సాక్షి ప్రతినిధి సంఘారెడ్డి: సంచలన వ్యాఖ్యలు.. కలుపుగోలుతత్వం.. అంతకు మించిన ఆవేశం.. అన్నీ కలిస్తే తూర్పు జగ్గారెడ్డి. ఎప్పుడూ ఏదో రకంగా వార్తల్లో ఉంటూనే ఉంటారు. కాంగ్రెస్ పార్టీ నుంచి జంప్ చేసి బీజేపీ టికెట్ తీసుకుని మెదక్ ఉప ఎన్నికను వేడెక్కించిన ఆయన కాసేపు సాక్షి ప్రతినిధితో ముచ్చటిస్తూ ఈ విధంగా అన్నారు..
‘చిన్న రాష్ట్రాలతో లాభం కంటే నష్టమే ఎక్కువని కేసీఆర్ మాట్లాడలేదా? రాజకీయ స్వలాభం కోసం మాట మార్చి తెలంగాణవాదం అందుకోలేదా? సమైక్యవాదం అనేది ముగిసిన ఎపిసోడ్. తెలంగాణ రాష్ట్రం వచ్చింది. ఇప్పుడు కావాల్సింది తెలంగాణ అభివృద్ధి. ప్రజల బతుకులు బంగారం కావాలి. అభివృద్ధిని వదిలేసి ఇంకా ఆంధ్రోళ్లను తిట్టుకుంటా పబ్బం గడుపుకోవటం మంచిదేనా?’ అని జగ్గారెడ్డి అన్నారు. ‘అభివృద్ధి జరగాలంటే నిధులు కావాలి. కేంద్ర ప్రభుత్వ సహకారం కావాలి.
ఇప్పటివరకు కేసీఆర్ కేంద్రం సాయం కోరారా?. కిషన్‌రెడ్డిలాంటి బీజేపీ రాష్ట్ర నేతల సహకారంతో మోడీ ప్రభుత్వం నుంచి నిధులు తెచ్చుకునే ప్రయత్నం చేయాల’ అని అన్నారు. ‘నన్ను గెలిపించండి మోడీని ఒప్పించి నిధులు పట్టుకొస్తా, మెదక్ పార్లమెంటు నియోజకవర్గంలోని 30 మండలాలను, 4 మున్సిపాల్టీలను సంగారెడ్డి తరహాలో అభివృద్ధి చేసి చూపిస్తా. ఎమ్మెల్యేగా వైఎస్సార్‌ను ఒప్పించి సంగారెడ్డి ఐఐటీ తీసుకొచ్చినా, ఎంపీగా గెలిస్తే అటువంటి పనులు ఎన్నో చేస్తా’ అని అన్నారు.
‘హరీష్‌రావు పొద్దున లేస్తే జగ్గారెడ్డి జపమే చేస్తున్నారు. తెలంగాణవాది, సమైక్యవాది అనేది ఇప్పుడు అనవసర ప్రస్తావన. ప్రజలకు తాగు, సాగునీరు, కరెంటు కావాలి, ఇవన్నీ కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోనే ఉన్నాయి. కేసీఆర్ వీటిని తేగలరా?’ అని జగ్గారెడ్డి ప్రశ్నించారు. ‘మెదక్ ప్రజలకు నాదొక విజ్ఞప్తి.. ఇప్పుడు టీఆర్‌ఎస్‌కు 10 ఎంపీ సీట్లు ఉన్నాయి. మెదక్ గెలిస్తే పదకొండో సీటు అయితది. కానీ ఏమిటి ప్రయోజనం. నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి, ఢిల్లీకి పంపిస్తే ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుకు జాతీయ హోదా పట్టుకొస్తా.
ప్రతి ఇంటికి మంజీరా నీరు అందిస్తా. అభివృద్ధే నా మంత్రం. కాంగ్రెస్ పార్టీలో నాకు ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ బీజేపీ ఒక బలమైన నాయకుని కోసం చూసింది. పార్టీలో చేరాలని కొంతమంది మిత్రులు నా ఒత్తిడి తెచ్చారు. వాళ్ల మాట నేను కాదనలేకపోయాను. మోడీ నాయకత్వంలోనే దేశం, రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని నమ్మా. కనుకనే బీజేపీలో చేరాల్సి వచ్చింది. నాతోటి చాలామంది జాతీయ నాయకులే మాట్లాడారు. వాళ్లందరూ తోడుగా ఉంటామని మాటిచ్చారు. వాళ్ల సహాయంతోనైనా మెదక్‌ను అభివృద్ధి చేయవచ్చనే ఆలోచనతోనే బీజేపీలోకి చేరాను. ఎవరెవరు ప్రచారానికి వస్తారనే విషయం పార్టీ చూసుకుంటుంది.
పార్లమెంటులో బీజేపీ మద్దతుతోనే తెలంగాణ బిల్లు నెగ్గిందనే విషయాన్ని కేసీఆర్ మర్చిపోయినట్టున్నారు’ అని జగ్గారెడ్డి వివరించారు. ‘రాష్ట్రం విడిపోతే తెలంగాణకు కరెంటు కష్టాలుంటాయని అందిరికీ తెలిసిందే. ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఏమైనా సర్దుబాటు చర్యలు చేపట్టారా? పక్క రాష్ట్రాల్లో మిగులు కరెంటు నిల్వలు ఉన్నాయి. వాటిని కొనుగోలు చేసి రైతు సమస్యలను పరిష్కరించడానికి ఏమైనా ప్రయత్నం చేశారా? ప్రజలు మూడు నెలలుగా ఎదురుచూస్తున్నారు. వెనుకటికి దొంగలు ఉడుము మూతికి తేనె పూసి పెద్దపెద్ద భవనాలను ఎక్కినట్టుగా కేసీఆర్ ఇప్పుడ మాయ మాటలతో ప్రజలను మోసం చేస్తూ పూట గడుపుకుంటున్నారని’ జగ్గారెడ్డి తనదైన శైలిలో మాట్లాడారు.
ఒక్క ఛాన్స్ ఇవ్వండి
Published Tue, Sep 2 2014 11:35 PM | Last Updated on Wed, Aug 15 2018 9:22 PM
Advertisement
Advertisement