Telangana Budget 2016-17
-
పంచాయతీరాజ్‌కు నిధుల్లో కోత!
బడ్జెట్లో రూ. 4,686.16 కోట్ల కేటాయింపులతో సరి ⇒ ఈ శాఖకు గతేడాది కేటాయింపులు రూ. 6,927.48 కోట్లు ⇒ గ్రామీణాభివృద్ధిశాఖకు స్వల్పంగా పెరిగిన నిధులు ⇒ గత బడ్జెట్లో రూ. 6,256.68 కోట్లు కేటాయించగా ఈసారి ⇒ రూ. 6,344.55 కోట్ల కేటాయింపు ⇒ మిషన్ భగీరథకు కేటాయింపులు శూన్యం సాక్షి, హైదరాబాద్: పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి వ్యవస్థల బలోపేతానికి అత్యంత ప్రాధాన్యమిస్తామన్న ప్రభుత్వం ఈసారి బడ్జెట్లో ఆ మేరకు కేటాయింపులు మాత్రం చేయలేదు. 2015-16 ఆర్థిక బడ్జెట్లో వివిధ పథకాల కోసం పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖలకు రూ.13,184 కోట్లు కేటాయించగా తాజా బడ్జెట్లో కేవలం రూ. 11,031 కోట్లతో సరిపెట్టింది. ఇందులోనూ తగ్గింపు వసూళ్లు రూ. 300 కోట్లు చూపి నికర కేటాయింపులను రూ. 10,731 కోట్లుగా పేర్కొన్నారు. ఆసరా పథకం మినహా మిషన్ భగీరథ, గ్రామీణ రహదారుల నిర్మాణానికి బడ్జెట్లో నిధులు కేటాయించలేదు. కేటాయింపుల మొత్తంలో పంచాయతీరాజ్‌కు గతేడాదికన్నా నిధులను బాగా తగ్గించగా గ్రామీణాభివృద్ధికి మాత్రం స్వల్పంగా కేటాయింపులు పెంచారు. అయితే పెరిగిన కేటాయింపులు కూడా కేంద్రం నుంచి వచ్చే జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులకు సంబంధించినవే కావడం గమనార్హం. పంచాయతీరాజ్ విభాగానికి గతేడాది మొత్తం రూ. 6,927.48 కోట్లు కేటాయించగా ఈసారి బడ్జెట్లో రూ. 4,686.16 కోట్లు మాత్రమే కేటాయించారు. ఇక గ్రామీణాభివృద్ధి విభాగానికి గత బడ్జెట్లో రూ. 6,256.68 కోట్లు కేటాయించగా ఈ ఏడాది కేటాయింపులను స్వల్పంగా పెంచుతూ రూ. 6,344.55 కోట్లు కేటాయించారు. పంచాయతీరాజ్ విభాగానికి కేటాయించిన నిధుల్లో రూ. 2,102.96 కోట్లను ప్రణాళికేతర వ్యయంగానూ రూ. 2,583.20 కోట్లు ప్రణాళికా వ్యయంగానూ చూపారు. గ్రామీణాభివృద్ధిశాఖకు ప్రణాళికా వ్యయం కింద రూ. 6,336.30 కోట్లు చూపగా, ప్రణాళికేతర వ్యయం కింద రూ. 8.25 కోట్లను మాత్రమే చూపారు. పంచాయతీరాజ్‌కు కేటాయింపులు ఇలా.. పంచాయతీరాజ్ విభాగంలో ముఖ్య కేటాయింపులను పరిశీలిస్తే సచివాలయశాఖ ఆర్థిక సేవలకు రూ. 3.50 కోట్లు, జిల్లా పరిషత్‌లకు ఆర్థిక సాయంగా రూ. 58.65 కోట్లు, మండల పరిషత్‌లకు రూ. 240.08 కోట్లు, గ్రామ పంచాయతీలకు రూ. 819.50 కోట్లు కేటాయించారు. పంచాయతీరాజ్ సంస్థలకు నష్టపరిహారం, ఇతర కేటాయింపుల కింద మొత్తం రూ. 1,468.56 కోట్లు కేటాయించారు. ప్రణాళిక కింద ఇతర గ్రామీణాభివృద్ధి కార్యక్రమాలకు మరో రూ. 94.02 కోట్లు, ఏకగ్రీవ గ్రామ పంచాయతీలకు ప్రోత్సాహకాల నిమిత్తం రూ. 45.16 కోట్లు, గ్రామ పంచాయతీల బలోపేతానికి రూ. 45.16 కోట్లు, ప్రధాన మంత్రి ఆదర్శ గ్రామ యోజన కింద రూ. 45.16 కోట్లు కేటాయించారు. ఆస్తుల రూపకల్పన, ఉపాధి హామీ పనుల అప్‌గ్రెడేషన్ కోసం మొత్తం రూ. 1,078 కోట్లు కేటాయించారు. మండల పరిషత్ భవనాల కోసం రూ. 45 కోట్లు, ప్రధాన మంత్రి గ్రామ సడక్ యోజన కింద కేంద్రం నుంచి రూ. 407 కోట్లు రావచ్చని చూపారు. గ్రామీణ నీటిసరఫరా విభాగానికి రూ. 164 కోట్లు కేటాయించారు. నిర్మల భారత్ అభియాన్, ఎన్ఆర్డీడబ్ల్యూఎంపీ ప్రోగ్రామ్‌ల కింద కేంద్రం నుంచి మరో రూ. 1,040 కోట్లు వస్తాయని బడ్జెట్ కేటాయింపుల్లో చూపారు. గ్రామీణాభివృద్ధికి ఇలా.. గ్రామీణాభివృద్ధిశాఖకు బడ్జెట్లో ప్రణాళికా వ్యయం కింద మొత్తం రూ. 6,344.55 కోట్లు చూపగా ఇందులో వివిధ సామాజిక భద్రతా పింఛన్ల కోసం రూ. 3,260 కోట్లు కే టాయించారు. ఈ శాఖ పరిధిలో చేపట్టనున్న ఇతర ప్రత్యేక కార్యక్రమాలకు రూ. 2,712.55 కోట్లు, ఇతర గ్రామీణాభివృద్ధి కార్యక్రమాలకు రూ. 3.74 కోట్లను బడ్జెట్లో కేటాయించారు. వడ్డీలేని రుణాలకు గతేడాదికన్నా కేటాయింపులు పెంచారు. గతంలో రూ. 84.61 కోట్లు కేటాయించగా తాజాగా రూ. 148.43 కోట్లకు పెంచారు. స్త్రీ నిధి బ్యాంకుకు ప్రత్యేక గ్రాంటును రూ. 11 కోట్లకు పెంచారు. గ్రామీణ జీవనోపాధికి రూ. 57.36 కోట్లు, గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థకు రూ. 133 కోట్లు, గ్రామీణ ఉపాధి హామీ పథకానికి రూ. 2,450 కోట్లు, ఇంటిగ్రేటెడ్ వాటర్‌షెడ్ ప్రోగ్రామ్‌కు రూ. 84 కోట్లు కేటాయించారు. ప్రణాళికేతర వ్యయం కింద గతేడాది రూ. 11.81 కోట్లు కేటాయించగా ఈ ఏడాది దాన్ని రూ. 8.24 కోట్లకు కుదించారు. ఇందులో ప్రత్యేక కార్యక్రమాలకు రూ. 2.16 కోట్లు, టీసీపార్డ్కు గతేడాది రూ. 7.96 కోట్లు కేటాయించగా ఈ ఏడాది కేవలం రూ. 4.85 కోట్లకు కుదించారు. ‘మిషన్ భగీరథ’కు అప్పులే ఆధారం! ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ పథకానికి వివిధ ఆర్థిక సంస్థలిచ్చే అప్పులే ఆధారం కానున్నాయి. గతేడాది ఈ ప్రాజెక్టుకు ప్రభుత్వం బడ్జెట్లో రూ. 4 వేల కోట్లు కేటాయించగా ఈ ఏడాది బడ్జెట్లో నిధుల కేటాయింపు ఊసేలేదు. బడ్జెట్ ప్రసంగంలోనూ మిషన్ భగీరథకు హడ్కో, నాబార్డు, బ్యాంక్ ఆఫ్ ఇండియా, కెనరా బ్యాంక్ మొదలైన సంస్థల నుంచి ఆర్థిక వనరులను సమకూర్చుకుంటున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. సుమారు రూ. 40 వేల కోట్లతో చేపడుతున్న ఈ ప్రాజెక్టును వచ్చే మూడేళ ్లలో పూర్తి చేయనున్నట్లు ఆర్థిక మంత్రి ఈటల చెప్పారు. 2016 చివరికి 6,100 గ్రామాలు, 12 పట్టణాలకు సురక్షిత తాగునీరందిస్తామని సర్కారు ప్రకటించింది. గ్రామజ్యోతికి నిధులు కరువు ప్రభుత్వం గత ఆగస్టులో ప్రారంభించిన గ్రామజ్యోతికి ఈ బడ్జెట్లో ప్రత్యేకంగా నిధులేమీ కేటాయించలేదు. మన ఊరు-మన ప్రణాళికలో ప్రజల సూచనల ప్రకారం గ్రామాభివృద్ధి ప్రణాళికలను తయారు చేయడమే గ్రామజ్యోతి ముఖ్య ఉద్దేశమని బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు. -
‘డబుల్’ ఇళ్లకు అప్పులే దిక్కు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పేదలు ఎప్పుడెప్పుడా అని ఆశగా ఎదురుచూస్తున్న రెండు పడక గదుల ఇళ్ల పథకాన్ని ‘అప్పుల’తో నెట్టుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందులోభాగంగానే బడ్జెట్లో నామమాత్రంగా రూ.860 కోట్లే కేటాయించింది. రాష్ట్రవ్యాప్తంగా లక్ష ఇళ్లు, రాజధాని హైదరాబాద్‌లో మరో లక్ష ఇళ్లను వచ్చే ఆర్థిక సంవత్సరంలో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. వాటిని హ డ్కోతోపాటు ఇతర సంస్థల నుంచి రుణం తెచ్చి పూర్తి చేస్తామని బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ పేర్కొన్నారు. అంత రుణం సాధ్యమా? ప్రభుత్వం చెబుతున్న రెండు లక్షల ఇళ్లతోపాటు గత సంవత్సరం మంజూరు చేసి పనులు ప్రారంభించని మరో 60 వేల ఇళ్లను పూర్తి చేయాలంటే దాదాపు రూ.16 వేల కోట్లు కావాలి. కానీ బడ్జెట్లో కేటాయిం చింది రూ.860 కోట్లే. మిగతా సుమారు రూ.15వేల కోట్లను ఒకే సంవత్సరం వ్యయం చేయడం సాధ్యమా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గతేడాది మంజూరు చేసిన 60 వేల ఇళ్ల కోసం హడ్కో నుంచి రూ.3,500 కోట్లు అప్పు తెచ్చుకునేందుకు గృహనిర్మాణ శాఖకు సర్కారు అనుమతి ఇచ్చింది. అది పోను మి గతా అప్పు ఈ సంవత్సరమే అంటే ఎలా సాధ్యమో ప్రభుత్వం స్పష్టం చేయలేదు. మొత్తంగా కొత్త ఆర్థిక సంవత్సరంలోనూ కొన్ని ‘డబుల్’ ఇళ్లను నిర్మించి చూ పే అవకాశం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇక ఇందిరమ్మ ఇళ్ల బకాయిల చెల్లింపుపైనా అస్పష్టతే కొనసాగుతోంది. ఆ పథకం పేరుతో బడ్జెట్లో నిధులు ప్రతిపాదించక పోవడమే దీనికి కారణం. -
పరిశ్రమలకు ప్రోత్సాహమేదీ?
సాక్షి, హైదరాబాద్: పరిశ్రమల శాఖకు జరిగిన కేటాయింపులను గత ఏడాదితో పోలిస్తే 2016-17 ఆర్థిక బడ్జెట్లో రూ.6.64 కోట్ల మేర కోతలు విధిస్తూ ఆర్థిక మంత్రి ప్రతిపాదనలు సమర్పించారు. గత ఏడాది పరిశ్రమల శాఖకు రూ.973.73 కోట్లను ప్రణాళిక, ప్రణాళికేతర పద్దుల క్రింద ప్రతిపాదించగా.. ఈ ఏడాది రూ.967.09 కోట్లకు పరిమితం చేశారు. ఇందులో రూ.859.63 కోట్లను ప్రణాళికా వ్యయం కింద ప్రతిపాదించారు. గతేడాది ప్రతిపాదించిన బడ్జెట్లో ఇప్పటి వరకు రూ.689.26 కోట్లు మాత్రమే ఖర్చు చేసినట్లు సవరణ ప్రతిపాదించారు. ప్రస్తుత బడ్జెట్లో పరిశ్రమల విభాగానికి మినహా.. ఇతర అనుబంధ శాఖల కోటాలో భారీగా కోత విధించారు. విదేశీ వాణిజ్యం, ఎగుమతులు, చక్కెర పరిశ్రమ శాఖ కు నయాపైసా విదల్చలేదు. చక్కెర శాఖను వ్యవసాయ శాఖలో.. విదేశీ వాణిజ్య విభాగాన్ని టీఎస్ఐఐసీలో విలీనం చేస్తారనే వార్తల నేపథ్యంలో నయాపైసా కేటాయించక పోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. నిజాం దక్కన్ షుగర్స్ పునరుద్ధరణకు ప్రభుత్వం చొరవ చూపుతుందని ఆశించినా.. బడ్జెట్లో ప్రస్తావనకు రాలేదు. ఆహార నిల్వ, గిడ్డంగులకు గత ఏడాది రూ.101.56 కోట్లు ప్రతిపాదించి, రూ.60.26 కోట్లు ఖర్చు చేయగా.. ఈ ఏడాది ప్రతిపాదన ల్లో కేవలం రూ.10 కోట్లకు పరిమి తం చేశారు. చేనేత, జౌళి శాఖకు సంబంధించి కేటాయింపుల్లోనూ భారీగా కోతలు విధించారు. గనులు, భూగర్భ వనరుల శాఖకు గత ఏడాది మాదిరిగానే ప్రణాళికా వ్యయం కింద రూ.కోటి కేటాయించారు. గ్రామీణ పరిశ్రమలు, ఇతర పరిశ్రమలకు గతంలో రూ.562.88 కోట్లు ప్రతిపాదించగా.. ప్రస్తుత బడ్జెట్లో రూ.778.63 కోట్లు ప్రతిపాదించారు. -
రోడ్లకు మైనస్
గత బడ్జెట్లో భారీ కేటాయింపులు * పనుల్లో కనిపించని పురోగతి * దీంతో ఈసారి నిధుల్లో కోత సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వం మంజూరు చేసిన పనులు.. వాస్తవంగా జరుగుతున్న పనులకు పొంతన లేకపోవటంతో కొత్త బడ్జెట్లో రోడ్లు, భవనాల శాఖకు కేటాయించే నిధుల్లో ప్రభుత్వం కోత పెట్టింది. గత బడ్జెట్ కంటే దాదాపు రూ. 1,600 కోట్ల నిధులు తగ్గించింది. గత బడ్జెట్లో భారీ ఎత్తున నిధులు కేటాయించినప్పటికీ వాటిని ఖర్చు చేయటంలో ఆ శాఖ విఫలం కావటంతో ప్రభుత్వం ఈసారి తక్కువ నిధులే సరిపోతాయని భావించి రూ. 4,322 కోట్లతో సరిపుచ్చింది. మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రాలకు, జిల్లా కేంద్రాల నుంచి రాజధానికి రెండు వరసల రోడ్లు.. నదులు, వాగులు, వంకలపై అవసరమైన ప్రాంతాల్లో వంతెనలు అంటూ గత సంవత్సరం ప్రభుత్వం కనీవినీ ఎరుగని రీతిలో దాదాపు రూ. 11,600 కోట్ల విలువైన పనులకు పచ్చజెండా ఊపింది. వీటిని నిర్వహించే క్రమంలో గత బడ్జెట్లో రూ. 5,917 కోట్లను ప్రతిపాదించింది. కానీ ఆర్థిక సంవత్సరం చివరకు వచ్చేసరికి రూ. 2,576 కోట్లనే ఖర్చు చేయగలిగారు. ఈ సంవత్సరం బడ్జెట్ సన్నాహక సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ఇదే విషయమై అధికారులను నిలదీశారు. కొన్ని సాంకేతిక సమస్యల కారణంగా పనులను వేగంగా నిర్వహించలేకపోయామని, ఇకనుంచి ఊపందుకుంటాయని సమాధానమిచ్చారు. ఇందుకోసం కొత్త బడ్జెట్లో రూ. 5,500 కోట్లు కేటాయించాల్సిందిగా అధికారులు కోరారు. కానీ ఈసారి కూడా అధికారులు అనుకున్న వేగంతో పనులు చేయించలేరనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి అన్ని నిధులివ్వలేనని తేల్చి చెప్పారు. అనుకున్నట్టుగానే తాజా బడ్జెట్లో భారీగానే కోత పెట్టారు. ఈసారి కొత్తగా మండల కేంద్రాలు, జిల్లా కేంద్రాలకు ప్రత్యేకంగా నిధులు కేటాయించలేదు. గత సంవత్సరం పనులే ఈసారి కొనసాగే అవకాశం ఉన్నందున వాటితోనే సరిపుచ్చుకోవాలన్న సంకేతాన్ని ప్రభుత్వం ఇచ్చింది. * ముఖ్యమైన జిల్లా రహదారుల నిర్మాణం కోసం రూ. 1,137 కోట్లు కేటాయించారు. * గజ్వేల్ ప్రాంతీయ అభివృద్ధి మండలి, ఇతర అనుసంధాన రోడ్ల అభివృద్ధి కోసం రూ. 30 కోట్లు కేటాయించారు. * ఔటర్ రింగు రోడ్డుకు అనుసంధానంగా నిర్మించే రేడియల్ రోడ్ల కోసం రూ. 250 కోట్లు ప్రతిపాదించారు. * కొత్త రైల్వే లైన్ల కోసం రూ. 50 కోట్లు ప్రతిపాదించారు. * కొత్త సచివాలయ భవన సముదాయ నిర్మాణం కోసం రూ. 50 కోట్లు, జిల్లా కలెక్టరేట్ భవనాల కోసం రూ. 3.50 కోట్లు, రాష్ట్ర ఎన్నికల సంఘం భవనం కోసం రూ. కోటి, తెలంగాణ జర్నలిస్టుల భవన నిర్మాణం కోసం రూ. కోటి, తెలంగాణ కళాభారతి, ఇతర భవనాల కోసం రూ. 50 కోట్లు, రాజ్‌భవన్‌లో నిర్మాణాల కోసం రూ. 50 కోట్లు, సీనియర్ అధికారుల నివాస భవనాల నిర్మాణం కోసం రూ. 20 కోట్లు ప్రతిపాదించారు. * తెలంగాణ రోడ్ సెక్టార్ కోసం రూ. 60 కోట్లు చూపారు. * కోర్ నెట్వర్క్ రోడ్లకు రూ. 360 కోట్లు ప్రతిపాదించారు. -
కరెంటుకు కోతలే
- డిస్కంల ఆదాయ లోటే రూ.6,831 కోట్లు.. సబ్సిడీలు రూ.4470.1 కోట్లకే పరిమితం - ‘థర్మల్’ పెట్టుబడి, ‘సహాయ’ నిధులకు మంగళం - సౌర విద్యుత్, బోరుబావుల విద్యుదీకరణా అంతే సాక్షి, హైదరాబాద్: విద్యుత్ రంగానికి బడ్జెట్లో సర్కారు భారీగా కోత పెట్టింది. వ్యవసాయ విద్యుత్ సబ్సిడీని నామమాత్రంగా పెంచి, విద్యుదుత్పత్తి సంస్థ జెన్కోకు ఆర్థిక సాయానికి, కొత్త థర్మల్ విద్యుత్ ప్రాజెక్టుల్లో ప్రభుత్వ పెట్టుబడి కేటాయింపులకు పూర్తిగా మంగళం పాడింది. ఇంధన శాఖకు గత బడ్జెట్లో రూ.7,999.96 కోట్ల కేటాయింపులు జరపగా, తాజా బడ్జెట్లో రూ.5,341.45 కోట్లతో సరిపెట్టింది. వ్యవసాయ విద్యుత్ సబ్సిడీలకు గత బడ్జెట్లో జరిపిన రూ.4,257.24 కోట్ల కేటాయింపులను రూ.3,192.93 కోట్లకు తగ్గిస్తూ తాజాగా సవరణలు చేసింది. తాజా బడ్జెట్లో రూ.4,470.10 కోట్లు కేటాయించింది. సోలార్ పంపు సెట్లు, సౌర విద్యుత్ పథకం, బోరుబావుల విద్యుదీకరణ పథకాలకు నిధులే కేటాయించలేదు. డిస్కంలకేదీ భరోసా? విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లు ఇటీవల ఈఆర్సీకి సమర్పించిన వార్షిక ఆదాయ అవసరాల (ఏఆర్ఆర్) నివేదికలో 2016-17లో మొత్తం రూ.30,207 కోట్ల ఖర్చులను చూపాయి. ఆదాయం రూ.21,418 కోట్లు వస్తుందని, విద్యుత్ చార్జీల పెంపుతో రూ.1,958 కోట్ల అదనపు ఆదాయం వస్తుందని చూపాయి. మిగతా రూ.6,831 కోట్ల లోటును వ్యవసాయ విద్యుత్ సబ్సిడీలతో భర్తీ చేయాల్సిన ప్రభుత్వం అందుకు రూ.4470.10 కోట్లే కేటాయించింది. వచ్చే ఖరీఫ్ నుంచి వ్యవసాయానికి పగలే 9 గంటల నిరంతర విద్యుత్ ఇస్తామని బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి ఈటల పునరుద్ఘాటించారు. ఇందుకు కావాల్సిన 5,400 మిలియన్ యూనిట్ల అదనపు విద్యుత్ సరఫరాకు రూ.4,000 కోట్ల దాకా కావాలి. ఈ అదనపు వ్యయ అంచనాలను ఏఆర్‌ఆర్‌లో డిస్కంలు చూపలేదు. 2014-15, 2015-16 నష్టాలను ‘ట్రూ అప్’ పద్ధతిన 2016-17లో రికవరీ చేయాలని నిబంధనలు పేర్కొంటున్నాయి. కానీ, రూ.1,500 కోట్ల వరకు ఉండే ఈ ఖర్చులను సైతం డిస్కంలు చూపలేదు. ఈ భారాలన్నీ కలిపి డిస్కంల నష్టాలు రూ.13 వేల కోట్ల దాకా ఉంటాయని నిపుణుల అంచనా. ఇందులో సబ్సిడీ పోగా మిగతా రూ.5,700 కోట్ల నష్టాలను అధిగమించడం సవాలే. జెన్కోకు నిధులు కోత గతేడాది బడ్జెట్లో జెన్కో భారీగా నిధులు కేటాయించిన ప్రభుత్వం ఈసారి రిక్తహస్తం చూపింది. విద్యుదుత్పత్తి కోసం గత బడ్జెట్ అంచనాల్లో రూ.1000 కోట్ల కేటాయింపులు కేటాయించి ఆ తర్వాత సవరణ అంచనాల్లో రూ.850 కోట్లకు కుదించింది. రాష్ట్రంలో భారీగా నిర్మిస్తున్న కొత్త థర్మల్ విద్యుత్కేంద్రాలకు గత బడ్జెట్ అంచనాల్లో కేటాయించిన రూ.1000 కోట్ల పెట్టుబడి నిధులను రూ.573.45 కోట్లకు తగ్గించింది. విద్యుదుత్పత్తి అవసరాలు, పెట్టుబడి గ్రాంట్ల కింద కూడా జెన్కోకు ఎలాంటి కేటాయింపులూ జరపలేదు. సబ్సిడీపై సోలార్ పంపు సెట్ల పంపిణీకి గత బడ్జెట్లో రూ.150 కోట్లు, సౌర విద్యుత్ పథకం కింద రూ.30 కోట్లు కేటాయించగా ఈసారి వాటికి పూర్తిగా మంగళం పాడింది. ట్రాన్స్‌కో, డిస్కంలకు రుణ సాయాన్ని మాత్రం రూ.150 కోట్ల నుంచి రూ.190 కోట్లకు పెంచింది. -
ఈటల సమర్పించిన జలదృశ్యం
- రూ. 1,30,415 కోట్లతో బడ్జెట్ - సాగునీటి ప్రాజెక్టులకే రూ. 25 వేల కోట్ల కేటాయింపు - పాలమూరు, కాళేశ్వరం, భక్తరామదాసు ప్రాజెక్టులకు ప్రాధాన్యం.. - - - - మిషన్ కాకతీయకు రూ. 2 వేల కోట్లు - సంక్షేమం, వైద్యారోగ్యానికి ఘనంగా కేటాయింపులు - ‘ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ’లకు రూ. 13,355 కోట్లు - బడ్జెటేతర వనరుల ద్వారా ‘భగీరథ’, డబుల్ బెడ్రూం ఇళ్లు - నాబార్డు, హడ్కో, బ్యాంకుల నుంచి రుణ సమీకరణ - ముఖ్యమంత్రి వద్ద రూ. 4,675 కోట్లతో ప్రత్యేక నిధి సాక్షి, హైదరాబాద్ నీళ్లు.. నిధులు.. నియామకాలు.. తెలంగాణ ఉద్యమాన్ని నడిపిన చోదకశక్తులివి! పోరాటానికి ఊపిరిలూదిన నినాదాలవి! వాటిలో మొదటిదైన ‘నీళ్లకు’ సర్కారు నిధుల వరద పారించింది!! పడావుపడ్డ భూములకు పచ్చదనం అద్దేందుకు ప్రాజెక్టులకు పట్టంకట్టింది. మూడో బడ్జెట్లో తెలంగాణ జల దృశ్యాన్ని ఆవిష్కరించింది. కోటి ఎకరాలకు సాగునీటిని అందించే మహా సంకల్పానికి అడుగు ముందుకేసింది. తొలి రెండేళ్ల సంక్షేమ ఎజెండాను కొనసాగిస్తూనే 2016-17 బడ్జెట్లో సాగునీటి రంగానికి అత్యంత ప్రాధాన్యమిచ్చింది. రూ.1.30 లక్షల కోట్లతో ప్రవేశపెట్టిన బడ్జెట్లో సింహభాగం ఈ రంగానికే కేటాయించింది. ప్రణాళిక వ్యయాన్ని భారీగా పెంచి కార్యాచరణ దిశగా దృఢ సంకల్పాన్ని చాటుకుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి బడ్జెట్లో ఏకంగా రూ.25 వేల కోట్లను సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి ప్రతిపాదించింది. ఇందులో పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల, కాళేశ్వరం ప్రాజెక్టు, భక్త రామదాసు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులకే రూ.15 వేల కోట్లు ప్రతిపాదించింది. సాగునీటి వాటాను సమతుల్యం చేసేందుకు మిగతా రంగాలకూ సముచిత కేటాయింపులు చేసింది. గతేడాది సాగునీటి రంగానికి కేవలం రూ.8,500 కోట్లు ఖర్చు చేసిన ప్రభుత్వం ఈసారి అమాంతం మూడింతల నిధులు కేటాయించడం విశేషం. చెరువుల పునరుద్ధరణ లక్ష్యంగా చేపట్టిన ‘మిషన్ కాకతీయ’ పథకాన్ని ఈ ఏడాది కూడా కొనసాగించనుంది. సాగునీటి కేటాయింపుల వాటాలోనే దాదాపు రూ.2 వేల కోట్లకుపైగా చెరువుల పునరుద్ధరణకు ఖర్చు చేయనుంది. భగీరథ, డబుల్ పథకాలకు బడ్జెటేతర నిధులు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ, డబుల్ బెడ్రూం ఇళ్ల పథకానికి బడ్జెట్లో ప్రభుత్వం నిధులు కేటాయించలేదు. బడ్జెట్‌తో సంబంధం లేకుండా బడ్జెటేతర వనరులతో వీటిని చేపడతామని ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ తన ప్రసంగంలో ప్రకటించారు. రూ.40 వేల కోట్లతో చేపట్టిన మిషన్ భగీరథకు హడ్కో, నాబార్డు, కెనరా బ్యాంకుల నుంచి రుణం తీసుకుంటామని వెల్లడించారు. ఇప్పటికే మంజూరు చేసిన 60 వేల డబుల్ బెడ్రూం ఇళ్లతో పాటు ఈ ఏడాది పట్టణాల్లో లక్ష ఇళ్లు, గ్రామీణ ప్రాంతాల్లో మరో లక్ష ఇళ్లను హడ్కో రుణ సాయంతో నిర్మిస్తామని ప్రకటించారు. హైదరాబాద్‌లో అధునాతనంగా నిర్మించే నాలుగు కొత్త ఆసుపత్రులకు నెదర్లాండ్స్‌లోని రాబో బ్యాంకు సాయం తీసుకుంటామని తెలిపారు. సంక్షేమానికి సముచిత ప్రాధాన్యం ప్రణాళికా వ్యయానికి సంబంధించిన కేటాయింపుల్లో సాగునీటి రంగం తర్వాత ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల సంక్షేమానికి ప్రభుత్వం ఎక్కువ నిధులు కేటాయించింది. వీటికి రూ.13,355 కోట్లు ప్రణాళిక వ్యయంలో చూపించింది. ఆ తర్వాత గ్రామీణాభివృద్ధికి రూ.6,564.96 కోట్లు, రోడ్లు, రవాణా రంగానికి రూ.4,711 కోట్లు, వైద్యారోగ్యానికి రూ.2,462.83 కోట్లు ప్రణాళిక పద్దు కింద కేటాయించింది. పట్టణాలు, నగరాభివృద్ధికి రూ.2,141.75 కోట్లు, వ్యవసాయానికి రూ.2,111.11 కోట్లు, విద్యారంగానికి రూ.1,780.44 కోట్లు కేటాయించింది. నిరుటితో పోలిస్తే గ్రామీణాభివృద్ధికి, వ్యవసాయానికి, విద్యుత్ రంగానికి, తాగునీటి సరఫరాకు నిధుల వాటా తగ్గించింది. ఈసారి కొత్త పథకాలివే.. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రత్యేక అభివృద్ధి నిధి కింద బడ్జెట్లో రూ.4,675 కోట్లు కేటాయించడం గమనార్హం. అనుకోని అవసరాలకు కేటాయించేందుకు వీలుగా వీటిని ముఖ్యమంత్రి, మంత్రులు, జిల్లా కలెక్టర్ల దగ్గర అందుబాటులో ఉంచుతారు. బ్రాహ్మణ సంక్షేమ నిధికి రూ.100 కోట్లు, కల్యాణ లక్ష్మి పథకాన్ని బీసీలతో సహా అన్ని వర్గాల్లోని పేద కుటుంబాలకు విస్తరించటం, కాలేజీలు, యూనివర్సిటీల విద్యార్థులకు సన్న బియ్యం.. ఈసారి బడ్జెట్లో కొత్త పథకాలు! ఆసరా ఫించన్లకు ఈ ఏడాది కూడా రూ.4,693 కోట్లు కేటాయించారు. రైతుల రుణమాఫీ పథకానికి మూడో విడత చెల్లింపులకు రూ.4,250 కోట్లు, విద్యుత్ సబ్సిడీకి రూ.4,470 కోట్లు, బియ్యం సబ్సిడీకి రూ.2,200 కోట్లు బడ్జెట్లో పొందుపరిచారు. పోలీసుశాఖకు రూ. 4,817 కోట్లు - ప్రణాళిక పద్దుల కింద గతేడాదికన్నా ఆరురెట్లు అధిక నిధులు - కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు రూ. 140 కోట్ల కేటాయింపులు - పోలీసు సిబ్బంది క్వార్టర్లకు రూ. 70 కోట్లు - నక్సల్స్, ఉగ్రవాదుల కట్టడికి రూ. 28 కోట్లు పోలీసుశాఖపై రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో వరాల జల్లు కురిపించింది. శాంతిభద్రతలు అదుపులో ఉంటేనే రాష్ట్రం అభివృద్ధి మార్గంలో పయనిస్తుందనే ఉద్దేశంతో పోలీసుశాఖ అడిగిన వాటికి కాదనకుండా కేటాయింపులు చేసింది. 