సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: ఉప ఎన్నిక వేళ ‘హస్త’వాసి చెదిరిపోతోంది. ఢిల్లీ దిగ్గజాలు దిగ్విజయ్‌సింగ్, గులాంనబీ ఆజాద్, సచిన్ పైలట్, జ్యోతిరాదిత్య లాంటి నేతలతో ప్రచారం చేసి సీటు గెలుచుకోవాలని కాంగ్రెస్ అధిష్టానం వ్యూహం రచిస్తుంటే.. ఇక్కడ మాత్రం వలసలు, వర్గపోరుతో ఆ పార్టీ కొట్టుమిట్టాడుతోంది. ఓటరును పోలింగ్‌స్టేషన్ వరకు నడిపించే ద్వితీయ, తృతీయ శ్రేణి నాయకులు ఇప్పటికే గులాబీ ‘పుష్ప’క విమానం ఆకర్షణలో పడిపోయారు. ఉన్న కొద్దోగొప్పో నాయకులు వర్గపోరుతో పలుచనవుతున్నారు.
ఈ నేపథ్యంలో ఢిల్లీ నేతల సభలకు జనాలను ఎక్కడి నుంచి తీసుకురావాలని మెతుకు సీమ కాంగ్రెస్ నాయకులు తలపట్టుకుంటున్నారు. గులాబీ నేతలు ఆకర్ష్ పథకాన్ని అమలు చేయడంతో ఆ పార్టీలోకి కుప్పలు తెప్పలుగా గల్లీ నేతలు మొదలుకొని అధినాయకుల వరకు వచ్చి చేరిపోతున్నారు. గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి చేరికతో మొదలైన వలసల పరంపర మాజీ మంత్రి ఫరీదుద్దీన్, ఎమ్మెల్సీ భూపాల్‌రెడ్డి చేరికతో ఊపందుకున్నాయి.
మెదక్ ఉప ఎన్నిక పరిధిలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో 35కి పైగా సర్పంచులు, 30 ఎంపీటీసీ సభ్యులు, పలువురు జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు గులాబీ కండువా కప్పుకున్నారు. పటాన్‌చెరు నియోజకవర్గంలో భారీగా ఎంపీటీసీలు, సర్పంచులు టీఆర్‌ఎస్‌లో చేరారు. ఇక్కడి స్థానిక నాయకుడు ఎమ్మెల్సీ భూపాల్‌రెడ్డి ఒకవైపు, ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి మరోవైపు ఉండి పోటాపోటీగా ఇతర పార్టీల నాయకులను లాగేసుకుంటున్నట్టు తెలుస్తోంది. మాజీ మంత్రి, ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సునీతారెడ్డికి అత్యంత ఆప్తుడు, జిన్నారం నాయకుడు బాల్‌రెడ్డి పార్టీకి హ్యాండిచ్చి టీఆర్‌ఎస్‌లోకి దూకేశారు.
గజ్వేల్ నియోజకవర్గంలో ఒకరిద్దరు ప్రజా ప్రతినిధులు మినహాయించి, అన్ని పార్టీలకు చెందిన నేతలు టీఆర్‌ఎస్‌లో చేరిపోయారు. నర్సాపూర్ నియోజకవర్గంలోని చిన్నచింతకుంట మాజీ ఎంపీటీసీ వెంకటేశ్,అదే గ్రామ మాజీ సర్పంచ్ భాగ్యమ్మ, తుజాల్‌పూర్ సర్పంచ్ సాయిలు కాంగ్రెస్ నుంచి టీఆర్‌ఎస్‌లో చేరారు. శివ్వంపేట మండలంలోని పిల్లుట్ల గ్రామ సర్పంచ్ సులోచన కాంగ్రెస్ నుంచి టీఆర్‌ఎస్‌లో చేరారు.
కౌడిపల్లి మండలం యువజన కాంగ్రెస్ అద్యక్షుడు చంద్రంగౌడ్‌తో పాటు మరో ఐదుగురు కార్యవర్గ సభ్యులు టీఆర్‌ఎస్‌లో చేరారు. మెదక్ నియోజకవర్గంలో చిన్నశంకరంపేట మండలం మడూర్ సొసైటీ చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డి, మెదక్ పట్టణంలోని ఇద్దరు మాజీ కౌన్సిలర్లు, మెదక్ మండలంలో నుంచి ముగ్గురు సర్పంచ్‌లు టీఆర్‌ఎస్‌లో చేరారు. ఇలా చెప్పుకుంటూ పోతే చేరికల లిస్టు చేంతాడంత అవుతుంది.
అలక పాన్పులు ఎక్కి...
వర్గపోరులోనూ కాంగ్రెస్ పార్టీ నేతలే ముందున్నారు. ఫ్లెక్సీలలో నా బొమ్మ పెట్టలేదని ఒక నాయకుడు, నాకు తగిన ప్రాధాన్యత ఇవ్వటం లేదని మరొకరు, సభలో నాకు చిన్న కుర్సీ వేశారని మరో నేత ఇలా అలక పాన్పు ఎక్కుతున్నారు. నిజానికి ప్రస్తుత బీజేపీ అభ్యర్థి జగ్గారెడ్డికి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం డీసీసీ అధ్యక్షుని పదవి ఇస్తూ ప్రకటన చేసింది.
అదే రోజు జిల్లాకు చెందిన కొందరు సీనియర్ నాయకులు దిగ్విజయ్‌సింగ్ వద్దకు వెళ్లి జగ్గారెడ్డికి ఆ పదవి ఇవ్వకుండా అడ్డుపడ్డారు. అప్పటి నుంచి మనస్తాపంతో ఉన్న జగ్గారెడ్డి అవకాశం రాగానే బీజేపీలోకి వె ళ్లి టికెట్ తెచ్చుకున్నారు. తాజాగా దుబ్బాక నియోజకవర్గంలో జరిగిన కార్యకర్తల సమావేశంలో చెరకు ముత్యంరెడ్డి, ఫారూక్ హుస్సేన్ వర్గాలు వాగ్వాదానికి దిగటం, ఒకరినొకరు ధూషించుకోవటంతో కార్యకర్తలను విస్మయానికి గురిచేసింది.
భూ కబ్జాదారులే వెళ్లిపోతున్నారు: భూ కబ్జాదారులు, వైట్ కాలర్ నేరగాళ్లే కాంగ్రెస్ పార్టీని వీడుతున్నారు. టీఆర్‌ఎస్ నేతలు ఆశపెట్టి పార్టీలోకి లాక్కుంటున్నారు. పార్టీకి ఎలాంటి నష్టం లేదు. ప్రజలు, కార్యకర్తలు మా వెంటే ఉన్నారు. ఢిల్లీ నేతల సభకు జనం రారు అనేది టీఆర్‌ఎస్ చేస్తున్న గోబెల్స్ ప్రచారం. ఇందులో ఎంతమాత్రం నిజం లేదు. 120 ఏళ్ల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇలాంటి ఆటుపోట్లను ఎన్నిటినో తట్టుకొని నిలబడింది.
‘హస్త’వ్యస్తం!
Published Tue, Sep 2 2014 11:31 PM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
Advertisement
Advertisement