సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వ్యవసాయానికి 24 గంటల పాటు నిరంతర విద్యుత్ సరఫరాకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదేశాల మేరకు డిసెంబర్ 31 అర్ధరాత్రి 12:01 గంటలకు నిరంతర సరఫరాను ప్రారంభించి.. రైతాంగానికి నూతన సంవత్సర కానుక అందించబోతున్నారు.
24 గంటల విద్యుత్ సరఫరాపై నవంబర్ 6 నుంచి 20వ తేదీ వరకు 15 రోజులపాటు చేసిన ప్రయోగం విజయవంతమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దాదాపు 23 లక్షల వ్యవసాయ పంపుసెట్లకు విద్యుత్ అందించేలా విద్యుత్ సంస్థలు ఏర్పాట్లు చేశాయి. మొత్తంగా వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్‌తో తెలంగాణ దేశ చరిత్రలో కొత్త రికార్డు సృష్టించబోతోంది.
డిమాండ్‌కు తగినట్లుగా..
ప్రయోగాత్మక సరఫరా సమయంలో 24 గంటల కరెంటుపై విద్యుత్ సంస్థలు ఒక అంచనాకు వచ్చాయి. ఒక దశలో రోజువారీ డిమాండ్ 9,500 మెగావాట్ల వరకు వెళ్లింది. ఈ నేపథ్యంలో వ్యవసాయంతో పాటు ఇతర వర్గాలకు సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా విద్యుత్ డిమాండ్ అంచనాలను సిద్ధం చేశాయి. డిమాండ్ 11 వేల మెగావాట్ల వరకు చేరే అవకాశముందని నిర్ధారించుకుని.. అందుకు తగినట్లుగా రూ. 12,610 కోట్ల వ్యయంతో సరఫరా, పంపిణీ వ్యవస్థల సామర్థ్యం పెంపు పనులు చేపట్టాయి.
జూన్ నుంచి ఎత్తిపోతలకు కూడా..
వ్యవసాయానికి 24 గంటల కరెంటు ఇచ్చే గడువు సమీపించడంతో జెన్‌కో, ట్రాన్స్‌కో సంస్థల సీఎండీ డి.ప్రభాకర్‌రావు గురువారం హైదరాబాద్‌లో ఈ అంశంపై సమీక్షించారు. సాగుకు 24 గంటల కరెంటుతో విద్యుత్ సరఫరా గ్రిడ్‌పై ఒత్తిడి క్రమంగా పెరుగుతుందని.. మార్చి నాటికి డిమాండ్ 11 వేల మెగావాట్లు దాటుతుందని అంచనా వేశారు. అందుకు తగినట్లుగా ఏర్పాట్లు చేశామని.. పంపిణీ, సరఫరా వ్యవస్థలు సక్రమంగా నడిచేలా చూడాలని అధికారులను ఆదేశించారు. వచ్చే జూన్ నుంచి ఎత్తిపోతల పథకాలు కూడా ప్రారంభమవుతుండడంతో విద్యుత్ డిమాండ్ మరింతగా పెరుగుతుందని చెప్పారు. అందుకు తగినట్లుగా వ్యూహం తయారు చేసుకోవాలని ఆదేశించారు.
కరెంటు గోస తీరడం సంతోషకరం: కేసీఆర్
దశాబ్దాల తరబడి రైతులు అనుభవిం చిన కరెంట్ గోస తీరుతుండడం సంతోషకర మని సీఎం కె.చంద్రశేఖర్‌రావు అన్నారు. రైతులకు మేలు చేయడంకన్నా తృప్తి మరొకటి ఉండదన్నారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. ‘‘తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా ఈ కష్టాలు కొనసాగడం అర్థ రహితమని భావించాం. విద్యుత్ సరఫరా మెరుగుదలకు ప్రాధాన్య మిచ్చాం. రైతులకు 24 గంటల కరెంటు ఇవ్వడాన్ని గొప్ప అవకా శంగా భావిస్తున్నాం.
రైతులతో పాటు అన్ని వర్గాలకు 24 గంటల పాటు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలని నిర్ణయించాం. ప్రభుత్వ నిర్ణయానికి అను గుణంగా విద్యుత్ సంస్థలు, ఉద్యోగులు పని చేశారు. ఫలితంగానే అన్ని వర్గాలకు నాణ్యమైన నిరంతరా య విద్యుత్ అందించే రాష్ట్రంగా తెలంగాణను ప్రకటించు కున్నాం. విద్యు త్ సరఫరా మెరుగ్గా ఉంటేనే పరిశ్రమలు తరలివస్తాయి. పారిశ్రామికాభివృద్ధి సాధ్యం. రైతులకు సాగునీరు, ప్రజలకు తాగునీరు అందుతుంది. విద్యుత్‌తోనే అభివృద్ధి, మెరుగైన జీవితం ఆధారపడి ఉంది. ప్రస్తుత అవసరాలు తీరడంతో పాటు భవిష్యత్ అవసరాలకు తగ్గట్టు విద్యుత్ ఉత్పత్తి పెంచుతున్నాం. ఇక ఇప్పుడు తెలంగాణ కరెంట్ కోతలంటే ఏమిటో తెలియని రాష్ట్రంగా మారింది..’’అని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment