ఇవి సాధారణ చేరికలు కావు
♦ ప్రజల భవిష్యత్ కోసం జరుగుతున్న రాజకీయ పునరేకీకరణ: సీఎం కేసీఆర్
♦ సీఎం సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరిన బస్వరాజు సారయ్య
సాక్షి, హైదరాబాద్ : టీఆర్‌ఎస్‌లో నాయకుల చేరికలు సాధారణమైన రాజకీయ చేరికలు కావని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అన్నారు. తెలంగాణ భవిష్యత్ కోసం, రాష్ట్ర ప్రజల బాగు కోసం జరుగుతున్న రాజకీయ పునరేకీకరణగా ఆయన వాటిని అభివర్ణించారు. వరంగల్ జిల్లాకు చెందిన మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత బస్వరాజు సారయ్య మంగళవారం సీఎం కేసీఆర్ సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. ‘ఎన్నో కష్టనష్టాలకోర్చి తెలంగాణ సాధించుకున్నం. వచ్చిన తెలంగాణను గొప్పగా తీర్చిదిద్దుకోవాలి. దేశం ముందు నిలిచి గెలవాలి. అందుకే తెలంగాణ అంతా ఏకం కావాలి. రాజకీయాలు అంటే.. అయిదేళ్లకు ఓసారి ఎన్నికలు రావడం, ఒకరు ఓడడం, ఇంకొకరు గెలవడం సాధారణం. కానీ, ఇప్పుడు కావాల్సింది రాజకీయం కాదు.
తెలంగాణ వాళ్లకు పరిపాలన చేతకాదు అన్న వాళ్లకు సమాధానం చెప్పాలి...’ అని పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ తదితర వర్గాల కోసం ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నామని, ప్రజలే కేంద్ర బిందువుగా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామని తెలిపారు. ‘కరెంటు సమస్య లేకుండా చేశాం, కరువును నివారించడానికి శాశ్వత చర్యలు తీసుకుంటున్నాం, పేదలకోసం డబుల్ బెడ్‌రూం ఇళ్లు నిర్మిస్తున్నాం’ అని వివరించారు. రాజకీయ శక్తులన్నీ ఏకమై రాష్ట్ర అభివృద్ధికి ముందడుగు వేయాలని సీఎం అన్నారు. ‘బస్వరాజు సారయ్య నాకు మిత్రుడు. తెలంగాణ సాధన కోసం తన పద్ధతిలో పనిచేశారు.
ఆయనను కలుపుకొని పోతాం. యువకుడు అనిశెట్టి మురళికి కూడా స్వాగతం. వరంగల్ అభివృద్ధికి ఇప్పటికే అనేక చర్యలు తీసుకున్నాం. నగరానికి రూ.300 కోట్లు కేటాయిస్తాం. మామునూరు విమానాశ్రయాన్ని పునరుద్ధరిస్తాం. అంతా కలసి అభివృద్ధి చేసుకుందాం’ అని కేసీఆర్ చెప్పారు. టీఆర్‌ఎస్‌లో చేరిన వారిలో టీడీపీ వరంగల్ అధ్యక్షుడు అనిశెట్టి మురళి, కుడా మాజీ చైర్మన్ రామ్మోహన్, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ డాక్టర్ పోల నటరాజ్, పలువురు మాజీ కార్పొరేటర్లు, కాంగ్రెస్, టీడీపీ నాయకులు ఉన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, ఎంపీలు గుండు సుధారాణి, పసునూరి దయాకర్, ఎమ్మెల్యే కొండా సురేఖ, ఎమ్మెల్సీ కొండా మురళి పాల్గొన్నారు.
సోనియా, కేసీఆర్‌కు రుణపడి ఉంటా: బస్వరాజు సారయ్య
రాష్ట్రంలో బడుగు, బలహీన వర్గాల అభివృద్ధి కోసం కృషి చేస్తుంది ఒక్క టీఆర్‌ఎస్ మాత్రమేనని, సీఎం కేసీఆర్ నాయకత్వంలోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని విశ్వసించే టీఆర్‌ఎస్‌లో చేరానని కాంగ్రెస్ సీనియర్ నేత బస్వరాజు సారయ్య పేర్కొన్నారు. సీఎం సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. ‘తెలంగాణ ఇచ్చింది ముమ్మాటికీ సోనియా గాంధీ, జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ వల్లే అది సాధ్యమయింది, టీఆర్‌ఎస్‌లో చేరినంత మాత్రాన కాంగ్రెస్‌ను విమర్శించను’ అని బస్వరాజు చెప్పారు. వరంగల్ అభివృద్ధికి సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారని, అందుకోసం రూ.300 కోట్లు కేటాయించినందుకు సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు చెబుతున్నానని అన్నారు. సోనియా, కేసీఆర్ .. ఇద్దరికీ రుణపడి ఉంటానన్నారు.