మార్చి నుంచి కోతలు లేని కరెంట్ : ఈటెల
జమ్మికుంట : వచ్చే మార్చి వరకు తెలంగాణ ప్రాంతంలో గృహావసరాలకు కోతలు లేని కరెంట్ సరఫరా చేస్తామని మంత్రి ఈటెల రాజేందర్ స్పష్టం చేశారు. తెలంగాణలో 2017 వరకు 20 వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తితో కరెంట్ సమస్యనే లేకుండా చేస్తామని వెల్లడించారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం కొత్తపల్లిలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. తెలంగాణలో కరెంట్ కోతలకు ఆంధ్రా పాలకులే కారణమని మండిపడ్డారు.
తెలంగాణ లో ప్రస్తుతం 7,981 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి వర్షాలు, నీళ్లు లేక 3వేల మెగావాట్ల ఉత్పత్తి తగ్గిందని, దీంతోనే కరెంటు కోతలు అధికమవుతున్నాయని వెల్లడించారు. 2015 మార్చి వరకు ఉత్పత్తిని పెంచి కరెంట్ కోతలు లేకుండా చూస్తామని స్పష్టం చేశారు. 2017 వరకు రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తిని 20 వేల మెగావాట్లకు పెంచి, పరిశ్రమలకు, వ్యవసాయానికి కూడా కావలసినంత విద్యుత్ అందిస్తామన్నారు.