Funded by the central government
-
వాటాకొస్తే సరి..!
వాటర్‌షెడ్ పథకానికి రూ.2.49 కోట్ల నిధులు నిలిపిన కేంద్రం ఆగిన అభివృద్ధి పనులు ఇప్పటివరకు కేంద్రం వాటా 90, రాష్ట్ర వాటా 10 శాతం రాష్ట్ర వాటా పెంచాల్సిందేనంటూ కేంద్రం ఆదేశం చిత్తూరు: వాటర్‌షెడ్ పథకానికి కేంద్ర ప్రభుత్వం నిధులను నిలిపివేసింది. ఈ పథకానికి సంబంధించి రాష్ట్ర వాటా పెంచేంతవరకు నిధులు ఇచ్చేది లేదని తేల్చిచెప్పింది. రాష్ట్రం ఎటూ తేల్చకపోవడంతో గత ఫిబ్రవరి నుంచి ఇప్పటివరకు జిల్లాకు ఇవ్వాల్సిన రూ.2.49 కోట్ల నిధులను నిలుపుదల చేసింది. దీంతో జిల్లాలో వాటర్‌షెడ్ అభివృద్ధి పనులు ముందుకు సాగే పరిస్థితి లేకుం డా పోయింది. జిల్లాలో వాటర్‌షెడ్ పథకం కింద 2009 -10 నుంచి 5 నుంచి 7 ఏళ్ల కాలపరిమితితో పనులు మొదలెట్టారు. 2009-10లో తొమ్మిది మండలాల పరిధి లో 9 ప్రాజెక్టుల కింద 55 వాటర్‌షెడ్ పనులతో38.25 వేల హెక్టార్లలో అభివృద్ధి పనులను చేపట్టాల్సి ఉంది. 2010-11లో 14 మండలాల పరిధిలో 18 ప్రాజెక్టుల కింద 115 వాటర్‌షెడ్ పనుల కింద 77.13 వేల హెక్టార్ల పరిధిలో, 2011-12లో 10 మండలాల పరిధిలో 20 ప్రాజెక్టుల కింద 105 వాటర్షెడ్ల పరిధిలో 82.68 వేల హెక్టార్ల పరిధిలో అభివృద్ధి పనులు చేపట్టాల్సి ఉంది. వీటిలో 40 శాతం పనులు కూడా పూర్తి కాలేదు. ఇక 2012-13లో రెండు మండలాల పరిధిలో 11 ప్రాజెక్టుల కింద 60 వాటర్షెడ్ల పరిధిలో 43.83 వేల హెక్టార్లలో, 2014-15లో ఒక్క మండల పరిధిలో నాలుగు ప్రాజెక్టుల కింద 24 వాటర్షెడ్ల పరిధిలో 16వేల హెక్టార్లలో అభివృద్ధి పనులు చేపట్టాల్సి ఉంది. అయితేపై రెండేళ్లకు సంబంధించి పనుల్లో పురోగతి లేకుండా పోయింది. కేంద్రం సైతం మొక్కుబడిగా నిధులు ఇవ్వడంతో వాటర్షెడ్ల పనులు జరగడం లేదు. మొత్తంగా ఆరేళ్ల కాలపరిమితిలో 36 మండలాల పరిధిలో 62 ప్రాజెక్టుల కింద 359 వాటర్షెడ్ల పరిధిలో 2.54లక్షల హెక్టార్లలో వాటర్‌షెడ్ అభివృద్ధి పనులు జరగాల్సి ఉంది. ఇందుకోసం రూ.305.59 కోట్లు ఖర్చు చేయాల్సి ఉండగా, ఇప్పటివరకు కేవలం రూ.136 కోట్లు మాత్రమే ఖర్చు చేసినట్లు గణాంకాలు చెబుతున్నాయి. 2014-15 ఏడాదికి సంబంధించి పనులు ప్రతిపాదనలకే పరిమితయ్యాయి. ఒక్క పని కూడా ప్రారంభం కాలేదు. 2012-13కు సంబంధించి కూడా మొక్కుబడి పనులతో సరిపెట్టారు. తాజాగా ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి ఇప్పటివరకు కేంద్రం ఇవ్వాల్సిన 90 శాతం వాటా రూ.2.49 కోట్ల నిధులను నిలిపివేయడంతో పనులు దాదాపు నిలిచిపోయాయి. ఇప్పటివరకు వాటర్షెడ్లకు సంబంధించి కేంద్రం ప్రభుత్వం 90 శాతం నిధులు ఇస్తుండగా, రాష్ట్ర ప్రభుత్వం 10 శాతం వాటాగా ఇస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం వాటాను 20 నుంచి 25 శాతానికి పెంచాలని కేంద్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తోంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంపై ఎటూ తేల్చలేదు. దీంతో కేంద్రం నిధులను నిలుపుదల చేయడంతో అభివృద్ధి పనులు నిలిచిపోయాయి. తక్షణం రాష్ట్ర ప్రభుత్వం నిధుల వాటా విషయం తేల్చితే తప్ప అభివృద్ధి పనులు మొదలయ్యే పరిస్థితి లేదని అధికారులంటున్నారు. -
గెలిపిస్తే.. నిధులవరదే
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: ‘‘కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు, ప్రాజెక్టులు రాబట్టుకోవడంలో టీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైంది.. నవ తెలంగాణ నిర్మాణంలో భాగంగా అభివృద్ధి పనులు జరగాలంటే కేంద్ర ప్రభుత్వ సహకారం తప్పనిసరి...మెదక్ ఎంపీగా తనకు అవకాశం కల్పిస్తే ప్రధాని మోడీ సహకారంతో మెదక్ పార్లమెంట్ నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తా’’నని టీడీపీ,బీజేపీల ఉమ్మడి ఎంపీ అభ్యర్థి తూర్పు జయప్రకాశ్‌రెడ్డి అన్నారు. శనివారం సంగారెడ్డిలో నిర్వహించిన ఎన్నికల ప్రచార ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, మెదక్ పార్లమెంట్ పరిధిలోని ఓటర్లు విజ్ఞతతో ఆలోచించి తనను గెలిపించాలని కోరారు. ఎంపీగా అవకాశం కల్పిస్తే గతంలో ఎన్నడూ జరగని విధంగా ఏడు నియోజకవర్గాల్లో అభివృద్ధి చేసి చూపుతానన్నారు. మూడు నెలల టీఆర్ఎస్ పాలనపై ప్రజలు అసంతృప్తితో ఉన్నారన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సొంత జిల్లా అయినప్పటికీ రైతు లు, విద్యార్థులు, అన్నివర్గాల ప్రజలు సమస్యలు ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. సీఎం సొంత నియోజకవర్గ పరిధిలోని మాసాయిపేటలో ఘోర రైల్వే ప్రమాదం జరిగి 18 మంది చనిపోతే కనీసం పరామర్శించే తీరిక కూడా కేసీఆర్‌కు లేకుండా పోయిందన్నారు. ఇలాంటి వ్యక్తి రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేస్తారో ఆలోచించాలన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధికి కట్టుబడి ఉందన్నారు. రూ.200 కోట్ల మంజీరా నీటి ప్రాజెక్టు మెదక్ ఎంపీగా ప్రజలు అవకాశం ఇస్తే మెదక్ పార్లమెంట్ పరిధిలోని ఏడు నియోజకవర్గాలకు మంజీరా తాగునీరు అందించేందుకు రూ.200 కోట్లతో తాగునీటి ప్రాజెక్టు తీసుకువస్తానని జయప్రకాశ్‌రెడ్డి తెలిపారు. జిల్లా గుండా మంజీరా నది ప్రవహిస్తున్నా, మెదక్ పార్లమెంట్ పరిధిలోని చాలా గ్రామాల్లో తాగునీటి సమస్య ఉందన్నారు. తాను ఎంపీగా గెలిస్తే ప్రజలకు మంజీరా తాగునీరు అందించేందుకు అధిక ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు చెప్పారు. సంగారెడ్డి నియోజకవర్గంలోని రెండు మున్సిపాలిటీలు, రెండు మండలాల్లోని అన్ని గ్రామాలకు మంజీరా సౌకర్యం కల్పించినట్లు చెప్పారు. అలాగే రైతులకు అవసరమైన సాగునీరు కల్పనపై దృష్టి పెడతానని హామీ ఇచ్చారు. అంతేకాకుండా ప్రధాని నరేంద్ర మోడీని ఒప్పించి మెట్రో రైలును మియాపూర్ నుంచి సంగారెడ్డి వరకు పొడిగించేలా చూస్తానన్నారు.