turpu jayaprakash reddy
-
‘ఆయన పడే ఆవేదన చూసి మనసు కలుక్కుమన్నది’
హైదరాబాద్: ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి ఆవేదన మీడియాలో చూసి తన మనసుకు చాలా బాధగా అనిపించిందని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ‘ఈ వయసులో జీవన్‌రెడ్డికి ఈ ఆవేదన ఏంటో అని మనసు కలుక్కుమన్నది. జగ్గారెడ్డి అండగా ఉన్నాడు అని చెప్పడానికి... నా మనసులో మాటని మీడియా ద్వారా తెలియజేస్తున్నా. నేను ఎవరిని తప్పుపట్టడం లేదు. కానీ జీవన్ రెడ్డి నేను ఒంటరి అని అనుకోవద్దు. సమయం వచ్చినప్పుడు జీవన్‌రెడ్డి వెంట జగ్గారెడ్డి ఉంటాడు. ఎప్పుడు జనంలో ఉండే ఆయన్ని జగిత్యాల ప్రజలు ఎందుకు ఒడగొట్టారో అర్థం కానీ పరిస్థితి. పార్టీని కానీ.. ప్రజలను కానీ తప్పుపట్టడం లేదు. మా టైం బాగోలేదు కాబట్టి.. ఎవరేం చేస్తారు అని సర్డుకుపోతున్నా. దీన్ని తొందరగా అధిష్టానం గుర్తించి జీవన్‌రెడ్డి సమస్యకు పరిష్కారం చూపాలని... సీఎం రేవంత్‌రెడ్డిని, పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్‌ని, ఖర్గేని, రాహుల్‌గాంధీని మీడియా ముఖంగా కోరుతున్నా’ అని జగ్గారెడ్డి స్పష్టం చేశారు. ఇదీ చదవండి: అవమానాలు చాలు.. ఇకనైనా బతకనివ్వండి -
స్ట్రెయిట్ టాక్ విత్ తూర్పు జయప్రకాష్ రెడ్డి
-
‘నా దమ్మేంటో టీఆర్ఎస్కు చూపిస్తా’
సంగారెడ్డి: రాహుల్ గాంధీ సభతో టీఆర్ఎస్ నాయకుల గుండెల్లో దడ మొదలైందని కాంగ్రెస్ నాయకుడు తూర్పు జయప్రకాశ్ రెడ్డి(జగ్గారెడ్డి) అన్నారు. సభ సక్సెస్‌తో మంత్రి హరీశ్‌రావు మెంటల్‌గా మారారని ఎద్దేవా చేశారు. సంగారెడ్డిలో కాంగ్రెస్ నాయకులను వేధిస్తున్నారని ఆరోపించారు. చిల్లర రాజకీయాలు మనుకోవాలని మంత్రి హరీశ్‌రావుకు హితవుపలికారు. హరీశ్ ఆదేశాలతోనే అమిన్ పూర్ సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్‌ను తొలగిస్తూ కలెక్టర్ ఉత్తర్వు ఇచ్చారన్నారు. సర్పంచ్ తొలగింపు ఆపకుంటే కలెక్టర్‌ను ఘెరావ్ చేస్తామని హెచ్చరించారు. సర్పంచ్ లకు కాంగ్రెస్ అండగా ఉంటుందని తెలిపారు. అమీన్పూర్ భూముల కేసును తిరగదోడుతున్నారని, భూముల కేటాయింపులో తన తప్పేమీలేదని పేర్కొన్నారు. కేసులు పెడితే తన దమ్మేంటో టీఆర్ఎస్కు చూపిస్తానని అన్నారు. తనపై కేసులు పెట్టిన మరుసటి రోజు నుంచి అధికార పార్టీ నేతలకు నిద్ర లేకుండా చేస్తానని హెచ్చరించారు. ప్రభుత్వం నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడుతోందని ధ్వజమెత్తారు. తక్షణమే డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకుంటే మంత్రి కడియం శ్రీహరిని ఘోరావ్ చేస్తామని హెచ్చరించారు. గతంలో తనను టీఆర్ఎస్ లోకి రావాలని వత్తిడి చేశారని, వారి మాటకుండా కాంగ్రెస్‌లోనే ఉన్నందుకు వేధిస్తున్నారని అమీన్పూర్ సర్పంచి శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. -
మళ్లీ దూకేశాడుగా...
స్కూల్ పిల్లగాడు తొక్కుడు బిళ్ల ఆటలో ఆ గడి నుంచి ఈ గడికి దూకినంత ఈజీగా సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే తూర్పు జయప్రకాశ్ రెడ్డి పార్టీలు మారుతున్నారు. తొలుత బీజేపీలో చేరిన ఆయన... ఆ తర్వాత టీఆర్ఎస్ కారు ఎక్కారు. అదీ నచ్చక కాంగ్రెస్‌లో చేరి ఆ నేతలతో చెట్టాపట్టాలేసుకుని... ప్రభుత్వ విప్ పదవి పొందారు. తెలంగాణ ఉద్యమం తీవ్రంగా సాగుతున్నప్పుడు కూడా తనది జంపింగ్ రాగమే కాదు సమైక్య రాగం కూడా అంటూ కోరస్ లేకుండా సాంగేసుకుని మరీ జయప్రకాశ్‌రెడ్డి స్పష్టం చేశారు. ఇంతలో ఎన్నికలు రానే వచ్చాయి. మళ్లీ సంగారెడ్డి నుంచి హస్తం పార్టీ తరపున పోటీ చేశారు. కానీ ఆ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయారు. మళ్లీ ఏదో సభకు వెళ్లి అధ్యక్షా అననిదే మనస్సు మనస్సులో నిలిచేలా లేదు. దాంతో మెదక్ పార్లమెంట్ ఉప ఎన్నికలు వస్తున్నాయని తెలిసి హస్తం పార్టీ టిక్కెట్ కోసం ప్రయత్నించారు. అధిష్టానం మాత్రం మీరు క్యూలో ఉన్నారు అని చెప్పడంతో.. టికెట్ వస్తుందో రాదో అని అనుకుంటున్నారు. ఆ తరుణంలో మెదక్ జిల్లా అధ్యక్షుడిగా నియమిస్తూ... అధిష్టానం ఆదేశాలు జారీ చేసింది. ఎంపీ టిక్కెట్ కోసం బీ ఫారం అడిగితే డీసీసీ పీఠం ఎవడికీ కావాలని అంటూ మీకు మీ పార్టీకో దణ్ణం అంటూ కాంగ్రెస్‌కి రాం రాం చెప్పారు. ఆ సమయంలోనే ఉప ఎన్నికల్లో గెలిచే అభ్యర్థి కోసం బీజేపీ ప్రయత్నం చేస్తుందని తెలిసి... ఆ నాయకులను కలిశారు. అదీకాక ఆ పార్టీ తరఫున పోటీ చేస్తే తన 'సమైక్య రాగం' సెంటిమెంట్ తనకు ఆయింట్మెంట్లా పనికొస్తుందని భావించారు. ఎలాగోలా టీడీపీ పొత్తుతో బీజేపీ తరఫున ఎన్నికల బరిలో నిలిచారు. కానీ ఉప ఎన్నికల్లో కారు దెబ్బకు కమలం మూడో స్థానంలోకి చేరింది. కాంగ్రెస్‌లోనే ఉంటే పార్టీ విజయం సాధించి ఉండేదేమో అనే జయప్రకాశ్ రెడ్డి మీమాంసలో పడ్డారు. నాటి నుంచి మనశాంతి కరువైంది. కాంగ్రెస్‌లో ఉన్న మనశాంతి నేడు లేదని భావించిన ఆయన హస్తంలో చేరేందుకు ఆ పార్టీ నేతల చుట్టు ప్రదక్షణాలు చేశారు. ఢిల్లీ వెళ్లి మరీ అధిష్టానం పెద్దలను కూడా కలసి తన పరిస్థితి వివరించారు. మెదక్ అంటేనే కేసీఆర్... కేసీఆర్ అంటేనే మెదక్ అనే రేంజ్లో ఉంది ప్రస్తుత పరిస్థితి. ఈ తరుణంలో టీఆర్ఎస్పై విమర్శలు చేసే తెలంగాణలో పెద్ద తలకాయిగా ఉన్న డీఎస్ కూడా కారు ఎక్కేశారు. సీఎల్పీ నేత జానారెడ్డి కూడా టీఆర్ఎస్ నేతలను విమర్శించాలంటే పద్దతిగా మాట్లాడతారు. దాంతో టీ కాంగ్రెస్‌కు 'నోరున్న' నేత కోసం ఆ పార్టీ నేతలు వెతుకుతున్నారు. దాంతో తూర్పు జయప్రకాశ్‌రెడ్డి నోరున్న నేత కావడంతో సదరు నేతలు కాంగ్రెస్‌లోకి ఆహ్వానించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇటీవలే హస్తం పార్టీ పెద్దల సమక్షంలో వారికి షేక్ హ్యాండ్ ఇచ్చి మరీ ఆయన కాంగ్రెస్‌లో చేరారు. కాంగ్రెస్ పార్టీ వీడటమే తాన జీవితంలో చేసిన పెద్ద తప్పు అని ఈ సందర్భంగా చెప్పిన జయప్రకాశ్‌రెడ్డి మళ్లీ ఆ తప్పు చేయకుండా ఉంటారా ? ఏమో... . -
భలే జంపర్
బీజేపీలో చేరి కమల తీర్థం పుచ్చుకున్నాడు. ఇక్కడ లాభం లేదనుకుని ఆ వెంటనే టీఆర్ఎస్ కండువా కప్పుకున్నాడు. ఎమ్మెల్యే అయ్యాడు. ఇక్కడ ఎంటోగా ఉంది అంటూ అప్పటికే రాష్ట్రంలో అధికారంలో ఉన్న హస్తం గూటికి చేరాడు. అక్కడ ప్రభుత్వ వీప్ పదవిని అందుకున్నాడు... మా తెలంగాణ మాకు కావాలే అంటూ ఆ ప్రాంత నాయకులు ఉద్యమిస్తున్న సమయంలో కూడా 23 జిల్లాల ఆంధ్రప్రదేశ్ కలిసి ఉండాలంటూ సమైక్యాంధ్ర నేతల గొంతుతో గొంతు కలిపి ఎలుగెత్తి నినదించాడు. కానీ విభజన జరిగిపోయింది. ఆ తర్వాత ఎన్నికలు వచ్చాయి. హస్తం పార్టీ టిక్కెట్‌పై పోటీ చేసి ఓడిపోయాడు. ఇంతలో మెదక్ లోక్‌సభ ఉప ఎన్నిక వచ్చింది. అక్కడ హస్తం గెలిచి తీరాలని అధిష్టానం నిర్ణయించింది. అందుకోసం జిల్లా అధ్యక్షుడిగా ఆయన పేరును ఖరారు చేసింది. ఉప ఎన్నికల నామినేషన్ గడువు ముగుస్తున్న సమయంలో... కమలం పార్టీలోకి జంప్ చేసి.... ఉప ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి... ఓటమి పాలైయ్యాడు. కేంద్రంలో మోడీ హవా కొనసాగుతున్నా.... సైకిల్‌తో చెట్టా పట్టాలు వేసుకుని పోటీ చేసిన మూడో స్థానంలో నిలబడాల్సి వచ్చింది. దీంతో ఆయనగారు కాస్త కంగారు పడ్డారు. కారు, కాషాయం కన్నా హస్తం ముద్దంటూ మళ్లీ ఆ గూటిలోకి చేరేందుకు మరోసారి జంపింగ్ జపాంగ్ రాగాన్ని అందుకున్నారు. ఇంతకీ ఆయన ఎవరనేగా... ఆయనే తూర్పు జయప్రకాశ్ రెడ్డి అలియాస్ జగ్గారెడ్డి. త్వరలో కాంగ్రెస్ పార్టీలోకి జంప్ చేస్తున్నారని సమాచారం. పార్టీ నుంచే బయటకు వెళ్లే వారే కానీ పార్టీలోకి వచ్చే వారు లేని ఆ పార్టీలో జగ్గారెడ్డి ఎంత కాలం మనగలుగుతారో లేక మళ్లీ జంపింగ్ రాగాన్ని అందుకుంటారో చూడాలి. కాంగ్రెస్ లో చేరే విషయంపై ఇప్పటికే జగ్గారెడ్డి జిల్లా సీనియర్ నేతలతో సంప్రదింపులు జరిపారు. అందుకు కొందరు సానుకూలంగా స్పందించినా.. అత్యధికులు మాత్రం వ్యతిరేకించారని సమాచారం. అలాగే గతంలో జిల్లాలో జరిగిన మతఘర్షణల్లో జగ్గారెడ్డి ప్రమేయం ఉందంటూ పోలీసు కేసు నమోదయిన సంగతి తెలిసిందే. దీంతో జగ్గారెడ్డి రాకతో కాంగ్రెస్ పార్టీకి లాభమా లేక నష్టమా అనేది కాలమే చెప్పాలి. ఆ పార్టీ నుంచి ఈ పార్టీకి ఈ పార్టీ నుంచి ఆ పార్టీకి జంపింగ్ ల మీద జంపింగ్ లు చేసి ఈ నాయకుడు మంచి జంపర్ గా పేరు సంపాదించారు. -
గెలిపిస్తే.. నిధులవరదే
