సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: ‘‘కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు, ప్రాజెక్టులు రాబట్టుకోవడంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం విఫలమైంది.. నవ తెలంగాణ నిర్మాణంలో భాగంగా అభివృద్ధి పనులు జరగాలంటే కేంద్ర ప్రభుత్వ సహకారం తప్పనిసరి...మెదక్ ఎంపీగా తనకు అవకాశం కల్పిస్తే ప్రధాని మోడీ సహకారంతో మెదక్ పార్లమెంట్ నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తా’’నని టీడీపీ,బీజేపీల ఉమ్మడి ఎంపీ అభ్యర్థి తూర్పు జయప్రకాశ్‌రెడ్డి అన్నారు.
శనివారం సంగారెడ్డిలో నిర్వహించిన ఎన్నికల ప్రచార ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, మెదక్ పార్లమెంట్ పరిధిలోని ఓటర్లు విజ్ఞతతో ఆలోచించి తనను గెలిపించాలని కోరారు. ఎంపీగా అవకాశం కల్పిస్తే గతంలో ఎన్నడూ జరగని విధంగా ఏడు నియోజకవర్గాల్లో అభివృద్ధి చేసి చూపుతానన్నారు. మూడు నెలల టీఆర్‌ఎస్ పాలనపై ప్రజలు అసంతృప్తితో ఉన్నారన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ సొంత జిల్లా అయినప్పటికీ రైతు లు, విద్యార్థులు, అన్నివర్గాల ప్రజలు సమస్యలు ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. సీఎం సొంత నియోజకవర్గ పరిధిలోని మాసాయిపేటలో ఘోర రైల్వే ప్రమాదం జరిగి 18 మంది చనిపోతే కనీసం పరామర్శించే తీరిక కూడా కేసీఆర్‌కు లేకుండా పోయిందన్నారు. ఇలాంటి వ్యక్తి రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేస్తారో ఆలోచించాలన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధికి కట్టుబడి ఉందన్నారు.
రూ.200 కోట్ల మంజీరా నీటి ప్రాజెక్టు
మెదక్ ఎంపీగా ప్రజలు అవకాశం ఇస్తే మెదక్ పార్లమెంట్ పరిధిలోని ఏడు నియోజకవర్గాలకు మంజీరా తాగునీరు అందించేందుకు రూ.200 కోట్లతో తాగునీటి ప్రాజెక్టు తీసుకువస్తానని జయప్రకాశ్‌రెడ్డి తెలిపారు. జిల్లా గుండా మంజీరా నది ప్రవహిస్తున్నా, మెదక్ పార్లమెంట్ పరిధిలోని చాలా గ్రామాల్లో తాగునీటి సమస్య ఉందన్నారు. తాను ఎంపీగా గెలిస్తే ప్రజలకు మంజీరా తాగునీరు అందించేందుకు అధిక ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు చెప్పారు.
సంగారెడ్డి నియోజకవర్గంలోని రెండు మున్సిపాలిటీలు, రెండు మండలాల్లోని అన్ని గ్రామాలకు మంజీరా సౌకర్యం కల్పించినట్లు చెప్పారు. అలాగే రైతులకు అవసరమైన సాగునీరు కల్పనపై దృష్టి పెడతానని హామీ ఇచ్చారు. అంతేకాకుండా ప్రధాని నరేంద్ర మోడీని ఒప్పించి మెట్రో రైలును మియాపూర్ నుంచి సంగారెడ్డి వరకు పొడిగించేలా చూస్తానన్నారు.
గెలిపిస్తే.. నిధులవరదే
Published Sat, Sep 6 2014 11:29 PM | Last Updated on Sat, Sep 2 2017 12:58 PM
Advertisement