మళ్లీ విద్యుత్ కోతలు
నగరంలో 4 గంటలు కోత విధిస్తున్నట్లు ఎస్పీడీసీఎల్ ప్రకటన
అనధికారికంగా రాష్ట్రవ్యాప్తంగా అమలు!
జిల్లా కేంద్రాల్లో 6, మండల కేంద్రాల్లో 8, గ్రామాల్లో 12 గంటల మేర కట్
పరిశ్రమలకూ వారంలో ఒక రోజు కోత!
భారీగా తగ్గిపోయిన జల విద్యుత్.. థర్మల్ కేంద్రాల్లోనూ నిలిచిపోయిన ఉత్పత్తి
డిమాండ్ 155 ఎంయూ.. సరఫరా 143 ఎంయూ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో విద్యుత్ కోతలు మళ్లీ మొదలయ్యాయి. జల విద్యుత్‌తో పాటు థర్మల్ విద్యుత్ కేంద్రాల్లోనూ ఉత్పత్తి తగ్గిపోవడంతో.. కోతలు అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. గురువారం నుంచి హైదరాబాద్‌లో నాలుగు గంటలపాటు అధికారికంగా విద్యుత్ కోతలు విధిస్తున్నట్టు తెలంగాణ రాష్ట్ర దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్ ఎస్పీడీసీఎల్) ప్రకటించింది. అయితే అధికారికంగా ప్రకటించనప్పటికీ.. జిల్లా, మండల కేంద్రాలతో పాటు గ్రామాల్లో కూడా కోతలు అమలు చేయనున్నట్లు సమాచారం. జిల్లా కేంద్రాల్లో 6 గంటలు, మండల కేంద్రాల్లో 8 గంటల పాటు కోతలు అమలు కానున్నాయి. ఇక గ్రామాల్లోనైతే ఇప్పటికే ఏకంగా 12 గంటల పాటు కోతలు అమలు చేస్తున్నారు. అనధికారికంగా రాత్రి సమయాల్లో కూడా విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నారు. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వ్యవసాయానికి విద్యుత్ సరఫరా పరిస్థితి కూడా ఇదే విధంగా ఉంది. తెలంగాణలో విద్యుత్ డిమాండ్ మంగళవారం నాటికి 155 మిలియన్ యూనిట్ల (ఎంయూ)కు చేరుకుంది. సరఫరా మాత్రం 143 ఎంయూలకు పరిమితమయ్యింది. మిగతా 12 ఎంయూ మేరకు అనధికారికంగా కోతలు అమలు చేశారు. విద్యుత్ డిమాండ్ ఇంకా పెరిగితే పరిశ్రమలకు కూడా వారంలో ఒక రోజు పాటు కోత పెట్టే అవకాశం ఉందని ఇంధనశాఖ వర్గాలు తెలిపాయి.
తగ్గిపోయిన జల విద్యుత్!
రాష్ట్రంలోని రిజర్వాయర్లలో నీటి చేరిక తగ్గిపోవడంతో... విద్యుత్ ఉత్పత్తి బాగా తగ్గిపోయింది. తెలంగాణ, ఏపీలు కలిపి కూడా శ్రీశైలం ప్రాజెక్టు నుంచి రోజుకు 25 వేల క్యూసెక్కుల నీటిని మాత్రమే వాడుకోవాలని బోర్డు నిర్ణయించింది. దీంతో తెలంగాణ 12,500 క్యూసెక్కుల నీటిని మాత్రమే ఉపయోగించి విద్యుత్ ఉత్పత్తి చేసుకోవాల్సి వస్తోంది. ఈ నీటితో 6 ఎంయూ విద్యుత్ మాత్రమే ఉత్పత్తి అవుతుంది. దీన్ని కూడా సాయంత్రం 6 నుంచి రాత్రి 10 మధ్య (పీక్ అవర్స్‌లో) మాత్రమే ఉత్పత్తి చేసుకోవాలని ఇంధనశాఖ నిర్ణయించింది. మరోవైపు నాగార్జునసాగర్ నుంచి ఒక్క క్యూసెక్ నీటిని కూడా విడుదల చేయవద్దని బోర్డు తీర్మానించింది. తద్వారా ఇక్కడ పూర్తిగా విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. ఇటీవలి వరకూ శ్రీశైలంలో 900 మెగావాట్లు, సాగర్‌లో సుమారు 700 మెగావాట్ల మేరకు విద్యుత్ ఉత్పత్తి జరిగింది. కానీ బుధవారం నుంచి కేవలం 250 మెగావాట్ల (6 ఎంయూ)కే పరిమితం కావాల్సి వస్తోంది. మరోవైపు ఎన్టీపీసీకి చెందిన రెండు యూనిట్లలో (1000 మెగావాట్లు) బొగ్గు లేక విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోవడంతో... అక్కడి నుంచి తెలంగాణకు రావాల్సిన వాటా ఆగిపోయింది. ఇక సింగరేణి నుంచి వస్తున్న బొగ్గులో రాళ్లు కలిసి వస్తుండడంతో.. టీ జెన్‌కోకు చెందిన కేటీపీఎస్ 50 శాతం లోడు ఫ్యాక్టర్ (పీఎల్‌ఎఫ్)తో మాత్రమే నడుస్తోంది. దీంతో రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ నేపథ్యంలో నాణ్యమైన బొగ్గును పంపాలంటూ సింగరేణి సీఎండీ సుతీర్థ భట్టాచార్యకు టీ జెన్‌కో సీఎండీ డి.ప్రభాకర్‌రావు బుధవారం లేఖ రాశారు.
ఏపీపై తెలంగాణ ఫిర్యాదు..
శ్రీశైలం ప్రాజెక్టు నుంచి రోజుకు 25 వేల క్యూసెక్కులకు మించి నీటిని వినియోగించవద్దన్న ఆదేశాలున్నప్పటికీ.. ఏపీ ప్రభుత్వం బుధవారం శ్రీశైలం కుడిగట్టు కేంద్రంలో పూర్తిస్తాయిలో విద్యుత్‌ను ఉత్పత్తి చేసింది. దీంతో ఏపీపై కృష్ణా బోర్డుకు తెలంగాణ ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో గురువారం నుంచి ఏపీ పరిధిలో విద్యుత్ ఉత్పత్తిని తగ్గించనున్నట్లు తెలుస్తోంది.