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: ‘‘కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు, ప్రాజెక్టులు రాబట్టుకోవడంలో టీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైంది.. నవ తెలంగాణ నిర్మాణంలో భాగంగా అభివృద్ధి పనులు జరగాలంటే కేంద్ర ప్రభుత్వ సహకారం తప్పనిసరి...మెదక్ ఎంపీగా తనకు అవకాశం కల్పిస్తే ప్రధాని మోడీ సహకారంతో మెదక్ పార్లమెంట్ నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తా’’నని టీడీపీ,బీజేపీల ఉమ్మడి ఎంపీ అభ్యర్థి తూర్పు జయప్రకాశ్‌రెడ్డి అన్నారు. శనివారం సంగారెడ్డిలో నిర్వహించిన ఎన్నికల ప్రచార ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, మెదక్ పార్లమెంట్ పరిధిలోని ఓటర్లు విజ్ఞతతో ఆలోచించి తనను గెలిపించాలని కోరారు. ఎంపీగా అవకాశం కల్పిస్తే గతంలో ఎన్నడూ జరగని విధంగా ఏడు నియోజకవర్గాల్లో అభివృద్ధి చేసి చూపుతానన్నారు. మూడు నెలల టీఆర్ఎస్ పాలనపై ప్రజలు అసంతృప్తితో ఉన్నారన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సొంత జిల్లా అయినప్పటికీ రైతు లు, విద్యార్థులు, అన్నివర్గాల ప్రజలు సమస్యలు ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. సీఎం సొంత నియోజకవర్గ పరిధిలోని మాసాయిపేటలో ఘోర రైల్వే ప్రమాదం జరిగి 18 మంది చనిపోతే కనీసం పరామర్శించే తీరిక కూడా కేసీఆర్‌కు లేకుండా పోయిందన్నారు. ఇలాంటి వ్యక్తి రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేస్తారో ఆలోచించాలన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధికి కట్టుబడి ఉందన్నారు. రూ.200 కోట్ల మంజీరా నీటి ప్రాజెక్టు మెదక్ ఎంపీగా ప్రజలు అవకాశం ఇస్తే మెదక్ పార్లమెంట్ పరిధిలోని ఏడు నియోజకవర్గాలకు మంజీరా తాగునీరు అందించేందుకు రూ.200 కోట్లతో తాగునీటి ప్రాజెక్టు తీసుకువస్తానని జయప్రకాశ్‌రెడ్డి తెలిపారు. జిల్లా గుండా మంజీరా నది ప్రవహిస్తున్నా, మెదక్ పార్లమెంట్ పరిధిలోని చాలా గ్రామాల్లో తాగునీటి సమస్య ఉందన్నారు. తాను ఎంపీగా గెలిస్తే ప్రజలకు మంజీరా తాగునీరు అందించేందుకు అధిక ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు చెప్పారు. సంగారెడ్డి నియోజకవర్గంలోని రెండు మున్సిపాలిటీలు, రెండు మండలాల్లోని అన్ని గ్రామాలకు మంజీరా సౌకర్యం కల్పించినట్లు చెప్పారు. అలాగే రైతులకు అవసరమైన సాగునీరు కల్పనపై దృష్టి పెడతానని హామీ ఇచ్చారు. అంతేకాకుండా ప్రధాని నరేంద్ర మోడీని ఒప్పించి మెట్రో రైలును మియాపూర్ నుంచి సంగారెడ్డి వరకు పొడిగించేలా చూస్తానన్నారు. -
వారు అభివృద్ధి నిరోధకులు
సిద్దిపేట జోన్: మెదక్ ఉప ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తున్న తూర్పు జయప్రకాశ్‌రెడ్డి, సునీతాలకా్ష్మరెడ్డిలు అభివృద్ధి నిరోధకులని రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీష్‌రావు ఆరోపించారు. అందుకు సంబంధించిన సాక్ష్యాధారాలు కూడా తనవద్ద ఉన్నాయని ఆయన వెల్లడించారు. శనివారం ఆయన టీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డికి మద్దతుగా సిద్దిపేట పట్టణంలోని పలు వార్డుల్లో మంత్రి ఈటెల రాజేందర్‌తో కలిసి పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక నాసర్‌పురాలో ప్రజలనుద్దేశించి ఆయన మాట్లాడారు. సిద్దిపేట మున్సిపాలిటీలో విలీనం చేసిన ఆరు గ్రామాల అభివృద్ధి కోసం తాను ఎమ్మెల్యే హోదాలో రూ. 150 కోట్లతో కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపగా, అప్పుడు ప్రభుత్వ విప్‌గా ఉన్న జగ్గారెడ్డి అడ్డుకున్నారన్నారు. జగ్గారెడ్డి అప్పటి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికి రాసిన లేఖ ఇదే నంటూ బహిరంగ సభలో ప్రజలకు చూపించారు. ఇక మంత్రి హోదాలో సునీతాలక్ష్మారెడ్డి సిద్దిపేటలో పాలిటెక్నిక్ కళాశాలల ఏర్పాటును వ్యతిరేకిస్తూ అప్పటి ముఖ్యమంత్రిపై ఒత్తిడి తెచ్చిన విషయం వాస్తవం కాదా అని ఆయన ప్రశ్నించారు. సిద్దిపేట అభివృద్ధిని అడ్డుకున్న వారిద్దరూ నేడు సిద్దిపేట నియోజకవర్గ ప్రజలను ఓట్లు అభ్యర్థించడం ఎంతవరకు సమంజసమన్నారు. ఈ ఉప ఎన్నికల్లో వారిద్దరి డిపాజిట్లు గల్లంతు చేసి సిద్దిపేట దెబ్బ ఎలా ఉంటుందో చూపాలన్నారు. అనంతరం ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ మాట్లాడుతూ, సిద్దిపేట ప్రజలు లేనిది కేసీఆర్ లేడని, కేసీఆర్ లేనిది తెలంగాణ ఉద్యమం లేదన్నారు. మంచి ముఖ్యమంత్రిని రాష్ట్రానికి అందించిన ఘనత సిద్దిపేట నియోజకవర్గ ప్రజలకు దక్కుతుందన్నారు. ఎంత చేసిన సిద్దిపేట రుణం తాము తీర్చుకోలేమన్నారు. సమావేశంలో కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, టీఆర్ఎస్ నాయకులు రాజనర్సు, మచ్చవేణుగోపాల్‌రెడ్డి, చిన్న, నయ్యర్, బర్ల