rice seeding
-
రబీ వరి నాట్లు 2 శాతమే..!
వ్యవసాయ శాఖ నివేదికలో వెల్లడి సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వరి నాట్లు ఇంకా ఊపందుకోలేదు. రబీలో వరి సాధా రణ సాగు విస్తీర్ణం 13.32 లక్షల ఎకరాలు కాగా.. ఇప్పటివరకు 30 వేల ఎకరాల్లో(2 శాతం) మాత్రమే వరినాట్లు పడ్డాయని తెలంగాణ వ్యవసాయ శాఖ బుధవారం విదుదల చేసిన నివేదికలో వెల్లడించింది. సెప్టెంబర్‌లో అధిక వర్షాలు కురిసినా.. జలాశయాలు, వాగులు వంకలు, చెరువుల్లోకి నీరు వెల్లు వెత్తినా.. భూగర్భ జలాలు పెరిగినా ఇంకా వరినాట్లు ఊపందుకోకపోవడం గమనార్హం. అయితే వరిసాగు విస్తీర్ణం సాధారణం కంటే అధికంగా ఉంటుందని వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి పలు సందర్భాల్లో పేర్కొన్నారు. ఇంకా సమయం ఉందని.. కాబట్టి ఇబ్బంది ఏమీ ఉండబోదని ఆయన పేర్కొనడం విశేషం. వ్యవసాయ శాఖ నివేదిక ప్రకారం మొత్తం అన్ని పంటల సాధారణ సాగు విస్తీర్ణం 30.20 లక్షల ఎకరాలు కాగా.. ఇప్పటివరకు 10.05 లక్షల ఎకరాల్లో(33%) పంటల సాగు జరిగింది. అందులో శనగ సాగు విస్తీర్ణం అత్యధికంగా 115 శాతం కావడం విశేషం. రబీలో శనగ సాధారణ సాగు విస్తీర్ణం 2.11 లక్షల ఎకరాలు కాగా.. ఇప్పటివరకు 2.52 లక్షల ఎకరాల్లో పంట సాగైంది. మొత్తం అన్ని రకాల పప్పుధాన్యాల సాగు 97 శాతం ఉంది. రబీలో పప్పుధాన్యాల సాధారణ సాగు విస్తీర్ణం 3.17 లక్షల ఎకరాలు కాగా.. ఇప్పటివరకు 3.07 లక్షల ఎకరాల్లో సాగయ్యాయి. నూనె గింజల్లో వేరుశనగ సాగు సాధారణ విస్తీర్ణం 3.8 లక్షల ఎకరాలు కాగా.. 3.37 లక్షల ఎకరాల్లో(89%) సాగైంది. ఇదిలావుండగా రాష్ట్రంలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. ఈశాన్య రుతుపవనాలు ముఖం చాటేయడంతో రెండు నెలలుగా ఈ పరిస్థితి నెలకొంది. -
శరవేగంగా నాట్లేసేశారు...
తిక్క లెక్క దాదాపు ఐదెకరాల పొలంలో నాట్లేయాలంటే ఒక రోజంతా సరిపోదు. బాగా మందీ మార్బలం రంగంలోకి దిగి ఎంత హడావుడిగా పనిచేసినా దాదాపు ఒక పూట పట్టేస్తుంది. తైవాన్ రైతులు మాత్రం ఏకంగా 16 నిమిషాల 20 సెకండ్లలోనే 5.1 ఎకరాల పొలంలో వరి నాట్లు వేయడం పూర్తి చేసి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. అంతేనా..! గిన్నెస్ రికార్డుల్లోనూ చోటు దక్కించుకున్నారు. -
నిలువునా ముంచారు
విత్తనాలిచ్చి, సాగునీరిస్తామని చెప్పిన ప్రభుత్వం తీరా వరినాట్లు ప్రారంభించాక నిలువునా ముంచేసిందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేశారు. నీళ్లిస్తారనే ఆశతో వేసిన నారుమళ్లు ఎండిపోవడంతో తీవ్రంగా నష్టపోయామని క్షేత్రస్థాయిలో పంటల పరిస్థితులు, రైతుల కష్టనష్టాలను పరిశీలించేందుకు వచ్చిన వైఎస్సార్ సీపీ నేతల ఎదుట తమ గోడు వినిపించారు. నాగాయలంక మండలంలో పార్టీ దక్షిణ కృష్ణా అధ్యక్షుడు కొలుసు పార్థసారథి, వత్సవాయిలో జగ్గయ్యపేట నియోజకవర్గ సమన్వయకర్త సామినేని ఉదయభాను, చాట్రాయిలో ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావు, తిరువూరు మండలంలో ఎమ్మెల్యే రక్షణనిధి శుక్రవారం రైతుల పరిస్థితులను పరిశీలించారు. నాగాయలంక/వత్సవాయి/చాట్రాయి : నాగాయలంక తీర ప్రాంతంలో రైతుల పరిస్థితి, కష్టనష్టాలను అధ్యయనం చేసేందుకు వైఎస్సార్ సీపీ దక్షిణ కృష్ణా అధ్యక్షుడు కొలుసు పార్థసారథి ఆ పార్టీ అవనిగడ్డ నియోజకవర్గ సమన్వయకర్త సింహాద్రి రమేష్‌బాబుతో కలసి శుక్రవారం మండలంలో విస్తృతంగా పర్యటించారు. గణపేశ్వరం, దిండి, సొర్లగొంది ప్రాంతాల్లో పర్యటించిన నేతలకు రైతులు తమ గోడు వినిపించారు. సొర్లగొంది మత్య్సకార రైతులు మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేని విధంగా పంటలు వేయలేక పొలాలను బీడుగా వదిలేసినట్లు చెప్పారు. నీళ్లిస్తారన్న ఆశతో నారుమళ్లు పోసుకుని ఎండబెట్టుకోవడంతో తీవ్రంగా నష్టపోయామన్నారు. చేపలవేట నిషేధానికి సంబంధించిన ఆర్థికసాయం కూడా ప్రభుత్వం ఇంకా ఇవ్వలేదని వివరించారు. వేలాది ఎకరాల్లో పంట వేయని, వేసి నష్టపోయిన వారందరికీ పరిహారం ఇప్పించాలని రైతులు విజ్ఞప్తి చేశారు. పంటవేయకుండా వదిలేసిన భూములు, మాడిపోయిన నారుమళ్లు, నీరందక నెర్రెలిచ్చిన పొలాలను నాయకులు పరిశీలించారు. పర్యటనలో పార్టీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు నలుకుర్తి రమేష్, మండల కన్వీనర్ భోగాది వెంకట శేషగిరిరావు, రైతు కన్వీనర్ బీసాబత్తుని ప్రసాద్, ప్రచార కన్వీనర్ మద్ది చిన్నారి, మాజీ సర్పంచ్ నాయుడు అమ్మన్న, తోట సాయిబాబు తదితరులు పాల్గొన్నారు. ఇరిగేషన్ మంత్రి చేతగానిదద్దమ్మ : సారథి ఇరిగేషన్ శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు రైతాంగం ఉసురుతీసి చేష్టలుడిగిన.. చేతగాని దద్దమ్మలా రైతుల జీవనాన్ని అల్లకల్లోలం చేశారని వైఎస్సార్సీపీ దక్షిణ కృష్ణా అధ్యక్షుడు కె.పార్థసారథి ధ్వజమెత్తారు. శుక్రవారం ఆయన నాగాయలంకలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సముద్రతీర మండలాల్లో రైతుల కష్టాలు వర్ణనాతీతంగా మారాయని, ప్రభుత్వం మాటలు నమ్మి నాట్లు వేసుకున్న రైతులను నష్టాల నుంచి కాపాడాల్సిన నైతిక బాధ్యత విస్మరించడం దౌర్భాగ్యమన్నారు. అవనిగడ్డ, నాగాయలంక, కోడూరు మండలాల్లో 75వేల ఎకరాల సాగు విస్తీర్ణం ఉండగా కేవలం 25వేల ఎకరాల్లో పంటలు వేశారని, కనీసం వాటినీ ప్రభుత్వం కాపాడలేకపోతే 7, 8 వేల ఎకరాల్లో కూడా దిగుబడి రాదని సారథి చెప్పారు. తక్షణం సాగునీరు విడుదల చేసి రైతులు వేసిన పంటలను కాపాడాలని, సముద్రతీరంలో జీవనం కోల్పోయిన రైతాంగానికి ఓప్రణాళికతో ప్రభుత్వం నష్టపరిహారం ప్రకటించాలని పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నామన్నారు. పార్టీ అవనిగడ్డ నియోజకవర్గ సమన్వయకర్త సింహాద్రి రమేష్‌బాబు మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే ఇచ్చిన మాట ప్రకారం ఎదురుమొండి రైతులకు అటవీ భూములను, తీరగ్రామాల మత్స్యకారులకు చేపలవేట నిషేధిత కాలంలో ఇచ్చే ఆర్థిక సాయాన్ని తక్షణం ఇప్పించి ఆదుకోవాలని డిమాండ్ చే శారు. -
సాగుతూ..ఆగుతూ..
ఆశించిన స్థాయిలో పడని వరినాట్లు జలాశయాల పరిధిలో 20శాతమే ఆందోళన కలిగిస్తున్న ఖరీఫ్ అధికారుల లెక్కలు మాత్రం వేరు విశాఖపట్నం: జిల్లాలో సాగునీటి ప్రాజెక్టుల్లో ఆశించిన స్థాయిలో నీటి మట్టాలు లేకపోవడంతో వాటి పరిధిలోని ఆయకట్టులో వరినాట్లు ముందుకుసాగడంలేదు. పరీవాహక ప్రాంతాల్లో ఆశించిన స్థాయిలో వర్షాలు లేకపోవడంతో జలాశయాల్లో పూర్తి స్థాయిలో నీరు చేరలేదు. నీటిపారుదలశాఖ అధికారుల లెక్కల ప్రకారం 20శాతానికి మించలేదు. వర్షాధార ప్రాంతంలో మాత్రం 90 శాతం మేర నాట్లు పూర్తికావడంతో అధికారులు ఊపిరి పీల్చుకుంటున్నారు. కానీ సీజన్ ముగుస్తున్నా..నాట్లు పూర్తికాకపోవడంతో ఈ ప్రభావం దిగుబడిపై తీవ్రంగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. జిల్లాలో ఖరీఫ్ వరిసాగు లక్ష్యం 2.65లక్షల ఎకరాలు. మేజర్, మీడియం ఇరిగేషన్ ప్రాజెక్టుల పరిధిలో 75,762 ఎకరాలు, మైనర్ ఇరిగేషన్ పరిధిలో 2.86లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. ఇందులో 1.25లక్షల ఎకరాల్లో వరి సాగు చేపట్టాలి. వర్షాధారంగా 65,233 ఎకరాల్లో నాట్లు వేశారు. తాండవప్రాజక్టు పరిధిలో ప్రస్తుతం 6.60 టీఎంసీల నీరు ఉంది. 496 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఈ ప్రాజెక్టు పరిధిలో 32,689 ఎకరాల ఆయకట్టు ఉండగా..నీరు విడుదల చేయకముందే వర్షాధారంగా సుమారు రెండువేలఎకరాల్లో నాట్లు వేశారు. రైవాడ, కోనాం, పెద్దేరు పరిధిలో 42,873 ఎకరాల ఆయకట్టు ఉంది. ప్రస్తుతం 22,420 ఎకరాల్లోనే నాట్లు పడ్డాయి. ఇక మైనర్ ఇరిగేషన్ పరిధిలో 2,86,538 ఎకరాల ఆయకట్టుకు కేవలం 57,605 ఎకరాల్లో మాత్రమే నాట్లు వేశారు. ఇప్పటి వరకు 80 శాతం విస్తీర్ణంలో నాట్లు పడ్డాయని వ్యవసాయశాఖాధికారులు చెబుతుంటే..60 శాతం మేర మాత్రమే నాట్లుపడ్డాయని క్షేత్ర స్థాయిలో వివరాలు సేకరించే ముఖ్యప్రణాళికావిభాగం అధికారులు పేర్కొంటున్నారు. ప్రాజెక్టులు, సాగునీటి వనరుల పరిధిలో కేవలం 20శాతం విస్తీర్ణంలోనే నాట్లు పడ్డాయని ఇరిగేషన్ అధికారులు చెప్పడం విస్మయానికి గురి చేస్తోంది. ఎవరి లెక్కలు వాస్తవమో తెలియని గందరగోళ పరిస్థితి నెలకొంది. -
ఆశల చిగురు
రెండు రోజులుగా జిల్లాలో వర్షం వరి,చెరకు పంటలకు అనుకూలం ఆలస్యంగా వేసిన నాట్లకు మేలు ఖరీఫ్ ఆఖరిలో వరుణుడు అన్నదాతల్లో ఆనందాన్ని నింపుతున్నాడు. ఒడిశా, ఉత్తర కోస్తాంధ్ర తీరాన్ని ఆనుకుని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో స్థిరంగా అల్పపీడనంతో రెండు రోజులుగా జిల్లా అంతటా భారీ వర్షాలు పడుతున్నాయి. ఆలస్యంగా వేసిన వరినాట్లు ప్రస్తుతం పిలకలదశలో ఉన్నాయి. పొట్టదశవరకు నీటి ఉధృతిని తట్టుకునే ఈ పంటకు మేలు చేకూరినట్టే. అక్కడక్కడా వర్షాభావంతో వడలిపోతున్నమెట్టపంటలకు అనుకూలం. ఇంకా ఉధృతమైతేనే కొన్ని పంటలకు నష్టం. అనకాపల్లి : అల్పపీడనంతో రెండు రోజులుగా జిల్లా అంతటా వర్షాలు పడుతున్నాయి. ఇవి పంటలకు అనుకూలం. ఆగస్టు నెలాఖరులో కురిసిన వర్షాలతో సెప్టెంబర్ మొదటి రెండు వారాల్లోనూ వరి నాట్లు జోరుగా సాగాయి. ఆలస్యంగా నాట్లుతో ప్రస్తుతం చాలా చోట్ల వరి పిలకల దశలో ఉంది. పొట్టదశ వరకూ నీటి ఉధృతిని తట్టుకోగల స్వభావం ఉన్నందున వర్షాలు మితిమీరినా ఇప్పటికిప్పుడు ఈ పంటకు వచ్చిన నష్టం ఏమీ ఉండదని వ్యవసాయశాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. అవకాశం ఉంటే ఎప్పటికప్పుడు నీటిని తొలగించుకుంటే మంచిదంటున్నారు. అయితే లోతట్టు ప్రాంతాల్లోని పొలాల్లో నీరు నిల్వ ఉండడంతో రైతుల్లో కొంత ఆందోళన నెల కొంది. పరిస్థితి ఇప్పటికి అనుకూలంగా ఉన్నప్పటికీ ఇంకా భారీ వర్షాలు నమోదయితే ముంపు కష్టాలు తప్పవేమోనని అటు రైతులు, ఇటు వ్యవసాయాధికారులు భావిస్తున్నారు. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు నదు లు, వాగులు, కొండగెడ్డలు పొంగి ప్రవహిస్తున్నా యి. ఇప్పటికే నిండుగా ఉన్న జలాశయాల్లోకి ఎగువ నుంచి భారీ ఎత్తున వరదనీరు వచ్చిపడుతోంది. శుక్రవారం సాయంత్రానికి తాండవ జలాశయంలో 370 అడుగుల నీరు నిల్వ ఉంది కురుస్తున్న వ ర్షాలతో నీటి మట్టం మరింత పెరిగే అవకాశం ఉందని నీటిపారుదలశాఖ అధికారులు పేర్కొంటున్నారు. వరి, చెరకుకు మేలు నాది మునగపాక మండలం తిమ్మరాజుపేట. ఈ ఏడాది 75 సెంట్ల విస్తీర్ణంలో చెరకు సాగు చేపట్టాను. మూడేళ్లుగా చెరకుతోటలకు మొజాయిక్ తెగులు ఆశించి నష్టపోతున్నాను. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు దీని నివారణకు అనుకూలమని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. రెండురోజులుగా కురుస్తున్న వర్షాలకు తెగులు పోయే అవకాశం ఉంటుందని ఆశగా ఉంది. ఆలస్యంగా వేసిన వరినాట్లుకు అనుకూలం. - భీమరశెట్టి గణేష్‌నాయుడు, రైతు, పంటలకు అనుకూలం ప్రస్తుతం నమోదవుతున్న భారీ వర్షాలకు రైతులు ఆందోళన చెందాల్సిన పనిలేదు. ప్రధానంగా చెరకు, వరి పంటలకు ఎటువంటి ఇబ్బందులు ఉండవు. పత్తి, కందికి మాత్రం కొద్దిగా నష్టం వాటిల్లే అవకాశం ఉంది. పత్తిలో నీరు నిల్వ ఉంటే తొలగించాలి. నీరు తగ్గాక 3 గ్రాముల కాఫర్ ఆక్సీ క్లోరైడ్‌ను లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి. - సి.వి.రామారావు, ఏరువాక కేంద్రం, శాస్త్రవేత్త