విద్యుత్ సంక్షోభం నుంచి గట్టెక్కేందుకే యాదాద్రి, భద్రాద్రి ప్లాంట్లు: కేసీఆర్
ప్రాంతీయ సమతుల్యత కోసమే దామరచర్లలో ప్లాంట్ నిర్మాణం
నిబంధనల మేరకే పారదర్శకంగా ఛత్తీస్‌గఢ్ నుంచి కరెంటు కొనుగోలు
ఇరు రాష్ట్రాల ఈఆర్సీల ఆమోదంతోనే ఒప్పందం జరిగిందని వెల్లడి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన కొత్తలో ఇక్కడ నెలకొన్న అసాధారణ విద్యుత్ సంక్షోభాన్ని దృష్టిలో పెట్టుకునే కొన్ని అసాధారణ నిర్ణయాలు తీసుకున్నట్టు బీఆర్‌ఎస్ అధ్యక్షుడు, మాజీ సీఎం కె.చంద్రశేఖర్‌రావు స్పష్టం చేశారు. ఈ మేరకు విద్యుత్ కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ చైర్మన్ జస్టిస్ నరసింహారెడ్డికి రాసిన లేఖలో వివరాలను వెల్లడించారు. ఛత్తీస్‌గఢ్ నుంచి విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు, యాదాద్రి, భద్రాద్రి థర్మల్ ప్లాంట్ల నిర్మాణం వెనుక ఉన్న అంశాలను వివరించారు.
ఆ అంశాలు కేసీఆర్ మాటల్లోనే.. ‘‘మా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్లే తెలంగాణలో అన్ని రంగాలకు నాణ్యమైన, నిరంతర విద్యుత్ సరఫరా జరిగి.. వ్యవసాయ, ఐటీ, పారిశ్రామిక ప్రగతి సాధించాయి. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ సమయంలో సుమారు 5వేల మెగావాట్ల విద్యుత్ కొరత ఉండగా.. మా ప్రభుత్వ కఠోర శ్రమతో విద్యుత్ రంగంలో స్వయంవృద్ధి సాధించింది. 2014 నాటికి దేశంలో 90శాతం సబ్ క్రిటికల్ థర్మల్ ప్లాంట్లే ఉంటే.. తెలంగాణ ప్రభుత్వం ఒక్కటే ఆ తరహాలో భద్రాద్రి ప్లాంట్ చేపట్టినట్టు చెప్పడం సరికాదు.
బీహెచ్‌ఈఎల్‌తో సంప్రదింపులు జరిపి పెట్టుబడి వ్యయం రూ.400 కోట్లు తగ్గించినందునే భద్రాద్రి ప్లాంటు పనులు ప్రారంభమయ్యాయి. రెండేళ్లలోనే ప్లాంట్ సిద్ధం చేస్తామని బీహెచ్‌ఈఎల్ లిఖిత పూర్వకంగా హామీ ఇచి్చనందునే.. అధిక ధరల భారం రాష్ట్రం మీద పడకుండా నామినేషన్ పద్ధతిలో పనులు అప్పగించాం.
ఆర్థికాభివృద్ధి కోసమే యాదాద్రి ప్లాంట్
తెలంగాణలో ప్రభుత్వం నిర్మించిన థర్మల్ విద్యుత్ కేంద్రాలన్నీ గోదావరి నది తీరంలోనే ఉన్నాయి. రాష్ట్ర దక్షిణ ప్రాంతంలోని మహబూబ్‌నగర్, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాల్లో ఒక్క భారీ విద్యుత్కేంద్రం లేదు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల మధ్య మౌలిక సదుపాయాల కల్పనలో ప్రాంతీయ సమతుల్యత సాధించడం ప్రభుత్వాల ప్రాథమిక కర్తవ్యం. వీటిన్నింటినీ పరిగణనలోకి తీసుకుని అప్పటి ప్రభుత్వం నల్లగొండ జిల్లాలోని దామరచర్లను ఉద్దేశపూర్వకంగానే యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంటు నిర్మాణానికి ఎంపిక చేసింది.
దామరచర్లకు సమీపంలో ఉన్న కృష్ణపట్నం, బందరు (మచిలీపట్నం) రేవుల నుంచి అత్యవసర పరిస్థితుల్లో బొగ్గును దిగుమతి చేసుకునే అవకాశం ఉంది. దామరచర్లకు జాతీయ రహదారి, రైల్వే లైన్ సమీపంలో ఉన్నందున రవాణా సమస్యలు ఉండవు. నాగార్జునసాగర్ టెయిల్ పాండ్ నుంచి ప్లాంటుకు అవసరమయ్యే నీరు ఎల్లవేళలా అందుబాటులో ఉంటుంది. ఈ ప్లాంటు నుంచి వెలువడే ఫ్లైయాష్‌ను స్థానిక సిమెంటు పరిశ్రమలు వినియోగించుకుంటాయి. ప్రభుత్వ రంగ సంస్థ బీహెచ్‌ఈఎల్ మేలును కోరే యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంటును పనులను నామినేషన్ పద్ధతిపై అప్పగించాం.
తీవ్ర సంక్షోభం ఉన్నందునే ఛత్తీస్‌గఢ్ విద్యుత్
2014లో తెలంగాణ ఏర్పాటుతో ఎదుర్కొన్న కరెంటు సంక్షోభాన్ని దృష్టిలో పెట్టుకుని ఛత్తీస్‌గఢ్ నుంచి వెయ్యి మెగావాట్ల విద్యుత్ కొనుగోలుకు తెలంగాణ అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. నాటి పరిస్థితుల్లో ఛత్తీస్‌గఢ్ విద్యుత్ సంస్థలతో ఒప్పందాలు (పీపీఏ) చేసుకోవడం, వాటిని సమరి్పంచి పవర్ గ్రిడ్ కార్పొరేషన్ వద్ద 2 వేల మెగావాట్ల కారిడార్ బుక్ చేసుకోవడం తప్ప తెలంగాణ ప్రభుత్వానికి, విద్యుత్ సంస్థలకు మరో మార్గం లేదు.
ఛత్తీస్‌గఢ్ నుంచి విద్యుత్ సరఫరా ప్రారంభమైన తర్వాత వెయ్యి మెగావాట్ల కారిడార్ ఉపయోగించుకుని, మరో వెయ్యి మెగావాట్ల కారిడార్ ఒప్పందాన్ని రద్దు చేసుకున్నాం. ఈ రద్దు ద్వారా తెలంగాణ రాష్ట్ర విద్యుత్ సంస్థలకు ఎలాంటి ఆర్థిక నష్టం వాటిల్లలేదు. ఛత్తీస్‌గఢ్ నుంచి విద్యుత్ కొనుగోలుకు సంబంధించి అధికారిక ప్రక్రియను రెండు రాష్ట్ర ప్రభుత్వాలు, ఇరు రాష్ట్రాల విద్యుత్ సంస్థలు నిర్వహించాయి.
అయినప్పటికీ రెండు రాష్ట్రాల ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ (ఈఆర్సీ)లు పారదర్శకంగా పబ్లిక్ హియరింగ్ నిర్వహించి ఆమోదించిన తర్వాతే కొనుగోలు జరిగింది. న్యాయ ప్రాధికార సంస్థలైన ఈఆర్సీలు ఆమోదించినా ఎంక్వైరీ జరపాలనే ఆలోచన దురదృష్టకరం. ఛత్తీస్‌గఢ్ నుంచి విద్యుత్ కొనుగోలుపై అప్పట్లో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా ఉన్న రేవంత్‌రెడ్డి ఈఆర్సీకి అభ్యంతరాలు తెలిపారు. ఆ అభ్యంతరాలు, ఆక్షేపణలపై అప్పీలుకు వెళ్లే అవకాశమున్నా రేవంత్‌రెడ్డి ఆ ప్రయత్నం చేసిన దాఖలా లేదు’’అని కేసీఆర్ లేఖలో వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment