విత్తు జాడేది?
► పుష్కలంగా నీళ్లున్నా రైతన్నను వేధిస్తున్న విత్తన కొరత
► 4.88 లక్షల క్వింటాళ్ల సరఫరా లక్ష్యం.. అందింది 30 వేల క్వింటాళ్లే
► విత్తనాలు దొరక్క రైతుల కష్టాలు.. రబీ సన్నద్ధతలో వ్యవసాయ శాఖ విఫలం
సాక్షి, హైదరాబాద్: పుష్కలంగా వానలు పడ్డాయి.. చెరువులు, కుంటలు, ప్రాజెక్టులు కళకళలాడుతున్నాయి.. భూగర్భ జలాలు పైకి వచ్చాయి.. రబీకి గత పదేళ్ల కాలంలో ఇంతటి సానుకూల పరిస్థితి ఎప్పుడూ లేదంటున్నారు.. కానీ ఏం లాభం..? వ్యవసాయశాఖ అందుకు తగ్గట్లుగా సన్నద్ధం కాలేదు. దీంతో రబీ సీజన్ మొదలై 25 రోజులు కావొస్తున్నా విత్తు జాడ కానరావడం లేదు. వేరుశనగ, శనగ, వరి, కంది, మినుములు, మొక్కజొన్న వంటి విత్తనాల కోసం రైతులు అవస్థలు పడుతున్నారు.
విక్రయ కేంద్రాల వద్ద బారులు తీరుతున్నారు. పలుచోట్ల రోడ్డెక్కుతున్నారు. రబీకి అన్ని రకాల విత్తనాలు 4.88 లక్షల క్వింటాళ్లు సరఫరా చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకోగా.. ఇప్పటివరకు విక్రయ కేంద్రాల్లో 66,993 క్వింటాళ్లు సిద్ధంగా ఉంచారు. అందులో 30,634 క్వింటాళ్లు మాత్రమే రైతులకు సరఫరా చేశారు. గత్యంతరం లేక ప్రైవేటు వ్యాపారుల వద్ద అధిక ధరలకు విత్తనాలు కొనుగోలు చేస్తూ నష్టపోతున్నారు.
అదను తప్పితే అంతే..
ఈ నెల ఒకటో తేదీ నుంచే వివిధ రకాల పంటల సాగు మొదలు పెట్టాలని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం రైతులకు సూచిం చింది. అందుకు సంబంధించి రబీ సీజన్ పం టల సాగు కేలండర్‌ను గత నెలలోనే విడుదల చేసింది. పంటలు వేయాల్సిన గడువు తేదీలను (కట్ ఆఫ్) ప్రకటించింది. ఆ ప్రకారం వేరుశనగ, శనగ, మొక్కజొన్న, పెసర పంటలను ఈ నెల ఒకటో తేదీ నుంచే వేయడం ప్రారంభించాలి. కానీ వేరుశనగ, శనగ, మొక్కజొన్న, పెసర విత్తనాలను అవసరం మేరకు రైతులకు అందించడంలో వైఫల్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. 1.58 లక్షల క్వింటాళ్ల వేరుశనగ విత్తనాలను రైతులకు సరఫరా చేయాల్సి ఉండగా.. ఇప్పటివరకు విక్రయ కేంద్రాల్లో 35,172 క్విం టాళ్లే సిద్ధంగా ఉంచారు.
అందులో 17,116 క్వింటాళ్లే రైతులకు సరఫరా చేశారు. 1.22 లక్షల క్వింటాళ్ల శనగ విత్తనాలను సరఫరా చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా.. ఇప్పటివరకు విక్రయ కేం ద్రాలకు 18,363 క్వింటాళ్లు మాత్రమే చేరాయి. అందులో రైతులకు 13,145 క్వింటాళ్లే సరఫరా చేశారు. 3,800 క్వింటాళ్ల పెసర విత్తనాలకు గాను.. విక్రయ కేంద్రాల్లో కేవలం 493 క్వింటాళ్లే సిద్ధంగా ఉన్నాయి. అందులో 187 క్వింటాళ్లు మాత్రమే రైతులకు అందజేశారు. మొక్కజొన్న 24 వేల క్వింటాళ్లకుగాను ప్రభుత్వం ఒక్క క్వింటాలు కూడా సరఫరా చేయడం లేదు.
వేరు శనగ, శనగకు మించిన సమయం
ఉత్తర తెలంగాణలో వేరుశనగ, పెసర పం టలను ఈ నెల 20 వరకు వేసుకోవచ్చని.. దక్షిణ తెలంగాణలో మాత్రం వేరుశనగను నవంబర్ 15వ తేదీ వరకు వేసుకోవచ్చని శాస్త్రవేత్తలు సూచించారు. ఉత్తర తెలంగాణలో వేరుశనగ, శనగ వేయడానికి సమయం మించిపోయింది. అదను కూడా తప్పింది. ఇలాంటి పరిస్థితుల్లో ఆ విత్తనాలను ఇంకెప్పుడు సరఫరా చేస్తారో అంతుబట్టడంలేదు. అవసరమైన సమయంలో సబ్సిడీ విత్తనాలను సరఫరా చేయకపోవడంపై రైతులు నిలదీస్తున్నారు.