రాష్ట్రంలో వరి నాట్లు ఇంకా ఊపందుకోలేదు. రబీలో వరి సాధా రణ సాగు విస్తీర్ణం 13.32 లక్షల ఎకరాలు కాగా..
వ్యవసాయ శాఖ నివేదికలో వెల్లడి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వరి నాట్లు ఇంకా ఊపందుకోలేదు. రబీలో వరి సాధా రణ సాగు విస్తీర్ణం 13.32 లక్షల ఎకరాలు కాగా.. ఇప్పటివరకు 30 వేల ఎకరాల్లో(2 శాతం) మాత్రమే వరినాట్లు పడ్డాయని తెలంగాణ వ్యవసాయ శాఖ బుధవారం విదుదల చేసిన నివేదికలో వెల్లడించింది. సెప్టెంబర్‌లో అధిక వర్షాలు కురిసినా.. జలాశయాలు, వాగులు వంకలు, చెరువుల్లోకి నీరు వెల్లు వెత్తినా.. భూగర్భ జలాలు పెరిగినా ఇంకా వరినాట్లు ఊపందుకోకపోవడం గమనార్హం. అయితే వరిసాగు విస్తీర్ణం సాధారణం కంటే అధికంగా ఉంటుందని వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి పలు సందర్భాల్లో పేర్కొన్నారు. ఇంకా సమయం ఉందని.. కాబట్టి ఇబ్బంది ఏమీ ఉండబోదని ఆయన పేర్కొనడం విశేషం.
వ్యవసాయ శాఖ నివేదిక ప్రకారం మొత్తం అన్ని పంటల సాధారణ సాగు విస్తీర్ణం 30.20 లక్షల ఎకరాలు కాగా.. ఇప్పటివరకు 10.05 లక్షల ఎకరాల్లో(33%) పంటల సాగు జరిగింది. అందులో శనగ సాగు విస్తీర్ణం అత్యధికంగా 115 శాతం కావడం విశేషం. రబీలో శనగ సాధారణ సాగు విస్తీర్ణం 2.11 లక్షల ఎకరాలు కాగా.. ఇప్పటివరకు 2.52 లక్షల ఎకరాల్లో పంట సాగైంది. మొత్తం అన్ని రకాల పప్పుధాన్యాల సాగు 97 శాతం ఉంది. రబీలో పప్పుధాన్యాల సాధారణ సాగు విస్తీర్ణం 3.17 లక్షల ఎకరాలు కాగా.. ఇప్పటివరకు 3.07 లక్షల ఎకరాల్లో సాగయ్యాయి. నూనె గింజల్లో వేరుశనగ సాగు సాధారణ విస్తీర్ణం 3.8 లక్షల ఎకరాలు కాగా.. 3.37 లక్షల ఎకరాల్లో(89%) సాగైంది. ఇదిలావుండగా రాష్ట్రంలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. ఈశాన్య రుతుపవనాలు ముఖం చాటేయడంతో రెండు నెలలుగా ఈ పరిస్థితి నెలకొంది.