అష్టదిగ్బంధం
- మెదక్ జిల్లా బంద్‌కు అడుగడుగునా పోలీసుల అడ్డంకులు
- మల్లన్నసాగర్ నిర్వాసితులకు సంఘీభావంగా కదలిన నేతలు, ప్రజాసంఘాలు
సాక్షి నెట్‌వర్క్ : పోలీసుల అష్టదిగ్బంధం.. ఎక్కడికక్కడ అరెస్టులు.. మల్లన్నసాగర్ బాధితులకు సంఘీభావంగా తరలివచ్చిన నేతల ను పోలీసులు అడుగడుగునా అడ్డుకున్నారు. ముంపు గ్రామాలకు వెళ్లనీయకుండా మధ్యలోనే అరెస్టు చేసి పోలీస్‌స్టేషన్లకు తరలించా రు.దీనిపై నేతలు, ప్రజాసంఘాల నాయకులు మండిపడ్డారు. భూనిర్వాసితులపై పోలీసుల లాఠీచార్జిని నిరసిస్తూ ప్రతిపక్షాలు సోమవారం మెదక్ జిల్లా బంద్‌కు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బాధితుల ను కలిసేందుకు బయల్దేరిన టీజేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాంను జిల్లా సరిహద్దు శా మీర్‌పేట వద్దే పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
‘‘గాయపడిన నిర్వాసితులను పరామర్శించి, వారితో మాట్లాడి కార్యాచరణ రూపొందించుకుందామనుకున్నాం. అంతలోనే మమ్మల్ని అన్యాయంగా అరెస్ట్ చేశారు’’ అని కోదండరాం అన్నారు. చర్చల ద్వారానే మల్లన్నసాగర్ ప్రాజెక్టుకు పరిష్కారం కనుగొనాలన్నారు. గజ్వేల్ ఆసుపత్రిలో ఉన్న బాధితులను పరామర్శిస్తామని చెప్పినా వినకుండా పోలీసులు తమను గంటన్నరపాటు వాహనంలో తిప్పారన్నారు. రైతుల నుంచి బలవంతంగా భూము లు లాక్కోవద్దని ప్రభుత్వానికి సూచించారు. లాఠీచార్జిలో గాయపడినవారికి ప్రభుత్వమే మెరుగైన వైద్యం అందించి, కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ప్రజలతో చర్చించి ప్రభుత్వం న్యాయపరంగా భూములు సేకరించాలన్నారు. లేకుంటే పెద్దఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. బొల్లారం పోలీస్‌స్టేషన్‌కు కోదండరాంతో పాటు మెదక్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారెడ్డిని కూడా తరలించారు. ప్రజల్ని భయభ్రాంతులకు గురిచేసి ప్రాజెక్టులు నిర్మించడం సమంజసం కాదని, రాష్ట్రంలో హిట్లర్ పాలన సాగుతోందని ఆమె దుయ్యబట్టారు. అనంతరం వారిని పోలీసులు సొంత పూచీకత్తుపై విడుదల చేశారు.
నియంతలా వ్యవహరిస్తున్నారు..
సీఎం కేసీఆర్ నియంతగా వ్యవహరిస్తున్నారని మాజీ డీప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ విమర్శించారు. సోమవారం గజ్వేల్ చేరుకున్న ఆయన్ను పోలీసులు అరెస్టు చేసి తూప్రాన్ స్టేషన్ కు తరలించారు. యూపీఏ ప్రభుత్వం తెచ్చిన 2013 భూసేకరణ చట్టాన్ని కాదని రాష్ట్ర ప్రభుత్వం దళారుల కోసం జీవో 123 తెచ్చిందని ఆరోపించారు. సీఎం సొంత జిల్లా నుంచే యుద్ధం ప్రారంభమైందన్నారు. ఇక సిద్దిపేటలో మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. భూనిర్వాసితులను కలిసేందుకు వెళ్తుంటే తమను అరెస్టు చేయడం దారుణమన్నారు.
ప్రభుత్వం అణచివేత ధోరణి అవలంభిస్తుంటే తాము ప్రేక్షకపాత్ర వహించబోమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి ధ్వజమెత్తారు. సోమవారం ఆయన్ను పోలీసులు అరెస్ట్ చేసిన సందర్భంగా ఫోన్ లో ‘సాక్షి’తో మాట్లాడారు. బంద్‌కు మద్దతు తెలిపేందుకు బయల్దేరిన తెలంగాణ యునెటైడ్ ఫ్రంట్ అధ్యక్షురాలు విమలక్కను పోలీసులు కుకునూర్‌పల్లి సమీపంలో అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘బంగారం పండే భూములు పోతుంటే కడుపుమండదా? న్యాయం చేయండని అడిగితే లాఠీచార్జీ చేస్తారా?’ అని ఆమె ప్రశ్నించారు. ఆమెతో పాటు అరెస్టయిన ఫ్రంట్ కార్యదర్శి దాసు తదితరులను సాయంత్రం విడుదల చేశారు.
నాడు టీఆర్‌ఎస్ నాయకులు బైఠాయించలేదా?
భూనిర్వాసితులకు సంఘీభావం తెలిపేందుకు హైకోర్టు రిటైర్డ్ జస్టిస్ చంద్రకుమార్, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం రహస్యంగా హైదరాబాద్ నుంచి పల్లెపహాడ్‌కు, అక్కడ్నుంచి వేములఘాట్‌కు చేరుకున్నారు. రాష్ట్రంలో టీఆర్‌ఎస్ పాలన రజాకార్ల పాలనను తలపిస్తోందని, తెలంగాణ ఉద్యమంలో టీఆర్‌ఎస్ నాయకులు రోడ్లపై బైఠారుుంచి వంటావార్పులు చేయలేదాఅని తమ్మినేని ప్రశ్నించారు. లాఠీచార్జీకి కారణమైన సిద్దిపేట డీఎస్పీని సస్పెండ్ చేయాలన్నారు. బంగారు తెలంగాణ అంటే రెండు పంటలు పండే భూమలను బలవంతంగా లాక్కోవడమేనా అని ప్రశ్నించారు. మల్లన్న సాగర్‌ను రద్దు చేసి కాలువల ద్వారా సాగునీరు అందించాలన్నారు. జస్టిస్ చంద్రకుమార్ మాట్లాడుతూ.. దేశానికి అన్నం పెట్టే రైతన్న పోలీసులకు తీవ్రవాదుల్లా కనిపించా రా అని మండిపడ్డారు. బంగారు తెలంగాణలో ఈ 14 గ్రామాల ప్రజలను బతకనివ్వారా అని ప్రశ్నించారు. బీజేపీ ఎమ్మెల్యే రామచంద్రారెడ్డి, టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డిని గజ్వేల్‌లో, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు గౌరెడ్డి శ్రీధర్‌రెడ్డిని సంగారెడ్డిలో అరెస్ట్ చేశారు.