మల్లికార్జున్, జంగిటి కనకరాజు, కూర బాల్‌రెడ్డి, కాముని నగేష్, బోనాల నర్సింలు, కిషన్‌రావు తదితరులు పాల్గొన్నారు. బీజేపీకి ఓటు వేస్తే బెజవాడ బాబుకు వేసినట్లే సిద్దిపేట రూరల్: మెదక్ పార్లమెంట్ ఉప ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేస్తే తెలంగాణను అడుగడుగునా అడ్డుకున్న చంద్రబాబుకు ఓటు వేసినట్లేనని, ఇక కాంగ్రెస్ ఓటు వేస్తే అది మురిగిపోతుందని మంత్రి తన్నీరు హరీష్‌రావు అన్నారు. శనివారం సిద్దిపేట మండలం మిట్టపల్లి గ్రామ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ సిద్దరబోయిన రాజ్యలక్ష్మి శ్రీనివాస్‌తో పాటు పలువురు నాయకులు టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు, వివిధ సంఘాలు ‘ఓటుకు నోటు కార్యక్రమం’ నిర్వహించారు. అనంతరం హరీష్‌రావు, ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ కలిసి మాట్లాడుతూ, బీజేపీకి అభ్యర్థులు లేక సమైక్యవాదిని నిలబెట్టారన్నారు. తెలంగాణ ఏర్పడినప్పటికీ బీజేపీలో ఆంధ్రాపెత్తనం కొనసాగుతోందని, చంద్రబాబు చెప్పిన వ్యక్తికి టికెట్ ఇచ్చారని, ఈ విషయం కిషన్‌రెడ్డికి తెల్వదా అని ప్రశ్నించారు. ఇక కాంగ్రెస్ పార్టీ నాయకులు అధికారంలో ఉండి ఏం అభివృద్ధి చేశారో ఇప్పుడు ఏం చేయడానికి ఓటు వేయమని అడుగుతున్నారో చెప్పాలన్నారు. కాంగ్రెస్, బీజేపీ నాయకుల ఓటమి అందరికి తెలుసని అందుకే ఇక్కడి ప్రచారానికి జాతీయ నాయకులు రావడం లేదన్నారు. టీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన మాట ప్రకారం ప్రతి హామీ నెరవేరుస్తుందని, అలాగే రుణమాఫీ ఈ నెలాఖరులోగా పూర్తవుతుందని తెలిపారు. కార్యక్రమంలో మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు కిషన్‌రెడ్డి, గ్రామ ఎంపీటీసీ భూలక్ష్మి శ్రీనివాస్, నాయకులు నారేంద్రనాథ్, స్వామిచరణ్, బాలకిషన్‌రావు, శ్రీనివాస్‌రావు, ప్రవీణ్‌రెడ్డి, రాములు తదితరులు పాల్గొన్నారు. -
ఒక్క ఛాన్స్ ఇవ్వండి
సాక్షి ప్రతినిధి సంఘారెడ్డి: సంచలన వ్యాఖ్యలు.. కలుపుగోలుతత్వం.. అంతకు మించిన ఆవేశం.. అన్నీ కలిస్తే తూర్పు జగ్గారెడ్డి. ఎప్పుడూ ఏదో రకంగా వార్తల్లో ఉంటూనే ఉంటారు. కాంగ్రెస్ పార్టీ నుంచి జంప్ చేసి బీజేపీ టికెట్ తీసుకుని మెదక్ ఉప ఎన్నికను వేడెక్కించిన ఆయన కాసేపు సాక్షి ప్రతినిధితో ముచ్చటిస్తూ ఈ విధంగా అన్నారు.. ‘చిన్న రాష్ట్రాలతో లాభం కంటే నష్టమే ఎక్కువని కేసీఆర్ మాట్లాడలేదా? రాజకీయ స్వలాభం కోసం మాట మార్చి తెలంగాణవాదం అందుకోలేదా? సమైక్యవాదం అనేది ముగిసిన ఎపిసోడ్. తెలంగాణ రాష్ట్రం వచ్చింది. ఇప్పుడు కావాల్సింది తెలంగాణ అభివృద్ధి. ప్రజల బతుకులు బంగారం కావాలి. అభివృద్ధిని వదిలేసి ఇంకా ఆంధ్రోళ్లను తిట్టుకుంటా పబ్బం గడుపుకోవటం మంచిదేనా?’ అని జగ్గారెడ్డి అన్నారు. ‘అభివృద్ధి జరగాలంటే నిధులు కావాలి. కేంద్ర ప్రభుత్వ సహకారం కావాలి. ఇప్పటివరకు కేసీఆర్ కేంద్రం సాయం కోరారా?. కిషన్‌రెడ్డిలాంటి బీజేపీ రాష్ట్ర నేతల సహకారంతో మోడీ ప్రభుత్వం నుంచి నిధులు తెచ్చుకునే ప్రయత్నం చేయాల’ అని అన్నారు. ‘నన్ను గెలిపించండి మోడీని ఒప్పించి నిధులు పట్టుకొస్తా, మెదక్ పార్లమెంటు నియోజకవర్గంలోని 30 మండలాలను, 4 మున్సిపాల్టీలను సంగారెడ్డి తరహాలో అభివృద్ధి చేసి చూపిస్తా. ఎమ్మెల్యేగా వైఎస్సార్‌ను ఒప్పించి సంగారెడ్డి ఐఐటీ తీసుకొచ్చినా, ఎంపీగా గెలిస్తే అటువంటి పనులు ఎన్నో చేస్తా’ అని అన్నారు. ‘హరీష్‌రావు పొద్దున లేస్తే జగ్గారెడ్డి జపమే చేస్తున్నారు. తెలంగాణవాది, సమైక్యవాది అనేది ఇప్పుడు అనవసర ప్రస్తావన. ప్రజలకు తాగు, సాగునీరు, కరెంటు కావాలి, ఇవన్నీ కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోనే ఉన్నాయి. కేసీఆర్ వీటిని తేగలరా?’ అని జగ్గారెడ్డి ప్రశ్నించారు. ‘మెదక్ ప్రజలకు నాదొక విజ్ఞప్తి.. ఇప్పుడు టీఆర్ఎస్కు 10 ఎంపీ సీట్లు ఉన్నాయి. మెదక్ గెలిస్తే పదకొండో సీటు అయితది. కానీ ఏమిటి ప్రయోజనం. నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి, ఢిల్లీకి పంపిస్తే ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుకు జాతీయ హోదా పట్టుకొస్తా. ప్రతి ఇంటికి మంజీరా నీరు అందిస్తా. అభివృద్ధే నా మంత్రం. కాంగ్రెస్ పార్టీలో నాకు ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ బీజేపీ ఒక బలమైన నాయకుని కోసం చూసింది. పార్టీలో చేరాలని కొంతమంది మిత్రులు నా ఒత్తిడి తెచ్చారు. వాళ్ల మాట నేను కాదనలేకపోయాను. మోడీ నాయకత్వంలోనే దేశం, రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని నమ్మా. కనుకనే బీజేపీలో చేరాల్సి వచ్చింది. నాతోటి చాలామంది జాతీయ నాయకులే మాట్లాడారు. వాళ్లందరూ తోడుగా ఉంటామని మాటిచ్చారు. వాళ్ల సహాయంతోనైనా మెదక్‌ను అభివృద్ధి చేయవచ్చనే ఆలోచనతోనే బీజేపీలోకి చేరాను. ఎవరెవరు ప్రచారానికి వస్తారనే విషయం పార్టీ చూసుకుంటుంది. పార్లమెంటులో బీజేపీ మద్దతుతోనే తెలంగాణ బిల్లు నెగ్గిందనే విషయాన్ని కేసీఆర్ మర్చిపోయినట్టున్నారు’ అని జగ్గారెడ్డి వివరించారు. ‘రాష్ట్రం విడిపోతే తెలంగాణకు కరెంటు కష్టాలుంటాయని అందిరికీ తెలిసిందే. ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఏమైనా సర్దుబాటు చర్యలు చేపట్టారా? పక్క రాష్ట్రాల్లో మిగులు కరెంటు నిల్వలు ఉన్నాయి. వాటిని కొనుగోలు చేసి రైతు సమస్యలను పరిష్కరించడానికి ఏమైనా ప్రయత్నం చేశారా? ప్రజలు మూడు నెలలుగా ఎదురుచూస్తున్నారు. వెనుకటికి దొంగలు ఉడుము మూతికి తేనె పూసి పెద్దపెద్ద భవనాలను ఎక్కినట్టుగా కేసీఆర్ ఇప్పుడ మాయ మాటలతో ప్రజలను మోసం చేస్తూ పూట గడుపుకుంటున్నారని’ జగ్గారెడ్డి తనదైన శైలిలో మాట్లాడారు. -
టీఆర్ఎస్ విమర్శలు అర్థరహితం
- తెలంగాణ వస్తే రాజకీయ సన్యాసం చేస్తానని ఏనాడూ అనలేదు - బీజేపీ ఎంపీ అభ్యర్థి తూర్పు జయప్రకాష్‌రెడ్డి సిద్దిపేట జోన్: తాను పార్టీలు మారిన విషయాన్ని రచ్చ చేస్తూ రాజకీయ పార్టీలు అనవసర వ్యాఖ్యలు చేయడం అర్థరహితమని, తన పార్టీ మార్పు విషయం ప్రస్తుతం అప్రస్తుతమని మెదక్ ఉప ఎన్నిక బీజేపీ అభ్యర్థి తూర్పు జయప్రకాష్‌రెడ్డి అన్నారు. సోమవారం స్థానిక వీఏఆర్ గార్డెన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సమైక్యవాదిగా ముద్రపడిన తనకు బీజేపీ టికెట్ ఇవ్వడాన్ని ప్రశ్నిస్తూ టీఆర్ఎస్ నేతలు ప్రతికల్లో విమర్శలకు దిగడం సిగ్గు చేటన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మొదట కాంగ్రెస్ ఆ తర్వాత టీడీపీ ప్రస్తుతం టీఆర్ఎస్లో ఉన్నారని గుర్తు చేశారు. తన రాజకీయ జీవితం బీజేపీతోనే మొదలైందని గుర్తు చేసుకున్నారు. తెలంగాణ వస్తే తాను ఏనాడు రాజకీయ సన్యాసం తీసుకుంటానని బహిరంగ ప్రకటన చేయలేదని విలేకరులడిగిన ప్రశ్నకు బదులిచ్చారు. ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికలు స్థానిక ఎన్నికలు కావన్నారు. మెదక్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనను గెలిపించాలని సిద్దిపేట నియోజకవర్గ ప్రజలకు ప్రతికా ముఖంగా విజ్ఞప్తి చేశారు. టీఆర్ఎస్ అభ్యర్థికి ఓటు వేసి వృథా చేసుకోవద్దన్నారు. మెదక్ ఎంపీగా తాను గెలిస్తే ప్రధాని నరేంద్రమోడీతో మాట్లాడి జిల్లాకు సాగు, తాగు నీరుతో పాటు రైల్వే సమస్యలను పరిష్కరించే అవకాశం ఉంటుందన్నారు. అదే విధంగా సంగారెడ్డి తరహాలోనే సిద్దిపేటను అభివృద్ధి చేస్తానన్నారు. రూ. 110 కోట్లను అడ్డుకున్నానని తనపై మంత్రి హరీష్ విమర్శలు చేయడం సరికాదన్నారు. ప్రజలకు అందుబాటులో ఉండే నాయకున్నే గెలిపించాలని కోరారు. ప్రజలు నరేంద్రమోడీని చూస్తున్నారని, బీజేపీని గెలిపిస్తే మంచి రోజులు వస్తాయన్నారు. మెదక్ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో బీజేపీకి బలమైన క్యాడర్ ఉందన్నారు. ఈ సమావేశంలో బీజేపీ రాష్ట్ర నాయకులు వంగ రాంచంద్రారెడ్డి, గుండ్ల జనార్దన్, దూది శ్రీకాంత్‌రెడ్డి, విద్యాసాగర్, రాంచందర్‌రావుతో పాటు పలువురు పాల్గొన్నారు. -
'వ్యక్తిగత పరిచయంతోనే పవన్‌ను కలిశా'
హైదరాబాద్: తాను బీజేపీతో చేరుతున్నట్టు వచ్చిన వార్తలను సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నాయకుడు తూర్పు జయప్రకాష్ రెడ్డి(జగ్గారెడ్డి) తోసిపుచ్చారు. తనకు బీజేపీలో చేరే ఆలోచన లేదని స్పష్టం చేశారు. వ్యక్తిగత పరిచయంతోనే పవన్ కళ్యాణ్ ను కలిశానని ఆయన వివరణ ఇచ్చారు. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యను కలిసిన తర్వాత ఆయన విలేకరులతో మాట్లాడారు. మెదక్ జెడ్పీ స్థానం గురించి పొన్నాలతో చర్చించినట్టు చెప్పారు. జగ్గారెడ్డి బీజేపీలో చేరి మెదక్ ఎంపీగా పోటీ చేస్తారని అంతకుముందు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. -
కమలం వికసించేనా?
