కేసీఆర్‌కు గత ఏప్రిల్‌లోనే నోటీసులు జారీ: జస్టిస్‌ నరసింహారెడ్డి | Justice Narasimha Reddy says Notices issued to KCR | Sakshi
Sakshi News home page

కేసీఆర్‌కు గత ఏప్రిల్‌లోనే నోటీసులు జారీ: జస్టిస్‌ నరసింహారెడ్డి

Published Wed, Jun 12 2024 4:48 AM | Last Updated on Wed, Jun 12 2024 4:51 AM

Justice Narasimha Reddy says Notices issued to KCR

విద్యుత్‌ రంగ నిర్ణయాల్లో పాత్రపై జారీ చేశామన్న జస్టిస్‌ నరసింహారెడ్డి

మాజీ సీఎం సహా 25 మందికి గత ఏప్రిల్‌లోనే నోటీసులు ఇచ్చాం 

కేసీఆర్‌ మినహా అందరూ రాతపూర్వకంగా బదులిచ్చారు 

లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో జూలై 31 వరకు ఆయన గడువు కోరారు 

జూన్‌ 15లోగా ఇవ్వాలని చెప్పాం..కానీ ఇప్పటివరకు వివరణ అందలేదు 

నిర్ణయాలన్నీ గత సర్కార్‌వేనని ట్రాన్స్‌కో, జెన్‌కో మాజీ సీఎండీ చెప్పారు 

ఛత్తీస్‌గఢ్‌ ఒప్పందంతో రాష్ట్రం భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది 

భద్రాద్రిలో సబ్‌ క్రిటికల్‌ టెక్నాలజీతో ఏటా రూ.300 కోట్ల అదనపు భారం 

ఛత్తీస్‌గఢ్‌ విద్యుత్‌ ఒప్పందం, యాదాద్రి, భద్రాద్రి విద్యుత్‌ కేంద్రాల 

నిర్మాణంపై విచారణ జరుపుతున్న జస్టిస్‌ నరసింహారెడ్డి కమిషన్‌

సాక్షి, హైదరాబాద్‌: కాంపిటీటివ్‌ బిడ్డింగ్‌కి బదులుగా నామినేషన్ల ప్రాతిపదికన ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంతో విద్యుత్‌ కొనుగోలు ఒప్పందం కుదుర్చుకోవడం, యాదాద్రి, భద్రాద్రి థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాలు నిర్మించాలని నిర్ణయం తీసుకోవడంలో పాత్రపై మాజీ సీఎం కె.చంద్రశేఖర్‌రావుకు గత ఏప్రిల్‌లో నోటీసులు జారీ చేసినట్లు జస్టిస్‌ ఎల్‌.నరసింహారెడ్డి తెలిపారు. కేసీఆర్‌ సహా మొత్తం 25 మంది అధికారులు, అనధికారులకు నోటీసులు జారీ చేసినట్లు వెల్లడించారు. విద్యుత్‌ కొనుగోలు ఒప్పందంతో పాటు విద్యుత్‌ కేంద్రాల నిర్మాణంపై జస్టిస్‌ నరసింహారెడ్డి కమిషన్‌ విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే. 

ఈ క్రమంలో ఇప్పటికే రాష్ట్ర ఇంధన శాఖ మాజీ ముఖ్య కార్యదర్శులైన సురేష్‌ చందా, ఎస్‌కే జోషీ, అరవింద్‌కుమార్‌లతో పాటు ట్రాన్స్‌కో, జెన్‌కో మాజీ సీఎండీ డి.ప్రభాకర్‌రావు, బీహెచ్‌ఈఎల్‌ మాజీ సీఎండీ, ప్రస్తుత సీఎండీలను విచారించారు. ఈ నేపథ్యంలో జస్టిస్‌ నరసింహారెడ్డి   మంగళవారం బీఆర్‌కేఆర్‌ భవన్‌లోని కమిషన్‌ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.  

