'ఐఐటీ పక్కన ఇళ్ల స్థలాలు ఇప్పిస్తా'
హైదరాబాద్: తెలంగాణ అమరవీరుల కుటుంబాలను ఆదుకోవాల్సిన బాధ్యత అన్ని పార్టీలపై ఉందని సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జయప్రకాష్ రెడ్డి అన్నారు. అమరవీరుల త్యాగం వల్లే తెలంగాణ రాష్ట్రం వచ్చిందన్నారు. తెలంగాణ కోసం అమరులైన వెయ్యి మందికి ఇళ్ల స్థలాలు ఇప్పిస్తానని హామీయిచ్చారు. తన నియోజకవర్గంలో ఉన్న ఐఐటీ పక్కన విలువైన స్థలాలు ఇప్పిస్తానని చెప్పారు. అమరవీరుల జాబితాను కోదండరాం తనకు పంపించాలని కోరారు.
సమైక్యవాదం తన వ్యక్తిగతమని, కలిసివుంటేనే అభివృద్ధి సాధ్యమన్నదే తన అభిప్రాయమన్నారు. కాంగ్రెస్ కార్యకర్తగా అధిష్టానం నిర్ణయాన్ని శిరసావహిస్తానని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో సంగారెడ్డి నుంచి కాంగ్రెస్ పార్టీ తరపునే పోటీ చేస్తానని జయప్రకాష్ రెడ్డి స్పష్టం చేశారు. అయితే అమరవీరుల కుటుంబానికి చెందిన అభ్యర్థిని పోటీకి నిలిపి, గెలిపించేందుకు అన్ని పార్టీలు ఐక్యంగా ముందుకు వస్తే తన సీటు వదులుకునేందుకు సిద్ధమని ఆయన ప్రకటించారు.