సంగారెడ్డి క్రైం, న్యూస్‌లైన్: జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలో బీజేపీ గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది. దశాబ్దం క్రితం ఉన్న పట్టు ఇప్పుడు కన్పించడం లేదు. నాడు మూడు పర్యాయాలు సంగారెడ్డి మున్సిపాలిటీని, ఓసారి ఎమ్మెల్యే స్థానాన్ని దక్కించుకున్న ఆ పార్టీ ప్రస్తుత ఎన్నికల్లో మాత్రం ఉనికిని చాటుకునేందుకే అష్టకష్టాలు పడుతోంది. పట్టణంలో మొత్తం 31 వార్డులకు గాను కేవలం 19 వార్డుల్లో మాత్రమే అభ్యర్థులను నిలిపింది. టీడీపీతో సీట్ల సర్దుబాటు చేసుకున్నామని పైకి చెబుతున్నా వాస్తవానికి అలాంటి పరిస్థితి కన్పించడం లేదు. గతంలో ఇలా.. బీజేపీ తరఫున గతంలో మున్సిపల్ చైర్పర్సన్లుగా పన్యాల ప్రభాకర్, తూర్పు జయప్రకాశ్‌రెడ్డి, కారం పద్మ పనిచేశారు. పటాన్‌చెరుకు చెందిన బీజేపీ నేత కె.సత్యనారాయణ సైతం సంగారెడ్డి నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఇలాంటి బలమైన పునాదులు కలిగిన పార్టీ ఇప్పుడు చతికిల పడినట్టు కన్పిస్తోంది. దశాబ్దం నుంచి మొదలైన కష్టాలు.. తూర్పు జయప్రకాశ్‌రెడ్డి(జగ్గారెడ్డి) 2004కు ముందు బీజేపీని వీడారు. అప్పటినుంచి ఆ పార్టీ కేడర్ క్రమేణ తగ్గుతూ వస్తోంది. జగ్గారెడ్డి అప్పట్లో బీజేపీ నుంచి టీఆర్ఎస్లో చేరడంతో ఆయన అనుచరగణమంతా టీఆర్ఎస్లోకి వెళ్లింది. తరువాత జరిగిన పరిణామక్రమంలో జగ్గారెడ్డి టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ గూటికి చేరా రు. ఈ దశలోనూ కమలం పార్టీ ఇక్కడ దాదాపు సగం ఖాళీ అయింది. దీంతో సంగారెడ్డి నియోజక వర్గంలో బీజేపీకి మునుపటి పట్టు లేదని తెలుస్తోంది. ప్రస్తుతం 19 స్థానాల్లోనే పోటీ.. మూడుసార్లు మున్సిపాలిటీని ఏలిన బీజేపీ ఇప్పు డు అన్ని స్థానాల్లో పోటీ చేయలేని పరిస్థితికి చేరిం ది. మొత్తం 31 వార్డులకు గాను 19 వార్డులతోనే సరిపెట్టుకుంటుంది. మారిన రాజకీయ పరిస్థితుల దృష్ట్యా బీజేపీ శ్రేణులు నరేంద్ర మోడీ జపం చేస్తున్నాయి. ఆ పార్టీ నుంచి ఆయన ప్రధాని అభ్యర్థి కావడంతో మోడి పేరు చెప్పి ఎన్నికల ప్రచారాన్ని చేపడుతుంది. అదీగాక తెలంగాణ కోసం బీజేపీ ఎంతో శ్రమించిందని కూడా చెప్పుకుంటోంది. బీజేపీ మద్దతు వల్లే పార్లమెంట్లో తెలంగాణ బిల్లు ఆమోదం పొందిందని చెబుతూ ప్రచార పర్వాన్ని సాగిస్తోంది. తెలంగాణతోపాటు నరేంద్రమోడి పేరిట ఆ పార్టీ ప్రచారాన్ని సాగిస్తోంది. -
కేసీఆర్‌పై పోటీ చేసి ఓడిస్తా: జగ్గారెడ్డి
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ఇస్తే టీఆర్ఎస్ను కాంగ్రెస్‌లో విలీనం చేస్తానన్న కేసీఆర్ ఇప్పుడు మాటమారుస్తున్నారని సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జయప్రకాష్ రెడ్డి(జగ్గారెడ్డి) విమర్శించారు. దొంగ మాటలతో కేసీఆర్ డ్రామాలు ఆడుతున్నారని దుయ్యబట్టారు. తెలంగాణ పునర్ నిర్మాణం కేసీఆర్‌కే కాదు, తమకూ తెలుసునని చెప్పారు. కాంగ్రెస్‌లో టీఆర్ఎస్ విలీనం కాకుంటే ఆ పార్టీకే నష్టమన్నారు. సొంతంగా పోటీ చేస్తే టీఆర్ఎస్ ఓడిపోతుందని, 10 సీట్లు కూడా రావని అన్నారు. టీఆర్ఎస్ విలీనం చేయకుంటే ఆ పార్టీలో కేసీఆర్ కుటుంబ సభ్యులే మిగులుతారని చెప్పారు. టీఆర్ఎస్ విలీనం చేయకపోవడం ప్రజలు, కాంగ్రెస్‌ను మోసం చేయడమే అన్నారు. పార్టీ ఆదేశిస్తే కేసీఆర్‌పై పోటీ చేసి ఓడిస్తానని జగ్గారెడ్డి దీమా వ్యక్తం చేశారు. తన సంగారెడ్డి సీటుకు ఎసరు పెట్టే సత్తా టీఆర్ఎస్కే కాదు, కాంగ్రెస్ నాయకులకు లేదని పేర్కొన్నారు. -
'ఐఐటీ పక్కన ఇళ్ల స్థలాలు ఇప్పిస్తా'