2016-17 ఆర్థిక సంవత్సరానికి ప్రణాళిక, ప్రణాళికేతర పద్దుల కింద రూ. 4,817 కోట్లు కేటాయించింది. గతేడాది ప్రణాళిక వ్యయం కింద కేవలం రూ. 200 కోట్లే కేటాయించగా ఈ ఏడాది ఆరు రెట్లు అధికంగా రూ. 1,200 కోట్లు కేటాయించింది. ప్రణాళికేతర వ్యయం కింద గతేడాది రూ. 3,504.70 కోట్లు ఖర్చు కావడంతో ఈ ఏడాది రూ. 3,617 కోట్లు కేటాయించింది. కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు భారీ కేటాయింపు.. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్న కమాండ్ కంట్రోల్ సెంటర్ (సీసీటీ)కు ప్రభుత్వం భారీ కేటాయింపులు చేసింది. దాదాపు ఏడు ఎకరాల విస్తీర్ణంలో నిర్మించనున్న సీసీటీ టవర్ల నిర్మాణానికి దాదాపు రూ. 140 కోట్లు కేటాయించింది. అలాగే పోలీసు సిబ్బంది క్వార్టర్ల నిర్మాణానికి రూ.70 కోట్లు, సీసీటీవీల పర్యవేక్షణ కోసం రూ. 225 కోట్లు, జిల్లాల్లోని పోలీసుస్టేషన్లలో రిసెప్షన్ సెంటర్ల ఏర్పాటుకు రూ. 80 కోట్ల కేటాయింపులు చేసింది. గతేడాది కమిషనరేట్‌గా రూపాంతరం చెందిన వరంగల్ సీపీ ఆధునీకరణకు రూ. 25 కోట్లు కేటాయించగా పోలీసు అకాడమీకి రూ.32 కోట్లు కేటాయించింది. అగ్నిమాపకశాఖకు 223 కోట్లు... ఏళ్లుగా నిరాదరణ కు గురవుతున్న అగ్నిమాపకశాఖకు ప్రభుత్వం భారీగా నిధులు కేటాయించింది. అగ్నిమాపకశాఖను బలోపేతం చేసేలా ప్రణాళిక పద్దుల కింద రూ. 111 కోట్లు కేటాయించింది. గత బడ్జెట్ ప్రణాళిక పద్దుల కింద కేవలం రూ. 41 కోట్లు మాత్రమే కేటాయించగా ఈసారి దాదాపు మూడు రెట్లు పెంచింది. రాష్ట్రంలో 22 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఇప్పటివరకు ఫైర్ స్టేషన్లు లేకపోవడంతో తక్షణం ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. మొత్తంగా రాష్ట్రంలో కొత్తగా 63 ఫైర్ స్టేషన్ల ఏర్పాటుకు రూ. 64 కోట్లు కేటాయించింది. తక్షణ చర్యలకు ప్రత్యేక నిధులు... ఆకస్మిక సంఘటనలు జరిగినప్పుడు పోలీసుశాఖ తక్షణ చర్యలు చేపట్టేందుకు వీలుగా బడ్జెట్లో పోలీసు సూపరింటెండెంట్, నగర పోలీసు కమిషనర్ల కు రూ. కోటి చొప్పున నిధులు కేటాయించింది. రాష్ట్ర పోలీసు డెరైక్టర్ జనరల్ పరిధిలో రూ. 10 కోట్లు కేటాయిస్తామని తెలిపింది. ఆకస్మిక పరిస్థితుల నిర్వహణ కు పోలీసు విభాగానికి రూ. 20 కోట్లు కేటాయించారు. నక్సల్స్, ఉగ్రవాదుల క ట్టడి కోసం దాదాపు రూ. 28 కోట్లు కేటాయింపులు చేశారు. జాతీయ రహదారి భ ద్రతను ఇక నుంచి పోలీసులే పర్యవేక్షించాలని భావిస్తున్న ప్రభుత్వం అందుకు అనుగుణంగా స్పీడ్‌గన్స్, నూ తన పోలీస్స్టేషన్ల ఏర్పాటుకు బడ్జెట్లో ప్రతిపాదనలు చేసింది. పెట్రోలింగ్ వాహనాలకు రూ. 23 కోట్లు కేటాయించింది. -
సర్వశ్రేయోనిధికి రూ.50 కోట్ల గ్రాంటు
సాక్షి, హైదరాబాద్: దేవాదాయ శాఖ సర్వశ్రేయోనిధికి ప్రభుత్వం రూ.50 కోట్లు గ్రాంటుగా ప్రకటించింది. పురాతన దేవాలయాల జీర్ణోద్ధరణ, కొత్త ఆలయాలను ధూపదీప నైవేద్యాల పథకం కిందకు తేవటం, బలహీన వర్గాల కాలనీల్లో రామాలయాల నిర్మాణం కోసం ఈ నిధులు వినియోగిస్తారు. బలహీన వర్గాల వాడల్లో రామాలయాల నిర్మాణ పనులకు సంబంధించి దాదాపు రూ.43 కోట్ల బకాయిలు పేరుకుపోయాయి. ఈ నేపథ్యంలో కనీసం రూ.100 కోట్లు కావాలంటూ దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ఇటీవల సీఎంను కోరారు. ఇక యువజన వ్యవహారాలు, పర్యాటక, సాంస్కృతిక శాఖకు రూ.232 కోట్లు ప్రతిపాదిస్తున్నట్లు మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. సాంస్కృతిక సారథికి రూ.25 కోట్లు అడగ్గా.. రూ.15 కోట్లు ప్రకటించారు. -
మండలిలో బడ్జెట్ ప్రవేశపెట్టిన కడియం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ను సోమవారం శాసనమండలిలో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ప్రవేశపెట్టారు. ఉదయం 11.35 గంటలకు బడ్జెట్ ప్రసంగాన్ని చదివారు. ‘‘ఉమ్మడి రాష్ట్రంలో అన్నివిధాలా దోపిడీకి గురైన తెలంగాణను బంగారు తెలంగాణగా తీర్చిదిద్దేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారు. దగాపడ్డ రైతన్నలకు మేలు చేకూర్చేందుకు సాగునీటి ప్రాజెక్టులకు, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, టీహబ్ తదితరాలకు భారీగా నిధులు కేటాయించడం హర్షణీయం. ఈ ప్రాజెక్టులు ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలవడం గర్వకారణం’’ అన్నారు. కడియం ప్రసంగిస్తుండగా అధికార పక్ష సభ్యులు చప్పట్లతో హర్షం వెలిబుచ్చారు. ఆయన ప్రసంగం పూర్తవగానే సభను 16వ తేదీకి మండలి చైర్మన్ స్వామిగౌడ్ వాయిదా వేశారు. -
కార్మిక శాఖకు కోతలు
సాక్షి, హైదరాబాద్: కార్మిక శాఖను ప్రభుత్వం నిరాశపరిచింది. గత బడ్జెట్‌తో పోల్చితే భారీగా కోత విధించింది. గత బడ్జెట్లో కింద రూ.70 కోట్లు ప్రకటించగా, ఈసారి 36.53 కోట్లతో సరిపెట్టింది. మొత్తం ప్రణాళిక, ప్రణాళికేతర వ్యయం కింద రూ.425.32 కోట్లు కేటాయించింది. కార్మికుల బీమా వైద్య సదుపాయాలకు ఒక్క రూపాయి కూడా ప్రకటించలేదు. ఉపాధి శిక్షణకు పెద్దపీట.. ఉన్నంతలో ఉపాధి శిక్షణ విభాగానికి కాస్త పెద్దపీట వేసింది. ఇటీవల యువతకు వివిధ రంగాల్లో ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహిస్తోంది. అలాగే విదేశాల్లో ఉపాధి అవకాశాల కోసం తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్‌పవర్ కంపెనీస్ ద్వారా ఉద్యోగాలు ఇప్పించే ప్రయత్నం చేస్తోంది. జిల్లాలోని ఉపాధి కల్పన కార్యాలయాల్లో కూడా ప్రత్యేక క్యాంపస్ రిక్రూట్మెంట్లు నిర్వహిస్తోంది. దీంతో ప్రత్యేక శిక్షణ కార్యక్రమాల కోసం ప్రభుత్వం బడ్జెట్లో రూ.26.17 కోట్లు కేటాయించింది. -
మహిళా, శిశు సంక్షేమానికి రూ. 1,552 కోట్లు
సాక్షి, హైదరాబాద్: మహిళా, శిశు సంక్షేమానికి 2016-17 బడ్జెట్లో రూ. 1,552 కోట్లను ప్రభుత్వం కేటాయించింది. ఇందులో ప్రణాళికా బడ్జెట్ కింద రూ. 1,481. 83 కోట్లు కేటాయించగా, ప్రణాళికేతర బడ్జెట్ కింద రూ. 70.74 కోట్లు కేటాయించారు. ప్రణాళికా బడ్జెట్లో గత బడ్జెట్ కంటే ఈసారి రూ. 166 కోట్లు అదనంగా కేటాయించగా, ప్రణాళికేతర బడ్జెట్లో కూడా రూ. 47 లక్షలు ఎక్కువగా కేటాయించడం గమనార్హం. కాగా ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించినట్లు బంగారుతల్లి పథకానికి నిధులు కేటాయించలేదు. సాంఘిక భద్రత, సంక్షేమం కోసం ఈ ఏడాది రూ. 697. 37 కోట్లు కేటాయించారు. గత ఏడాది సాంఘిక భద్రత, సంక్షేమం కోసం రూ. 730 .91 కోట్లు కేటాయించగా, ఈసారి తగ్గింది. ఐసీడీఎస్‌లో వృత్తి సేవల కింద అంగన్వాడీ వర్కర్ల చెల్లింపులకు వివిధ పద్దుల కింద వందలాది కోట్ల రూపాయలు కేటాయించారు. ఆరోగ్యలక్ష్మి కింద రూ. 396.77 కోట్లు కేటాయించారు. గత బడ్జెట్లో ఈ కేటాయింపులు కేవలం రూ. 35.68 కోట్లు మాత్రమే. బాలికా సంరక్షణ పథకం కింద రూ. 26.62 కోట్లు కేటాయించారు. ఐసీడీఎస్ వేతనాలకు కూడా గత సంవత్సరం కంటే రూ. 67 కోట్లు తగ్గించి బడ్జెట్ కేటాయింపులు జరిపారు. ఈసారి రూ. 50 కోట్లు మాత్రమే కేటాయింపులు చేశారు. గర్భిణులు, శిశువుల పౌష్టికాహారం కోసం కిందటేడు కంటే రూ. 200 కోట్లు అదనంగా కేటాయించడం విశేషం. -
ఆర్టీసీకి నిరాశే
బడ్జెట్లో రూ.236 కోట్లు కేటాయింపు సాక్షి, హైదరాబాద్: అప్పులు, నష్టాలతో సతమతమవుతున్న రాష్ర్ట రోడ్డు రవాణా సంస్థకు ప్రభుత్వం మొండిచేయి చూపింది. అంతర్గత సామర్థ్యం పెంచుకుని నష్టాలు తగ్గించుకోవాలన్న హితోపదేశంతోనే సరిపెడుతున్న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు బడ్జెట్ కేటాయింపుల్లోనూ అదే పంథా అవలంబించారు. ఈ బడ్జెట్లో కేవలం రూ.236 కోట్లను విదిల్చి చేతులు దులుపుకొన్నారు. గతేడాది కేటాయించిన మొత్తంలో సగం కూడా విడుదల చేయలేదు. గతేడాది ఆర్టీసీ సిబ్బంది వేతనాలు సవరించిన సమయంలో ఆర్టీసీని ఆదుకునేందుకు బడ్జెట్లో ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చిన సీఎం ప్రస్తుత బడ్జెట్లో దాని ఊసే ఎత్తలేదు. బడ్జెట్ ప్రతిపాదనలు చూసి ఆర్టీసీ యాజమాన్యం కంగుతినాల్సి వచ్చింది. కొత్త బస్సుల కొనుగోలుకు ప్రణాళిక పద్దు కింద రూ.40 కోట్లు ప్రకటించింది. బస్‌పాస్ రాయితీల రూపంలో నష్టపోతున్న మొత్తాన్ని రీయింబర్స్ చేసే క్రమంలో రూ.110 కోట్లు చూపింది. ప్రణాళికేతర పద్దు కింద మరో రూ.86 కోట్లను ప్రతిపాదించింది. గతేడాది రూ.150 కోట్లు ప్రకటించినా సవరించిన అంచనాలో దాన్ని రూ.91 కోట్లకు తగ్గించింది. గత బడ్జెట్ గడువు మరో పక్షం రోజులే ఉండగా ఇప్పటికీ నయా పైసా విడుదల కాలేదు. దీంతో తాజాగా కేటాయించిన నిధులు ఎంత వరకు విడుదల అవుతాయో చూడాల్సిందే. -
నీటిపై ‘కోటి’ ఆశలు
సాక్షి, హైదరాబాద్: కృష్ణా, గోదావరి నదీ జలాల్లో రాష్ట్రానికి హక్కుగా కలిగిన నికర, మిగులు జలాల్లోని నిర్ణీత వాటాలను సంపూర్ణంగా వినియోగంలోకి తేవడం.. సుమారు లక్ష కోట్ల ఖర్చుతో కోటి ఎకరాలకు పైగా కొత్త ఆయకట్టుకు నీరివ్వడం.. ఇలా ఘనమైన లక్ష్యాలను నిర్దేశించుకున్న రాష్ట్ర ప్రభుత్వం అందుకు తగ్గట్టుగానే బడ్జెట్లో సాగునీటి శాఖకు రూ.25 వేల కోట్లు కేటాయించింది! అయితే ఈ నిధుల ఖర్చు జరగాలంటే ప్రాజెక్టుల్లో వేగం, సకాలంలో నిధుల కేటాయింపులు, నిరంతర పర్యవేక్షణ అత్యంత ఆవశ్యకమని నీటిపారుదల రంగ నిపుణులు చెబుతున్నారు. గతేడాది బడ్జెట్లో రూ.11 వేల కోట్ల మేర కేటాయింపులు జరిపితే అందులో రూ.7 వేల కోట్లు మాత్రమే ఖర్చు చేశారని, ఇప్పుడు రూ.25 వేల కోట్లు ఖర్చు చేయడమంటే మాటలు కాదని అంటున్నారు. చేసింది గోరంత.. చేయాల్సింది కొండంత! ప్రస్తుతం రాష్ట్రంలో మొత్తంగా 2.76 కోట్ల ఎకరాల విస్తీర్ణం భూమి ఉంది. ఇందులో 1.67 కోట్ల విస్తీర్ణం భూమి సాగుకు యోగ్యంగా ఉంది. అయితే ఇందులో ప్రస్తుతం కేవలం 48.22 లక్షల ఎకరాల ఆయకట్టు మాత్రమే సాగులో ఉంది. మరో కోటి 20 లక్షల ఎకరాల ఆయకట్టును వృద్ధిలోకి తేవాల్సి ఉంది. ఇందులో ఇప్పటికే 60 లక్షల ఎకరాలకు ఆయకట్టు ఇచ్చే లక్ష్యంతో భారీ ప్రాజెక్టులు పురుడు పోసుకున్నాయి. 2004లో చేపట్టిన భారీ, మధ్యతరహా ప్రాజెక్టులను రూ.1.30 లక్షల కోట్లతో చేపట్టగా అందులో రూ.46 వేల కోట్లు ఖర్చు చేశారు. మరో రూ.84 వేల కోట్ల మేర పనులను పూర్తి చేయాల్సి ఉంది. రీ డిజైన్ పేరిట ఆ వ్యయం కాస్తా ఇప్పుడు లక్ష కోట్లకు చేరింది. వీటి కింద సుమారు 60 లక్షల ఎకరాల మేర ఆయకట్టుకు నీరివ్వాల్సి ఉండగా అందులో 8.87 లక్షల ఎకరాలకు మాత్రమే నీరిచ్చారు. ఇంకా 51 లక్షల ఎకరాలకు నీరివ్వాల్సి ఉంది. వీటితోపాటు కొత్తగా చేపట్టిన పాలమూరు, డిండి సహా ఇతర ప్రాజెక్టులతో కలిపితే ఆయకట్టు లక్ష్యం మరో 15 లక్షలు పెరుగుతుంది. ఇక చిన్న నీటి వనరుల కింద 22 లక్షల ఎకరాల మేర ఆయకట్టు ఉన్నా సాగులో ఉన్నది కేవలం 8 లక్షలు మాత్రమే.ఇదంతా కలిపితే కోటి ఎకరాల కొత్త ఆయకట్టు ఉంటుంది. మహబూబ్‌నగర్‌లోని కల్వకుర్తి, నెట్టెంపాడు, రాజీవ్ బీమా, కోయిల్‌సాగర్, నల్లగొండలోని ఏఎమ్మార్పీ, వరంగల్‌లోని దేవాదుల, కరీంనగర్, ఖమ్మం, నల్లగొండలకు సాగునీరు ఇచ్చే ఎస్సారెస్పీ-2, వరద కాలువ, కరీంనగర్‌లోని ఎల్లంపల్లి, ఖమ్మం జిల్లాకు చెందినరాజీవ్‌సాగర్, ఇందిరా సాగర్ ప్రాజెక్టు నిర్మాణాలు దాదాపు 80 శాతానికిపైగా పూర్తయ్యాయి. భూసేకరణ సమస్యలు పరిష్కరించి, పరిహారంలో జాప్యాన్ని నివారిస్తూ ముందుకెళ్తే 2017 జూన్ నాటికి 17.5 లక్షల ఎకరాల ఆయకట్టు లక్ష్యాలను ప్రభుత్వం చేరుకునే అవకాశం ఉంది. -
మిషన్ కాకతీయకు రూ.2,255 కోట్లు
గత ఏడాదితో పోలిస్తే కాస్త ఎక్కువే సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మిషన్ కాకతీయ పథకానికి ప్రభుత్వం ఈ ఏడాది ఆశించిన స్థాయిలోనే నిధులను కేటాయించింది. గత ఏడాదితో పోలిస్తే సుమారు రూ.172 కోట్ల మేర అదనపు కేటాయింపులు చేసి మొత్తంగా రూ.2,255 కోట్లు కేటాయింపులు జరిపింది. ఈ నిధులతో సుమారు 9 వేలకు పైగా చెరువులను పునరుద్ధరించనుంది. ఇందులో చిన్న నీటి చెరువుల పునరుద్ధరణకు రూ.1,410.15 కోట్లు కేటాయించగా, ఇదే మిషన్ కాకతీయలో పెద్దతరహా పనులైన మినీ ట్యాంక్బండ్లు ఇతర చెరువుల కోసం రూ.737.93 కోట్లు కేటాయించారు. ఇందులో సత్వర సాగునీటి ప్రాయోజిత కార్యక్రమం (ఏఐబీపీ) కింద రూ.100 కోట్లు, గ్రామీణ మౌలిక సదుపాయాల అభివృధ్ధి నిధి (ఆర్ఐడీఎఫ్) కింద రూ.5 కోట్లు, ట్రిపుల్ ఆర్ కింద మరిన్ని నిధులు వస్తాయని అంచనా వేసింది. -
సాగుపై శీతకన్ను
ఏకమొత్తంగా రుణమాఫీ లేనట్లే! * ఇన్పుట్ సబ్సిడీకి నిధులు కరువు * పాడి ప్రోత్సాహకంపై నీళ్లు... బడ్జెట్లో నిధులు కేటాయించని వైనం * పావలా వడ్డీ పంట రుణాల పథకం ఎత్తివేత!.. వ్యవసాయ, అనుబంధ రంగాలకు రూ.6,759కోట్లు సాక్షి, హైదరాబాద్: వ్యవసాయంపై రాష్ట్ర ప్రభుత్వం శీతకన్ను వేసింది. ఒకవైపు కరువు, మరోవైపు రైతుల ఆత్మహత్యలు పెరిగిపోతున్నా... సాగుకు బడ్జెట్ కేటాయింపులపై నిర్లక్ష్యం చూపింది. కరువులో ఇన్పుట్ సబ్సిడీ నిధులను ప్రకటించకపోవడంపై, రైతు ఆత్మహత్యల నివారణకు నిధిని ఏర్పాటు చేయకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గతేడాది ఖరీఫ్ పంట నష్టాన్ని ఆధారం చేసుకొని రాష్ట్రంలో 231 కరువు మండలాలను ప్రకటించారు. రైతు సంఘాల లెక్కల ప్రకారం దాదాపు 1,800 మందికిపైగా రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. కానీ బడ్జెట్లో నిధుల కేటాయింపులు మాత్రం పెరగలేదు. టీఆర్ఎస్ సర్కారు ప్రధాన హామీ అయిన రుణమాఫీపైనా సర్కారు శీతకన్ను వేసింది. రుణమాఫీలోని మొత్తం నాలుగు విడతల్లో రెండు విడతల సొమ్మును బ్యాంకులకు చెల్లించాల్సి ఉన్నా... ఒక వాయిదా మాత్రమే చెల్లిస్తామని బడ్జెట్లో ప్రకటించింది. ఇందుకోసం ప్రణాళికేతర బడ్జెట్లో రూ.4,250కోట్లు చూపింది. ప్రభుత్వం రుణమాఫీ సొమ్మును పూర్తిగా చెల్లించకపోవడంతో ఇప్పటికే బ్యాంకులు రుణాలివ్వక ఇబ్బందులు పడుతున్న రైతులకు మరిన్ని సమస్యలు తప్పేలా లేవు. ఇక పాడి రైతులకు ఇస్తున్న లీటర్‌కు రూ.4 ప్రోత్సాహకానికి బడ్జెట్లో నిధులు కేటాయించకపోవడం గమనార్హం. పశుసంవర్థకశాఖ అధికారులు దీనికోసం రూ.109 కోట్లు కావాలని కోరినా మొండిచెయ్యి చూపారు. అంటే పాడి ప్రోత్సాహకాన్ని ఎత్తేస్తారేమోనన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పాలిహౌస్కు తగ్గిన నిధులు 2016-17 బడ్జెట్లో వ్యవసాయ, ఉద్యాన, సహకార, మార్కెటింగ్ తదితర అనుబంధ రంగాలకు రూ.6,758.53 కోట్లు కేటాయించింది. అందులో ప్రణాళిక బడ్జెట్ రూ.1,821.24 కోట్లు. పశు సంవర్థక, మత్స్యశాఖలకు రూ.647.64 కోట్లు కేటాయించగా.. అందులో ప్రణాళిక బడ్జెట్ రూ.247.56 కోట్లుగా చూపారు. మొత్తంగా వ్యవసాయశాఖ ప్రణాళికేతర బడ్జెట్లో రూ.4,250 కోట్లను రైతుల రుణమాఫీ కోసం కేటాయించడం గమనార్హం. ప్రభుత్వం రుణమాఫీలో మొత్తం నాలుగు విడతలకు గాను ఇప్పటివరకు రెండు విడతలు నిధులు చెల్లించింది. ఇది మూడో విడత కానుంది. ఇక పాలిహౌస్ సాగుకు 75 శాతం సబ్సిడీ ఇచ్చేందుకు గత బడ్జెట్లో రూ.250 కోట్లు ఇవ్వగా... ఈ బడ్జెట్లో రూ.199.50కోట్లను మాత్రమే ప్రతిపాదించారు. ఇందులో ఎస్సీ రైతులకు రూ.30.90కోట్లు, ఎస్టీ రైతులకు రూ.18.16కోట్లు కేటాయించారు. 600 మంది ఎస్సీ, ఎస్టీ రైతులకు నూటికి నూరు శాతం సబ్సిడీ ఇస్తామని... మొత్తంగా వెయ్యి ఎకరాలకు సబ్సిడీ ఇస్తామని ప్రకటించారు. మార్కెట్లో ధరల స్థిరీకరణ కోసం గత బడ్జెట్లో రూ.75కోట్లు కేటాయించిన ప్రభుత్వం... ఈసారి ఒక్క పైసా కేటాయించలేదు. వ్యవసాయ యాంత్రీకరణకు మాత్రం రూ.250కోట్లు చూపారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఘనంగా చెప్పుకొనే పంట కాలనీలు, భూమి, నీటి విశ్లేషణకు ఒక్కపైసా కేటాయించకపోవడం గమనార్హం. పావలా వడ్డీ పంట రుణాల పథకానికీ నిధులివ్వలేదు. ప్రాథమిక సహకార సంఘాల (పాక్స్)కు సాయం చేసేందుకు కొత్తగా పథకాన్ని ఏర్పాటు చేసి, రూ.14.95 కోట్లు కేటాయించారు. వ్యవసాయ, అనుబంధ రంగాలకు కేటాయింపులు ⇒ చిన్న, సన్నకారు రైతులకు పంటల బీమా ప్రీమియంలో సాయానికి రూ.134 కోట్లు ⇒ రైతులకు విత్తనాల సరఫరాకు రూ.60.33కోట్లు, సీడ్‌చైన్ పథకాన్ని బలోపేతం చేసేందుకు రూ.33.80కోట్లు ⇒ కేంద్ర సహకారంతో నిర్వహించే పథకమైన ప్రధానమంత్రి కృషి సించాయి యోజన పథకానికి రూ.4.75 కోట్లు ⇒ సూక్ష్మ సేద్యానికి రూ.140కోట్లు ⇒ జాతీయ ఉద్యాన ప్రాజెక్టుకు 70 కోట్లు ⇒ క్షేత్రస్థాయి వెటర్నరీ సంస్థలకు మౌలిక సదుపాయాల కోసం రూ.54.96 కోట్లు ⇒ గడ్డి, దాణా అభివృద్ధి కోసం 13.50 కోట్లు ⇒ వెటర్నరీ సేవలకు రూ.28.37 కోట్లు ⇒ జంతువులు, కోళ్ల ఉత్పత్తి ప్రోత్సాహకానికి రూ.21.06 కోట్లు ⇒ మత్స్యశాఖ అభివృద్ధికి రూ.70.15 కోట్లు ⇒ చేప విత్తన క్షేత్రాల కోసం రూ.29 కోట్లు ⇒ ‘చుక్కనీటితో ఎక్కువ పంట’ కోసం రూ.112 కోట్లుర కరువు సాయమేదీ?: రైతు సంఘాలు బడ్జెట్లో ప్రభుత్వం కరువు సాయం కోసం నిధులు కేటాయించలేదని అఖిల భారత రైతు సంఘం ఉపాధ్యక్షుడు సారంపల్లి మల్లారెడ్డి విమర్శించారు. రుణమాఫీకి కేటాయించిన ప్రణాళికేతర బడ్జెట్ కేటాయింపులు తీసేస్తే ప్రభుత్వం వ్యవసాయానికి కేవలం 1.8 శాతమే కేటాయించిందని ఆయన పేర్కొన్నారు. పాడి రైతులకు లీటర్‌కు రూ.4 ప్రోత్సాహకానికి బడ్జెట్లో నిధులు కేటాయించలేదని తెలంగాణ ఆదర్శ పాడి రైతు సంఘం ప్రధాన కార్యదర్శి కందాల బాల్‌రెడ్డి విమర్శించారు. ఆ పథకాన్ని ఎత్తేసేందుకు కుట్ర జరుగుతోందని ఆరోపించారు. -
‘రెవెన్యూ’కు నిరాశ
బడ్జెట్ కేటాయింపుల్లో గతేడాది కన్నా రూ.300 కోట్ల గండి సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కీలకమైన రెవెన్యూ శాఖకు తాజా బడ్జెట్లో నిరాశే మిగిలింది. పైగా గత సంవత్సరం కంటే తక్కువ నిధులను ప్రభుత్వం కేటాయించింది. సిబ్బంది వేతనాలు, కార్యాలయాల ఖర్చులు, అద్దె వాహన చార్జీలకు మాత్రమే నిధులను కేటాయించింది. శాఖాపరంగా తీసుకురాదలిచిన సంస్కరణలకు ఊతమిచ్చే ప్రయత్నం చేయలేదు. గత ఏడాది బడ్జెట్లో రూ.1,687 కోట్లు కేటాయించిన ప్రభుత్వం ఈ ఏడాది కేటాయింపుల్లో రూ.300 కోట్లకుపైగా కోత పెట్టింది. ఈసారి 1,384.13 కోట్లను మాత్రమే కేటాయించింది. ఇందులో ప్రణాళికా వ్యయం కింద రూ.46.76 కోట్లు, ప్రణాళికేతర పద్దులో రూ.1337.37 కోట్లు ఉన్నాయి. అన్ని గ్రామాల్లోనూ వీఆర్వో కార్యాలయాలు, రెవెన్యూ డివిజన్లలో ఆర్డీవో ఆఫీసులు, కలెక్టరేట్లకు కొత్త భవనాల నిర్మాణానికి బడ్జెట్లో నిధులు కేటాయించలేదు. తాజా రెవెన్యూ చట్టాలపై సిబ్బందికి శిక్షణ, రెవెన్యూ వ్యవస్థ సంపూర్ణ కంప్యూటరీకరణకు కేవలం రూ.కోటితో సరిపెట్టింది. రెవెన్యూ శాఖకు సంబంధించి సచివాలయ విభాగానికి రూ.10.71 కోట్లు, జిల్లాల్లో భూపరిపాలన విభాగానికి రూ.859 కోట్లు కేటాయించింది. -
తలసరి అప్పు రూ.35,373
రెండేళ్లలో రెండింతలు అవుతున్న అప్పులు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రం అప్పుల కుప్పలా మారుతోంది. ఏటికేడు అప్పులు, వడ్డీల భారం రాష్ట్రాన్ని వణికిస్తోంది. రాష్ట్ర విభజన సమయంలో రూ.70 వేల కోట్ల అప్పులు ఉండగా... 2016-17 ఆర్థిక సంవత్సరంలో రూ.1.23 లక్షల కోట్లకు చేరుతున్నాయి. అంటే రుణభారం రెట్టింపవుతోంది. ఇదే సమయంలో మిషన్ భగీరథ, డబుల్ బెడ్రూం ఇళ్లు, ఆసుపత్రుల నిర్మాణాన్ని బడ్జెటేతర వనరుల ద్వారా చేపడతామని ప్రభుత్వం పేర్కొంది. మిషన్ భగీరథకు రూ.30 వేల కోట్లు, ఈ ఏడాది నిర్మించే 2.60 లక్షల డబుల్ బెడ్రూం ఇళ్లకు రూ.15 వేల కోట్లు, హైదరాబాద్‌లో నాలుగు ఆసుపత్రుల నిర్మాణానికి రూ.5వేల కోట్లు అవసరమని అంచనా. ఈ లెక్కన దాదాపు రూ.50 వేల కోట్ల దాకా అప్పులు తెచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. దీంతో అప్పుల భారం వచ్చే ఏడాది రూ.2 లక్షల కోట్లకు చేరినా ఆశ్చర్యం లేదని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. గతేడాది వడ్డీల కోసమే ప్రభుత్వం రూ.7,162 కోట్లు వ్యయం చేసింది. 2016-17లో వడ్డీల చెల్లింపులకు రూ.7,706 కోట్లు కావాలని తాజా బడ్జెట్లో అంచనా వేసుకుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 3.50 కోట్ల జనాభా ఉంది. ప్రభుత్వం చేసిన అప్పులను పంచితే తలసరి అప్పు రూ.35,373 చేరుతోంది. -
నిధులు పొంగాయి నీళ్లే పారాలి!