జగదీశ్‌రెడ్డికి నోటీసులు ఇవ్వలేదు 
‘విద్యుత్‌ నిర్ణయాలకు సంబంధించిన ఫైళ్ల పరిశీలనలో మీ పాత్రను గుర్తించామని, దీనిపై వివరణ ఇవ్వాలని కోరుతూ అందరికీ నోటీసులు ఇచ్చాం. కేసీఆర్‌ మినహా నోటీసులు అందుకున్న మిగతా వారంతా గడువులోగా తమ పాత్రపై రాతపూర్వకంగా వివరణ అందజేశారు. లోక్‌సభ ఎన్నికల్లో తీరిక లేకుండా ఉన్నానని, జూలై 31 వరకు గడువు పొడిగించాలని కేసీఆర్‌ విజ్ఞప్తి చేయగా, జూన్‌ 15 వరకు కమిషన్‌ గడువు పొడిగించింది. 

అయితే ఇప్పటికీ కేసీఆర్‌ నుంచి వివరణ అందలేదు. కొందరి వివరణలు సంతృప్తికరంగా లేకపోవడంతో అదనపు సమాచారం కోరు తూ మళ్లీ నోటీసులు జారీ చేశాం. నిర్ణయాల్లో అప్పటి విద్యుత్‌ శాఖ మంత్రి జి.జగదీశ్‌రెడ్డి పాత్ర ఉన్నట్టుగా ఎలాంటి ప్రస్తావన లేకపోవడంతో ఆయనకు నోటీసులు జారీ చేయలేదు..’ అని జస్టిస్‌ నరసింహారెడ్డి తెలిపారు.  


ఎవరు నిర్ణయం తీసుకున్నారో పరిశీలిస్తున్నాం  
‘ఛత్తీస్‌గఢ్‌ విద్యుత్‌ ఒప్పందం, యాదాద్రి, భద్రాద్రి విద్యుత్‌ కేంద్రాల నిర్మాణం అంశాల్లో నిర్ణయం ఎవరు తీసుకున్నారు? అనే అంశంపై విచారణ నిర్వహిస్తున్నాం. నిర్ణయాల్లో పాత్రలేని అధికారులు ఒక్కొక్కరిని తప్పించడం (ఎలిమినేషన్‌) ద్వారా అసలు నిర్ణయం తీసుకున్న వారెవరో గుర్తించడానికి ప్రయత్నిస్తున్నాం. మూడు అంశాల్లోనూ నాటి ప్రభుత్వం నేరుగా నిర్ణయాలు తీసుకుందని జెన్‌కో, ఇతర విద్యుత్‌ సంస్థల పాత్ర లేదని ట్రాన్స్‌కో, జెన్‌కో మాజీ సీఎండీ డి.ప్రభాకర్‌రావు చెప్పారు. ఇక్కడ ప్రభుత్వం అంటే.. నిర్ణయం తీసుకుంది ఎవరు? అనే అంశం పరిశీలిస్తున్నాం..’ అని చెప్పారు.  

ఛత్తీస్‌గఢ్‌ ఈఆర్సీకి అధికారాలు పెద్ద తప్పిదం 
‘ఛత్తీస్‌గఢ్‌ విద్యుత్‌ కొనుగోలు ఒప్పందంతో రాష్ట్రం భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచి్చనట్టుగా మా లెక్కల్లో తేలింది. ఒప్పందంపై కేంద్ర విద్యుత్‌ నియంత్రణ మండలి (సీఈఆర్సీ)కి బదులుగా ఛత్తీస్‌గఢ్‌ ఈఆర్సీకి సర్వ అధికారాలు కట్టబెట్టడం పెద్ద తప్పిదం. 12 ఏళ్లకు ఒప్పందం జరిగితే, ఛత్తీస్‌గఢ్‌ కేవలం మూడు నాలుగేళ్లు మాత్రమే విద్యుత్‌ సరఫరా చేసి మానుకుంది. 

ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం నుంచి 1000 మెగావాట్ల విద్యుత్‌ కొనుగోలు చేయడానికి 2014లో ఆ రాష్ట్ర ప్రభుత్వంతో తెలంగాణ ప్రభుత్వం అవగాహన ఒప్పందం (ఎంఓయూ) చేసుకోగా, నాటి రాష్ట్ర ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్‌కే జోషీ దీనిపై సంతకం చేశారు. అయితే ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి ప్రమేయం లేకుండానే 2016లో విద్యుత్‌ కొనుగోలు ఒప్పందం (పీపీఏ) జరిగింది. జీఎస్పీడీసీఎల్‌/టీజీఎన్పీడీసీఎల్‌ సీఎండీలు దీనిపై సంతకం పెట్టారు. అయితే అప్పటికి ఛత్తీస్‌గఢ్‌లో థర్మల్‌ విద్యుత్‌ కేంద్రం (మార్వా) నిర్మాణమే ప్రారంభం కాలేదని మా పరిశీలనలో తేలింది..’ అని జస్టిస్‌ నరసింహారెడ్డి తెలిపారు. 

చర్యలు తీసుకోని ఈఆర్సీ 
‘ఛత్తీస్‌గఢ్‌ ఒప్పందంతో తనకు ఎలాంటి సంబంధం లేదని అరవింద్‌కుమార్‌ వివరణ ఇచ్చారు. నామినేషన్‌ విధానంలో ఛత్తీస్‌గఢ్‌ నుంచి విద్యుత్‌ కొనుగోలు ఒప్పందం చేసుకుంటే రాష్ట్రానికి తీవ్ర నష్టం జరుగుతుందని, దీనికి బదులుగా విద్యుత్‌ కొనుగోళ్ల కోసం బహిరంగ టెండర్లను నిర్వహిస్తే బాగుంటుందని పేర్కొంటూ అరవింద్‌కుమార్‌ 2016 నవంబర్‌ చివరలో రాష్ట్ర ఈఆర్సీకి సుదీర్ఘ లేఖ రాయగా, ఈఆర్సీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని తేలింది. ఈ లేఖ రాసిన వెంటనే తాను ఇంధన శాఖ నుంచి బదిలీకి గురైనట్టు అరవింద్‌కుమార్‌ తెలిపారు. 

2000 మెగావాట్ల విద్యుత్‌ను దక్షిణాది రాష్ట్రాల నుంచి కొనుగోలు చేసేందుకు అనుమతిస్తూ ఎస్‌కే జోషి తొలుత జీవో 22 జారీ చేశారు. ఆ తర్వాత కొన్ని రోజులకే ఛత్తీస్‌గఢ్‌ నుంచి విద్యుత్‌ కొనుగోళ్లకు వీలు కలి్పంచేలా ఈ జీవోను సవరిస్తూ దేశంలో ఎక్కడి నుంచైనా విద్యుత్‌ కొనుగోలు చేసేందుకు అనుమతించారు. 1000 మెగావాట్ల ఛత్తీస్‌గఢ్‌ విద్యుత్‌ కోసం 2000 మెగావాట్ల విద్యుత్‌ కారిడార్‌ను బుక్‌ చేసుకున్నారు. అందులో 1000 మెగావాట్ల లైన్లను కూడా ఎన్నడూ పూర్తిగా వాడుకోలేదు..’ అని వివరించారు.  

సూపర్‌ క్రిటికల్‌కి బదులుగా సబ్‌ క్రిటికల్‌ టెక్నాలజీతో ‘భద్రాద్రి’  
‘ఉత్తర భారత దేశంలో నిర్మించతలపెట్టిన థర్మల్‌ విద్యుత్‌ కేంద్రం అవసరాల కోసం బీహెచ్‌ఈఎల్‌ తయారు చేసిన జనరేటర్లు, బాయిలర్లు నిరుపయోగంగా ఉండడంతో వాటిని తీసుకొచ్చి 1080 మెగావాట్ల సబ్‌ క్రిటికల్‌ థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాన్ని నిర్మించినట్టు మా పరిశీలనలో తేలింది. సూపర్‌ క్రిటికల్‌కి బదులుగా సబ్‌ క్రిటికల్‌ టెక్నాలజీతో భద్రాద్రి విద్యుత్‌ కేంద్రం నిర్మించడంతో బొగ్గు వాడకం పెరిగి ఏటా రూ.250 కోట్ల నుంచి రూ.300 కోట్ల వరకు వ్యయం పెరిగింది. బొగ్గు వాడకం పెరగడంతో పర్యావరణ కాలుష్యం కూడా పెరిగింది. 

25 ఏళ్ల పాటు అధిక వ్యయం, కాలుష్యాన్ని భరించాల్సి ఉంటుంది. తెలంగాణ వచ్చాక కొత్తగూడెంలో 800 మెగావాట్ల కొత్త థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాన్ని సూపర్‌ క్రిటికల్‌ టెక్నాలజీతో రికార్డు కాలంలో నిర్మించారు. యాదాద్రి థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాన్ని సైతం సూపర్‌ క్రిటికల్‌ టెక్నాలజీతోనే నిర్మిస్తున్నారు. కానీ భద్రాద్రి కేంద్రాన్ని సబ్‌ క్రిటికల్‌ టెక్నాలజీతో నిర్మించారు. సబ్‌ క్రిటికల్‌ టెక్నాలజీతో భద్రాద్రి నిర్మించాలని నేరుగా ప్రభుత్వం నుంచే నిర్ణయం వెలువడిందని, ఇందులో తమ పాత్ర లేదని ప్రభాకర్‌ రావు చెప్పారు.  

ఈఆర్సీ మాజీ చైర్మన్‌ను విచారించేందుకు వీలుండదు 
త్వరలో మరో మాజీ ముఖ్య కార్యదర్శి అజయ్‌ మిశ్రాను విచారిస్తామని, టీజేఏసీ చైర్మన్‌ కె.రఘు, టీజేఎస్‌ అధినేత కోదండరాం, విద్యుత్‌ రంగ నిపుణులు వేణుగోపాల్‌ రావును కూడా పిలిపించి వారి వద్ద ఉన్న సమాచారాన్ని తెలుసుకుంటామని జస్టిస్‌ నరసింహారెడ్డి చెప్పారు. ఈఆర్సీ మాజీ చైర్మన్‌ను విచారించేందుకు వీలుండదని ఆయన ఓ ప్రశ్నకు బదులిచ్చారు.  

యాదాద్రి ఇప్పట్లో పూర్తయ్యేలా లేదు
యాదాద్రి, భద్రాద్రి కేంద్రాలను రెండేళ్లలో నిర్మిస్తామని చెప్పి గడువులోగా పూర్తి చేయలేకపోయారు. యాదాద్రి కేంద్రాన్ని ఇటీవల సందర్శించగా, సమీప భవిష్యత్తులో పూర్తయ్యే పరిస్థితి కనిపించలేదు. కాంపిటీటివ్‌ బిడ్డింగ్‌ ద్వారా టెండర్లు నిర్వహించకుండా బీహెచ్‌ఈఎల్‌కు నామినేషన్ల విధానంలో వీటి పనులు అప్పగించారు. 

బీహెచ్‌ఈఎల్‌ మాజీ, ప్రస్తుత సీఎండీలను పిలిపించి విచారించగా, అవకతవకలు జరిగినట్టు అనుమానాలు ఉన్న అంశాల (గ్రే ఏరియాస్‌)పై పరిశీలన జరుపుతామని బదులిచ్చారు. తాను స్వల్పకాలం పాటే ఇంధన శాఖలో పనిచేశానని, అప్పట్లో ఎలాంటి నిర్ణయాలు జరగలేదని, కేవలం ఉత్తర ప్రత్యుత్తరాలు జరిగాయని సురేష్‌ చందా చెప్పారు..’ అని జస్టిస్‌ నరసింహారెడ్డి వెల్లడించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement