అండగా నిలుస్తాం
అమరుల కుటుంబాలకు త్వరలోనే రూ. 10 లక్షల ఆర్థిక సాయం పంపిణీ
అధికారులతో సమీక్షలో ముఖ్యమంత్రి కేసీఆర్
కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం లేదా ప్రత్యామ్నాయ ఉపాధి
వ్యాపారం చేసుకునేవారికి అదనంగా ఆర్థికసాయం
వ్యవసాయం చేసుకుంటే భూమి అందజేత
వచ్చే నెల 1 నుంచి బీడీ కార్మికులకు భృతి
హైదరాబాద్‌లో వ్యాక్సిన్ల పరీక్షకు ప్రయోగశాల
సీఎం కేసీఆర్ నిర్ణయాలు
సాక్షి, హైదరాబాద్: ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం తమ ప్రాణాలను అర్పించిన అమరవీరుల కుటుంబాలకు సాంత్వన కలిగించే చర్యలను రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఆ కుటుంబాలకు రూ. 10 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందజేయడంతో పాటు ఒకరికి ఉద్యోగ అవకాశం కల్పించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు శనివారం అధికారులను ఆదేశించారు. తొలి విడతగా ఇప్పటికే గుర్తించిన అమరవీరుల కుటుంబాలకు ఈ ఆర్థిక సహాయం చెల్లించాలని... ఆయా జిల్లాల మంత్రులు, కలెక్టర్లు ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించాలని సూచించారు. అమరవీరుల కుటుంబాలకు చేయూత అంశంపై శనివారం ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నతాధికారులతో సమీక్షించారు.
ఆ కుటుంబాలకు ఆర్థిక సాయం, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించే విషయంపై మార్గదర్శకాలు రూపొందించాలని... దీనిపై ప్రతిపాదనలు సమర్పించాలని అధికారులను ఆదేశించారు. కుటుంబంలో ఎవరికి ఉద్యోగావకాశం కల్పించాలనే అంశాన్ని కుటుంబ సభ్యులకే వదిలిపెట్టాలని సీఎం సూచించారు. ఒకవేళ కుటుంబంలో ఉద్యోగానికి ఎవరూ అర్హులు లేకున్నా, ప్రభుత్వ ఉద్యోగంపై ఆసక్తి లేకున్నా... మరో ప్రత్యామ్నాయ మార్గం ద్వారా ఉపాధి చూపించాలని ఆదేశించారు. వ్యాపారం చేసుకుంటామంటే కూడా అందుకు ఆర్థిక సహకారం అందించాలని, వ్యవసాయం చేసుకుంటామంటే వారికి భూమిని సమకూర్చాలని చెప్పారు.
ఇంకా అమరుల కుటుంబ సభ్యులు తమ కుటుంబం నిలబడడానికి ఏం కోరుకుంటారో దానిపై ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సీఎం అధికారులకు సూచించారు. జిల్లా కలెక్టర్లు తమ జిల్లాలో ఉన్న ఒక్కో అమర వీరుల కుటుంబానికి ఏం కావాలనే అంశంపై స్వయంగా దృష్టిపెట్టాలని చెప్పారు. ఆర్థిక సహాయం చెల్లింపులో ఎటువంటి జాప్యం వద్దని స్పష్టం చేశారు. ఆర్థిక సహాయం చెల్లింపు కోసం కావాల్సిన నిధులను జిల్లా కలెక్టర్లకు విడుదల చేయాలని ఆర్థిక శాఖను ఆదేశించారు.
462 కుటుంబాలకు..
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అసువులు బాసిన 442 మంది అమర వీరుల కుటుంబాలకు రూ. 10 లక్షల చొప్పున ఆర్థిక సహాయం మంజూరు చేస్తూ రెవెన్యూ శాఖ గతేడాది అక్టోబర్ 27వ తేదీన ఉత్తర్వులు (జీవో నం.36) జారీ చేసింది. అమరవీరుల పేర్లు, చిరునామాలతో జిల్లాల వారీగా జాబితాను అందులో ప్రకటించింది. ఆ తర్వాత నల్లగొండ, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల్లోని మరో 20 మంది అమరవీరుల కుటుంబాలకు కూడా ఆర్థిక సహాయం మంజూరు చేస్తూ ఫిబ్రవరి 7న మరో ఉత్తర్వు(జీవో నం.17) జారీ చేసింది. ఈ నేపథ్యంలో తాజాగా ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయంతో... తక్షణమే 462 మంది అమరుల కుటుంబాలకు లబ్ధి కలగనుంది. జిల్లా వారీగా ఈ కుటుంబాల సంఖ్యను ఈ కింది పట్టికలో చూడవచ్చు..
తొలి విడతలో గుర్తించిన కుటుంబాలు..
జిల్లా అమరులు
నల్లగొండ 53
ఖమ్మం 04
రంగారెడ్డి 29
ఆదిలాబాద్ 27
కరీంనగర్ 164
నిజామాబాద్ 31
మహబూబ్‌నగర్ 17
హైదరాబాద్ 11
మెదక్ 52
వరంగల్ 91
మొత్తం 462
బీడీ కార్మికులకు భరోసా..
బీడీ కార్మికులకు రూ. వెయ్యి పింఛన్ ఇస్తామన్న హామీని వచ్చే నెల 1వ తేదీ నుంచి అమలు చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఆ రోజు ముఖ్యమంత్రి స్వయంగా కరీంనగర్ జిల్లా మెట్‌పల్లి, మెదక్ జిల్లా దుబ్బాక, నిజామాబాద్ జిల్లా కామారెడ్డిల్లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. మిగతా జిల్లాల్లో మంత్రులు, కలెక్టర్లు, మండలాల్లో స్థానిక ఎంపీడీవోలు ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. బీడీ కార్మికులున్న జిల్లాల కలెక్టర్లతో మాట్లాడిన సీఎం.. ఈ మేరకు ఏర్పాట్లు చేయాలనిఆదేశించారు. బీడీ కార్మికుల భృతి కోసం సీఎం ఆదేశాల మేరకు ఆర్థిక శాఖ రూ. 40 కోట్లు విడుదల చేసింది.
వ్యాక్సిన్ల ఉత్పత్తి కేంద్రంగా రాజధాని..
వివిధ వ్యాక్సిన్ల నాణ్యతా పరీక్షలు జరిపేందుకు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో వ్యాక్సిన్ల ప్రయోగశాలను ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. శాంతా బయోటెక్ చైర్మన్ వరప్రసాద్‌రెడ్డి శనివారం సచివాలయంలో కేసీఆర్‌ను కలిశారు. ఈ సందర్భంగా ఆయన రాష్ట్రంలో వ్యాక్సిన్ల ల్యాబ్ ఏర్పాటు అవసరాన్ని వివరించగా... దానిపై సీఎం అప్పటికప్పుడే నిర్ణయం తీసుకున్నారు. ల్యాబ్‌కు అవసరమైన భూమి, నిధులను ప్రభుత్వమే సమకూరుస్తుందని హామీ ఇచ్చారు. నగరంలో ల్యాబ్ పెట్టడం వల్ల తెలంగాణకే కాక, దక్షిణాది రాష్ట్రాలకు ఉపయోగకరంగా ఉంటుందకేసీఆర్ వ్యాఖ్యానించారు.
రాష్ట్రంలో వ్యాక్సిన్ల ఉత్పత్తికి అవసరమైన ప్రోత్సాహం అందిస్తామని హామీ ఇచ్చారు. దేశంలో ఏడాదికి రూ. 4,500 కోట్ల విలువైన వ్యాక్సిన్లు తయారవుతుంటే.. అందులో తెలంగాణలోనే రూ. 3,000 కోట్లకు పైగా విలువైన వ్యాక్సిన్లు తయారవుతున్నాయని వరప్రసాద్‌రెడ్డి ఈ సందర్భంగా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువచ్చారు. దేశంలో ఆరు ప్రముఖ కంపెనీలు వ్యాక్సిన్ల తయారీలో భాగస్వాములైతే అందులో తెలంగాణలోనే నాలుగు కంపెనీలున్నాయని చెప్పారు.
హైదరాబాద్ నగరం వ్యాక్సిన్ల ఉత్పత్తికి ప్రధాన కేంద్రంగా మారిందని వివరించారు. అయితే వ్యాక్సిన్ల నాణ్యతను పరీక్షించే ల్యాబ్‌లు రాష్ట్రంలో అందుబాటులో లేవని, హిమాచల్‌ప్రదేశ్‌లో కసౌలిలోని సెంట్రల్ డ్రగ్ ల్యాబరేటరీకి పంపాల్సి వస్తోందని వరప్రసాద్ సీఎంకు తెలిపారు. దీంతో కేసీఆర్ నగరంలో ల్యాబ్ ఏర్పాటుపై నిర్ణయం తీసుకున్నారు.