సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: రాష్ట్ర పునర్విభజన ముసాయిదా బిల్లు త్వరలో అసెంబ్లీ తలుపు తట్టనుంది. బిల్లుపై జరిగే చర్చలో జిల్లాకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు ‘విభజన’ మంత్రానికి మద్దతు పలకనున్నారు. అయితే సమైక్యవాదం జపిస్తున్న ప్రభుత్వ విప్ తూర్పు జయప్రకాశ్‌రెడ్డి అసెంబ్లీలో అనుసరించే వైఖరిపై ఆసక్తి నెలకొంది. అధిష్టానం మనసెరిగి మసలుకోవాల్సిందిగా సొంత పార్టీ నేతలు జయప్రకాశ్‌రెడ్డికి హితబోధ చేస్తున్నట్టు సమాచారం.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో భాగంగా అసెంబ్లీలో ప్రవేశ పెట్టే ‘ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన ముసాయిదా బిల్లు 2013’పై జిల్లాకు చెందిన శాసన సభ్యులు అనుసరించే వైఖరి ఆసక్తికరంగా మారింది. డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ సహా ఇద్దరు మం త్రులు, ఐదుగురు ఎమ్మెల్యేలు జిల్లా నుంచి కాంగ్రెస్ పక్షాన అసెంబ్లీలో ప్రాతిని ధ్యం వహిస్తున్నారు. సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జయప్రకాశ్‌రెడ్డి అసెంబ్లీలో కీలకమైన విప్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుపై డిప్యూటీ సీఎం సహా జిల్లాకు చెం దిన మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు సుముఖంగా ఉన్నారు. అయితే విప్ జయప్రకాశ్‌రెడ్డి మాత్రం ‘తెలంగాణ’ రాష్ట్ర ఏర్పాటుపై తొలి నుంచి భిన్న వైఖరి అవలంబిస్తూ వస్తున్నారు.
సమైక్య వాదాన్ని బలంగా వినిపిస్తున్న ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డితో ఈయనకు సన్నిహిత సంబంధాలున్నాయి. రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలంటూ పార్టీ అధ్యక్షురాలు సోనియాకు గతంలోనే లేఖ రాసిన జయప్రకాశ్‌రెడ్డి తరచూ సమైక్య వాదాన్ని వినిపిస్తూ వస్తున్నారు. తెలంగాణను ఏర్పాటు చేస్తే కాంగ్రెస్‌లో ఉండేది లేదని వ్యాఖ్యానించిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ ప్రాంతంలో సమైక్య నినాదం వినిపిస్తున్న ఎమ్మెల్యేగా జయప్రకాశ్‌రెడ్డి తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. అసెంబ్లీలో బిల్లు చర్చకు రానున్న నేపథ్యంలో ప్రభుత్వ విప్ వైఖరి ఎలా ఉంటుందనే అంశంపై సొంత పార్టీలోనే చర్చ జరుగుతోంది.
సీఎంకు వ్యతిరేకంగా జిల్లా ప్రజాప్రతినిధులు..
రాష్ట్ర ఏర్పాటు అంశంలో సీఎం అనుసరిస్తున్న వైఖరిపై డిప్యూటీ సీఎం సహా జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మండిపడుతున్నారు. ‘రచ్చబండ-3’లో పాల్గొనేందుకు సీఎంను విప్ ఆహ్వానించినా, సొంత పార్టీ నేతలే వ్యతిరేకించారు. ఒకవేళ సీఎం పర్యటనకు వచ్చినా బహిష్కరిస్తామని హెచ్చరించడంతో చివరి నిమిషంలో కిరణ్ తనపర్యటన రద్దు చేసుకున్నారు. సీఎంను ఆహ్వానించడంపై విప్ జయప్రకాశ్‌రెడ్డిపైనా అధికార పార్టీ ఎమ్మెల్యేలు అసంతృప్తి వ్యక్తం చేశారు.
జయప్రకాశ్‌రెడ్డి మనసు మార్చే ప్రయత్నం..
విభజన బిల్లుపై చర్చ సందర్భంగా విప్ జయప్రకాశ్‌రెడ్డి వైఖరిని అనుకూలంగా మార్చేందుకు జిల్లాకు చెందిన కాంగ్రెస్ కీలక నేత ఒకరు మధ్యవర్తిత్వం వహిస్తున్నారు. సహచర ఎమ్మెల్యేలు కూడా బిల్లుకు మద్దతు పలకాల్సిందిగా నచ్చ చె పుతున్నారు.
కీలకం కానున్న డిప్యూటీ సీఎం పాత్ర..
బిల్లుపై చర్చ సందర్భంగా డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ కీలక పాత్ర పోషించనున్నారని జిల్లాకు చెందిన కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుడొకరు తెలిపారు. దామోదర మాట తెలంగాణ మొత్తంలో చెల్లుబాటు అవుతున్నా సొంత జిల్లాకే చెందిన విప్ భిన్నవాదన వినిపిస్తే కొంత ఇబ్బందికర పరిస్థితి తప్పదని ఆయన పేర్కొన్నారు. పార్టీ అధిష్టానం విభజనకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో అనుకూల వైఖరితో నడుచుకోవాల్సిందిగా జయప్రకాశ్‌రెడ్డికి నచ్చ చెపుతున్నామని తెలిపారు. తమతోపాటే రాబోయే రోజుల్లో విప్ రాజకీయ ప్రస్థానం కొనసాగిస్తారని ఆశిస్తున్నామని ఆయన వ్యాఖ్యానించారు.
విప్ దారెటు?
Published Sat, Dec 7 2013 11:51 PM | Last Updated on Thu, Sep 27 2018 8:33 PM
Advertisement
Advertisement