Justice Narasimha Reddy
-
విద్యుత్ కమిషన్ చైర్మన్ జస్టిస్ నరసింహారెడ్డి కీలక వ్యాఖ్యలు
-
అందుకే ప్రెస్ మీట్ నిర్వహించా: జస్టిస్ నరసింహారెడ్డి
ఢిల్లీ, సాక్షి: విచారణ కమిషన్లు వేసేదే ప్రజలకు అన్ని విషయాలు తెలియాలని, అలాంటిది తనపై అబద్ధాలు ప్రచారం చేశారని జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి అన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకే పవర్ కమిషన్ చైర్మన్ తప్పుకున్నట్లు చెప్పిన ఆయన.. సాక్షితో మాట్లాడారు.విచారణ కమిషన్ చైర్మన్‌గా బాధ్యతలు తీసుకున్నాక కొన్ని ఊహాగానాలకు చెక్‌పెట్టేందుకే ప్రెస్ మీట్ పెట్టాను. పైగా ఆ ప్రెస్ మీట్లో ఎక్కడా నా అభిప్రాయం చెప్పలేదు. సీఎం రేవంత్‌రెడ్డితో భేటీ అయినట్లు ప్రచారం జరిగింది. కనీసం ఆయనతో ఫోన్లో కూడా మాట్లాడలేదు. పవర్ కమిషన్ విచారణలో ఎవరికీ నోటీసులు ఇవ్వలేదు. కమిషన్ తరఫున 28 మందికి లేఖలు రాశా. కేసీఆర్ తప్ప అంతా తమ అభిప్రాయాలు చెప్పారు. వన్ ర్యాంక్.. వన్ పెన్షన్ కమిషన్‌లో నేను పని చేశా. అలాంటిది విచారణ కమిషన్ చైర్మన్ పదవి నుంచి తప్పుకోమని కేసీఆర్ లేఖ రాశారు. ఆ లేఖలోనూ సమాజం అంగీకరించని భాష వాడారు. ఎన్నో కమిషన్ చైర్మన్లు ప్రెస్ మీట్లు పెట్టినా రాని అభ్యంతరం నాపైనే ఎందుకు వచ్చిందో తెలియడం లేదు.అందరి అభిప్రాయాలు తీసుకుని నేను నివేదిక కూడా సిద్ధం చేశా. నేను ఇచ్చే రిపోర్ట్ నా వ్యక్తిగతం.. దానిపై ఎవరికీ హక్కులేదు. కమిషన్ ఇచ్చే నివేదికను ప్రభుత్వం అంగీకరించొచ్చు.. అంగీకరించకపోవచ్చు. ఆ ఇచ్చిన రిపోర్ట్‌ను తప్పని ఎవరైనా సవాల్ చేయొచ్చు అని అన్నారాయన. అంతకు ముందు..కేసీఆర్ పిటిషన్‌పై ఇవాళ హైకోర్టులో విచారన సందర్భంగా అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. విచారణ కమిషన్ చైర్మన్ పదవి నుంచి తాను తప్పుకుంటున్నట్లు జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి ఇచ్చిన లేఖను తెలంగాణ ప్రభుత్వం తరఫున న్యాయవాది సుప్రీం బెంచ్‌కు సమర్పించారు. -
పవర్ కమిషన్ కు మాజీ సీఎం కేసీఆర్ రాసిన లేఖపై చర్చ
-
అసాధారణ పరిస్థితుల్లోనే నిర్ణయాలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన కొత్తలో ఇక్కడ నెలకొన్న అసాధారణ విద్యుత్ సంక్షోభాన్ని దృష్టిలో పెట్టుకునే కొన్ని అసాధారణ నిర్ణయాలు తీసుకున్నట్టు బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ సీఎం కె.చంద్రశేఖర్‌రావు స్పష్టం చేశారు. ఈ మేరకు విద్యుత్ కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ చైర్మన్ జస్టిస్ నరసింహారెడ్డికి రాసిన లేఖలో వివరాలను వెల్లడించారు. ఛత్తీస్‌గఢ్ నుంచి విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు, యాదాద్రి, భద్రాద్రి థర్మల్ ప్లాంట్ల నిర్మాణం వెనుక ఉన్న అంశాలను వివరించారు.ఆ అంశాలు కేసీఆర్ మాటల్లోనే.. ‘‘మా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్లే తెలంగాణలో అన్ని రంగాలకు నాణ్యమైన, నిరంతర విద్యుత్ సరఫరా జరిగి.. వ్యవసాయ, ఐటీ, పారిశ్రామిక ప్రగతి సాధించాయి. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ సమయంలో సుమారు 5వేల మెగావాట్ల విద్యుత్ కొరత ఉండగా.. మా ప్రభుత్వ కఠోర శ్రమతో విద్యుత్ రంగంలో స్వయంవృద్ధి సాధించింది. 2014 నాటికి దేశంలో 90శాతం సబ్ క్రిటికల్ థర్మల్ ప్లాంట్లే ఉంటే.. తెలంగాణ ప్రభుత్వం ఒక్కటే ఆ తరహాలో భద్రాద్రి ప్లాంట్ చేపట్టినట్టు చెప్పడం సరికాదు.బీహెచ్ఈఎల్తో సంప్రదింపులు జరిపి పెట్టుబడి వ్యయం రూ.400 కోట్లు తగ్గించినందునే భద్రాద్రి ప్లాంటు పనులు ప్రారంభమయ్యాయి. రెండేళ్లలోనే ప్లాంట్ సిద్ధం చేస్తామని బీహెచ్ఈఎల్ లిఖిత పూర్వకంగా హామీ ఇచి్చనందునే.. అధిక ధరల భారం రాష్ట్రం మీద పడకుండా నామినేషన్ పద్ధతిలో పనులు అప్పగించాం. ఆర్థికాభివృద్ధి కోసమే యాదాద్రి ప్లాంట్ తెలంగాణలో ప్రభుత్వం నిర్మించిన థర్మల్ విద్యుత్ కేంద్రాలన్నీ గోదావరి నది తీరంలోనే ఉన్నాయి. రాష్ట్ర దక్షిణ ప్రాంతంలోని మహబూబ్‌నగర్, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాల్లో ఒక్క భారీ విద్యుత్కేంద్రం లేదు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల మధ్య మౌలిక సదుపాయాల కల్పనలో ప్రాంతీయ సమతుల్యత సాధించడం ప్రభుత్వాల ప్రాథమిక కర్తవ్యం. వీటిన్నింటినీ పరిగణనలోకి తీసుకుని అప్పటి ప్రభుత్వం నల్లగొండ జిల్లాలోని దామరచర్లను ఉద్దేశపూర్వకంగానే యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంటు నిర్మాణానికి ఎంపిక చేసింది.దామరచర్లకు సమీపంలో ఉన్న కృష్ణపట్నం, బందరు (మచిలీపట్నం) రేవుల నుంచి అత్యవసర పరిస్థితుల్లో బొగ్గును దిగుమతి చేసుకునే అవకాశం ఉంది. దామరచర్లకు జాతీయ రహదారి, రైల్వే లైన్ సమీపంలో ఉన్నందున రవాణా సమస్యలు ఉండవు. నాగార్జునసాగర్ టెయిల్ పాండ్ నుంచి ప్లాంటుకు అవసరమయ్యే నీరు ఎల్లవేళలా అందుబాటులో ఉంటుంది. ఈ ప్లాంటు నుంచి వెలువడే ఫ్లైయాష్‌ను స్థానిక సిమెంటు పరిశ్రమలు వినియోగించుకుంటాయి. ప్రభుత్వ రంగ సంస్థ బీహెచ్ఈఎల్ మేలును కోరే యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంటును పనులను నామినేషన్ పద్ధతిపై అప్పగించాం.తీవ్ర సంక్షోభం ఉన్నందునే ఛత్తీస్‌గఢ్ విద్యుత్ 2014లో తెలంగాణ ఏర్పాటుతో ఎదుర్కొన్న కరెంటు సంక్షోభాన్ని దృష్టిలో పెట్టుకుని ఛత్తీస్‌గఢ్ నుంచి వెయ్యి మెగావాట్ల విద్యుత్ కొనుగోలుకు తెలంగాణ అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. నాటి పరిస్థితుల్లో ఛత్తీస్‌గఢ్ విద్యుత్ సంస్థలతో ఒప్పందాలు (పీపీఏ) చేసుకోవడం, వాటిని సమరి్పంచి పవర్ గ్రిడ్ కార్పొరేషన్ వద్ద 2 వేల మెగావాట్ల కారిడార్ బుక్ చేసుకోవడం తప్ప తెలంగాణ ప్రభుత్వానికి, విద్యుత్ సంస్థలకు మరో మార్గం లేదు.ఛత్తీస్‌గఢ్ నుంచి విద్యుత్ సరఫరా ప్రారంభమైన తర్వాత వెయ్యి మెగావాట్ల కారిడార్ ఉపయోగించుకుని, మరో వెయ్యి మెగావాట్ల కారిడార్ ఒప్పందాన్ని రద్దు చేసుకున్నాం. ఈ రద్దు ద్వారా తెలంగాణ రాష్ట్ర విద్యుత్ సంస్థలకు ఎలాంటి ఆర్థిక నష్టం వాటిల్లలేదు. ఛత్తీస్‌గఢ్ నుంచి విద్యుత్ కొనుగోలుకు సంబంధించి అధికారిక ప్రక్రియను రెండు రాష్ట్ర ప్రభుత్వాలు, ఇరు రాష్ట్రాల విద్యుత్ సంస్థలు నిర్వహించాయి.అయినప్పటికీ రెండు రాష్ట్రాల ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ (ఈఆర్సీ)లు పారదర్శకంగా పబ్లిక్ హియరింగ్ నిర్వహించి ఆమోదించిన తర్వాతే కొనుగోలు జరిగింది. న్యాయ ప్రాధికార సంస్థలైన ఈఆర్సీలు ఆమోదించినా ఎంక్వైరీ జరపాలనే ఆలోచన దురదృష్టకరం. ఛత్తీస్‌గఢ్ నుంచి విద్యుత్ కొనుగోలుపై అప్పట్లో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా ఉన్న రేవంత్‌రెడ్డి ఈఆర్సీకి అభ్యంతరాలు తెలిపారు. ఆ అభ్యంతరాలు, ఆక్షేపణలపై అప్పీలుకు వెళ్లే అవకాశమున్నా రేవంత్‌రెడ్డి ఆ ప్రయత్నం చేసిన దాఖలా లేదు’’అని కేసీఆర్ లేఖలో వివరించారు. -
కేసీఆర్‌కు గత ఏప్రిల్‌లోనే నోటీసులు జారీ: జస్టిస్ నరసింహారెడ్డి
సాక్షి, హైదరాబాద్: కాంపిటీటివ్ బిడ్డింగ్‌కి బదులుగా నామినేషన్ల ప్రాతిపదికన ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంతో విద్యుత్ కొనుగోలు ఒప్పందం కుదుర్చుకోవడం, యాదాద్రి, భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రాలు నిర్మించాలని నిర్ణయం తీసుకోవడంలో పాత్రపై మాజీ సీఎం కె.చంద్రశేఖర్‌రావుకు గత ఏప్రిల్‌లో నోటీసులు జారీ చేసినట్లు జస్టిస్ ఎల్.నరసింహారెడ్డి తెలిపారు. కేసీఆర్ సహా మొత్తం 25 మంది అధికారులు, అనధికారులకు నోటీసులు జారీ చేసినట్లు వెల్లడించారు. విద్యుత్ కొనుగోలు ఒప్పందంతో పాటు విద్యుత్ కేంద్రాల నిర్మాణంపై జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పటికే రాష్ట్ర ఇంధన శాఖ మాజీ ముఖ్య కార్యదర్శులైన సురేష్ చందా, ఎస్కే జోషీ, అరవింద్కుమార్లతో పాటు ట్రాన్స్‌కో, జెన్కో మాజీ సీఎండీ డి.ప్రభాకర్‌రావు, బీహెచ్ఈఎల్ మాజీ సీఎండీ, ప్రస్తుత సీఎండీలను విచారించారు. ఈ నేపథ్యంలో జస్టిస్ నరసింహారెడ్డి మంగళవారం బీఆర్కేఆర్ భవన్‌లోని కమిషన్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. జగదీశ్‌రెడ్డికి నోటీసులు ఇవ్వలేదు ‘విద్యుత్ నిర్ణయాలకు సంబంధించిన ఫైళ్ల పరిశీలనలో మీ పాత్రను గుర్తించామని, దీనిపై వివరణ ఇవ్వాలని కోరుతూ అందరికీ నోటీసులు ఇచ్చాం. కేసీఆర్ మినహా నోటీసులు అందుకున్న మిగతా వారంతా గడువులోగా తమ పాత్రపై రాతపూర్వకంగా వివరణ అందజేశారు. లోక్‌సభ ఎన్నికల్లో తీరిక లేకుండా ఉన్నానని, జూలై 31 వరకు గడువు పొడిగించాలని కేసీఆర్ విజ్ఞప్తి చేయగా, జూన్ 15 వరకు కమిషన్ గడువు పొడిగించింది. అయితే ఇప్పటికీ కేసీఆర్ నుంచి వివరణ అందలేదు. కొందరి వివరణలు సంతృప్తికరంగా లేకపోవడంతో అదనపు సమాచారం కోరు తూ మళ్లీ నోటీసులు జారీ చేశాం. నిర్ణయాల్లో అప్పటి విద్యుత్ శాఖ మంత్రి జి.జగదీశ్‌రెడ్డి పాత్ర ఉన్నట్టుగా ఎలాంటి ప్రస్తావన లేకపోవడంతో ఆయనకు నోటీసులు జారీ చేయలేదు..’ అని జస్టిస్ నరసింహారెడ్డి తెలిపారు. ఎవరు నిర్ణయం తీసుకున్నారో పరిశీలిస్తున్నాం ‘ఛత్తీస్‌గఢ్ విద్యుత్ ఒప్పందం, యాదాద్రి, భద్రాద్రి విద్యుత్ కేంద్రాల నిర్మాణం అంశాల్లో నిర్ణయం ఎవరు తీసుకున్నారు? అనే అంశంపై విచారణ నిర్వహిస్తున్నాం. నిర్ణయాల్లో పాత్రలేని అధికారులు ఒక్కొక్కరిని తప్పించడం (ఎలిమినేషన్) ద్వారా అసలు నిర్ణయం తీసుకున్న వారెవరో గుర్తించడానికి ప్రయత్నిస్తున్నాం. మూడు అంశాల్లోనూ నాటి ప్రభుత్వం నేరుగా నిర్ణయాలు తీసుకుందని జెన్కో, ఇతర విద్యుత్ సంస్థల పాత్ర లేదని ట్రాన్స్‌కో, జెన్కో మాజీ సీఎండీ డి.ప్రభాకర్‌రావు చెప్పారు. ఇక్కడ ప్రభుత్వం అంటే.. నిర్ణయం తీసుకుంది ఎవరు? అనే అంశం పరిశీలిస్తున్నాం..’ అని చెప్పారు. ఛత్తీస్‌గఢ్ ఈఆర్సీకి అధికారాలు పెద్ద తప్పిదం ‘ఛత్తీస్‌గఢ్ విద్యుత్ కొనుగోలు ఒప్పందంతో రాష్ట్రం భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచి్చనట్టుగా మా లెక్కల్లో తేలింది. ఒప్పందంపై కేంద్ర విద్యుత్ నియంత్రణ మండలి (సీఈఆర్సీ)కి బదులుగా ఛత్తీస్‌గఢ్ ఈఆర్సీకి సర్వ అధికారాలు కట్టబెట్టడం పెద్ద తప్పిదం. 12 ఏళ్లకు ఒప్పందం జరిగితే, ఛత్తీస్‌గఢ్ కేవలం మూడు నాలుగేళ్లు మాత్రమే విద్యుత్ సరఫరా చేసి మానుకుంది. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం నుంచి 1000 మెగావాట్ల విద్యుత్ కొనుగోలు చేయడానికి 2014లో ఆ రాష్ట్ర ప్రభుత్వంతో తెలంగాణ ప్రభుత్వం అవగాహన ఒప్పందం (ఎంఓయూ) చేసుకోగా, నాటి రాష్ట్ర ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్కే జోషీ దీనిపై సంతకం చేశారు. అయితే ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి ప్రమేయం లేకుండానే 2016లో విద్యుత్ కొనుగోలు ఒప్పందం (పీపీఏ) జరిగింది. జీఎస్పీడీసీఎల్/టీజీఎన్పీడీసీఎల్ సీఎండీలు దీనిపై సంతకం పెట్టారు. అయితే అప్పటికి ఛత్తీస్‌గఢ్‌లో థర్మల్ విద్యుత్ కేంద్రం (మార్వా) నిర్మాణమే ప్రారంభం కాలేదని మా పరిశీలనలో తేలింది..’ అని జస్టిస్ నరసింహారెడ్డి తెలిపారు. చర్యలు తీసుకోని ఈఆర్సీ ‘ఛత్తీస్‌గఢ్ ఒప్పందంతో తనకు ఎలాంటి సంబంధం లేదని అరవింద్‌కుమార్ వివరణ ఇచ్చారు. నామినేషన్ విధానంలో ఛత్తీస్‌గఢ్ నుంచి విద్యుత్ కొనుగోలు ఒప్పందం చేసుకుంటే రాష్ట్రానికి తీవ్ర నష్టం జరుగుతుందని, దీనికి బదులుగా విద్యుత్ కొనుగోళ్ల కోసం బహిరంగ టెండర్లను నిర్వహిస్తే బాగుంటుందని పేర్కొంటూ అరవింద్‌కుమార్ 2016 నవంబర్ చివరలో రాష్ట్ర ఈఆర్సీకి సుదీర్ఘ లేఖ రాయగా, ఈఆర్సీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని తేలింది. ఈ లేఖ రాసిన వెంటనే తాను ఇంధన శాఖ నుంచి బదిలీకి గురైనట్టు అరవింద్‌కుమార్ తెలిపారు. 2000 మెగావాట్ల విద్యుత్‌ను దక్షిణాది రాష్ట్రాల నుంచి కొనుగోలు చేసేందుకు అనుమతిస్తూ ఎస్కే జోషి తొలుత జీవో 22 జారీ చేశారు. ఆ తర్వాత కొన్ని రోజులకే ఛత్తీస్‌గఢ్ నుంచి విద్యుత్ కొనుగోళ్లకు వీలు కలి్పంచేలా ఈ జీవోను సవరిస్తూ దేశంలో ఎక్కడి నుంచైనా విద్యుత్ కొనుగోలు చేసేందుకు అనుమతించారు. 1000 మెగావాట్ల ఛత్తీస్‌గఢ్ విద్యుత్ కోసం 2000 మెగావాట్ల విద్యుత్ కారిడార్‌ను బుక్ చేసుకున్నారు. అందులో 1000 మెగావాట్ల లైన్లను కూడా ఎన్నడూ పూర్తిగా వాడుకోలేదు..’ అని వివరించారు. సూపర్ క్రిటికల్‌కి బదులుగా సబ్ క్రిటికల్ టెక్నాలజీతో ‘భద్రాద్రి’ ‘ఉత్తర భారత దేశంలో నిర్మించతలపెట్టిన థర్మల్ విద్యుత్ కేంద్రం అవసరాల కోసం బీహెచ్ఈఎల్ తయారు చేసిన జనరేటర్లు, బాయిలర్లు నిరుపయోగంగా ఉండడంతో వాటిని తీసుకొచ్చి 1080 మెగావాట్ల సబ్ క్రిటికల్ థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని నిర్మించినట్టు మా పరిశీలనలో తేలింది. సూపర్ క్రిటికల్‌కి బదులుగా సబ్ క్రిటికల్ టెక్నాలజీతో భద్రాద్రి విద్యుత్ కేంద్రం నిర్మించడంతో బొగ్గు వాడకం పెరిగి ఏటా రూ.250 కోట్ల నుంచి రూ.300 కోట్ల వరకు వ్యయం పెరిగింది. బొగ్గు వాడకం పెరగడంతో పర్యావరణ కాలుష్యం కూడా పెరిగింది. 25 ఏళ్ల పాటు అధిక వ్యయం, కాలుష్యాన్ని భరించాల్సి ఉంటుంది. తెలంగాణ వచ్చాక కొత్తగూడెంలో 800 మెగావాట్ల కొత్త థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని సూపర్ క్రిటికల్ టెక్నాలజీతో రికార్డు కాలంలో నిర్మించారు. యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని సైతం సూపర్ క్రిటికల్ టెక్నాలజీతోనే నిర్మిస్తున్నారు. కానీ భద్రాద్రి కేంద్రాన్ని సబ్ క్రిటికల్ టెక్నాలజీతో నిర్మించారు. సబ్ క్రిటికల్ టెక్నాలజీతో భద్రాద్రి నిర్మించాలని నేరుగా ప్రభుత్వం నుంచే నిర్ణయం వెలువడిందని, ఇందులో తమ పాత్ర లేదని ప్రభాకర్ రావు చెప్పారు. ఈఆర్సీ మాజీ చైర్మన్‌ను విచారించేందుకు వీలుండదు త్వరలో మరో మాజీ ముఖ్య కార్యదర్శి అజయ్ మిశ్రాను విచారిస్తామని, టీజేఏసీ చైర్మన్ కె.రఘు, టీజేఎస్ అధినేత కోదండరాం, విద్యుత్ రంగ నిపుణులు వేణుగోపాల్ రావును కూడా పిలిపించి వారి వద్ద ఉన్న సమాచారాన్ని తెలుసుకుంటామని జస్టిస్ నరసింహారెడ్డి చెప్పారు. ఈఆర్సీ మాజీ చైర్మన్‌ను విచారించేందుకు వీలుండదని ఆయన ఓ ప్రశ్నకు బదులిచ్చారు. యాదాద్రి ఇప్పట్లో పూర్తయ్యేలా లేదుయాదాద్రి, భద్రాద్రి కేంద్రాలను రెండేళ్లలో నిర్మిస్తామని చెప్పి గడువులోగా పూర్తి చేయలేకపోయారు. యాదాద్రి కేంద్రాన్ని ఇటీవల సందర్శించగా, సమీప భవిష్యత్తులో పూర్తయ్యే పరిస్థితి కనిపించలేదు. కాంపిటీటివ్ బిడ్డింగ్ ద్వారా టెండర్లు నిర్వహించకుండా బీహెచ్ఈఎల్కు నామినేషన్ల విధానంలో వీటి పనులు అప్పగించారు. బీహెచ్ఈఎల్ మాజీ, ప్రస్తుత సీఎండీలను పిలిపించి విచారించగా, అవకతవకలు జరిగినట్టు అనుమానాలు ఉన్న అంశాల (గ్రే ఏరియాస్)పై పరిశీలన జరుపుతామని బదులిచ్చారు. తాను స్వల్పకాలం పాటే ఇంధన శాఖలో పనిచేశానని, అప్పట్లో ఎలాంటి నిర్ణయాలు జరగలేదని, కేవలం ఉత్తర ప్రత్యుత్తరాలు జరిగాయని సురేష్ చందా చెప్పారు..’ అని జస్టిస్ నరసింహారెడ్డి వెల్లడించారు. -
భారతదేశ సంపద యువతే
హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నర్సింహారెడ్డి కరీంనగర్, న్యూస్‌లైన్ : యుువతే భారతదేశ సంపద అని, దేశ ఔన్నత్యాన్ని మరింత పెంచేందుకు నేటి యువతకు జ్ఞానం, శీలం, ఏకత అవసరమని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎల్.నర్సింహారెడ్డి అన్నారు. కరీంనగర్లో రెండు రోజులుగా నిర్వహిస్తున్న ఏబీవీపీ రాష్ట్ర మహాసభల్లో భాగంగా బుధవారం ‘జనమంచి గౌరీశంకర్ యువ పురస్కార్’ అవార్డు ప్రదానోత్సవం చేశారు. ఉత్తమ సేవలందించినందుకు మహబూబ్‌నగర్ జిల్లా మునగ్రాల వాసి, డాక్టర్ రాజశేఖర్‌కు ఈ అవార్డు అందించారు. ఈ కార్యక్రవూనికి ముఖ్య అతిథిగా హాజరైన జస్టిస్ నర్సింహారెడ్డి మాట్లాడుతూ, చైన్ స్నాచింగ్ కేసుల్లో అత్యధికులు ఇంజనీరింగ్ అభ్యసించిన వారున్నారంటే మన బోధన ఏ వైపు నడిపిస్తోందో చర్చించాలన్నారు. -
జానపదాల్లో శ్రావ్యమైన సంగీతం
సాక్షి, హైదరాబాద్: జానపద సంగీతనృత్యాల్లో శ్రావ్యమైన సంగీతం ఉందని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎల్.నరసింహారెడ్డి పేర్కొన్నారు. కిన్నెర సంస్థ 36 వార్షికోత్సవాల సందర్భంగా బుధవారం రవీంద్రభారతిలో ఆంధ్రప్రదేశ్ జానపద సంగీత నృత్యోత్సవాలు ‘ఘంటసాల’ వేదికపై ఘనంగా ప్రారంభమయ్యాయి. జస్టిస్ నరసింహారెడ్డి ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ.. సమాజాన్ని ప్రతిబింబించే అంశాలు జానపదాల్లో ఉండేవని, వాటిని అందరూ వల్లెవేసేవారని చెప్పారు. రాష్ట్రంలో ఐదు దశాబ్దాలుగా జానపద కళలు నిరాదరణకు గురయ్యాయని, ప్రభుత్వం పెద్దగా సాయం చేయకున్నా కిన్నెర వాటిని ప్రోత్సహిస్తోందని అన్నారు. నృత్యోత్సవాల్లో జానపద బ్రహ్మ పీవీ చలపతిరావు, మాపల్లె శంకర్ బృందాలు పాడిన జానపద గీతాలు శ్రోతలను అలరించాయి. విశ్రాంత డీజీపీ డాక్టర్ ఆర్.ప్రభాకరరావు, విశ్రాంత ఐఏఎస్ అధికారి డాక్టర్ కె.వి.రమణాచారి, ఆంధ్రా బ్యాంక్ జీఎం టీవీఎస్ చంద్రశేఖర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.