telangana martyrs
-
నిజాం పునాదులు కదిలించిన ఓరుగల్లు
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం.. రజాకార్లు, దేశ్‌ముఖ్‌ల ఆగడాలకు వ్యతిరేకంగా ఊర్లకు ఊర్లు మర్లబడ్డయి. గ్రామస్తులు బరిసెలు, తుపాకులు చేతబట్టి సాయుధ పోరాటానికి దిగారు. వీరిని చంపేందుకు రజాకార్లు చేయని ప్రయత్నం లేదు. నిజాం సైన్యం ఊర్లపై పడి దొరికిన వారిని దొరికినట్లు చంపేశారు. గ్రామాల్లో మూకుమ్మడి హత్యలు చేశారు. అయినా వెరవలేదు. భయపడలేదు. ఎదురొడ్డి నిలిచి పోరాడారు. సింహంలా దూకిన మొగిలయ్య హన్మకొండ కల్చరల్/వరంగల్ అర్బన్: 1944లో వరంగల్‌లో సర్వోదయ సంఘం స్థాపించారు. ప్రతివారం వరంగల్ కోటలో, స్తంభంపల్లిలో త్రివర్ణ పతాకం ఎగురవేయాలని నిర్ణయం తీసుకున్నారు. రాజలింగం, హయగ్రీవాచారి, సంగరంబోయిన కనకయ్య, మల్లయ్య, దుగ్గిశెట్టి వెంకటయ్య, ఏ.సుదర్శన్, బి. రంగనాయకులు, వి.గోవిందరావు, భూపతి కృష్ణమూర్తి, బత్తిని రామస్వామి, బత్తిని మొగిలయ్యల ఆధ్వర్యంలో 1944 నుంచి జెండా వందనాలు జరుగుతూ వచ్చాయి. బత్తిని రామస్వామి ఇంటిముందున్న ఆవరణలో 1946, ఆగస్టు 11న జెండావందనం జరిగింది. మొగిలయ్య కూడా అందులో పాల్గొన్నాడు. విషయం తెలుసుకున్న రజాకార్ల గుంపు ఖాసీం షరీఫ్ ఆధ్వర్యంలో వారిపై దాడి జరిపారు. బత్తిని రామస్వామికి గాయాలయ్యాయి. వెంకటయ్య చేయి నరికివేశారు. కూచం మల్లేషం తుపాకీ గుండుతో గాయపడ్డాడు. మరికొందరు గాయపడ్డారు. అప్పటికే కల్లుగీసేందుకు వనానికి వెళ్లిన మొగిలయ్యకు తన సోదరుడు గాయపడిన సంగతి తెలిసింది. వెంటనే సింహంలా వచ్చి వారిపై కలబడ్డాడు. మొగిలయ్యను వదిలేస్తే తమను వదిలిపెట్టాడని భావించిన రజాకార్లు బరిసెతో పొడవడంతో అక్కడికక్కడే మరణించాడు. ఖాసీం షరీఫ్, తన అనుచరులు ఖిలా వరంగల్ నుంచి వరంగల్ చౌరస్తాకు చేరుకున్నారు. అక్కడి ప్రజలకు మొగిలయ్యను చంపిన బరిసెను చూపుతూ భయం కలిగించేలా ఊరేగింపు చేశారు. మొగిలయ్య స్మారక చిహ్నంగా ఎల్లమ్మ బజారులో ఒక భవనాన్ని నిర్మించారు. అది ఇప్పటికి మొగిలయ్య హాలుగా ప్రసిద్ధి చెందింది. సగర్వంగా జీవిస్తున్నా.. నాకు ఊహ తెలిసిన తర్వాత మా అమ్మ, కొంతమంది స్వాతంత్య్ర సమరయోధులైన మా నాన్న గురించి పదే పదే చెప్పేవారు. రజాకార్లకు ఎదుదొడ్డి నిలిచి వీరమరణం పొందాడని చెబుతుండడం గర్వంగా ఉంటుంది. నాకు, నా కుటుంబానికి ప్రభుత్వం నుంచి కానీ.. బత్తిని మొగిలయ్య గౌడ్ ట్రస్టునుంచి ఎలాంటి గుర్తింపు, ఆర్థికసాయం లేదు. – బత్తిని బాబు గౌడ్, మొగిలయ్య కుమారుడు ఒంటిచేత్తో... జాఫర్‌గఢ్ మండలం కూనూర్ గ్రామానికి చెందిన నెల్లుట్ల సుశీలాదేవి అలియాస్ అచ్చమాంబ ఒంటిచేత్తో రజాకార్లపై తిరుగుబాటు చేశారు. తుపాకీ చేతపట్టి నిజాం సైన్యాన్ని గడగడలాడించిన వీరవనిత ఆమె. గాయపడ్డ సహచర ఉద్యమకారులకు వైద్యం అందిస్తూ తనలోని గొప్పదనాన్ని చాటుకున్నారు. నెల్లుట్ల మోహన్‌రావుకు సహాయకురాలిగా పనిచేస్తూ.. ఆయననే వివాహం చేసుకున్నారు. ఆ సమయంలో మోహన్‌రావు కమ్యూనిస్టు పార్టీ నుంచి స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. మోహన్‌రావు మృతిచెందగా.. వృద్ధాప్యంలో ఉన్న సుశీలాదేవి మాత్రం ప్రస్తుతం వరంగల్‌లోని శాంతినగర్‌లో నివాసం ఉంటున్నారు. ఈమెకు ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి సమరయోధుల పింఛన్ రానప్పటికీ, భర్తకు వచ్చే పింఛన్‌తో బతుకు బండి లాగిస్తున్నారు. (క్లిక్ చేయండి: అక్షర యోధుడు షోయబుల్లాఖాన్) గత చరిత్రకు సాక్ష్యం ‘జనగామ రైల్వేస్టేషన్’ జనగామ: నిజాం నిరంకుశ పాలనపై మొదలైన తిరుగుబాటు.. దొరల పాలనకు చరమగీతం పాడింది జనగామ రైల్వేస్టేషన్. విస్నూరు దొర రాపాక రాంచంద్రారెడ్డి కొడుకు బాబుదొర అరాచకాలు ప్రజలను గోసపెట్టాయి. తనకు ఎదురొడ్డి నిలిచిన ఉద్యమకారులను హతమార్చాడు. 1947లో నలుగురు విప్లవకారులకాళ్లు, చేతులు కట్టేసి గూండాల సహాయంతో సవారు కచ్చరంలో లింగాలఘనపురం మండలం నెల్లుట్లకు చేరుకున్నాడు. తెల్లవారుజామున ఊరి శివారున ఉన్న ఈత చెట్ల వనం సమీపంలో నలుగురిని సజీవ దహనం చేస్తున్న క్రమంలో.. ఓ ఉద్యమకారుడు చాకచక్యంగా తప్పించుకున్నాడు. అదే మండలం కుందారం గ్రామానికి చేరుకుని జరిగిన విషయాన్ని గ్రామస్తులకు తెలియజెప్పాడు. దీంతో ఆగ్రహించిన ఆయా గ్రామాల ప్రజలు సుమారు పదివేల మందికిపైగా బాబుదొర జనగామ పోలీస్‌స్టేషన్‌లో ఉన్నాడని తెలుసుకుని అక్కడికి చేరుకున్నారు. దీంతో అతను పోలీస్ శరణుకోరి తలదాచుకున్నాడు. తమ విముక్తి కోసం పోరాడుతున్న ముగ్గురు విప్లవకారులను చంపేశారనే ఆవేశంలో పోలీస్‌స్టేషన్‌ను సైతం బద్దలు కొట్టేందుకు యత్నించారు. దీంతో బాబుదొర గన్‌తో బెదిరిస్తూ.. రైల్వేస్టేషన్‌కు సమీపంలోని పాత ఆంధ్రాబ్యాంకు ఏరియాలో ఉన్న తన చిన్నమ్మ ఇంటికి వెళ్లేందుకు ప్రయత్నించాడు. విషయం తెలుసుకున్న విప్లవయోధుడు గబ్బెట తిరుమల్‌రెడ్డి నాయకత్వంలో జాటోతు దర్గ్యానాయక్ (ప్రస్తుతం బతికే ఉన్నారు). మరికొందరు విప్లవకారులు జనగామ రైల్వే వ్యాగన్ ఏరియాలో కాపుకాస్తూ.. దొర రాకకోసం ఎదురుచూశారు. పట్టాలపై ఆగి ఉన్న గూడ్స్ రైలుకింద నుంచి దొర దాటుకుంటూ వ్యాగన్ పాయింగ్ రావిచెట్టు కిందకు రాగానే దర్గ్యానాయక్ ఆయన మెడపై మొదటి వేటు వేయడంతో అక్కడే కుప్పకూలిపోయాడు. విప్లవకారులు దొరను చిత్రహింసలు పెట్టి చంపేశారు. దీంతో ప్రజల జయజయధ్వానాల మధ్య సంబురాలు చేసుకున్నారు. దొరకు చరమగీతం పలికిన రైల్వేస్టేషన్ నాటి చరిత్రకు సజీవ సాక్ష్యంగా నిలుస్తోంది. చరిత్రకెక్కని సంకీస పోరు; 21 మందిని సజీవ దహనం చేసిన రజాకార్లు డోర్నకల్: మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం పెరుమాళ్ల సంకీస గ్రామానికి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో ప్రత్యేక గుర్తింపు ఉంది. రజాకార్ల ఆగడాలకు 21 మంది గ్రామస్తులు బలి కాగా.. ఇళ్లు, పంటలు ధ్వంసమయ్యాయి. కానీ.. ఆ పోరాటం చరిత్రకెక్కలేదు. మానుకోట, ఖమ్మం జిల్లాల పరిధిలోని గ్రామాల్లో తెలంగాణ సాయుధ పోరాటం ఉధృతంగా సాగుతుండగా పెరుమాళ్ల సంకీస గ్రామానికి చెందిన తుమ్మ శేషయ్య, ఉయ్యాలవాడకు చెందిన ఏలూరి వీరయ్య, నున్నా పుల్లయ్య వేర్వేరుగా దళాలను ఏర్పాటు చేసి రజాకార్ల ఆగడాలకు వ్యతిరేకంగా పోరాడారు. సంకీసకు చెందిన తుమ్మ శేషయ్య దళాలకు ముందుండి నడిపిస్తుండడంతో ఆయన్ను మట్టుబెట్టాలని రజాకార్లు పలుమార్లు ప్రయత్నించారు. శేషయ్యను పట్టుకునేందుకు ప్రయత్నించి మూడుసార్లు గ్రామాన్ని తగులబెట్టారు. నాలుగోసారి 1948, సెప్టెంబర్ 1న రజాకార్లు గ్రామంపై దాడి జరిపి మారణహోమం సృష్టించారు. శేషయ్య ఆచూకీ చెప్పాలని డిమాండ్ చేస్తూ గ్రామస్తులందరినీ బందెలదొడ్డి వద్దకు చేర్చారు. 15 ఏళ్లలోపు వారిని బయటకు పంపి.. మిగతా వారిని చిత్రహింసలకు గురిచేశారు. శేషయ్య జాడ చెప్పకపోవడంతో గ్రామస్తులపై మూకుమ్మడిగా కాల్పులు జరిపారు. కాల్పుల్లో కొందరు చనిపోగా.. కొన ఊపిరితో మరికొందరు కొట్టుకుంటుండగా వరిగడ్డి వారిపై వేసి కాల్చారు. వరి గడ్డి కోసం గడ్డివాము వద్దకు వెళ్లిన రజాకార్లకు గడ్డివాములో దాక్కున్న అన్నాతమ్ములు తేరాల గురవయ్య, రామయ్య, లాలయ్య కనిపించారు. వారు ఎంత బతిమిలాడినా వినకుండా తుపాకులతో కాల్చి చంపి అందరినీ ఒకచోటకు చేర్చి గడ్డితో తగులబెట్టారు. కాల్పుల్లో 16 మంది చనిపోగా.. తరువాత గాయాలతో ఐదుగురు ప్రాణాలు వదిలారు. రజాకార్లు గ్రామం నుంచి వెళ్లిపోయిన తరువాత సగం కాలిన మృతదేహాలకు గ్రామస్తులు ఘటనా స్థలం వద్దే సామూహిక అంత్యక్రియలు నిర్వహించారు. నాటి ఘటనను ప్రత్యక్షంగా చూసిన వారిలో కొద్దిమంది మాత్రమే గ్రామంలో ఉన్నారు. నెత్తురోడిన తమ్మడపల్లి(జి); ఒకేరోజు 12 మంది వీరమరణం జనగామ/జఫర్‌గఢ్/స్టేషన్‌ఘన్‌పూర్: తెలంగాణ సాయుధ పోరాటంలో జఫర్‌గఢ్ మండలం తమ్మడపల్లి(జి) ఊరి త్యాగం చరిత్ర పుటల్లో ఎక్కడా కనిపించదు. గ్రామానికి చెందిన 12 మందిని నిజాం సైన్యం కాల్చి చంపేసింది. నిజాం ఏజెంటుగా వ్యవహరించే ఖాదరెల్లి జాఫర్‌గఢ్ కేంద్రంగా తన అరాచకాలను కొనసాగించాడు. భరించలేని రైతులు ప్రజా రక్షక దళాలుగా ఏర్పడి కర్రలు, వడిశాలలు, బరిసెలు, కత్తులు, కారంపొడితో రజాకార్లపై తిరుగుబాటు చేశారు. కమ్యూనిస్టు ప్రతినిధులు నల్ల నర్సింహులు, కృష్ణమూర్తి, యాదగిరిరావు, నెల్లుట్ల మోహన్‌రావు వీరికి అండగా నిలిచారు. 1947, సెప్టెంబర్ 11న జరిగిన ఆంధ్ర మహాసభ తీర్మానం స్ఫూర్తితో తమ్మడపల్లి(జి), సురారం, షాపల్లి, తిమ్మాపూర్‌తోపాటు అనేక గ్రామాల ప్రజలు ఖాదరెల్లి ఇంటిపై మూకుమ్మడి దాడి చేశారు. విషయం తెలుసుకున్న రజాకార్లు తమ బలగాలతో తమ్మడపల్లి (జి) గ్రామాన్ని చుట్టుముట్టి 20 మందిని బంధించి, గ్రామ శివారులో వరుసగా నిలబెట్టి వారిపై బుల్లెట్ల వర్షం కురించారు. ఈ ఘటనలో చాడ అనంతరెడ్డి, బత్తిని బక్క రాజయ్య, దొంతూరి చిన్న రాజయ్య, ఎరుకల ఇద్దయ్య, గుండెమల్ల పోశాలు, చెదలు నర్సయ్య, ఎండీ.ఖాసీం, గుజ్జరి రామయ్య, దిడ్డి పెరుమయ్య, కోమటి నర్సింహరామయ్య, కుంట పెద్దపురం, మంగలి వెంకటమల్లు, గుండెటి గుండారెడ్డి అసువులు బాయగా.. మరో 8 మంది తీవ్ర గాయాలతో బయటపడ్డారు. (క్లిక్ చేయండి: సెప్టెంబర్ 17.. అసలేం జరిగింది?) -
అమరుల కుటుంబాలకు ప్రభుత్వం చేయూత!
-
అండగా నిలుస్తాం
అమరుల కుటుంబాలకు త్వరలోనే రూ. 10 లక్షల ఆర్థిక సాయం పంపిణీ అధికారులతో సమీక్షలో ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం లేదా ప్రత్యామ్నాయ ఉపాధి వ్యాపారం చేసుకునేవారికి అదనంగా ఆర్థికసాయం వ్యవసాయం చేసుకుంటే భూమి అందజేత వచ్చే నెల 1 నుంచి బీడీ కార్మికులకు భృతి హైదరాబాద్‌లో వ్యాక్సిన్ల పరీక్షకు ప్రయోగశాల సీఎం కేసీఆర్ నిర్ణయాలు సాక్షి, హైదరాబాద్: ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం తమ ప్రాణాలను అర్పించిన అమరవీరుల కుటుంబాలకు సాంత్వన కలిగించే చర్యలను రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఆ కుటుంబాలకు రూ. 10 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందజేయడంతో పాటు ఒకరికి ఉద్యోగ అవకాశం కల్పించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు శనివారం అధికారులను ఆదేశించారు. తొలి విడతగా ఇప్పటికే గుర్తించిన అమరవీరుల కుటుంబాలకు ఈ ఆర్థిక సహాయం చెల్లించాలని... ఆయా జిల్లాల మంత్రులు, కలెక్టర్లు ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించాలని సూచించారు. అమరవీరుల కుటుంబాలకు చేయూత అంశంపై శనివారం ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నతాధికారులతో సమీక్షించారు. ఆ కుటుంబాలకు ఆర్థిక సాయం, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించే విషయంపై మార్గదర్శకాలు రూపొందించాలని... దీనిపై ప్రతిపాదనలు సమర్పించాలని అధికారులను ఆదేశించారు. కుటుంబంలో ఎవరికి ఉద్యోగావకాశం కల్పించాలనే అంశాన్ని కుటుంబ సభ్యులకే వదిలిపెట్టాలని సీఎం సూచించారు. ఒకవేళ కుటుంబంలో ఉద్యోగానికి ఎవరూ అర్హులు లేకున్నా, ప్రభుత్వ ఉద్యోగంపై ఆసక్తి లేకున్నా... మరో ప్రత్యామ్నాయ మార్గం ద్వారా ఉపాధి చూపించాలని ఆదేశించారు. వ్యాపారం చేసుకుంటామంటే కూడా అందుకు ఆర్థిక సహకారం అందించాలని, వ్యవసాయం చేసుకుంటామంటే వారికి భూమిని సమకూర్చాలని చెప్పారు. ఇంకా అమరుల కుటుంబ సభ్యులు తమ కుటుంబం నిలబడడానికి ఏం కోరుకుంటారో దానిపై ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సీఎం అధికారులకు సూచించారు. జిల్లా కలెక్టర్లు తమ జిల్లాలో ఉన్న ఒక్కో అమర వీరుల కుటుంబానికి ఏం కావాలనే అంశంపై స్వయంగా దృష్టిపెట్టాలని చెప్పారు. ఆర్థిక సహాయం చెల్లింపులో ఎటువంటి జాప్యం వద్దని స్పష్టం చేశారు. ఆర్థిక సహాయం చెల్లింపు కోసం కావాల్సిన నిధులను జిల్లా కలెక్టర్లకు విడుదల చేయాలని ఆర్థిక శాఖను ఆదేశించారు. 462 కుటుంబాలకు.. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అసువులు బాసిన 442 మంది అమర వీరుల కుటుంబాలకు రూ. 10 లక్షల చొప్పున ఆర్థిక సహాయం మంజూరు చేస్తూ రెవెన్యూ శాఖ గతేడాది అక్టోబర్ 27వ తేదీన ఉత్తర్వులు (జీవో నం.36) జారీ చేసింది. అమరవీరుల పేర్లు, చిరునామాలతో జిల్లాల వారీగా జాబితాను అందులో ప్రకటించింది. ఆ తర్వాత నల్లగొండ, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల్లోని మరో 20 మంది అమరవీరుల కుటుంబాలకు కూడా ఆర్థిక సహాయం మంజూరు చేస్తూ ఫిబ్రవరి 7న మరో ఉత్తర్వు(జీవో నం.17) జారీ చేసింది. ఈ నేపథ్యంలో తాజాగా ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయంతో... తక్షణమే 462 మంది అమరుల కుటుంబాలకు లబ్ధి కలగనుంది. జిల్లా వారీగా ఈ కుటుంబాల సంఖ్యను ఈ కింది పట్టికలో చూడవచ్చు.. తొలి విడతలో గుర్తించిన కుటుంబాలు.. జిల్లా అమరులు నల్లగొండ 53 ఖమ్మం 04 రంగారెడ్డి 29 ఆదిలాబాద్ 27 కరీంనగర్ 164 నిజామాబాద్ 31 మహబూబ్‌నగర్ 17 హైదరాబాద్ 11 మెదక్ 52 వరంగల్ 91 మొత్తం 462 బీడీ కార్మికులకు భరోసా.. బీడీ కార్మికులకు రూ. వెయ్యి పింఛన్ ఇస్తామన్న హామీని వచ్చే నెల 1వ తేదీ నుంచి అమలు చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఆ రోజు ముఖ్యమంత్రి స్వయంగా కరీంనగర్ జిల్లా మెట్పల్లి, మెదక్ జిల్లా దుబ్బాక, నిజామాబాద్ జిల్లా కామారెడ్డిల్లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. మిగతా జిల్లాల్లో మంత్రులు, కలెక్టర్లు, మండలాల్లో స్థానిక ఎంపీడీవోలు ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. బీడీ కార్మికులున్న జిల్లాల కలెక్టర్లతో మాట్లాడిన సీఎం.. ఈ మేరకు ఏర్పాట్లు చేయాలనిఆదేశించారు. బీడీ కార్మికుల భృతి కోసం సీఎం ఆదేశాల మేరకు ఆర్థిక శాఖ రూ. 40 కోట్లు విడుదల చేసింది. వ్యాక్సిన్ల ఉత్పత్తి కేంద్రంగా రాజధాని.. వివిధ వ్యాక్సిన్ల నాణ్యతా పరీక్షలు జరిపేందుకు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో వ్యాక్సిన్ల ప్రయోగశాలను ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. శాంతా బయోటెక్ చైర్మన్ వరప్రసాద్‌రెడ్డి శనివారం సచివాలయంలో కేసీఆర్‌ను కలిశారు. ఈ సందర్భంగా ఆయన రాష్ట్రంలో వ్యాక్సిన్ల ల్యాబ్ ఏర్పాటు అవసరాన్ని వివరించగా... దానిపై సీఎం అప్పటికప్పుడే నిర్ణయం తీసుకున్నారు. ల్యాబ్‌కు అవసరమైన భూమి, నిధులను ప్రభుత్వమే సమకూరుస్తుందని హామీ ఇచ్చారు. నగరంలో ల్యాబ్ పెట్టడం వల్ల తెలంగాణకే కాక, దక్షిణాది రాష్ట్రాలకు ఉపయోగకరంగా ఉంటుందకేసీఆర్ వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో వ్యాక్సిన్ల ఉత్పత్తికి అవసరమైన ప్రోత్సాహం అందిస్తామని హామీ ఇచ్చారు. దేశంలో ఏడాదికి రూ. 4,500 కోట్ల విలువైన వ్యాక్సిన్లు తయారవుతుంటే.. అందులో తెలంగాణలోనే రూ. 3,000 కోట్లకు పైగా విలువైన వ్యాక్సిన్లు తయారవుతున్నాయని వరప్రసాద్‌రెడ్డి ఈ సందర్భంగా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువచ్చారు. దేశంలో ఆరు ప్రముఖ కంపెనీలు వ్యాక్సిన్ల తయారీలో భాగస్వాములైతే అందులో తెలంగాణలోనే నాలుగు కంపెనీలున్నాయని చెప్పారు. హైదరాబాద్ నగరం వ్యాక్సిన్ల ఉత్పత్తికి ప్రధాన కేంద్రంగా మారిందని వివరించారు. అయితే వ్యాక్సిన్ల నాణ్యతను పరీక్షించే ల్యాబ్‌లు రాష్ట్రంలో అందుబాటులో లేవని, హిమాచల్‌ప్రదేశ్‌లో కసౌలిలోని సెంట్రల్ డ్రగ్ ల్యాబరేటరీకి పంపాల్సి వస్తోందని వరప్రసాద్ సీఎంకు తెలిపారు. దీంతో కేసీఆర్ నగరంలో ల్యాబ్ ఏర్పాటుపై నిర్ణయం తీసుకున్నారు. -
'ఆ కుటుంబాలకు' సాయం ఎలా చేస్తారు ?
హైదరాబాద్ : తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధనలో భాగంగా అమరవీరులైన కుటుంబాలకు సాయం ఎలా చేస్తారో చెప్పాలని టీటీడీపీ సభ పక్ష నేత ఎర్రబెల్లి దయాకరరావు టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం తెలంగాణ అసెంబ్లీలో ఎర్రబెల్లి మాట్లాడుతూ... అమరవీరుల బలిదానాలతో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని ఆయన గుర్తు చేశారు. వారి కుటుంబాలకు చేసే సాయంపై ప్రభుత్వం సభలో చర్చించాలన్నారు. ఉద్యమంలో గాయపడి ఇప్పటికీ కోలుకోలేనివారు ఉన్నారని ఎర్రబెల్లి ఈ సందర్బంగా గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో అందరి పాత్ర ఉందని ఆయన అన్నారు. -
కొన్ని కుటుంబాలకే పరిహారం
అమరవీరుల ఆత్మక్షోభ కేసీఆర్‌ను వదలదు రాష్ట్ర వినాశనానికి రావణాసురుడై బీజేపీ నేత ఇంద్రసేనా రెడ్డి వినాయక్‌నగర్ : (నిజామాబాద్) : తెలంగాణ ఉద్యమంలో ఆత్మబలిదానాలు చేసుకున్నవారికి అసెంబ్లీ సాక్షిగా సంతాపం ప్రకటించిన కేసీఆర్ కొందరికి మాత్రమే పరిహారం చెల్లించి చేతులు దులుపుకున్నారని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు నల్లు ఇంద్రసేనారెడ్డి ఆరోపించారు. అమర వీరుల ఆత్మక్షోభ కేసీఆర్‌ను వదలదన్నారు. నిజామాబాద్‌లోని పార్టీ జిల్లా కార్యాలయంలో ఆయన ఆదివారం విలేకరులతో మా ట్లాడారు. 1200 మంది తెలంగాణ అమరవీరులను గుర్తించామని అసెంబ్లీలో ప్రకటించిన కేసీఆర్ 450 మందికి మాత్రమే అమరులయ్యారని మాట్లాడడం విచారకరమన్నారు. ఉద్యమం జరుగుతున్న సందర్భంలో కేసీఆర్, జేఏసీ చైర్మన్ కోదండరాం అమరుల అంత్యక్రియలలో పాల్గొనడంతోపాటు మృతుల కుటుంబాలను పరామర్శించారని గుర్తుచేశారు. ఉద్యమానికి క్షేత్ర స్థాయి నుంచి ఊపు అందించిన కోదండరాం మృతుల కుటుంబాలకు న్యాయం చేసే దిశగా పూర్తి బాధ్యతలను తీసుకోవాలన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు కరెంటు, నీరు, అధిక ధరలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. రైతులకు పూర్తి న్యాయం చేయలేక కేసీఆర్ అనవసరపు విషయాలపై అందరి దృష్టిని మళ్లిస్తున్నారని విమర్శించారు. తెలంగాణలో మౌలిక సదుపాయాలు కల్పించడంలో సీఎం పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు. ఇష్టానుసారంగా మాట్లాడుతూ తెలంగాణ అసెంబ్లీని ఆగౌరవపరుస్తున్నారన్నారు. గోదావరిలో నాలుగు కర్రలు పెడితే ఛత్తీస్‌గఢ్ నుంచి కరెంట్ వస్తుందని ప్రగల్భాలు పలికిన కేసీఆర్, అధికారంలోకి వచ్చి ఇన్ని నెలలైనా కరెంటు తేవడంలో విఫలమయ్యారన్నారు. పరిపాలన చేతగాక కేంద్ర ప్రభుత్వంపై నిందలు మోపుతున్నారన్నారు. చాలా విషయాలలో కోర్టు తీర్పు రాష్ర్ట ప్రభుత్వానికి వ్యతిరేకంగా వచ్చినా ఆయనకు చీమ కుట్టినట్లు కూడా లేదన్నారు. రాష్ట్రంతో పాటు రాష్ట్ర ప్రజలను ఏమి చేయాలని అనుకుంటున్నారని ఆయన ఇంద్రసేనా రెడ్డి ప్రశ్నించారు. రాష్ట్ర వినాశనానికే రావణసుడిలా ప్రవర్తిస్తున్నాడని అన్నారు. సమావేశంలో రాష్ర్ట నాయకులు లోక భూపతిరెడ్డి, రోషన్‌లాల్ బోరా తదితరులు పాల్గొన్నారు. -
అమరవీరులకు టీఆర్ఎస్ ఎమ్మెల్యేల నివాళి
హైదరాబాద్ : అసెంబ్లీ ఎదుట గన్‌పార్కు వద్ద ఉన్న తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బుధవారం నివాళులర్పించారు. తెలంగాణ శాసనసభ బడ్జెట్ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. శాసనసభ సమావేశాలు ప్రారంభం కావడానికి ముందు అమరులకు నివాళులర్పించాలని టీఆర్ఎస్ఎల్పీలో నిర్ణయించిన మేరకు నేతలు స్థూపం వద్దకు చేరుకుని శ్రద్ధాంజలి ఘటించారు. అక్కడి నుంచి అసెంబ్లీ సమావేశాలకు బయల్దేరారు. మంత్రులు హరీష్ రావు, పద్మారావుతో పాటు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మరోవైపు తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యేలు ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఆపార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్‌కు నివాళులు అర్పించి అసెంబ్లీకి బయల్దేరారు. -
'అమరుల త్యాగాలను కేసీఆర్ అవమానపరచడమే'
హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కాంగ్రెస్ ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ మంగళవారం లేఖ రాశారు. తెలంగాణ కోసం 2వేల మంది అమరులయ్యారంటూ అసెంబ్లీలో ప్రకటించిన కేసీఆర్... ఇప్పుడు కేవలం 459 మంది అమరుల కుటుంబాలకు మాత్రమే ఆర్థిక సాయం ప్రకటించటం సరికాదని ఆయన తన లేఖలో పేర్కొన్నారు. ఈ చర్య ముమ్మాటికీ తెలంగాణ అమరుల త్యాగాలను అవమానపరచడమేనని, మిగిలిన అమరుల కుటుంబాలకు కూడా ఆర్థిక సాయం ప్రకటించాలని షబ్బీర్ అలీ తన లేఖలో డిమాండ్ చేశారు. కాగా తెలంగాణ కోసం ప్రాణాత్యాగాలు చేసిన 459మంది అమరుల కుటుంబాలకు ఒక్కొక్కరికీ రూ.పది లక్షల ఎక్స్‌గ్రేషియాను అందించడానికి తెలంగాణ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. -
వాస్తవాలు తెలుసుకోకుండా విమర్శలా?
హైదరాబాద్: తెలంగాణ అమరవీరుల త్యాగాలపై టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య శవరాజకీయాలు చేస్తున్నారని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ మండిపడ్డారు. తెలంగాణలో ఆత్మహత్యలకు కాంగ్రెస్ పార్గీ కారణం కాదా అని సూటిగా ప్రశ్నించారు. వాస్తవాలు తెలుసుకోకుండా పొన్నాల విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. కేవలం 462 మందినే తెలంగాణ అమరవీరులుగా గుర్తించినట్లు ప్రకటించడం వారిని అవమానించినట్లు కాదా? వారి కుటుంబాలను మోసం చేసినట్లు కాదా? అని పొన్నాల లక్ష్మయ్య అంతకుముందు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. -
ఆ జాబితాలో కొన్ని పేర్లు గల్లంతు
హైదరాబాద్: ప్రభుత్వం ప్రకటించిన తెలంగాణ అమరవీరుల జాబితాలో కొందరి పేర్లు లేవని తెలంగాణ పొలిటిల్ జేఏసీ చైర్మన్, ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ ఎం.కోదండరాం తెలిపారు. గల్లంతైన వారి పేర్ల జాబితా తయారు చేసి ప్రభుత్వానికి అందజేస్తామని చెప్పారు. తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు రూ. 10 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందించేందుకు ప్రభుత్వం ముందుకు వచ్చింది. దీనికి సంబంధించిన ఫైలుపై ముఖయమంత్రి కేసీఆర్ సోమవారం సంతకం చేశారు. -
నా కొడుకు తెలంగాణ అమరవీరుడే..
తెలంగాణ ఉద్యమంలో మరణించిన తన కుమారుడి పేరును జిల్లా అమరవీరుల జాబితాలో చేర్పించి న్యాయం చేయాలని పెద్దపెల్లి మండలం రంగాపూర్‌కు చెందిన కొయ్యడ బావు గురువారం కలెక్టర్ వీరబ్రహ్మయ్యను కలిసి వేడుకున్నారు. తన కుమారుడు విక్రమ్ తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొంటూ రాష్ట్ర ఏర్పాటులో జాప్యంతో 2010 జూన్ 27న పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడని తెలిపారు. ఈ విషయమై దర్యాప్తు జరిపిన బసంత్‌నగర్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారని పేర్కొన్నాడు. చేతికందివచ్చిన కుమారుడి మరణంతో తమ కుటుంబం దీనస్థితిలో ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. తన కుమారుడి పేరు అమరుల జాబితాలో చేర్చి చేయూతనందించాలని కోరాడు. -
అమ్మ మాట..
తెలంగాణ కోసం నా కొడుకు చనిపోవడం గర్వంగా ఉంది నా కొడుకు జీవన్ తెలంగాణ కోసం ప్రాణ త్యాగం చేసినందుకు గర్వంగా ఉంది. వాడెప్పుడూ తెలంగాణ కోసమే ఆవేదన చెందేవాడు. ఆ ఆవేదనే కొడుకు ఆత్మహత్య చేసుకోవడానికి పురిగొల్పింది. 2010, జనవరి 28 జీవన్ చనిపోయిండు. ఆ తర్వాత నాలుగేళ్లకు తెలంగాణ అచ్చింది. తెలంగాణ అచ్చినందుకు సంతోషంగా ఉన్నా కొడుకు లేడని బాధగా ఉంది. కొత్త రాష్ట్రంలోనైనా యువకులకు ఉద్యోగాలివ్వాలి. రైతులకు సాగునీరు, కరెంటు అందించాలి. ప్రాజెక్టులు కట్టించి బీడు భూములను సాగులోకి తీసుకురావాలి. భవిష్యత్తులో ఏ బిడ్డా ఉద్యోగాల లేవని చనిపోకూడదు. చదువుకున్నోళ్లందరకు ఉద్యోగాలివ్వాలి. చదువు కూడా అందరికీ ఉచితంగా చెప్పాలి. అమరవీరుల కుటుంబాలను ఆదుకోవాలి. మహిళలకు కడుపుకోత లేకుండా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకోవాలి. కరెంటు ఎక్కువ తయారుచేసి అందరికీ కోతల్లేకుండా అందించాలి. గ్రామాల్లో రోడ్లు, మంచినీరు సక్రమంగా అందించాలి. ఆస్పత్రుల్లో పేదలందరికీ మెరుగైన వైద్యం అందించాలి. అన్ని సౌకర్యాలు కల్పించాలి. తెలంగాణలో మరే తల్లికి కడుపుకోత ఉండకుండా చూసుకోవాలి. - సేకరణ: రాజశేఖర్, జగిత్యాల -
అమ్మ మాట..
కడుపుకోతే మిగిలింది పట్నంల పనిచేసేటప్పుడు ఎప్పుడు ఫోన్జేసినా తెలంగాణ మీటింగ్‌లో ఉన్నా అనేటోడు నా బిడ్డ. తెలంగాణ వస్తెనే మనసొంటి పేదోళ్ల బతుకులు మారుతయనెటోడు.ఆ తెలంగాణ కోసమే ఢిల్లీకిబోయి పానందీస్కుండు. యాదిరెడ్డికి ఆరేళ్లున్నప్పుడే నా భర్త నర్సింహారెడ్డి కన్నుమూసిండు. అప్పుడు నాకు యాదిరెడ్డి, మంగమ్మ, ఓంరెడ్డి ముగ్గురు పిల్లలు. అన్ని కష్టాలకోర్చి యాదిరెడ్డిని 8వ తరగతి, ఓంరెడ్డిని 5వ తరగతి దాకా సదివించిన. యాదిరెడ్డి సదువు మానేసి చిన్న పనులు జేసిండు. ఊర్లనే దొరికిన పన్జేసుకుంట డ్రైవింగ్ నేర్చుకున్నడు. కొన్ని రోజులైనంక పట్నంబో యి డ్రైవింగ్ పనిచేసుకుంట అక్కడే ఉంటుండె. ఎప్పుడూ తెలంగాణ కోసమే మాట్లాడుతుంటే నేను ఎక్కువ పట్టించుకోలే. కానీ ఢిల్లీకి బోయి ఉరేసుకుని సచ్చిపోతే అప్పుడు తెల్సింది ఆడికి తెలంగాణ అంటే ఎంతిష్టమో. యాదిరెడ్డి సచ్చిపోయినప్పుడు మా ఇంటికి వేయిల మంది వచ్చిండ్రు. గిప్పుడు తెలంగాణ వచ్చిందనే సంతోషం ఉన్నా.. నాకైతే కడుపుకోతే మిగిలింది. ఎవరు ఎన్ని చెప్పినా నా కొడుకు తిరిగొస్తడా? ఆడి ఆత్మకు శాంతి కలగాలె. చెట్టంత కొడుకు పానం పోయినా సర్కారైతే ఏం సాయం సెయ్యలే. - కోసిక శ్రీనివాస్, మొయినాబాద్ -
మరే బిడ్డ ఉద్యమబాట పట్టకూడదు
అమ్మ మాట.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆలస్యమవుతుండడంతో ఆందోళన చెందిన నా కొడుకు రామకృష్ణ గతేడాది సాగర్ కాల్వలోకి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. కొడుకును పోగొట్టుకుని కుటుంబ పోషణకు అష్టకష్టాలు పడుతున్నాం. నా భర్త అనారోగ్యంతో మంచంపట్టి నరకం అనుభవిస్తున్నాడు. మాలాంటి వారికి గుండె ధైర్యం కల్పించే పాలన రావాలి. తెలంగాణ రాష్ట్రంలో మరేబిడ్డ ఉద్యమబాట పట్టకుండా అభివృద్ధి చేయాలి. అప్పుడే ఆత్మత్యాగం చేసిన బిడ్డల ఆత్మలు శాంతిస్తాయి. తెలంగాణ పునర్నిర్మాణంలో ప్రతి పేదకు రెండు గదులతోపాటు వంటగది ఉండేలా పక్కా ఇల్లు నిర్మించి ఇవ్వాలి. పేదలందరికీ సంక్షేమ ఫలాలు అందించాలి. రేషన్ షాపుల ద్వారా నెలకు ఒకరికి పది కిలోల చొప్పున నాణ్యమైన బియ్యం పంపిణీ చేయాలి. అలాగే నెలకు సరిపడా పప్పులు, ఉప్పు, నూనె అందిస్తే ఆకలి బాధలు ఉండవు. మద్యాన్ని నిషేధించాలి. ప్రతి పల్లెకు మినరల్ వాటర్ పంపిణీ చేయాలి. అమరుల జ్ఞాపకార్థం ప్రభుత్వమే విగ్రహాలు, స్థూపాలు ఏర్పాటు చేయాలి. వారి కుటుంబాలకు రైలు, బస్‌పాస్‌లు అందించాలి. బిడ్డను పోగొట్టుకుని పుట్టెడు కష్టాల్లో ఉన్న మాలాంటి వారికి వృద్ధాప్యంలో పింఛన్ ఇవ్వాలి. - మాదినేని శ్రీనివాసరావు, ఖమ్మం అర్బన్ -
ఉద్యమం వేరు పాలన వేరు: విజయశాంతి
ఇంటర్వ్యూ: విజయశాంతి * టీఆర్ఎస్కు పరిపాలన చేతకాదు * టీడీపీ-బీజేపీ పొత్తుతో ఒరిగేదేమీలేదు * అమరవీరుల త్యాగాలను రాజకీయం చేయొద్దు ఎలక్షన్ సెల్: విజయశాంతి... సినీరంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చి ‘తెలంగాణ ఉద్యమం’లో భాగస్వామి అయ్యారు. మొదట్లో బీజేపీ, తరువాత టీఆర్ఎస్... ఇపుడు కాంగ్రెస్‌లో చేరారు. టీఆర్ఎస్ తరఫున ఎంపీగా ఉన్న ఆమె ఇపుడు కాంగ్రెస్ తరఫున మెదక్ అసెంబ్లీ సెగ్మెంట్లో పోటీ చేస్తున్నారు. ప్రచారంలో తలమునకలై ఉన్న ఆమె తన గెలుపుపై ధీమాగా ఉన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పాగా వేస్తుందంటున్నారు. టీడీపీ-బీజేపీ పొత్తులతో తెలంగాణలో ఒరిగేదేమీ లేదు. బీజేపీ ఆహా ఓహో అం తా బాగుంది అంటూ ఊదరగొడుతోంది. కానీ ఆ పరిస్థితి లేనేలేదు. నేను ఆ పార్టీ లో నుంచే వచ్చాను కదా నాకు అంతా తెలుసు. ఆ పార్టీతో ఏమీ కా దు. మోడీ గాలి అంటున్నారు కానీ ఆ పరిస్థితి కిందిస్థాయిలో అంటే గ్రామ స్థాయిలో లేనేలేదు. ఇక టీడీపీ పరిస్థితి మరింత దిగజారింది. ఆ పార్టీ నుంచి అనేక మంది వివిధ పార్టీల్లో చేరిపోయారు. దీంతో ఆ పార్టీకి ఇక్కడ పెద్దగా ప్రభావం చూపలేదు. తెలంగాణలో అధికారం ఇస్తే బీసీని ముఖ్యమంత్రి చేస్తానని తెలుగుదేశం పార్టీ చెబుతుతోంది. అది సరే తెలంగాణకు మద్దతు ఇస్తామ ని చెప్పి తర్వాత ఆ పార్టీ మాట మార్చుకోలేదా? బీసీ సీఎం హామీ కూడా అంతే. టీడీపీవన్నీ మాయమాటలు. టీఆర్ఎస్వి మాయమాటలు... తెలంగాణలో కాంగ్రెస్ పార్టీనే అధికారంలోకి వస్తుంది. టీఆర్ఎస్ అధికారంలోకి రావడం కల్ల. ఉద్యమాలు వేరు పరిపాలన వేరు. టీఆర్ఎస్ పరిపాలన చేయలేదు. కరీంనగర్, మహబూబ్‌నగర్‌ల నుంచి ఎంపీగా ప్రాతినిధ్యం వహించి కేసీఆర్ ఏం చేశారు? ప్రజలకు ఏం పనులు చేశారు? వారికి అందుబాటులో ఉన్నారా? జాతీయ పార్టీగా కాంగ్రెస్సే మంచి పరిపాలన ఇవ్వగలదు. కాంగ్రెస్ పార్టీ, సోనియాగాంధీనే తెలంగాణ ఇచ్చినప్పుడు దాన్ని గెలిపిం చాల్సిన బాధ్యత ఇక్కడి ప్రజలదే. తెలంగాణ ఇస్తే సోనియాను, కాంగ్రెస్‌ను నెత్తిమీద పెట్టుకుంటాం అంటూ కేసీఆర్ ఏమేమో చెప్పారు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? విలీనం అన్నాడు... ఏం చేశాడు? టీఆర్ఎస్ మాయమాటలు చెబుతోంది. వారు చేసేది లేదు పెట్టేది లేదు. తెలంగాణ పునర్నిర్మాణం కాంగ్రెస్‌తోనే సాధ్యం. అసలు టీఆర్ఎస్ వారికి అభివృద్ధి చేయాలన్న ఆలోచన లేదు. వారికి పదవులు కావాలంతే. వారికి పరిపాలన చేతకాదు. దళితులను సీఎం చేస్తానన్నారు. మరెందుకు వెనక్కు తగ్గారు? తెలంగాణ పునర్నిర్మాణం అంటే తెలంగాణ అభివృద్ధి కోసం పెట్టుబడులు రావాలి. స్థానికులకు పెద్ద ఎత్తున ఉద్యోగాలు రావాలి. ప్రాజెక్టులు రావాలి. ఒక్కటి అనేక అంశాలపై తెలంగాణ అభివృద్ధి కావాలి. తెలంగాణ ప్రాంతం మొత్తం సెట్‌రైట్ కావాలి. అందుకు విజన్ ఉండాలి. అలాంటి విజన్ కాంగ్రెస్ పార్టీకే ఉంది. మెదక్ అభివృద్ధిపై దృష్టి... ఈసారి ఎంపీగా పోటీచేయదలచుకోలేదు. అందుకే ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను. మెదక్‌ను అభివద్ధి చేయాల్సిన బాధ్యత నామీద ఉంది. ప్రతిపక్షంలో ఉండి కూడా ఎంపీగా చాలా పనులు చేశాను. వెయ్యి గ్రామాలుంటే 700 గ్రామాల్లో తిరిగాను. తెలంగాణ ఉద్యమాలు చేస్తూ కూడా బాగా పనిచేశాను. పోలీస్స్టేషన్లు, గొడవలు, ఉద్యమాలు చేస్తూ ప్రజలకు అందుబాటులో ఉన్నాను. మెదక్ ఎమ్మెల్యేగా గెలిచి ఇక్కడ అభివద్ధిపై దృష్టిపెట్టాలన్నదే నా ఉద్దేశం. గతంలో ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించినవారెవరూ దీన్ని ఏమాత్రం పట్టించుకోలేదు. 40 శాతం కూడా పనిచేయలేదు. టీఆర్ఎస్ నుంచి ఉన్నవారెవరు దీన్ని పట్టించుకోలేదు. నాకు గెలుపు అవకాశాలు బాగానే ఉన్నాయి. ఇప్పుడే ప్రచారం మొదలుపెట్టాను. ప్రజల నుంచి స్పందన బాగుంది. నన్ను గెలిపించుకుంటాం అని చెబుతున్నారు. పదవుల కోసం అమరవీరులు త్యాగాలు చేయలేదు... తెలంగాణ అమరవీరులకు కాంగ్రెస్ పార్టీ ఒక్క టిక్కెట్టు కూడా ఇవ్వలేదని కొందరు విమర్శలు చేస్తున్నారు. ఆ విమర్శలకు అర్థంలేదు. అమరులైన వాళ్లు పదవులు ఆశించి త్యాగం చేయలేదు. టిక్కెట్ల కోసం చేయలేదు. తెలంగాణ భవిష్యత్తు బాగుం డాలన్న విశాల ధృక్పథంతో ఆత్మార్పణ చేసుకున్నారు. కొందరు దీన్ని కావాలనే రాజకీయం చేస్తున్నారు. ఆ కుటుంబాలకు న్యాయం జరగాలి. త్యాగాన్ని గుర్తించాలి. అంతేతప్ప త్యాగాలు చేసినవారు రాజకీయ పదవులు తమ కుటుంబాలకు కావాలని చేయలేదు. సీమాంధ్ర ప్రజలు ఇక ద్వేషాలకు పోకుండా అర్థంచేసుకోవాలి. తెలంగాణ ప్రజల మనోభావాలను అర్థంచేసుకోవాలి. ఇప్పుడు రాష్ట్రం విడిపోయినందున అభివృద్ధిపై ఎవరికివారు కృషిచేయాలి. అక్కడ ఎవరికి ఓటేయాలో వారే సరైన నిర్ణయం తీసుకొని ఆలోచించుకోవాలి. -
అమ్మ మాట.. నౌకరీలు దొరికితేనే ఆత్మ శాంతిస్తది
నా భర్త దుబాయికి పోయిండు. నాకు ఇద్దరు కొడుకులు. పెద్దోడు భాస్కర్, చిన్నోడు ప్రభాకర్. కూతురు ధనలక్ష్మి. పెద్దోడు కోరుట్లలో 2009లో డిగ్రీ సదువుకుంటూ తెలంగాణ ఉద్యమంలో తిరిగేటోడు. సదువుతుండంగనే కుటుంబానికి ఆసరా కోసం వర్షకొండలోని వైన్‌షాపులో పనిజేసేటోడు. కుటుంబం ఎల్లదీసుడు కష్టంగా ఉంటుండేది. ‘తెలంగాణ అస్తే మనకు ఈ గోస ఉండదే, నాన్న దుబాయికి పోయె పనుండది, నువ్వు బీడీలు చేసి కష్టపడే అవసరం ఉండది, నా అసోంటోళ్లకు ఉద్యోగాలు అత్తయని ’ చెప్పేటోడు. ఏమైందో తె ల్వదు గానీ 2011 ఫిబ్రవరి 9న వైన్‌షాపులోనే జేబులో లెటరు పెట్టుకొని ఆత్మహత్య చేసుకున్నడు. లెటర్ల తెలంగాణ కోసం సచ్చిపోతున్నానని రాసిండు. గిప్పుడు తెలంగాణ వచ్చింది. కొడుకుంటే ఎంత సంబరపడేటోడో. తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నం కాబట్టి గిప్పుడైనా మా బాధలు తీరాలి. అందరం బాగుపడాలి. అందరికీ న్యాయం జరగాలి. నా కొడుకులసుంటి పిలగాల్లకు నౌకరీలు దొరికితే నా కొడుకు ఆత్మశాంతిస్తది. - సేకరణ: చంద్రశేఖర్, కోరుట్ల -
అమ్మ మాట..
సదువుకునేటోళ్లు సస్తనే వస్తదా? తెలంగాణ రాష్ర్టమొచ్చిందని తెల్వంగనే అందరూ పండగ జేసుకున్నరు. అరవైయేండ్ల నుంచి పోరాడుతుంటే గీనాటికి మన కల తీరిందని మురిసిండ్రు. గా దినాన నా అసొంటి తల్లులు సంతోషపడాల్నా, ఏడ్వాల్నా అర్థంకాలే. ‘మీ బిడ్డల పుణ్యమే...’అని చానమంది నాయకులు మా ఇంటికొచ్చి చెబుతుంటే ఏడుస్తనే సంబరాలు చేసుకున్నం. నా బిడ్డ వయసు పద్దెనిమిదేండ్లు ఉంటది. ముక్కపచ్చలారని గసొంటి పొరగాళ్లు పాణమిడిస్తనే రాష్ర్టమొచ్చేదేందో నాకర్థమైతలే. నాలుగేండ్ల కింద నాయకులు ఉద్యమం పేరుజెప్పి దినానికో ముచ్చట జెప్పిటోళ్లు. ఆత్మహత్యలు చేసుకుంటనే రాష్ర్టమొస్తదని నమ్మిన నా కొడుకులాంటోళ్లు బలవంతపుచావు సచ్చిండ్రు. నాకిద్దరు కొడుకులు. పెద్దోడు రాజకుమార్. పదోతరగతి చదివిండు. ఉద్యమంలా తిరగాలని ఏ పొద్దువోయేటోడు...ఎప్పటికొచ్చేటోడో వాడికే తెలిసేది కాదు. నేను, నా భర్త పొద్దుగాల్నే వ్యవసాయం పనులకు పోయేటోళ్లం. ఇద్దరం కష్టవడితేగాని ఇల్లు గడ్వదు. ‘పెద్దోని సదువైనంక, కొలువుకు పోయినంక...నేను పొలానికి రానే’ అనేదాన్ని నా భర్తతో. ఇంకెక్కడి పెద్దోడు. ఒకరోజు మేం పొలానికి వోయినంక ఇంట్ల ఉరేసుకున్నడు. దోస్తలందరికి తెలంగాణకోసం సచ్చిపోతున్న అని చెప్పిండంట. ఈ వయసల మాకొచ్చే కష్టం కాదది. ఏ తల్లికీ రాకూడని కష్టం. తెలంగాణ రాష్ర్టమొచ్చినంక మస్తుమంది నాయకులొచ్చి మమ్మల్ని పలకరించ పోతుండ్రు. బతికున్నంతకాలం బిడ్డ చావు ముచ్చట చెప్పుకుంటూ బతుకుడు తప్ప మాకేం వచ్చేది లేదు. నా చిన్నకొడుక్కు మంచి కొలువొస్తే అది పెద్దోని పుణ్యమనుకుంటం. సేకరణ : భువనేశ్వరి, ఫొటో: ఆర్. కృష్ణారెడ్డి -
'ఐఐటీ పక్కన ఇళ్ల స్థలాలు ఇప్పిస్తా'
హైదరాబాద్: తెలంగాణ అమరవీరుల కుటుంబాలను ఆదుకోవాల్సిన బాధ్యత అన్ని పార్టీలపై ఉందని సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జయప్రకాష్ రెడ్డి అన్నారు. అమరవీరుల త్యాగం వల్లే తెలంగాణ రాష్ట్రం వచ్చిందన్నారు. తెలంగాణ కోసం అమరులైన వెయ్యి మందికి ఇళ్ల స్థలాలు ఇప్పిస్తానని హామీయిచ్చారు. తన నియోజకవర్గంలో ఉన్న ఐఐటీ పక్కన విలువైన స్థలాలు ఇప్పిస్తానని చెప్పారు. అమరవీరుల జాబితాను కోదండరాం తనకు పంపించాలని కోరారు. సమైక్యవాదం తన వ్యక్తిగతమని, కలిసివుంటేనే అభివృద్ధి సాధ్యమన్నదే తన అభిప్రాయమన్నారు. కాంగ్రెస్ కార్యకర్తగా అధిష్టానం నిర్ణయాన్ని శిరసావహిస్తానని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో సంగారెడ్డి నుంచి కాంగ్రెస్ పార్టీ తరపునే పోటీ చేస్తానని జయప్రకాష్ రెడ్డి స్పష్టం చేశారు. అయితే అమరవీరుల కుటుంబానికి చెందిన అభ్యర్థిని పోటీకి నిలిపి, గెలిపించేందుకు అన్ని పార్టీలు ఐక్యంగా ముందుకు వస్తే తన సీటు వదులుకునేందుకు సిద్ధమని ఆయన ప్రకటించారు.