సంగారెడ్డి టౌన్: రెడ్డి కులస్తులు ఏకమై కేసీఆర్‌కు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందని టీపీసీసీ అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. మంగళవారం ఆయన ఇంట్లో ఏర్పాటు చేసిన సమావేశంలో విలేకర్లతో మాట్లాడారు. తెలంగాణ ఉద్యమంలో అన్ని రాజకీయ పార్టీలు ఉద్యమాలు చేశాయన్నారు. జేఏసీ ఏర్పాటు అనంతరం అన్ని ఉద్యోగ, ఉపాధ్యాయ, ప్రజా సంఘాలు.. ఇలా ఉద్యమంలో సకల జనులు భాగస్వామ్యం అయ్యారని, టీఆర్‌ఎస్ పార్టీలో వీరంతా చేరి ఏనాడు మద్దతు తెలపలేదన్నారు. రాజకీయేతర పోరాటంతోనే తెలంగాణ సిద్ధిస్తుందని భావించి జేఏసీలో అందరూ చేరారని అన్నారు.
మన రాష్ట్రం– మన పరిపాలన ఉంటే బంగారు బాటలు వేసుకోవచ్చని ఉద్యమకారులు భావించారని, కానీ వారి ఆశలు నిరాశలయ్యాయన్నారు. జేఏసీలో ఉన్నప్పుడు కేసీఆర్‌కు కోదండరాం ముద్దుగా కనిపించాడని, ఇప్పుడు ఆయన దోషిగా కనబడుతున్నాడని, అందుకే ఆయన పర్యటనను అడ్డుకుంటున్నారని ఆరోపించారు. తెలంగాణ వచ్చిన తర్వాత మహిళలకు, యువతకు, రైతుకు ఏ ఒక్కరికీ న్యాయం జరగలేదన్నారు. రాజకీయంగా రెడ్డి సామాజిక వర్గాన్ని అణగదొక్కేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నాడన్నారు. రెడ్డిలంతా ఏకమైతే నీ బతుకు బజారుపాలవుతుందని కేసీఆర్‌ను ఆయన హెచ్చరించారు. రెడ్డి సామాజిక వర్గం పది మందికి సేవ చేసే దృక్పథంతో ఉంటుందన్నారు. అన్ని రాజకీయ పార్టీల్లో ఉన్న రెడ్డి సామాజిక వర్గం నేతలు జాగ్రత్త పడాలన్నారు. ఎస్సీ, బీసీలతో రెడ్డి కులస్తులకు అవినాభావ సంబంధం ఉందని, వెలమలకు ఎలాంటి సంబంధాలు లేవన్నారు.
Comments
Please login to add a commentAdd a comment