చీకటి సాగు
అర్ధరాత్రి వేళ సరఫరాతో ప్రమాదకర స్థితిలో రైతుల పాట్లు
విజయవాడ : వ్యవసాయానికి తొమ్మిది గంటల ఉచిత విద్యుత్ హామీని గాల్లో కలిపేసిన ప్రభుత్వం ప్రస్తుతం ఇస్తున్న ఏడు గంటల విద్యుత్‌నూ సక్రమంగా ఇవ్వటం లేదు. దీంతో రైతుల పాట్లు అన్నీ ఇన్నీ కావు. జిల్లాలో అసలే సాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. గత ఏడాది నవంబర్ ఐదు నాటికి విడుదల కావాల్సిన సాగునీరు నేటికీ విడుదల కాలేదు. దీంతో తూర్పు క ృష్ణాలో ఇప్పటికే సాగునీటి ఎద్దడి తీవ్రమైంది. జిల్లాలో ఎక్కువ శాతం సాగుకు బోర్లే ఆధారం.
పశ్చిమ కృష్ణాలో మామిడితో పాటు ఇతర పంటలు బోరు నీటితోనే సాగవుతున్నాయి. విద్యుత్ సరఫరాలో గ్రామాల వారీగా రొటేషన్ పద్ధతి అమలు చేస్తున్నారు. దీంతో అర్ధరాత్రి వేళ ప్రమాదకర పరిస్థితుల్లో అన్నదాతలు పొలాల్లో పడిగాపులు పడుతున్నారు. రైతుల ఇబ్బందులపై ‘సాక్షి’ పరిశీలన చేయగా వారి దయనీయ స్థితి వెలుగుచూసింది.