సాగునీటి పారుదల శాఖకు 25,000కోట్లు ప్రణాళిక బడ్జెట్ కింద 25 వేల కోట్ల కేటాయింపు * మొత్తంగా రూ.26,625.32 కోట్లు * పాలమూరు, ప్రాణహిత, సీతారామ ప్రాజెక్టులకు పెద్దపీట * పాలమూరుకు రూ.7,861 కోట్లు, కాళేశ్వరానికి రూ.6,286 కోట్లు, భక్తరామదాసు, సీతారామకు రూ.1151 కోట్లు * మహబూబ్‌నగర్, ఆదిలాబాద్ ప్రాజెక్టులకు భారీగా నిధులు సాక్షి, హైదరాబాద్: సాగునీటి రంగానికి నిధులు పొంగాయి! ముందునుంచి చెబుతున్నట్లుగానే 2016-17 బడ్జెట్లో నీటిపారుదల శాఖకు ప్రణాళికా వ్యయం కిందే మొత్తంగా రూ.25 వేల కోట్ల కేటాయింపులు చేశారు. గతేడాది ప్రణాళిక, ప్రణాళికేతర వ్యయం కన్నా సుమారు రూ.15 వేల కోట్లు అధికంగా కేటాయించి సాగునీటి రంగానికి పెద్దపీట వేశారు. టెండర్ల దశను దాటి పనులకు సిద్ధమవుతున్న పాలమూరు-రంగారెడ్డి, రీ డిజైన్ పూర్తయి ఇటీవల మహారాష్ట్రతో ఒప్పందాలు చేసుకున్న ప్రాణహిత-కాళేశ్వరం, కొద్దిరోజుల కిందట శంకుస్థాపన చేసిన సీతారామ, భక్తరామదాసు ప్రాజెక్టులకు బడ్జెట్లో అధిక ప్రాధాన్యం దక్కింది. ఈ మూడు ప్రాజెక్టులకు కలిపి మొత్తంగా రూ.15 వేల కోట్ల కేటాయింపులు చేశారు. ఇక వీటితోపాటే తక్షణ ఆయకట్టునిచ్చే ప్రాజెక్టులకు తొలి ప్రాధాన్యం ఇచ్చిన ఆర్థికమంత్రి ఈటల.. ఇతర ప్రాజెక్టులకూ ఊపిరి పోసేలా నిధుల కేటాయించారు. ప్రణాళిక, ప్రణాళికేతర వ్యయం కలిపి సాగునీటి రంగానికి బడ్జెట్లో మొత్తంగా రూ.26,625.32 కోట్లు కేటాయించిన ఆర్థికమంత్రి.. ఇందులో భారీ, మధ్య తరహా ప్రాజెక్టులకు రూ.23,893.66 కోట్లు, చిన్ననీటి పారుదలకు రూ.2,452.52 కోట్లు కేటాయించారు. పరీవాహక అభివృద్ధి విభాగానికి రూ.30.14 కోట్లు, వరద నిర్వహణకు రూ.249 కోట్లు కేటాయించారు. ఈ ఏడాది, వచ్చే ఏడాది కలుపుకొని ప్రాజెక్టుల కింద 16 లక్షల ఎకరాల ఆయకట్టు లక్ష్యంగా కదులుతున్న ప్రభుత్వం ఆ మేరకు ప్రాజెక్టు పరిధిలో పనుల పురోగతిని దృష్టిలో ఉంచుకొని నిధులు కేటాయించింది. కరువు జిల్లాకు కావాల్సినంత కరువు, వలసలతో కొట్టుమిట్టాడుతున్న పాలమూరు జిల్లాలో సాగునీటిని పారించేందుకు కావాల్సినన్ని నిధులు కేటాయించారు. గత ఏడాదే శంకుస్థాపనకు నోచుకున్న పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలకు గతేడాది బడ్జెట్లో రూ.100 కోట్ల నిధులే కేటాయించారు. ఈ ఏడాది ఏకంగా రూ.7,861 కోట్లు కేటాయించారు. రూ.35,200 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన ఈ ప్రాజెక్టుకు తొలి ఏడాదే సుమారు 30 శాతం నిధులు కేటాయించడం గమనార్హం. ఇక జిల్లాలోని నాలుగు ప్రధాన భారీ, మధ్య తరహా ప్రాజెక్టులైన కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్ ప్రాజెక్టులకు ఈ ఏడాది అనుకున్న స్థాయిలో నిధులు కేటాయించారు. ఈ ప్రాజెక్టులు పూర్తయితే సుమారు 70 టీఎంసీల కృష్ణా జలాలు వినియోగంలోకి వస్తుండటం, వీటితో వచ్చే ఖరీఫ్ నాటికే సుమారు 4 లక్షల ఎకరాలకు నీరందించే అవకాశాలు ఉండడం, పెండింగ్‌లో ఉన్న భూసేకరణ, సహాయ పునరావాసం అంశాలు కొలిక్కి వచ్చిన నేపథ్యంలో ప్రభుత్వం భారీ కేటాయింపులకు మొగ్గు చూపింది. ఈ ప్రాజెక్టులకు మొత్తంగా రూ.950 కోట్ల వరకు అవసరం ఉండగా రూ.600 కోట్ల వరకు కేటాయించారు. భారీ ప్రాజెక్టులకు అంతే భారీగా రాష్ట్రంలో ఇప్పటికే నిర్మాణంలో ఉన్న భారీ ప్రాజెక్టులకు అంతే భారీస్థాయిలో కేటాయింపులు చేశారు. రెండేళ్లలో పూర్తిస్థాయిలో వినియోగంలోకి తేవాలని భావిస్తున్న సీతారామ, భక్త రామదాసు ప్రాజెక్టులకు కలిపి రూ.1,151 కోట్ల మేర నిధులు కేటాయించారు. వచ్చే జూన్ నాటికి పూర్తి ఆయకట్టునిచ్చే ప్రాజెక్టుల్లో ఉన్న దేవాదులకు రూ.695 కోట్లు, ఇందిరమ్మ వరద కాల్వకు రూ.505 కోట్లు, ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రాజెక్టుకు రూ.1,417 కోట్ల మేర కేటాయింపులు చేశారు. టన్నెల్ ప్రాజెక్టును వేగంగా పూర్తి చేయాలన్న ఉద్దేశంతో గతేడాది ఈ ప్రాజెక్టుకు రూ.600 కోట్ల మేర కేటాయింపులు చేస్తే.. ఈ ఏడాది రెట్టింపు చేశారు. ఇక అంతర్రాష్ట్ర వివాదాలకు పరిష్కారం దొరికిన దిగువ పెన్‌గంగకు రూ.124 కోట్లు కేటాయించగా, నిజాంసాగర్, నాగార్జునసాగర్ ఆధునీకరణకు కలిపి మొత్తంగా రూ.660 కోట్లు కేటాయించారు. వీటితోపాటు ఎస్సారెస్పీ-1, 2లకు రూ.300 కోట్లు, ఆదిలాబాద్ జిల్లాలోని మధ్య తరహా ప్రాజెక్టులకు తగినన్ని నిధుల కేటాయించారు. ప్రాణహిత, కాళేశ్వరానికి విడివిడిగా.. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రాణహిత, కాళేశ్వరం ఎత్తిపోతలకు బడ్జెట్లో విడివిడిగా కేటాయింపులు చేశారు. ఆదిలాబాద్ జిల్లాకే పరిమితం చేసిన ప్రాణహితకు రూ.685 కోట్లు కేటాయించగా.. కాళేశ్వరానికి రూ.6,286 కోట్లు కేటాయించారు. మొత్తంగా ఈ ప్రాజెక్టుకు రూ.6,971 కోట్లు కేటాయించారు. గడిచిన ఆరేళ్లలో ఈ ప్రాజెక్టుకు ఎంత మొత్తంలో నిధులు కేటాయించారో దానికి సమానంగా ఈ ఏడాది బడ్జెట్ కేటాయింపులు ఉండటం విశేషం. రెండేళ్లలో మేడిగడ్డ-ఎల్లంపల్లి బ్యారేజీ నిర్మాణం పూర్తి, ఆయకట్టులో కనీసం 2 నుంచి 4 లక్షల ఎకరాలకు నీరివ్వాలని నిర్ణయించిన నేపథ్యంలో కేటాయింపులు పెరిగాయి. -
కేజీ టు పీజీకి మొండిచేయి
* బడ్జెట్లో ప్రత్యేక నిధులు కేటాయించని సర్కారు * విద్యాశాఖ అదనంగా రూ.500 కోట్లు అడిగితే ఇచ్చిందేమీ లేదు * పాఠశాల విద్యకు తగ్గిన కేటాయింపు * విద్యాశాఖకు మొత్తంగా రూ.10,738.62 కోట్లు * గతేడాది కంటే 477.47 కోట్ల తగ్గింపు సాక్షి, హైదరాబాద్: వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రారంభించాలనుకుంటున్న ప్రతిష్టాత్మక కేజీ టు పీజీ పథకానికి రాష్ట్ర ప్రభుత్వం మొండిచేయి చూపింది. బడ్జెట్లో దీనికి ప్రత్యేకంగా పైసా కూడా కేటాయించలేదు. దీంతో రాష్ట్రంలోని అన్ని గురుకులాలను ఒకే సొసైటీ పరిధిలోకి తీసుకు వచ్చి కేజీ టు పీజీ పథకాన్ని ప్రారంభించాలని భావిస్తున్న విద్యాశాఖకు నిరాశ ఎదురైంది. 2015-16 బడ్జెట్లో గురుకులాల నిర్వహణ కోసం గురుకుల విద్యాలయాల సొసైటీకి రూ.76.64 కోట్లు కేటాయించిన ఆర్థిక శాఖ.. ఈసారి గురుకులాల నిర్వహణతోపాటు కేజీ టు పీజీని కూడా పేర్కొంటూ రూ.73.84 కోట్లు కేటాయించింది. విద్యాశాఖ కేజీ టు పీజీ కింద 120 కొత్త గురుకులాలను ప్రారంభిస్తామని, వాటికి రూ.500 కోట్లు కావాలని ప్రభుత్వాన్ని కోరింది. ప్రస్తుతం వివిధ సొసైటీల పరిధిలోని 668 గురుకుల పాఠశాలలు, 391 కస్తూర్భాగాంధీ బాలిక విద్యాలయాలు ఉండగా మైనారిటీల కోసం 70 గురుకులాలను ప్రారంభించేందుకు ప్రభుత్వం ఓకే చెప్పింది. వాటితోపాటు మరో 120 గురుకులాలను కొత్తగా నిర్మిస్తే (గతంలో మోడల్ స్కూల్స్ ఫేజ్-2 కింద స్థలాలు గుర్తించినవి) కేజీ టు పీజీలో భాగంగా నియోజకవర్గానికి 10కి పైగా గురుకులాలను కేజీ టు పీజీ స్కూళ్లుగా కొనసాగించవచ్చని విద్యాశాఖ భావించింది. ఇందులో భాగంగానే ఒక్కో దానికి రూ.4 కోట్ల చొప్పున దాదాపు రూ.500 కోట్లు కావాలని ఆర్థిక శాఖకు బడ్జెట్ ప్రతిపాదనలు పంపించింది. కానీ బడ్జెట్లో ఆ మొత్తాన్ని కేటాయించకపోగా.. అత్తెసరు కేటాయింపులతోనే అన్నింటిని (గురుకులాలు, కేజీ టు పీజీ) చూసుకోవాలని పేర్కొన్నారు. 14 వేల కోట్లకు పైగా అడిగితే..! రాష్ట్రంలో ఒక్క పాఠశాల విద్యాశాఖకే రూ.14 వేల కోట్లకు పైగా నిధులు కావాలని విద్యాశాఖ ప్రతిపాదిస్తే వాటిని ఆర్థిక శాఖ పక్కనపెట్టేసింది. కేవలం రూ.8,574 కోట్ల కేటాయింపులతో సరిపెట్టింది. ఖర్చులు, నిర్వహణ వ్యయం పెరిగినందున ప్రణాళికేతర వ్యయం కింద రూ.10,533 కోట్లు అవసరమని ప్రతిపాదించినా పట్టించుకోలేదు. ప్రణాళికేతర పద్దులో భారీగా కోత పాఠశాల, ఉన్నత, సాంకేతిక విద్యాశాఖలకు 2015-16 ఆర్థిక సంవత్సరంలో రూ.11,216.09 కోట్ల బడ్జెట్ కేటాయించగా, ఈసారి దానిని రూ.10,738.62 కోట్లకు తగ్గించారు. ముఖ్యంగా ప్రణాళికేతర పద్దులో ప్రభుత్వం భారీగా కోత విధించింది. గతేడాది ప్రణాకేతర పద్దు కింద రూ.7,976.43 కోట్లు చూపగా.. ఈసారి రూ.7,290.94 కోట్లు కేటాయించింది. రూ.685.49 కోట్ల మేర కోత పెట్టింది. పాఠశాల విద్యాశాఖ ఉద్యోగులు, ఉపాధ్యాయుల కోసం 2015-16 బడ్జెట్లో కరువు భత్యం (డీఏ) కింద రూ.1,250 కోట్లు ప్రతిపాదించగా సవరించిన అంచనాల మేరకు రూ.550 కోట్ల వరకు వెచ్చించింది. దీంతో ఆ సవరించిన అంచనాల ప్రకారం ఈసారి (2016-17) నాన్‌ప్లాన్ బడ్జెట్లో ఆ మేరకు కేటాయింపులు తగ్గించి, డీఏ కింద రూ.500 కోట్ల మేర కేటాయించారు. ఇక 2014-15 సంవత్సరంలో ప్రణాళిక వ్యయం కింద పాఠశాల విద్యకు రూ.3,510.56 కోట్లు కేటాయించగా.. 