ఆశల చిగురు
- రెండు రోజులుగా జిల్లాలో వర్షం
- వరి,చెరకు పంటలకు అనుకూలం
- ఆలస్యంగా వేసిన నాట్లకు మేలు
ఖరీఫ్ ఆఖరిలో వరుణుడు అన్నదాతల్లో ఆనందాన్ని నింపుతున్నాడు. ఒడిశా, ఉత్తర కోస్తాంధ్ర తీరాన్ని ఆనుకుని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో స్థిరంగా అల్పపీడనంతో రెండు రోజులుగా జిల్లా అంతటా భారీ వర్షాలు పడుతున్నాయి. ఆలస్యంగా వేసిన వరినాట్లు ప్రస్తుతం పిలకలదశలో ఉన్నాయి. పొట్టదశవరకు నీటి ఉధృతిని తట్టుకునే ఈ పంటకు మేలు చేకూరినట్టే. అక్కడక్కడా వర్షాభావంతో వడలిపోతున్నమెట్టపంటలకు అనుకూలం. ఇంకా ఉధృతమైతేనే కొన్ని పంటలకు నష్టం.
అనకాపల్లి : అల్పపీడనంతో రెండు రోజులుగా జిల్లా అంతటా వర్షాలు పడుతున్నాయి. ఇవి పంటలకు అనుకూలం. ఆగస్టు నెలాఖరులో కురిసిన వర్షాలతో సెప్టెంబర్ మొదటి రెండు వారాల్లోనూ వరి నాట్లు జోరుగా సాగాయి. ఆలస్యంగా నాట్లుతో ప్రస్తుతం చాలా చోట్ల వరి పిలకల దశలో ఉంది. పొట్టదశ వరకూ నీటి ఉధృతిని తట్టుకోగల స్వభావం ఉన్నందున వర్షాలు మితిమీరినా ఇప్పటికిప్పుడు ఈ పంటకు వచ్చిన నష్టం ఏమీ ఉండదని వ్యవసాయశాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.
అవకాశం ఉంటే ఎప్పటికప్పుడు నీటిని తొలగించుకుంటే మంచిదంటున్నారు. అయితే లోతట్టు ప్రాంతాల్లోని పొలాల్లో నీరు నిల్వ ఉండడంతో రైతుల్లో కొంత ఆందోళన నెల కొంది. పరిస్థితి ఇప్పటికి అనుకూలంగా ఉన్నప్పటికీ ఇంకా భారీ వర్షాలు నమోదయితే ముంపు కష్టాలు తప్పవేమోనని అటు రైతులు, ఇటు వ్యవసాయాధికారులు భావిస్తున్నారు.
రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు నదు లు, వాగులు, కొండగెడ్డలు పొంగి ప్రవహిస్తున్నా యి. ఇప్పటికే నిండుగా ఉన్న జలాశయాల్లోకి ఎగువ నుంచి భారీ ఎత్తున వరదనీరు వచ్చిపడుతోంది. శుక్రవారం సాయంత్రానికి తాండవ జలాశయంలో 370 అడుగుల నీరు నిల్వ ఉంది కురుస్తున్న వ ర్షాలతో నీటి మట్టం మరింత పెరిగే అవకాశం ఉందని నీటిపారుదలశాఖ అధికారులు పేర్కొంటున్నారు.
వరి, చెరకుకు మేలు
నాది మునగపాక మండలం తిమ్మరాజుపేట. ఈ ఏడాది 75 సెంట్ల విస్తీర్ణంలో చెరకు సాగు చేపట్టాను. మూడేళ్లుగా చెరకుతోటలకు మొజాయిక్ తెగులు ఆశించి నష్టపోతున్నాను. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు దీని నివారణకు అనుకూలమని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. రెండురోజులుగా కురుస్తున్న వర్షాలకు తెగులు పోయే అవకాశం ఉంటుందని ఆశగా ఉంది. ఆలస్యంగా వేసిన వరినాట్లుకు అనుకూలం.
- భీమరశెట్టి గణేష్‌నాయుడు, రైతు,
పంటలకు అనుకూలం
ప్రస్తుతం నమోదవుతున్న భారీ వర్షాలకు రైతులు ఆందోళన చెందాల్సిన పనిలేదు. ప్రధానంగా చెరకు, వరి పంటలకు ఎటువంటి ఇబ్బందులు ఉండవు. పత్తి, కందికి మాత్రం కొద్దిగా నష్టం వాటిల్లే అవకాశం ఉంది. పత్తిలో నీరు నిల్వ ఉంటే తొలగించాలి. నీరు తగ్గాక 3 గ్రాముల కాఫర్ ఆక్సీ క్లోరైడ్‌ను లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి.
- సి.వి.రామారావు, ఏరువాక కేంద్రం, శాస్త్రవేత్త