Sub- Elections
-
ఒక్క ఛాన్స్ ఇవ్వండి
సాక్షి ప్రతినిధి సంఘారెడ్డి: సంచలన వ్యాఖ్యలు.. కలుపుగోలుతత్వం.. అంతకు మించిన ఆవేశం.. అన్నీ కలిస్తే తూర్పు జగ్గారెడ్డి. ఎప్పుడూ ఏదో రకంగా వార్తల్లో ఉంటూనే ఉంటారు. కాంగ్రెస్ పార్టీ నుంచి జంప్ చేసి బీజేపీ టికెట్ తీసుకుని మెదక్ ఉప ఎన్నికను వేడెక్కించిన ఆయన కాసేపు సాక్షి ప్రతినిధితో ముచ్చటిస్తూ ఈ విధంగా అన్నారు.. ‘చిన్న రాష్ట్రాలతో లాభం కంటే నష్టమే ఎక్కువని కేసీఆర్ మాట్లాడలేదా? రాజకీయ స్వలాభం కోసం మాట మార్చి తెలంగాణవాదం అందుకోలేదా? సమైక్యవాదం అనేది ముగిసిన ఎపిసోడ్. తెలంగాణ రాష్ట్రం వచ్చింది. ఇప్పుడు కావాల్సింది తెలంగాణ అభివృద్ధి. ప్రజల బతుకులు బంగారం కావాలి. అభివృద్ధిని వదిలేసి ఇంకా ఆంధ్రోళ్లను తిట్టుకుంటా పబ్బం గడుపుకోవటం మంచిదేనా?’ అని జగ్గారెడ్డి అన్నారు. ‘అభివృద్ధి జరగాలంటే నిధులు కావాలి. కేంద్ర ప్రభుత్వ సహకారం కావాలి. ఇప్పటివరకు కేసీఆర్ కేంద్రం సాయం కోరారా?. కిషన్‌రెడ్డిలాంటి బీజేపీ రాష్ట్ర నేతల సహకారంతో మోడీ ప్రభుత్వం నుంచి నిధులు తెచ్చుకునే ప్రయత్నం చేయాల’ అని అన్నారు. ‘నన్ను గెలిపించండి మోడీని ఒప్పించి నిధులు పట్టుకొస్తా, మెదక్ పార్లమెంటు నియోజకవర్గంలోని 30 మండలాలను, 4 మున్సిపాల్టీలను సంగారెడ్డి తరహాలో అభివృద్ధి చేసి చూపిస్తా. ఎమ్మెల్యేగా వైఎస్సార్‌ను ఒప్పించి సంగారెడ్డి ఐఐటీ తీసుకొచ్చినా, ఎంపీగా గెలిస్తే అటువంటి పనులు ఎన్నో చేస్తా’ అని అన్నారు. ‘హరీష్‌రావు పొద్దున లేస్తే జగ్గారెడ్డి జపమే చేస్తున్నారు. తెలంగాణవాది, సమైక్యవాది అనేది ఇప్పుడు అనవసర ప్రస్తావన. ప్రజలకు తాగు, సాగునీరు, కరెంటు కావాలి, ఇవన్నీ కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోనే ఉన్నాయి. కేసీఆర్ వీటిని తేగలరా?’ అని జగ్గారెడ్డి ప్రశ్నించారు. ‘మెదక్ ప్రజలకు నాదొక విజ్ఞప్తి.. ఇప్పుడు టీఆర్ఎస్కు 10 ఎంపీ సీట్లు ఉన్నాయి. మెదక్ గెలిస్తే పదకొండో సీటు అయితది. కానీ ఏమిటి ప్రయోజనం. నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి, ఢిల్లీకి పంపిస్తే ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుకు జాతీయ హోదా పట్టుకొస్తా. ప్రతి ఇంటికి మంజీరా నీరు అందిస్తా. అభివృద్ధే నా మంత్రం. కాంగ్రెస్ పార్టీలో నాకు ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ బీజేపీ ఒక బలమైన నాయకుని కోసం చూసింది. పార్టీలో చేరాలని కొంతమంది మిత్రులు నా ఒత్తిడి తెచ్చారు. వాళ్ల మాట నేను కాదనలేకపోయాను. మోడీ నాయకత్వంలోనే దేశం, రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని నమ్మా. కనుకనే బీజేపీలో చేరాల్సి వచ్చింది. నాతోటి చాలామంది జాతీయ నాయకులే మాట్లాడారు. వాళ్లందరూ తోడుగా ఉంటామని మాటిచ్చారు. వాళ్ల సహాయంతోనైనా మెదక్‌ను అభివృద్ధి చేయవచ్చనే ఆలోచనతోనే బీజేపీలోకి చేరాను. ఎవరెవరు ప్రచారానికి వస్తారనే విషయం పార్టీ చూసుకుంటుంది. పార్లమెంటులో బీజేపీ మద్దతుతోనే తెలంగాణ బిల్లు నెగ్గిందనే విషయాన్ని కేసీఆర్ మర్చిపోయినట్టున్నారు’ అని జగ్గారెడ్డి వివరించారు. ‘రాష్ట్రం విడిపోతే తెలంగాణకు కరెంటు కష్టాలుంటాయని అందిరికీ తెలిసిందే. ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఏమైనా సర్దుబాటు చర్యలు చేపట్టారా? పక్క రాష్ట్రాల్లో మిగులు కరెంటు నిల్వలు ఉన్నాయి. వాటిని కొనుగోలు చేసి రైతు సమస్యలను పరిష్కరించడానికి ఏమైనా ప్రయత్నం చేశారా? ప్రజలు మూడు నెలలుగా ఎదురుచూస్తున్నారు. వెనుకటికి దొంగలు ఉడుము మూతికి తేనె పూసి పెద్దపెద్ద భవనాలను ఎక్కినట్టుగా కేసీఆర్ ఇప్పుడ మాయ మాటలతో ప్రజలను మోసం చేస్తూ పూట గడుపుకుంటున్నారని’ జగ్గారెడ్డి తనదైన శైలిలో మాట్లాడారు. -
‘హస్త’వ్యస్తం!
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: ఉప ఎన్నిక వేళ ‘హస్త’వాసి చెదిరిపోతోంది. ఢిల్లీ దిగ్గజాలు దిగ్విజయ్‌సింగ్, గులాంనబీ ఆజాద్, సచిన్ పైలట్, జ్యోతిరాదిత్య లాంటి నేతలతో ప్రచారం చేసి సీటు గెలుచుకోవాలని కాంగ్రెస్ అధిష్టానం వ్యూహం రచిస్తుంటే.. ఇక్కడ మాత్రం వలసలు, వర్గపోరుతో ఆ పార్టీ కొట్టుమిట్టాడుతోంది. ఓటరును పోలింగ్‌స్టేషన్ వరకు నడిపించే ద్వితీయ, తృతీయ శ్రేణి నాయకులు ఇప్పటికే గులాబీ ‘పుష్ప’క విమానం ఆకర్షణలో పడిపోయారు. ఉన్న కొద్దోగొప్పో నాయకులు వర్గపోరుతో పలుచనవుతున్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ నేతల సభలకు జనాలను ఎక్కడి నుంచి తీసుకురావాలని మెతుకు సీమ కాంగ్రెస్ నాయకులు తలపట్టుకుంటున్నారు. గులాబీ నేతలు ఆకర్ష్ పథకాన్ని అమలు చేయడంతో ఆ పార్టీలోకి కుప్పలు తెప్పలుగా గల్లీ నేతలు మొదలుకొని అధినాయకుల వరకు వచ్చి చేరిపోతున్నారు. గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి చేరికతో మొదలైన వలసల పరంపర మాజీ మంత్రి ఫరీదుద్దీన్, ఎమ్మెల్సీ భూపాల్‌రెడ్డి చేరికతో ఊపందుకున్నాయి. మెదక్ ఉప ఎన్నిక పరిధిలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో 35కి పైగా సర్పంచులు, 30 ఎంపీటీసీ సభ్యులు, పలువురు జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు గులాబీ కండువా కప్పుకున్నారు. పటాన్చెరు నియోజకవర్గంలో భారీగా ఎంపీటీసీలు, సర్పంచులు టీఆర్ఎస్లో చేరారు. ఇక్కడి స్థానిక నాయకుడు ఎమ్మెల్సీ భూపాల్‌రెడ్డి ఒకవైపు, ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి మరోవైపు ఉండి పోటాపోటీగా ఇతర పార్టీల నాయకులను లాగేసుకుంటున్నట్టు తెలుస్తోంది. మాజీ మంత్రి, ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సునీతారెడ్డికి అత్యంత ఆప్తుడు, జిన్నారం నాయకుడు బాల్‌రెడ్డి పార్టీకి హ్యాండిచ్చి టీఆర్ఎస్లోకి దూకేశారు. గజ్వేల్ నియోజకవర్గంలో ఒకరిద్దరు ప్రజా ప్రతినిధులు మినహాయించి, అన్ని పార్టీలకు చెందిన నేతలు టీఆర్ఎస్లో చేరిపోయారు. నర్సాపూర్ నియోజకవర్గంలోని చిన్నచింతకుంట మాజీ ఎంపీటీసీ వెంకటేశ్,అదే గ్రామ మాజీ సర్పంచ్ భాగ్యమ్మ, తుజాల్పూర్ సర్పంచ్ సాయిలు కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్లో చేరారు. శివ్వంపేట మండలంలోని పిల్లుట్ల గ్రామ సర్పంచ్ సులోచన కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్లో చేరారు. కౌడిపల్లి మండలం యువజన కాంగ్రెస్ అద్యక్షుడు చంద్రంగౌడ్తో పాటు మరో ఐదుగురు కార్యవర్గ సభ్యులు టీఆర్ఎస్లో చేరారు. మెదక్ నియోజకవర్గంలో చిన్నశంకరంపేట మండలం మడూర్ సొసైటీ చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డి, మెదక్ పట్టణంలోని ఇద్దరు మాజీ కౌన్సిలర్లు, మెదక్ మండలంలో నుంచి ముగ్గురు సర్పంచ్‌లు టీఆర్ఎస్లో చేరారు. ఇలా చెప్పుకుంటూ పోతే చేరికల లిస్టు చేంతాడంత అవుతుంది. అలక పాన్పులు ఎక్కి... వర్గపోరులోనూ కాంగ్రెస్ పార్టీ నేతలే ముందున్నారు. ఫ్లెక్సీలలో నా బొమ్మ పెట్టలేదని ఒక నాయకుడు, నాకు తగిన ప్రాధాన్యత ఇవ్వటం లేదని మరొకరు, సభలో నాకు చిన్న కుర్సీ వేశారని మరో నేత ఇలా అలక పాన్పు ఎక్కుతున్నారు. నిజానికి ప్రస్తుత బీజేపీ అభ్యర్థి జగ్గారెడ్డికి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం డీసీసీ అధ్యక్షుని పదవి ఇస్తూ ప్రకటన చేసింది. అదే రోజు జిల్లాకు చెందిన కొందరు సీనియర్ నాయకులు దిగ్విజయ్‌సింగ్ వద్దకు వెళ్లి జగ్గారెడ్డికి ఆ పదవి ఇవ్వకుండా అడ్డుపడ్డారు. అప్పటి నుంచి మనస్తాపంతో ఉన్న జగ్గారెడ్డి అవకాశం రాగానే బీజేపీలోకి వె ళ్లి టికెట్ తెచ్చుకున్నారు. తాజాగా దుబ్బాక నియోజకవర్గంలో జరిగిన కార్యకర్తల సమావేశంలో చెరకు ముత్యంరెడ్డి, ఫారూక్ హుస్సేన్ వర్గాలు వాగ్వాదానికి దిగటం, ఒకరినొకరు ధూషించుకోవటంతో కార్యకర్తలను విస్మయానికి గురిచేసింది. భూ కబ్జాదారులే వెళ్లిపోతున్నారు: భూ కబ్జాదారులు, వైట్ కాలర్ నేరగాళ్లే కాంగ్రెస్ పార్టీని వీడుతున్నారు. టీఆర్ఎస్ నేతలు ఆశపెట్టి పార్టీలోకి లాక్కుంటున్నారు. పార్టీకి ఎలాంటి నష్టం లేదు. ప్రజలు, కార్యకర్తలు మా వెంటే ఉన్నారు. ఢిల్లీ నేతల సభకు జనం రారు అనేది టీఆర్ఎస్ చేస్తున్న గోబెల్స్ ప్రచారం. ఇందులో ఎంతమాత్రం నిజం లేదు. 120 ఏళ్ల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇలాంటి ఆటుపోట్లను ఎన్నిటినో తట్టుకొని నిలబడింది. -
ఎన్నిక వేళ... సీన్ రివర్స్
►ఉపపోరుకు పార్టీలు సమాయత్తం ►జెండా పాతేందుకు సిద్ధమైన బీజేపీ ►అస్త్రాలు సమకూర్చుకుంటున్న కాంగ్రెస్ ►అసలేమాత్రం పట్టని రీతిలో టీఆర్ఎస్ ఎన్నికల వేళ సీన్ రివర్స్ అయ్యింది. జాతీయ నాయకులంతా హైదరాబాద్‌కు వచ్చి ఉప పోరుకు సైరన్ ఊదుతుంటే... పోరు రాజేసిన గులాబీ ‘దళపతి’ హైదరాబాద్‌ను వదిలేసి సింగపూర్‌లో చక్కర్లు కొడుతున్నారు. కాంగ్రె స్ దిగ్గజం దిగ్గీరాజా, కమలం బాద్షా అమిత్ షా హైదరాబాద్‌లో మకాం వేసి అస్త్రాలకు పదును పెడుతుంటే, గులాబీ దళపతి సింగపూర్ సిటీ అందాలు చూస్తూ గడిపేస్తున్నారు. కమళదళం కసరత్తు మెదక్ పార్లమెంటు సీటును మోడీకి బహుమతిగా ఇవ్వాలని రెండు రోజుల కిందనే కమలనాథుడు అమిత్‌షా ఢిల్లీ ఫ్లైట్ దిగి హైదరాబాద్‌లో మకాం వేశారు. కిషన్‌రెడ్డి, నాగం జనార్దన్‌రెడ్డి, బద్దం బాల్‌రెడ్డి, కాసాల బుచ్చిరెడ్డి, రఘునందన్‌రావు లాంటి పార్టీ ముఖ్య నాయకులందరినీ పిలిచి మెదక్ ఉపపోరులో పార్టీ తరఫున ఎవరిని నిలపాలంటూ మంతనాలు జరిపారు. మెదక్ ఎంపీ స్థానాన్ని ఎలాగైనా గెలవాలని, అందువల్ల గెలిచే సత్తా ఉన్న వారి పేర్లే సూచించాలని కోరగా, నేతలంతా ‘నేనైతేనే గెలుస్తా’ నంటూ ఎవరికి వారు రేసులో నిలిచేందుకు ప్రయత్నించారట. అయితే మెదక్ ఉపపోరులో కిషన్‌రెడ్డినే నిలపాలని తొలుత పార్టీ నాయకత్వం భావించింది. అయితే తాను అందుకు సిద్ధంగా లేనని కిషన్‌రెడ్డి చెప్పినట్లు సమాచారం. రాష్ట్రపార్టీ అధ్యక్షునిగా ఉండి ఒడిపోతే బాగుండదని ఆయన ముందుగానే పోటీ నుంచి తప్పుకున్నారని ప్రచారం జరుగుతోంది. ఇక స్థానికుడు, యువకుడు, తెలంగాణవాది రఘునందన్‌రావు పేరు ప్రస్తావనకు వచ్చినట్లు సమాచారం. తెలంగాణ వాదంతోనే రాజకీయాల్లోకి వచ్చిన ఆయన, కేసీఆర్‌తో విబేధించారు కానీ, తెలంగాణ వాదాన్ని మాత్రం వదిలిపెట్టలేదు. ఆయనకు అవకాశం ఇస్తే మోడీ అనుకూల వర్గాల ఓట్లు చీలిపోకుండా ఒడిసిపట్టుకోగలడని భావించినా, ఆయన దగ్గర ‘డబ్బు’లేదని పక్కన పెట్టినట్లు తెలుస్తోంది. ఇక బుచ్చిరెడ్డి, నాగం జనార్దన్‌రెడ్డి, బాల్‌రెడ్డి తదితరులు కూడా పోటీకి సిద్ధంగా ఉండటంతో ఎవరిని అభ్యర్ధిగా నిలబెట్టాలో అంతు చిక్కక అమిత్ షా తలపట్టుకున్నారు. వ్యూహం రచిస్తున్న కాంగ్రెస్ మెదక్ ఉప ఎన్నికపై హోటల్ దసపల్లాలో టీపీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య అధ్యక్షతన జరిగిన కాంగ్రెస్ పార్టీ నాయకుల సమావేశంలో నేతలంతా అధిష్టానం నిర్ణయమే శిరోధార్యమని తేల్చిచెప్పారు. ఎవరికి టికెట్ ఇచ్చినా కలిసికట్టుగా పని చేస్తామని ముక్త కంఠంతో చెప్పారు. నాయకులు చెప్పిన విషయాన్నే పొన్నాల లక్ష్మయ్య అధిష్టానికి నివేదించారు. దీంతో తెలంగాణలో బక్కచిక్కిన కాంగ్రెస్ పార్టీకి మరమ్మతు చేసి మెదక్ పార్లమెంటు సీటును సోనియాకు బహుమతిగా ఇవ్వాలని కోటి ఆశలతో ఢిల్లీ నుంచి ఫ్లైట్ దిగిన దిగ్గీరాజాకు మెతుకుసీమ నాయకులు ముచ్చెమటలు పట్టించారు. ఎప్పటిలాగే వర్గపోరుతో స్వాగతం పలికారు. ఢిల్లీలో కూర్చుని డీసీసీ అధ్యక్షుని పదవికి జగ్గారెడ్డి పేరు మీద టిక్ కొట్టిన దిగ్గీరాజా, ఇక్కడకు రాగానే వర్గపోరును చూసి ‘అంతా..తూచ్ అన్నారు. అధ్యక్షుని ఎంపిక మళ్లీ మొదటి నుంచి కానిద్దాం’ అన్నారు. ఇదిలావుండగా, మెదక్ టికెట్ కోసం ప్రభుత్వ మాజీ విప్ జగ్గారెడ్డి, మాజీ మంత్రి సునితా లక్ష్మారెడ్డి, మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ భార్య పద్మిని, మాజీ ఎంపీ సర్వే సత్యనారాయణ తీవ్రంగా పోటీపడుతున్నారు. సర్వే సత్యనారాయణ ఢిల్లీలో చక్రం తిప్పి మెదక్ టికెట్ చేరువలో ఉండగా, మెతుకు సీమ నాయకులంతా కలిసికట్టుగా జిల్లాకు చెందిన వారికే టికెట్ ఇవ్వాలనే డిమాండ్ పెట్టారు. దీంతో సర్వే రేసులో కాస్త వెనుకబడ్డారు. ఇదే అదునుగా తూర్పు జగ్గారెడ్డి టికెట్ కోసం చకచకా పావులు కదిపారు. ఢిల్లీ స్థాయిలో పైరవీ చేసుకున్న ఆయన, ఇటీవల మూడో కంటికి తెలియకుండా డీసీసీ అధ్యక్షుని పదవి తెచ్చుకున్నారు. అదే ఊపులో ఎంపీ టికెట్ కూడా చేజిక్కించుకునే ప్రయత్నం చేశారు. దీంతో ఒక్కసారిగా కాంగ్రెస్ పార్టీలో ముఠా రాజకీయాలు తెరమీదకు వచ్చాయి. జగ్గారెడ్డిని కాలుపట్టి కిందకు గుంజేశారు. ప్రస్తుతం మెదక్ ఉపపోరులో కాంగ్రెస్ అభ్యర్థిగా సునితా లక్ష్మారెడ్డి పేరు బలంగా వినపడుతోంది. ఆమె వెనుకాలే ఉన్న పద్మినీరెడ్డి ఏం చేస్తారో చూడాలి. ఎదురుచూపుల్లో గులాబీ నేతలు ఇక గెలుపు ధీమాతో ఉన్న గులాబి దళపతి కేసీఆర్ ఎత్తులు..పైఎత్తులు కసరత్తులు అన్నీ తన ‘ట్రబుల్ షూటర్’ భుజాన పెట్టి సింగపూర్ మీదుగా మలేషియాకు వెళ్లే రోడ్ల మీద తిరుగుతున్నారు. ఇప్పుడాయన అక్కడి అద్దల్లాంటి రోడ్లను హైదరాబాద్‌లోనూ వేయాలనే ధ్యాసలో ఉన్నట్లు సన్నిహిత వర్గాలు చెప్తున్నాయి. మెదక్ ఉప ఎన్నికల నామినేషన్ల ముగింపు గుడువు దగ్గర పడుతున్న నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీ నుంచి టికెట్ ఆశిస్తున్న ఆశావాహులు టెన్షన్‌తో జుట్టు పీక్కుంటున్నారు. పార్టీ నుంచి టీఎన్జీఓల సంఘం అధ్యక్షుడు దేవి ప్రసాద్, ఉద్యమ సమయంలో పార్టీకి ఆర్థికంగా అండగా నిలబడిన కొత్త ప్రభాకర్‌రెడ్డి, రాజయ్య యాదవ్, మరో రియల్టర్ టికెట్‌ను ఆశిస్తున్నారు. అయితే ఇప్పటి వరకు కేసీఆర్‌ను కలిసి టికెట్ తనకే ఇవ్వాలని ఏ ఒక్కరు కూడా ధైర్యం చేసి అడగలేదు. ఒక్క దేవీ ప్రసాద్ మాత్రమే టీఎన్జీఓలతో కలిసి కేసీఆర్ మీద ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అయితే పక్కా ప్లాన్‌తో కేసీఆర్ ఇప్పటికే మెదక్ అభ్యర్థి ఎవరికో తేల్చేసి ఉంటారు. ఇక కావాల్సింది..ఆయన మనుసులోని ఆ పేరు బయటికి రావడమే. అంత వరకు గులాబిదళానికి ఎదురు చూపులు తప్పవు. -
బోణీ అయ్యింది...
మెదక్ ఎంపీ స్థానానికి నామినేషన్ వేసిన స్వతంత్ర అభ్యర్థి సంగారెడ్డి టౌన్: మెదక్ పార్లమెంట్ స్థానానికి జరగనున్న ఉప ఎన్నిక ల్లో గురువారం తొలి నామినేషన్ దాఖలైంది. మెదక్ ఎంపీ స్థానానికి స్వతంత్ర అభ్యర్థి రవికిరణ్‌రెడ్డి బొజ్జ తన నామినేషన్ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ శరత్‌కు దాఖలు చేశారు. రవికిరణ్ రెడ్డి స్వగ్రామం మహబూబ్‌నగర్ జిల్లా వంగూరు మండలం కొండారెడ్డిపల్లి గ్రామం. శ్రీరామానంద తీర్థ ఇన్స్టిట్యూట్కు సీఈఓగా మూడు సంవత్సరాలు పనిచేసిన రవికిరణ్‌రెడ్డి, యూఎన్డీప్రాజెక్ట్ ఆఫీసర్‌గా, రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని ఔషధ మొక్కల సంస్థ సలహాదారుడిగా కూడా పనిచేశారని తెలిసింది. అంతేకాకుండా జీహెచ్ఎంసీకి బయోడైవర్సిటీ నిపుణులుగా కూడా రవికిరణ్‌రెడ్డి పనిచేసినట్లు సమాచారం. రాజకీయాలపై మక్కువతోనే సెప్టెంబర్ 13న జరగనున్న మెదక్ పార్లమెంట్ ఉప ఎన్నికల్లో ఆయన పోటీ చేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.