హైదరాబాద్: తెలంగాణ అమరవీరుల కుటుంబాలను ఆదుకోవాల్సిన బాధ్యత అన్ని పార్టీలపై ఉందని సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జయప్రకాష్ రెడ్డి అన్నారు. అమరవీరుల త్యాగం వల్లే తెలంగాణ రాష్ట్రం వచ్చిందన్నారు. తెలంగాణ కోసం అమరులైన వెయ్యి మందికి ఇళ్ల స్థలాలు ఇప్పిస్తానని హామీయిచ్చారు. తన నియోజకవర్గంలో ఉన్న ఐఐటీ పక్కన విలువైన స్థలాలు ఇప్పిస్తానని చెప్పారు. అమరవీరుల జాబితాను కోదండరాం తనకు పంపించాలని కోరారు. సమైక్యవాదం తన వ్యక్తిగతమని, కలిసివుంటేనే అభివృద్ధి సాధ్యమన్నదే తన అభిప్రాయమన్నారు. కాంగ్రెస్ కార్యకర్తగా అధిష్టానం నిర్ణయాన్ని శిరసావహిస్తానని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో సంగారెడ్డి నుంచి కాంగ్రెస్ పార్టీ తరపునే పోటీ చేస్తానని జయప్రకాష్ రెడ్డి స్పష్టం చేశారు. అయితే అమరవీరుల కుటుంబానికి చెందిన అభ్యర్థిని పోటీకి నిలిపి, గెలిపించేందుకు అన్ని పార్టీలు ఐక్యంగా ముందుకు వస్తే తన సీటు వదులుకునేందుకు సిద్ధమని ఆయన ప్రకటించారు. -
'తెలంగాణలో కాంగ్రెస్ ఆత్మహత్య చేసుకున్నట్లే'
హైదరాబాద్ : సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జయప్రకాష్ రెడ్డి మరోసారి సమైక్య గళం విప్పారు. తాను ఇప్పటికీ సమైక్యవాదినే అని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్ర విభజన తర్వాత విలీనం కాకుండా టీఆర్ఎస్తో పొత్తు పెట్టుకుంటే కొందరు కాంగ్రెస్ నేతలు ఆపార్టీలోకి వెళ్లే అవకాశం ఉందన్నారు. టీఆర్ఎస్ విలీనం కాకుంటే కాంగ్రెస్‌కు తీవ్ర నష్టం కలుగుతుందన్నారు. ఇక తెలంగాణలో కాంగ్రెస్ ఆత్మహత్య చేసుకున్నట్లేనని జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. విభజన వల్ల సామాన్యుడికి ఒరిగేది ఏమీ లేదని... జరిగేది రాజకీయ విభజనే అని ఆయన అన్నారు. -
లక్ష్యాలను సాధించేందుకే ‘రైతుహిత’
సంగారెడ్డి టౌన్, న్యూస్‌లైన్: దిగుబడిలో లక్ష్యాలను సాధించేందుకు రైతుహిత సదస్సులను నిర్వహిస్తున్నట్టు జేసీ ఎ.శరత్ అన్నారు. శుక్రవారం స్థానిక హైదరాబాద్ ఫంక్షన్హాల్లో రైతుహిత కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జేసీ శరత్, ప్రభుత్వ విప్, స్థానిక ఎమ్మెల్యే తూర్పు జయప్రకాశ్‌రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల లక్ష్యాలను చేరుకునేందుకు ఈ సదస్సులు ఎంతగానో దోహదపడతాయన్నారు. పంటల సాగును బట్టి రైతులు అవలంబించాల్సిన యాంత్రీకరణ పద్ధతులను తెలియజేయనున్నట్టు తెలిపారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి పొందేవిధంగా రైతులు కృషి చేయాలని సూచించారు. అధునాతన పద్ధతులు పాటించడంతోపాటు ఆరుతడి పంటలపై ఎక్కువ శ్రద్ధ చూపాలన్నారు. అనంతరం ఎమ్మెల్యే జయప్రకాశ్‌రెడ్డి మాట్లాడుతూ రైతులు ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలన్నారు. వివిధ శాఖలకు సంబంధించిన అధికారులు, ఆదర్శరైతుల సూచనలతోపాటు సందేహాలను నివృత్తి చేసుకోవాలని వివరించాలన్నారు. ఈ సదస్సులో పాల్గొన్న రైతులు డ్రిప్పు, వరి, ఆరుతడి పంటలపై తమకున్న అవగాహనను తోటి రైతులకు వివరించారు. రైతు అనుబంధ శాఖలైన పశుసంవర్ధక, ఉద్యాన, పట్టుపరిశ్రమ, మత్స్యశాఖ, నీటి యాజమాన్య సంస్థ, పాడిపరిశ్రమ శాఖలు ఏర్పాటు చేసిన వివిధ ప్రదర్శనలు రైతులను ఎంతగానో ఆకర్శించాయి. అనంతరం పంటలు నష్టపోయిన రైతులకు సీఎం సహాయనిధి ద్వారా చెక్కులను పంపిణీ చేశారు. సమావేశంలో వ్యవసాయ శాఖ జేడీ ఉమామహేశ్వరమ్మ, ఉద్యాన శాఖ ఏడీ శేఖర్. ఎంఐపీ పీడీ రామలక్ష్మి, ఏడీ సెరికల్చర్ ఈశ్వరయ్య, పశుసంవర్ధక శాఖ జేడీ లక్ష్మారెడ్డి, ఆత్మకమిటీ చైర్మన్ రామకృష్ణారెడ్డి, వ్యవసాయ శాఖ చైర్మన్లు, రైతు సంఘాల నాయకులు, రైతులు పాల్గొన్నారు. -
విప్ దారెటు?
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: రాష్ట్ర పునర్విభజన ముసాయిదా బిల్లు త్వరలో అసెంబ్లీ తలుపు తట్టనుంది. బిల్లుపై జరిగే చర్చలో జిల్లాకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు ‘విభజన’ మంత్రానికి మద్దతు పలకనున్నారు. అయితే సమైక్యవాదం జపిస్తున్న ప్రభుత్వ విప్ తూర్పు జయప్రకాశ్‌రెడ్డి అసెంబ్లీలో అనుసరించే వైఖరిపై ఆసక్తి నెలకొంది. అధిష్టానం మనసెరిగి మసలుకోవాల్సిందిగా సొంత పార్టీ నేతలు జయప్రకాశ్‌రెడ్డికి హితబోధ చేస్తున్నట్టు సమాచారం. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో భాగంగా అసెంబ్లీలో ప్రవేశ పెట్టే ‘ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన ముసాయిదా బిల్లు 2013’పై జిల్లాకు చెందిన శాసన సభ్యులు అనుసరించే వైఖరి ఆసక్తికరంగా మారింది. డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ సహా ఇద్దరు మం త్రులు, ఐదుగురు ఎమ్మెల్యేలు జిల్లా నుంచి కాంగ్రెస్ పక్షాన అసెంబ్లీలో ప్రాతిని ధ్యం వహిస్తున్నారు. సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జయప్రకాశ్‌రెడ్డి అసెంబ్లీలో కీలకమైన విప్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుపై డిప్యూటీ సీఎం సహా జిల్లాకు చెం దిన మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు సుముఖంగా ఉన్నారు. అయితే విప్ జయప్రకాశ్‌రెడ్డి మాత్రం ‘తెలంగాణ’ రాష్ట్ర ఏర్పాటుపై తొలి నుంచి భిన్న వైఖరి అవలంబిస్తూ వస్తున్నారు. సమైక్య వాదాన్ని బలంగా వినిపిస్తున్న ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డితో ఈయనకు సన్నిహిత సంబంధాలున్నాయి. రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలంటూ పార్టీ అధ్యక్షురాలు సోనియాకు గతంలోనే లేఖ రాసిన జయప్రకాశ్‌రెడ్డి తరచూ సమైక్య వాదాన్ని వినిపిస్తూ వస్తున్నారు. తెలంగాణను ఏర్పాటు చేస్తే కాంగ్రెస్‌లో ఉండేది లేదని వ్యాఖ్యానించిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ ప్రాంతంలో సమైక్య నినాదం వినిపిస్తున్న ఎమ్మెల్యేగా జయప్రకాశ్‌రెడ్డి తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. అసెంబ్లీలో బిల్లు చర్చకు రానున్న నేపథ్యంలో ప్రభుత్వ విప్ వైఖరి ఎలా ఉంటుందనే అంశంపై సొంత పార్టీలోనే చర్చ జరుగుతోంది. సీఎంకు వ్యతిరేకంగా జిల్లా ప్రజాప్రతినిధులు.. రాష్ట్ర ఏర్పాటు అంశంలో సీఎం అనుసరిస్తున్న వైఖరిపై డిప్యూటీ సీఎం సహా జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మండిపడుతున్నారు. ‘రచ్చబండ-3’లో పాల్గొనేందుకు సీఎంను విప్ ఆహ్వానించినా, సొంత పార్టీ నేతలే వ్యతిరేకించారు. ఒకవేళ సీఎం పర్యటనకు వచ్చినా బహిష్కరిస్తామని హెచ్చరించడంతో చివరి నిమిషంలో కిరణ్ తనపర్యటన రద్దు చేసుకున్నారు. సీఎంను ఆహ్వానించడంపై విప్ జయప్రకాశ్రెడ్డిపైనా అధికార పార్టీ ఎమ్మెల్యేలు అసంతృప్తి వ్యక్తం చేశారు. జయప్రకాశ్‌రెడ్డి మనసు మార్చే ప్రయత్నం.. విభజన బిల్లుపై చర్చ సందర్భంగా విప్ జయప్రకాశ్‌రెడ్డి వైఖరిని అనుకూలంగా మార్చేందుకు జిల్లాకు చెందిన కాంగ్రెస్ కీలక నేత ఒకరు మధ్యవర్తిత్వం వహిస్తున్నారు. సహచర ఎమ్మెల్యేలు కూడా బిల్లుకు మద్దతు పలకాల్సిందిగా నచ్చ చె పుతున్నారు. కీలకం కానున్న డిప్యూటీ సీఎం పాత్ర.. బిల్లుపై చర్చ సందర్భంగా డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ కీలక పాత్ర పోషించనున్నారని జిల్లాకు చెందిన కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుడొకరు తెలిపారు. దామోదర మాట తెలంగాణ మొత్తంలో చెల్లుబాటు అవుతున్నా సొంత జిల్లాకే చెందిన విప్ భిన్నవాదన వినిపిస్తే కొంత ఇబ్బందికర పరిస్థితి తప్పదని ఆయన పేర్కొన్నారు. పార్టీ అధిష్టానం విభజనకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో అనుకూల వైఖరితో నడుచుకోవాల్సిందిగా జయప్రకాశ్‌రెడ్డికి నచ్చ చెపుతున్నామని తెలిపారు. తమతోపాటే రాబోయే రోజుల్లో విప్ రాజకీయ ప్రస్థానం కొనసాగిస్తారని ఆశిస్తున్నామని ఆయన వ్యాఖ్యానించారు. -
కేసీఆర్ పరోక్ష సమైక్యవాది: జగ్గారెడ్డి
సాక్షి, హైదరాబాద్: ‘నేను ఎప్పటికీ సమైక్యవాదినే.. నేను ప్రత్యక్ష సమైక్యవాదినైతే టీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు పరోక్షవాది. తెలంగాణ రావడం ఆయనకు ఇష్టం లేదు’ అని ప్రభుత్వ విప్ తూర్పు జయప్రకాశ్ రెడ్డి (జగ్గారెడ్డి) అన్నారు. తెలంగాణపై ఏర్పాటు చేసిన ఆంటోని కమిటీ ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీలను సందర్శించాలని కోరుతూ రాసిన లేఖను సోమవారం ఆయన విలేకరులకు విడుదల చేశారు. తెలంగాణ ఏర్పాటైతే కేసీఆర్‌కు, టీఆర్ఎస్కు రాజకీయ మనుగడ లేదని, అందుకే రాష్ట్ర విభజన ప్రకటన చేసిన తర్వాత కూడా ఉద్యమాలు, యాత్రలు అంటూ అడ్డుకుంటున్నారని విమర్శించారు. అమరుల ఆశయాలకు తగినట్టుగా రాష్ట్ర భవిష్యత్తులను తీర్చిదిద్దడానికి యూనివర్సిటీల విద్యార్థులతో చర్చించాలని ఆంటోని కమిటీకి జగ్గారెడ్డి విజ్ఞప్తి చేశారు. ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీలను సందర్శించి, ఉన్నత అర్హతలున్న విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని కోరారు. తెలంగాణకోసం అమరులైన వారి కుటుంబాలను ఆర్థికంగా ఆదుకోవాలని, విద్యార్థులపై అక్రమ కేసులను ఎత్తివేయాలన్నారు. ప్రతి అమరుని కుటుంబానికి ఉద్యోగంతో పాటు రెండెకరాల భూమిని ఇవ్వాలని జగ్గారెడ్డి డిమాండ్ చేశారు. రాష్ట్ర సాధనకోసం పోరాడిన విద్యార్థులకు పది సంవత్సరాల గరిష్ట వయసును సడలింపు చేయాలన్నారు. విద్యార్హతలున బట్టి అసిస్టెంటు ప్రొఫెసర్లుగా, లెక్చరర్లుగా, సర్వీసు కమిషన్ల ద్వారా ఉద్యోగాలను ఇవ్వాలని కోరారు. వారికి 500 గజాల ఇంటి స్థలాన్నివ్వాలని కోరారు. విద్యార్థుల పోరాటాలను పాఠ్యపుస్తకాల్లో చేర్చాలని, కార్పొరేషన్లలో నామినేటెడ్ పోస్టులను ఇవ్వాలని, ఉద్యమ నాయకులకు చట్టసభల్లో పార్టీ టికెట్లు ఇవ్వాలని జగ్గారెడ్డి విజ్ఞప్తి చేశారు.