సంగారెడ్డి క్రైం, న్యూస్‌లైన్: జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలో బీజేపీ గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది. దశాబ్దం క్రితం ఉన్న పట్టు ఇప్పుడు కన్పించడం లేదు. నాడు మూడు పర్యాయాలు సంగారెడ్డి మున్సిపాలిటీని, ఓసారి ఎమ్మెల్యే స్థానాన్ని దక్కించుకున్న ఆ పార్టీ ప్రస్తుత ఎన్నికల్లో మాత్రం ఉనికిని చాటుకునేందుకే అష్టకష్టాలు పడుతోంది. పట్టణంలో మొత్తం 31 వార్డులకు గాను కేవలం 19 వార్డుల్లో మాత్రమే అభ్యర్థులను నిలిపింది. టీడీపీతో సీట్ల సర్దుబాటు చేసుకున్నామని పైకి చెబుతున్నా వాస్తవానికి అలాంటి పరిస్థితి కన్పించడం లేదు.
గతంలో ఇలా..
బీజేపీ తరఫున గతంలో మున్సిపల్ చైర్‌పర్సన్‌లుగా పన్యాల ప్రభాకర్, తూర్పు జయప్రకాశ్‌రెడ్డి, కారం పద్మ పనిచేశారు. పటాన్‌చెరుకు చెందిన బీజేపీ నేత కె.సత్యనారాయణ సైతం సంగారెడ్డి నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఇలాంటి బలమైన పునాదులు కలిగిన పార్టీ ఇప్పుడు చతికిల పడినట్టు కన్పిస్తోంది.
దశాబ్దం నుంచి మొదలైన కష్టాలు..
తూర్పు జయప్రకాశ్‌రెడ్డి(జగ్గారెడ్డి) 2004కు ముందు బీజేపీని వీడారు. అప్పటినుంచి ఆ పార్టీ కేడర్ క్రమేణ తగ్గుతూ వస్తోంది. జగ్గారెడ్డి అప్పట్లో బీజేపీ నుంచి టీఆర్‌ఎస్‌లో చేరడంతో ఆయన అనుచరగణమంతా టీఆర్‌ఎస్‌లోకి వెళ్లింది. తరువాత జరిగిన పరిణామక్రమంలో జగ్గారెడ్డి టీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్ గూటికి చేరా రు. ఈ దశలోనూ కమలం పార్టీ ఇక్కడ దాదాపు సగం ఖాళీ అయింది. దీంతో సంగారెడ్డి నియోజక వర్గంలో బీజేపీకి మునుపటి పట్టు లేదని తెలుస్తోంది.
ప్రస్తుతం 19 స్థానాల్లోనే పోటీ..
మూడుసార్లు మున్సిపాలిటీని ఏలిన బీజేపీ ఇప్పు డు అన్ని స్థానాల్లో పోటీ చేయలేని పరిస్థితికి చేరిం ది. మొత్తం 31 వార్డులకు గాను 19 వార్డులతోనే సరిపెట్టుకుంటుంది. మారిన రాజకీయ పరిస్థితుల దృష్ట్యా బీజేపీ శ్రేణులు నరేంద్ర మోడీ జపం చేస్తున్నాయి. ఆ పార్టీ నుంచి ఆయన ప్రధాని అభ్యర్థి కావడంతో మోడి పేరు చెప్పి ఎన్నికల ప్రచారాన్ని చేపడుతుంది. అదీగాక తెలంగాణ కోసం బీజేపీ ఎంతో శ్రమించిందని కూడా చెప్పుకుంటోంది. బీజేపీ మద్దతు వల్లే పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లు ఆమోదం పొందిందని చెబుతూ ప్రచార పర్వాన్ని సాగిస్తోంది. తెలంగాణతోపాటు నరేంద్రమోడి పేరిట ఆ పార్టీ ప్రచారాన్ని సాగిస్తోంది.
కమలం వికసించేనా?
Published Tue, Mar 25 2014 12:07 AM | Last Updated on Fri, Mar 29 2019 9:18 PM
Advertisement
Advertisement