కేసీఆర్ మాయల మరాఠీ | K.chandrasekhar Rao cheated person says damodara rajanarsimha | Sakshi
Sakshi News home page

కేసీఆర్ మాయల మరాఠీ

Published Sat, Sep 6 2014 11:35 PM | Last Updated on Thu, Sep 27 2018 8:33 PM

K.chandrasekhar Rao cheated person says damodara rajanarsimha

సంగారెడ్డి రూరల్: ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు మాయమాటలతో పబ్బం గడుపుతున్నారని మాజీ డిప్యుటీ సీఎం దామోదర రాజనర్సింహ ఆరోపించారు. రైతు రుణమాఫీపైనే తొలి సంతకం పెడుతానన్న కేసీఆర్, హామీలు నెరవేర్చకుండా మాటలతో ప్రజలను మభ్యపెడుతున్నారన్నారు. మెదక్ లోక్‌సభ ఉప ఎన్నికల్లో భాగంగా శనివారం సంగారెడ్డి మండలంలోని కంది, కాశీపూర్, కలివేముల, చెర్లగూడెం, తోపుగొండ, జుల్‌కల్, ఇంద్రకరణ్, ఎద్దుమైలారం తదితర గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

ఈ సందర్భంగా జుల్‌కల్‌లో నిర్వహించిన బహిరంగ సభలో దామోదర రాజనర్సింహ మాట్లాడుతూ, కాంగ్రెస్ హయాంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఉచిత కరెంటు, రుణమాఫీపైనే తొలి సంతకం చేశారని గుర్తు చేశారు. రైతుల ఓట్లతో అధికారంలోకి వచ్చిన టీఆర్‌ఎస్ ప్రభుత్వం కరెంటు అడిగిన రైతులపై లాఠీచార్జి చేయించారన్నారు. అందువల్ల ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సునీతాలకా్ష్మరెడ్డికి ఓటు వేసి గెలిపించాలని కోరారు.

 అనంతరం సునీతాలకా్ష్మరెడ్డి మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే ఉచిత కరెంటు, రైతు రుణమాఫీ, తెల్ల రేషన్‌కార్డులు, బంగారుతల్లి పథకం, ఇందిరమ్మ ఇళ్లు, ఆరోగ్యశ్రీ తదితర సంక్షేమ పథకాలను పేదల కోసం ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. అయితే హామీలు గుప్పించి అధికారంలోకి వచ్చిన టీఆర్‌ఎస్ సర్కార్,  సమగ్ర కుటుంబ సర్వే పేరుతో పేదలకు సంక్షేమ పథకాలు దూరం చేసేందుకు కుట్ర చేస్తోందన్నారు.

 ఇంటికో ఉద్యోగం, ఎస్సీ కుటుంబానికి మూడెకరాల భూమి, ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్, రుణమాఫీ తదితర సంక్షేమ పథకాలను అమలు చేస్తామని, మాయమాటలు చెబుతూ ఓటర్లను మభ్యపెడుతున్నారని విమర్శించారు. వంద రోజుల పాలనలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం సాధించిన అభివృద్ధి ఏమిటో ప్రజలకు తెలియజేయాలని డిమాండ్ చేశారు.

 ఎన్నికల ముందు ఒక మాట, ఎన్నికల తర్వాత ఒక మాట పొంతన లేకుండా మాట్లాడుతూ ప్రజలను అయోమయానికి గురి చేస్తున్న టీఆర్‌ఎస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలన్నారు. అందుకోసం చేతి గుర్తుకు ఓటువేయాలని పిలుపునిచ్చారు.  కార్యక్రమంలో జహీరాబాద్ మాజీ ఎంపీ సురేశ్‌షెట్కార్, ఎమ్మెల్యే రాంరెడ్డి, నాయకులు శ్రావణ్‌కుమార్‌రెడ్డి, సురేందర్‌గౌడ్, వెంకట్‌రెడ్డి, ప్రకాశ్, మహబూబ్‌పాషా, చంద్రయ్య, రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement