అమ్మ మాట.. నౌకరీలు దొరికితేనే ఆత్మ శాంతిస్తది
నా భర్త దుబాయికి పోయిండు. నాకు ఇద్దరు కొడుకులు. పెద్దోడు భాస్కర్, చిన్నోడు ప్రభాకర్. కూతురు ధనలక్ష్మి. పెద్దోడు కోరుట్లలో 2009లో డిగ్రీ సదువుకుంటూ తెలంగాణ ఉద్యమంలో తిరిగేటోడు. సదువుతుండంగనే కుటుంబానికి ఆసరా కోసం వర్షకొండలోని వైన్‌షాపులో పనిజేసేటోడు. కుటుంబం ఎల్లదీసుడు కష్టంగా ఉంటుండేది. ‘తెలంగాణ అస్తే మనకు ఈ గోస ఉండదే, నాన్న దుబాయికి పోయె పనుండది, నువ్వు బీడీలు చేసి కష్టపడే అవసరం ఉండది, నా అసోంటోళ్లకు ఉద్యోగాలు అత్తయని ’ చెప్పేటోడు.
ఏమైందో తె ల్వదు గానీ 2011 ఫిబ్రవరి 9న వైన్‌షాపులోనే జేబులో లెటరు పెట్టుకొని ఆత్మహత్య చేసుకున్నడు. లెటర్ల తెలంగాణ కోసం సచ్చిపోతున్నానని రాసిండు. గిప్పుడు తెలంగాణ వచ్చింది. కొడుకుంటే ఎంత సంబరపడేటోడో. తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నం కాబట్టి గిప్పుడైనా మా బాధలు తీరాలి. అందరం బాగుపడాలి. అందరికీ న్యాయం జరగాలి. నా కొడుకులసుంటి పిలగాల్లకు నౌకరీలు దొరికితే నా కొడుకు ఆత్మశాంతిస్తది.
- సేకరణ: చంద్రశేఖర్, కోరుట్ల