తెలంగాణ ఉద్యమ శిఖరం
ఆదర్శం: బాపూజీ 1969 తెలంగాణ తొలిదశ ఉద్యమంలో చురుగ్గా పాల్గొని, మలిదశ ఉద్యమంలోనూ కీలక భూమిక పోషించారు. జీవితాంతం తాడిత పీడిత ప్రజల పక్షాన్నే నిలిచారు. దేశభక్తిపూరిత వందేమాతర ఉద్యమం నుంచి, ఆత్మగౌరవ పోరాటం తెలంగాణ ఉద్యమం వరకు ఆయన జీవితం ఉద్యమాలతోనే ముడివడి ఉంది. దురదృష్టవశాత్తూ తెలంగాణ కల సాకారమైన రోజు ఆయన మన మధ్య లేకుండా పోయారు.
రావుల శంకర్, ఆసిఫాబాద్
బాపూజీ స్వస్థలం అప్పటి హైదరాబాద్ సంస్థానంలోని ప్రస్తుత మహారాష్ట్రలోని రాజూర గ్రామం. 1915 సెప్టెంబర్ 27న ఆయన ఆదిలాబాద్ జిల్లా, ఆసిఫాబాద్ సమీపంలోని వాంకిడిలోని మేనత్త ఇంట్లో జన్మించారు. అమ్మక్క, బాపూజీల చివరి సంతానం లక్ష్మణ్. ముగ్గురు సోదరులు, ఒక సోదరి. మూడేళ్ళకే తల్లి దూరమవ్వడంతో మేనత్త వద్దే పెరిగారు. ఐదేళ్ల వయసులో తండ్రితో పాటు రాజూర వెళ్లాడు. అక్కడే బడికి వెళ్లాడు. లక్ష్మణ్ తండ్రి రాజూరలో పోస్ట్‌మెన్‌గా పనిచేసేవారు.
లక్ష్మణ్ బార్ ఎట్ లా చదివారు. మద్రాస్‌కు చెందిన డాక్టర్ శకుంతలా దేవిని వివాహమాడారు. ఆయనకు ఇద్దరు కుమారులు. లక్ష్మణ్ హైదరాబాద్ హైకోర్టులో న్యాయవాదిగా పనిచేశారు. తెలంగాణ ఉద్యమంలో జైలుపాలయిన బడుగు బలహీనుల కేసులను ఎక్కువగా వాదించేవారు. న్యాయస్థానంలో చాకలి ఐలమ్మకు న్యాయం చేసేందుకు కృషిచేశారు.
కొండా లక్ష్మణ్ బాపూజీ హైదారాబాద్ సం స్థానం పౌర విమోచనోద్యమంలో 1938లో మొదటి సారి అరెస్టయ్యారు. 1941-42లో ఖద్దరు ఉద్యమంలో, క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నారు. తెలంగాణ సాయుధ పోరాటంలో భాగమయ్యారు. నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ఆలుపెరుగని పోరాటం చేశారు.
1952 ఎన్నికల్లో ఆసిఫాబాద్ తొలి ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీ నుంచి ఘన విజయం సాధించారు. 1957, 62, 67, 72ల్లో నల్లగొండ జిల్లా నుంచి ఎమ్మెల్యేగా వరుసగా నాలుగు సార్లు గెలుపొందారు. మొత్తంమీద బాపూజీ 5 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి డిప్యూటీ స్పీకర్‌గా, రెండు సార్లు రాష్ట్ర మంత్రిగా పని చేశారు.
తెలుగుదేశం ప్రభుత్వం అష్టకష్టాలు పెట్టినా నిబ్బరంగా ముందుకెళ్ళారు. నిలువ నీడ లేకుండా చేసినా అద్దె ఇంట్లోనే తలదాచుకుని, తెలంగాణ కోసం తలెత్తుకుని ఉద్యమించారు.
పుట్టి పెరిగిన వాంకిడిలో సేవా కార్యక్రమాలు చేపట్టారు.
ముఖ్యమైన కొన్ని ఘట్టాలు
హెదరాబాద్ సంస్థాన్‌ను విలీనం చేయాలనే ఉద్యమం కారణంగా 13 సార్లు అరెస్టు అయ్యారు.
1950లోనే హైదరాబాద్‌లో బీసీ సంఘాన్ని స్థాపించి, బీసీల అభివృద్ధికై అహర్నిశలు కృషి చేశారు.
1957-60 వరకు రాష్ట్ర క్యాబినేట్‌లో డిప్యూటీ స్పీకర్‌గా పని చేశారు.
1960-62 వరకు దామోదరం సంజీవయ్య మంత్రివర్గంలో పలు కీలక శాఖలు నిర్వహించారు.
1967-69 వరకు కాసు అప్పటి ముఖ్యమంత్రి బ్రహ్మానంద రెడ్డి హాయంలో కార్మిక మంత్రిగా, సమాచార శాఖ మంత్రిగా పని చేశారు.
1969లో ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొని తెలంగాణ కోసం మంత్రి పదవికి రాజీనామా చేశారు. అదే సమయంలో అప్పటి ప్రభుత్వం కొండా లక్ష్మణ్ బాపూజీని అరెస్టు చేసి రాజమండ్రి జైలుకు తరలించింది.
- కొండా లక్ష్మణ్ బాపూజీ