కరెంటుకు కోతలే
- డిస్కంల ఆదాయ లోటే రూ.6,831 కోట్లు.. సబ్సిడీలు రూ.4470.1 కోట్లకే పరిమితం
- ‘థర్మల్’ పెట్టుబడి, ‘సహాయ’ నిధులకు మంగళం
- సౌర విద్యుత్, బోరుబావుల విద్యుదీకరణా అంతే
సాక్షి, హైదరాబాద్: విద్యుత్ రంగానికి బడ్జెట్లో సర్కారు భారీగా కోత పెట్టింది. వ్యవసాయ విద్యుత్ సబ్సిడీని నామమాత్రంగా పెంచి, విద్యుదుత్పత్తి సంస్థ జెన్‌కోకు ఆర్థిక సాయానికి, కొత్త థర్మల్ విద్యుత్ ప్రాజెక్టుల్లో ప్రభుత్వ పెట్టుబడి కేటాయింపులకు పూర్తిగా మంగళం పాడింది. ఇంధన శాఖకు గత బడ్జెట్లో రూ.7,999.96 కోట్ల కేటాయింపులు జరపగా, తాజా బడ్జెట్‌లో రూ.5,341.45 కోట్లతో సరిపెట్టింది. వ్యవసాయ విద్యుత్ సబ్సిడీలకు గత బడ్జెట్‌లో జరిపిన రూ.4,257.24 కోట్ల కేటాయింపులను రూ.3,192.93 కోట్లకు తగ్గిస్తూ తాజాగా సవరణలు చేసింది. తాజా బడ్జెట్‌లో రూ.4,470.10 కోట్లు కేటాయించింది. సోలార్ పంపు సెట్లు, సౌర విద్యుత్ పథకం, బోరుబావుల విద్యుదీకరణ పథకాలకు నిధులే కేటాయించలేదు.
డిస్కంలకేదీ భరోసా?
విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లు ఇటీవల ఈఆర్‌సీకి సమర్పించిన వార్షిక ఆదాయ అవసరాల (ఏఆర్‌ఆర్) నివేదికలో 2016-17లో మొత్తం రూ.30,207 కోట్ల ఖర్చులను చూపాయి. ఆదాయం రూ.21,418 కోట్లు వస్తుందని, విద్యుత్ చార్జీల పెంపుతో రూ.1,958 కోట్ల అదనపు ఆదాయం వస్తుందని చూపాయి. మిగతా రూ.6,831 కోట్ల లోటును వ్యవసాయ విద్యుత్ సబ్సిడీలతో భర్తీ చేయాల్సిన ప్రభుత్వం అందుకు రూ.4470.10 కోట్లే కేటాయించింది.
వచ్చే ఖరీఫ్ నుంచి వ్యవసాయానికి పగలే 9 గంటల నిరంతర విద్యుత్ ఇస్తామని బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి ఈటల పునరుద్ఘాటించారు. ఇందుకు కావాల్సిన 5,400 మిలియన్ యూనిట్ల అదనపు విద్యుత్ సరఫరాకు రూ.4,000 కోట్ల దాకా కావాలి. ఈ అదనపు వ్యయ అంచనాలను ఏఆర్‌ఆర్‌లో డిస్కంలు చూపలేదు. 2014-15, 2015-16 నష్టాలను ‘ట్రూ అప్’ పద్ధతిన 2016-17లో రికవరీ చేయాలని నిబంధనలు పేర్కొంటున్నాయి. కానీ, రూ.1,500 కోట్ల వరకు ఉండే ఈ ఖర్చులను సైతం డిస్కంలు చూపలేదు. ఈ భారాలన్నీ కలిపి డిస్కంల నష్టాలు రూ.13 వేల కోట్ల దాకా ఉంటాయని నిపుణుల అంచనా. ఇందులో సబ్సిడీ పోగా మిగతా రూ.5,700 కోట్ల నష్టాలను అధిగమించడం సవాలే.
జెన్‌కోకు నిధులు కోత
గతేడాది బడ్జెట్‌లో జెన్‌కో భారీగా నిధులు కేటాయించిన ప్రభుత్వం ఈసారి రిక్తహస్తం చూపింది. విద్యుదుత్పత్తి కోసం గత బడ్జెట్ అంచనాల్లో రూ.1000 కోట్ల కేటాయింపులు కేటాయించి ఆ తర్వాత సవరణ అంచనాల్లో రూ.850 కోట్లకు కుదించింది. రాష్ట్రంలో భారీగా నిర్మిస్తున్న కొత్త థర్మల్ విద్యుత్కేంద్రాలకు గత బడ్జెట్ అంచనాల్లో కేటాయించిన రూ.1000 కోట్ల పెట్టుబడి నిధులను రూ.573.45 కోట్లకు తగ్గించింది. విద్యుదుత్పత్తి అవసరాలు, పెట్టుబడి గ్రాంట్ల కింద కూడా జెన్‌కోకు ఎలాంటి కేటాయింపులూ జరపలేదు. సబ్సిడీపై సోలార్ పంపు సెట్ల పంపిణీకి గత బడ్జెట్లో రూ.150 కోట్లు, సౌర విద్యుత్ పథకం కింద రూ.30 కోట్లు కేటాయించగా ఈసారి వాటికి పూర్తిగా మంగళం పాడింది. ట్రాన్స్‌కో, డిస్కంలకు రుణ సాయాన్ని మాత్రం రూ.150 కోట్ల నుంచి రూ.190 కోట్లకు పెంచింది.