సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ 2019లో అధికారంలోకి రావడం ఖాయమని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్ కుమార్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. రైతులకు ఒక్కొక్కరికి రూ.2 లక్షల రుణాలను ఒకే దఫాలో మాఫీ చేస్తామని చెప్పారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నాలుగు విడతలుగా చేసిన రుణమాఫీతో రైతులకు ఒరిగిందేమీ లేదని అన్నారు. బుధవారం గాంధీభవన్‌లో జరిగిన కిసాన్ ఖేత్ మజ్దూర్ కాంగ్రెస్ సమావేశంలో పాల్గొన్న అనంతరం పీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి, కిసాన్ సెల్ చైర్మన్ కోదండరెడ్డి, ఎస్సీ సెల్ చైర్మన్ ఆరేపల్లి మోహన్‌తో కలసి ఉత్తమ్ విలేకరులతో మాట్లాడారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక వరికి రూ.2 వేలకు తగ్గకుండా మద్దతు ధర ఇస్తామని, మొక్క జొన్నకు కేంద్రం ఇచ్చే ధరకు అదనంగా రూ.2 వేలకు తగ్గకుండా, పత్తికి రూ.5 వేలకు తగ్గకుండా రాష్ట్ర ప్రభుత్వం తరఫున మద్దతు ధర ఇస్తామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే పంటల బీమా ప్రీమియంను ప్రభుత్వమే భరించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. రైతు రుణమాఫీ వడ్డీ భారాన్ని ప్రభుత్వమే భరిస్తుందని, అసెంబ్లీలో సీఎం కేసీఆర్ తాను చెప్పిన మాటను ఎందుకు నిలబెట్టుకోలేకపోయారో చెప్పాలని నిలదీశారు. అసెంబ్లీలో సీఎం ఇచ్చిన వాగ్దానాలకే దిక్కులేకుండా పోయిం దని, టీఆర్‌ఎస్ కార్యకర్తలకు ట్రాక్టర్లు ఇవ్వ డమే ‘వ్యవసాయ యాంత్రీకరణ’అని ఎద్దేవా చేశారు.
ప్రకృతి వైపరీత్యాలకు ఒక్క పైసా నష్ట పరిహారం ఇవ్వని ఘనత కేసీఆర్ ప్రభుత్వాని దేనని ధ్వజమెత్తారు. ఎంత పంట నష్టం జరిగిందో అంచనా వేయలేని దుస్థితిలో ప్రభుత్వముందని మండిపడ్డారు. అకాల వర్షాలతో నష్టపోయిన పత్తి రైతులకు రూ.25 వేలు, వరి రైతులకు రూ.15 వేల నష్ట పరి హారం చెల్లించాలని కోరారు. రైతు ఆత్మహత్య లకు గత కాంగ్రెస్ ప్రభుత్వమే కారణమనడం సిగ్గుచేటని అన్నారు. తెలంగాణలో 3 వేల 500 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే ఒక్క కుటుంబాన్ని కూడా సీఎం కేసీఆర్ పరామర్శించలేదని విమర్శించారు. రైతుల పట్ల కేసీఆర్ సర్కార్ అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరికి నిరసనగా ఈ నెల 27న చలో అసెంబ్లీ కార్యక్రమం చేపట్టామని తెలిపారు. చలో అసెంబ్లీపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్న మంత్రి హరీశ్‌రావు సీఎం హామీలను ఎందుకు నెరవేర్చడం లేదో చెప్పాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment