వాటర్ ప్లాంట్‌లకు ఉచిత విద్యుత్
లాభాపేక్ష లేని వాటికే: కేసీఆర్
♦ వితంతువులకు కార్పొరేషన్!
♦ సేంద్రియ సాగుపైనా త్వరలో నిర్ణయం
♦ ప్రజలను సంఘటితం చేస్తున్న బాలవికాసకు సహకారం
♦ బాలవికాస రజతోత్సవ వేడుకల్లో సీఎం కేసీఆర్
♦ బంగ్లాదేశ్ యూనస్ స్ఫూర్తి గాథ చెప్పిన ముఖ్యమంత్రి
సాక్షి, హైదరాబాద్: లాభాపేక్ష లేకుండా నడిచే వాటర్ ప్లాంట్‌లకు ఉచిత విద్యుత్, వితంతువులకు ఆర్థిక చేయూత అందిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇచ్చారు. వీటిపై వచ్చే కేబినెట్ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. వితంతువులకు కార్పొరేషన్, సేంద్రియ సాగుకు మద్దతు, గుడుంబా నియంత్రణకు చర్యలు చేపట్టాలని బాలవికాస సంస్థ ప్రతినిధులు ముఖ్యమంత్రిని కోరారు. సమాజానికి ఉపయుక్తమయ్యే అంశాలను ముందుకు తెచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఎల్‌బీ స్టేడియంలో మంగళవారం జరిగిన బాలవికాస రజతోత్సవ వేడుకల్లో కేసీఆర్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.
తెలంగాణ, ఏపీ, మహారాష్ట్రల నుంచి 15 వేలకు మందిపైగా ప్రజలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ... ఏ రంగంలోనైనా ప్రజలు సంఘటితంగా ఉంటే అద్భుతాలు సాధించవచ్చన్నారు. ఈ రుచిని వాళ్లకు తెలియజేసే బాధ్యతను బాలవికాస తీసుకోవడం అభినందనీయమన్నారు. ‘బంగ్లాదేశ్‌లో ఆరుగురు పేద మహిళలతో కూడిన ఓ బృందం రోజూ ఓ వడ్డీ వ్యాపారి వద్దకు వెళ్లి ఐదు రూపాయల వడ్డీతో రూ.100 తీసుకునేది. ఆ డబ్బుతో కూరగాయలు కొని గల్లీగల్లీ తిరుగుతూ అమ్మేవారు. వీరిని గమనించిన ప్రొఫెసర్ యూనస్ ఒకరోజు వారిని అనుసరించారు.
వడ్డీ వ్యాపారి చేతిలో వీరు మోసపోతున్నారని గుర్తించారు. వీరిని ఆదుకునేందుకు ఏం చేయాలో రాత్రంతా ఆలోచించి మరుసటి రోజు ఉదయాన్నే ఆ బృందం అటుగా వెళుతుంటే పిలిచారు. తాను రూ.మూడు వడ్డీకే డబ్బులు అప్పుగా ఇస్తానని చెప్పగా సరేనంటూ ఆ మహిళలు యూనస్ వద్ద ఆరు నెలలపాటు డబ్బులు తీసుకుంటూ వ్యాపారం కొనసాగించారు. వడ్డీ తగ్గడంతో కొంత లాభపడ్డారు. కొన్నిరోజుల తర్వాత యూనస్ వారిని కుటుంబంతో సహా తన ఇంటికి భోజనాలకు రమ్మని పిలిచారు. భోజనాల తర్వాత తన ఇంట్లో దాచిన రూ.30 వేలు తెచ్చాడు. ఇదంతా మీ సొమ్మే. నేనేం వ్యాపారిని కాదు. మీరిచ్చిన వడ్డీతో నేను ఆదా చేసిన ఈ డబ్బు మీకే దక్కుతుందంటూ.. రూ.5 వేల చొప్పున ఆరుగురికి పంచాడు.
ఇకపై నెత్తిన కూరగాయల గంపలు వద్దు. ఈ డబ్బుతో తోపుడు బండ్లు కొనుక్కొని వ్యాపారం చేసుకోండి. కానీ.. ఒక చిన్న షరతు. నేను ఎలా చేశానో మీరు కూడా మరో గ్రూప్‌ను తయారుచేయాలని హితబోధ చేశాడు. యూనస్ పట్టుదలతోనే బంగ్లాదేశ్‌లో 17 వేల స్వయం సహాయక సంఘాలు (ఎస్‌హెచ్‌జీ) తయారయ్యాయి. ప్రజలు సంఘటితంగా ఉంటే అద్భుతాలు సాధించవచ్చనే దానికిది ఉదాహరణ. ఇటువంటి బాధ్యతను బాలవికాస నెత్తికెత్తుకొని 25 ఏళ్ల నుంచి పాటుపడుతుండటం నిజంగా అభినందనీయం’ అని కేసీఆర్ అన్నారు. భవిష్యత్‌లోనూ సేవా కార్యక్రమాలు కొనసాగించి బాలవికాస ఓ బ్రహ్మస్త్రంలా పనిచేయాలని, ప్రభుత్వపరంగా అండదండలు ఉంటాయని హామీ ఇచ్చారు.
అనంతరం ఏపీ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాద్ మాట్లాడుతూ... ఏపీ, తెలంగాణ, కర్ణాటకలో బాలవికాస సేవలందిస్తోందని, వీరికి ఏపీ ప్రభుత్వం నుంచి సహకారం అందిస్తామన్నారు. ఆడబిడ్డల సాధికారతకు ఆ సంస్థ చేస్తున్న కృషి అనిర్వచనీయమని చెప్పారు. పేదల అభివృద్ధికి కృషి చేస్తున్న బాలవికాసకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కూడా మద్దతు తెలిపినట్టు బాలవికాస ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ శౌరిరెడ్డి తెలిపారు. కార్యక్రమంలో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, అజ్మీరా చందూలాల్, ఎమ్మెల్యేలు ఆరూరి రమేశ్, టి.రాజయ్య, సతీశ్, ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎమ్మెల్సీ సుధాకర్ రెడ్డి, వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే డేవిడ్ రాజు, బాలవికాస వ్యవస్థాపకురాలు బాల సెరెగ, ఆమె భర్త ఆండ్రి జంగ్రా పాల్గొన్నారు.