ఖమ్మం గులాబీమయం
♦ ప్లీనరీ, బహిరంగ సభకు ఏర్పాట్లు పూర్తి
♦ తోరణాలు, కటౌట్లు, ఫ్లెక్సీలతో నిండిన నగరం
♦ 27న ఖమ్మం వచ్చే వాహనాల మళ్లింపు
సాక్షిప్రతినిధి, ఖమ్మం: ఖమ్మం గులాబీమయమైంది. ఈనెల 27న ఖమ్మం జిల్లాలో నిర్వహించే టీఆర్‌ఎస్ 15వ ఆవిర్భావ దినోత్సవం(ప్లీనరీ), బహిరంగ సభకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. నగరంలోని చెరుకూరి తోట సమీపంలో నిర్వహించే ప్రతినిధుల సభకు, సాయంత్రం ఎస్‌ఆర్ అండ్ బీజీఎన్‌ఆర్ కళాశాలలో నిర్వహించే బహిరంగ సభకు అన్నీ సిద్ధం చేశారు. జిల్లా నేతలతోపాటు టీఆర్‌ఎస్ రాష్ట్రస్థాయి ముఖ్య నేతలు దగ్గరుండి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. టీఆర్‌ఎస్ ప్లీనరీని పురస్కరించుకుని ఖమ్మం నగరమంతా గులాబీవర్ణమైంది. నగరంలో గులాబీ తోరణాలు, కటౌట్లు, ఫ్లెక్సీలతో నిండిపోయాయి.
చెరుకూరి తోట సమీపంలో ప్రతినిధులకు కావాల్సిన ఏర్పా ట్లు చేశారు. ప్లీనరీలో మంత్రులు, ఎమ్మెల్యేలు ఆశీనులయ్యేలా ముందు భాగంలో, మరోవైపు మీడియా ప్రతినిధులకు సీట్లు కేటాయించారు. వారి వెనుక భాగంలో పార్టీ నాయకులు కూర్చునేందుకు వీలుగా ఏర్పాట్లు చేస్తున్నారు. చెరుకూరి తోటలో ప్లీనరీకి హాజరయ్యే దాదాపు 4వేల మంది ప్రతినిధులకు వడ్డించేందుకు అక్కడే భోజనశాలను సిద్ధం చేశారు. ప్లీనరీ ఉదయం 10 గంటల నుంచే ప్రారంభమవుతుండటంతో మండే ఎండలను దృష్టిలో పెట్టుకుని హైదరాబాద్, విజయవాడల నుంచి ఏసీలను ప్రత్యేకంగా తెప్పించారు.
ప్లీనరీలో సీఎం కేసీఆర్‌తోపాటు మంత్రులు, ప్రజాప్రతినిధులు ఎక్కువ సమయం ఉండనుండటంతో ఈ ప్రాంతాన్ని రెండు రోజుల క్రితమే పోలీసు బలగాలు తమ అధీనంలోకి తీసుకుని జల్లెడ పడుతున్నాయి. బహిరంగ సభ వేదిక కూడా పూర్తి కావస్తోంది. సీఎంతోపాటు ఒకరిద్దరు మంత్రులు మాత్రమే మాట్లాడేలా బహిరంగ సభకు ప్రణాళిక రూపొందిస్తున్నారు. మండుతున్న ఎండలను దృష్టిలో పెట్టుకుని ఖమ్మం చుట్టుపక్కల ఉన్న పరిసర ప్రాంతాల శ్రేణులే సభకు తరలిరావాలని ఆ పార్టీ మంత్రులు పిలుపునిచ్చారు. మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, జగదీష్‌రెడ్డి, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, బాలసాని లక్ష్మీనారాయణ సభ ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు.
27న ఉదయం 8 నుంచి ట్రాఫిక్ మళ్లింపు..
ఖమ్మంలో ప్లీనరీని దృష్టిలో పెట్టుకుని పోలీస్ అధికారులు ట్రాఫిక్‌ను మళ్లించారు. 27న ఉదయం 8 నుంచి రాత్రి 10 గంటల వరకు వాహనాలను నగరం చుట్టు పక్కల ప్రాంతాల నుంచి మళ్లిస్తున్నారు. హైదరాబాద్ వెళ్లేందుకు ఖమ్మం రావాల్సిన వాహనాలను బోనకల్లు మీదుగా చిల్లకల్లుకు మళ్లించారు. హైదరాబాద్ నుంచి జిల్లాకు వచ్చే వాహనాలు సూర్యాపేట, కోదాడ, చిల్లకల్లు, బోనకల్, వైరా మీదుగా ఇతర ప్రాంతాలకు మళ్లిస్తున్నారు. బహిరంగ సభకు వచ్చే వాహనాలను ఎన్టీఆర్ సర్కిల్, ఎన్నెస్పీ కెనాల్ గెస్ట్‌హౌస్, బైపాస్ రోడ్డులోని కొత్త బస్టాండ్, ఇల్లెందు క్రాస్‌రోడ్ వద్ద ప్రజలను దించిన తర్వాత పార్కింగ్‌ల వద్దకు వెన క్కు పంపిస్తారు. గొల్లగూడెం రోడ్డులో ప్లీనరీకి వచ్చే వాహనాలను తప్ప మరే ఇతర వాహనాలను అనుమతించమని డీఎస్పీ కె.సురేష్‌కుమార్ మీడియాకు విడుదల చేసిన ఓ ప్రకటనలో పేర్కొన్నారు.