారు. ఇక, పోచారం ఇంట్లోనే సీఎం రేవంత్ ఉన్న సమయంలో బీఆర్‌ఎస్ నేతలు, కార్యకర్తలు అక్కడికి చేరుకున్నారు. పోచారం శ్రీనివాస్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ధర్నాకు దిగారు.
ఈ సమయంలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ పోలీసుల కళ్లు గప్పి సీక్రెట్‌గా పోచారం ఇంట్లోకి వెళ్లారు. దీంతో, అక్కడ హైటెన్షన్ చోటుచేసుకుంది. కాగా, పోచారం ఇంటి వద్ద సెక్యూరిటీ వైఫల్యంపై సీఎంఓ ఆగ్రహం వ్యక్తం చేసింది. సీఎం రేవంత్ ఉండగానే బీఆర్‌ఎస్ నేతలు చొచ్చుకురావడంపై సీఎం సెక్యూరిటీ ఆరా తీసింది. భద్రతా లోపంపై నివేదిక ఇవ్వాలని ఏసీపీని ఆదేశించింది. ఈ నేపథ్యంలో వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్.. పోచారం ఇంటి వద్దకు వెళ్లారు. పోచారం ఇంట్లోకి బాల్క సుమన్ చొరబడిన తీరును అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బాల్క సుమన్‌తో పాటు బీఆర్‌ఎస్ నేతలపై చర్యలు ఉంటాయన్నారు.
కాగా, ఆ తర్వాత బీఆర్‌ఎస్, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. సీఎం రేవంత్ కాన్వాయ్‌ను బీఆర్‌ఎస్ శ్రేణులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో బీఆర్‌ఎస్ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ పరిస్థితుల కారణంగా రాష్ట్రంలో రాజకీయంగా రసవత్తరంగా మారింది.
Comments
Please login to add a commentAdd a comment