2015-16 సంవత్సరంలో రూ. 1,078.06 కోట్లకు తగ్గించింది. ఈసారి కాస్త పెంచి రూ.1,283.69 కోట్లకు పెంచింది. అయితే విద్యాశాఖ అడిగిన మొత్తంతో ( రూ. 3,591 కోట్లు) పోల్చితే 40 శాతం కూడా ఇవ్వలేదు. ఎస్ఎస్ఏకు పెరిగిన కేటాయింపులు కేంద్ర భాగస్వామ్యంతో రాష్ట్రంలో అమలు చేస్తున్న వివిధ పథకాల్లో రాష్ట్ర వాటా పెరగడంతో కిందటేడాది కేటాయింపుల కంటే ఈసారి 205.63 కోట్లు అదనంగా కేటాయించారు. అదీ ఎక్కువ మొత్తం సర్వ శిక్షా అభియాన్‌కే పెంచారు. రాష్ట్రీయ ఉచ్చతర్ శిక్షా అభియాన్, రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్‌కు నిధులను తగ్గించారు. మరోవైపు మధ్యాహ్న భోజనం, కంప్యూటర్ విద్య తదితర పథకాల్లో గతంలో కొన్నింటిలో కేంద్ర రాష్ట్ర వాటా 65:35, 70:30, 75:25గా ఉండేది. ఈ ఆర్థిక సంవత్సరం నుంచి కేంద్రం అన్నింటికి 60 శాతమే ఇస్తామని, రాష్ట్రాలు 40 శాతం నిధులను వెచ్చించాల్సిందేనని స్పష్టం చేయడంతో ప్రణాళిక వ్యయం కింద ఎస్ఎస్ఏకు నిధుల కేటాయింపును పెంచింది. -
ఆస్పత్రులకు టానిక్
* బడ్జెట్లో వైద్యారోగ్యశాఖకు రూ.5,966.88కోట్లు * గత ఏడాదికన్నా రూ.వెయ్యి కోట్లు అదనంగా కేటాయింపు సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వాస్పత్రుల ఆధునీకరణతోపాటు కొత్తగా మల్టీస్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణం దిశగా రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో నిధులు కేటాయించింది. 2016-17 బడ్జెట్లో వైద్య ఆరోగ్యశాఖకు రూ.5,966.88కోట్ల మేర ప్రతిపాదించింది. ఇందులో ప్రణాళిక కింద రూ.2,462.83కోట్లు, ప్రణాళికేతర బడ్జెట్ రూ.3,504.05కోట్లు చూపారు. మొత్తంగా వైద్యారోగ్యశాఖకు గతేడాది కంటే రూ.1,036 కోట్లు అదనంగా కేటాయించారు. ప్రణాళికా బడ్జెట్ మాత్రం గత ఏడాదితో ప్రణాళిక బడ్జెట్‌తో దాదాపు సమానంగా ఉండడం గమనార్హం. హైదరాబాద్‌లో 4 మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణం, 40 చోట్ల డయాలసిస్ కేంద్రాలు, మరో 40 చోట్ల డయాగ్నస్టిక్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని బడ్జెట్లో పేర్కొన్నారు. వైద్య పరికరాల కొనుగోలుకు, ఉన్న వాటిని మార్చడానికి రూ.600కోట్లు కేటాయించారు. డయాగ్నస్టిక్ పరికరాలు, పాత పడకల మార్పు, సివిల్ పనుల మరమ్మతులకు రూ.316కోట్లు ఇచ్చారు. ఔషధాలు తదితరాల కోసం రూ.225కోట్లు కేటాయించారు. పారిశుద్ధ్యం, సేవలకు రూ.100 కోట్లు కేటాయించారు. ఆరోగ్యశ్రీకి రూ.464కోట్లు వైద్య విద్య సంచాలకుల (డీఎంఈ) విభాగానికి గతేడాది కంటే తక్కువగా రూ.784.87కోట్లు కేటాయించారు. ఈ విభాగంలో భాగంగా ఉన్న ఆరోగ్యశ్రీకి రూ.344 కోట్లు, ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధుల నుంచి మరో రూ.120కోట్లు ప్రతిపాదించారు. వైద్య కళాశాలలు, ఆసుపత్రుల నిర్మాణానికి రూ.189కోట్లు కేటాయించారు. బోధనాసుపత్రుల్లో వైద్య పరికరాల నిర్వహణకు రూ.20కోట్లు, కాలేజీలు, ఆసుపత్రుల్లో వాహనాల కొనుగోలుకు రూ.6కోట్లు, విభాగంలో మానవ వనరుల అభివృద్ధికి రూ.26.75కోట్లు కేటాయించారు.108, 104 సర్వీసుల మెరుగుకు చర్యలు ఆరోగ్య, కుటుంబ సంక్షేమ కమిషనర్ పరిధిలోని విభాగాలకు గత బడ్జెట్లో రూ.1,218.19 కోట్లు ఇవ్వగా... ఈసారి రూ. 1,137.69 కోట్లు మాత్రమే కేటాయించారు. ఇందులో కీలకంగా 108, 104 సర్వీసులకు కొత్త వాహనాలు, పరికరాల కొనుగోలుకు రూ.49కోట్లు కేటాయించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో చనిపోయిన వారి మృతదేహాలను బాధితుల సొంతూళ్లకు తరలించేందుకు ఉచిత వాహన సదుపాయం కల్పించాలని నిర్ణయించారు. అందుకోసం బడ్జెట్లో రూ.5కోట్లు కేటాయించారు. కొత్తగా పుట్టిన శిశువులకు కిట్లు అందజేసేందుకు రూ.3కోట్ల వ్యయాన్ని ప్రతిపాదించారు. వైద్యారోగ్య శాఖకు ముఖ్య కేటాయింపులు ⇒ మెడికల్ కాలేజీల్లో పరిశోధనకు రూ.12 కోట్లు ⇒ ఆయుష్ కాలేజీ బలోపేతానికి రూ.8.10 కోట్లు ⇒ పీహెచ్‌సీల స్థాయి పెంపునకు రూ.68 కోట్లు ⇒ 24 గంటల పీహెచ్‌సీలుగా తీర్చిదిద్దేందుకు రూ.2 కోట్లు ⇒ భవనాల నిర్మాణానికి రూ.20కోట్లు -
వర్సిటీలకు కష్టకాలమే!
* ఉన్నత విద్యకు పెరగని కేటాయింపులు... సాంకేతిక విద్యకు కోత * పీఆర్సీ మేరకు వేతనాలు అందని పరిస్థితి * అంబేడ్కర్ ఓపెన్, తెలుగు వర్సిటీలకు ఒక్కపైసా కేటాయించని వైనం సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని యూనివర్సిటీలకు ఈ ఏడాది కష్టకాలమే ఎదురవుతోంది. ల్యాబ్‌ల కోసం పరికరాల కొనుగోలు, నిర్మాణాలు, ఇతర అవసరాలు, కంప్యూటర్ విద్య, స్పోర్ట్స్‌కు మినహా యూనివర్సిటీలు, డిగ్రీ కాలేజీల నిర్వహణకు రాష్ట్ర బడ్జెట్లో పెద్దగా నిధులు కేటాయించలేదు. అంతేకాదు వర్సిటీల్లో పనిచేసే అధ్యాపకులు, సిబ్బందికి కొత్త పీఆర్సీ మేరకు వేతన సవరణ చేసినా... ఆ మేరకు వేతనాల నిధులను మాత్రం పెంచలేదు. 2015-16 ఆర్థిక సంవత్సరంలో ఇచ్చిన మేరకే ఈసారీ కేటాయించారు. ఇటీవలే అధ్యాపకులు, ఉద్యోగులకు పెరిగిన డీఏకు సంబంధించీ నిధులివ్వలేదు. దీంతో వర్సిటీల అధ్యాపకులకు ఇబ్బందులు తప్పేలా లేవు. మరోవైపు కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల వేతనాలు పెరిగాయి. కానీ డిగ్రీ కాలేజీలు, వర్సిటీల్లో పనిచేసే కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు పెరిగిన మేరకు వేతనాలు ఎలా సర్దుబాటు చేయాలో అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఉస్మానియా, కాకతీయ, జేఎన్టీయూ వంటి ప్రధాన వర్సిటీలకు కూడా కేటాయింపు పెంచకపోవడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. ఉస్మానియాలో వేతనాల కోసం గత బడ్జెట్లో రూ.238 కోట్లు ఇవ్వగా... ఈసారీ అంతే కేటాయించారు. కాకతీయ వర్సిటీకి కూడా గత బడ్జెట్ తరహాలోనే 67.03 కోట్లు కేటాయించారు. ఇక తెలుగు యూనివర్సిటీ, అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ వంటి వాటి నిర్వహణకు ఒక్క పైసా ఇవ్వలేదు. మంథని, సుల్తాన్‌పూర్‌లోని జేఎన్టీయూ కాలేజీలకు అత్తెసరు నిధులనే కేటాయించారు. గతేడాది సుల్తాన్పూర్ జేఎన్టీయూ కాలేజీకి రూ.50కోట్లు ఇవ్వగా, ఈసారి రూ.14కోట్లే కేటాయించారు. మంథని కాలేజీకి గతేడాది రూ.143కోట్లు ఇవ్వగా... ఈసారి రూ.64.50కోట్లతో సరిపుచ్చారు నిర్మాణాలు, ల్యాబ్‌లపై దృష్టి డిగ్రీ, ఇంటర్ కొత్త కాలేజీల్లో మాత్రం పలు నిర్మాణాలు, ల్యాబ్ సదుపాయాల కల్పన, కంప్యూటర్ విద్య బోధన, నైపుణ్యాల పెంపు, శిక్షణలకు బడ్జెట్లో ప్రత్యేక కేటాయింపులు చేశారు. విద్యార్థుల్లో నైపుణ్యాలు పెంచేందుకు తెలంగాణ స్కిల్ నాలెడ్జ్ సెంటర్లకు రూ.6కోట్లు ఇచ్చారు. దీంతో సహా మొత్తంగా సదుపాయాల కల్పనకు రూ.46కోట్లు కేటాయించారు. డి గ్రీ కాలేజీల్లో నిర్మాణాలకు ఆర్డీఎఫ్ కింద రూ.98కోట్లు ఇచ్చారు. మొత్తంగా ఉన్నత విద్యకు గత బడ్జెట్లో రూ.1,652.39కోట్లు ఇవ్వగా... ఈసారి రూ.1,720.97కోట్లు కేటాయించారు. సాంకేతిక విద్యకు మాత్రం నిధులు తగ్గాయి. 2015-16 బడ్జెట్లో రూ.509.21కోట్లు కేటాయించగా ఈసారి రూ. 443.02 కోట్లే ప్రతిపాదించారు. పాలిటెక్నిక్‌లలో ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు సదుపాయాల కల్పన కోసం గతేడాది రూ.18.38కోట్లు ఇస్తే ఈసారి రూ.47.07కోట్లు కేటాయించారు. -
ఐటీ శాఖకు అంతంతే!
సాక్షి, హైదరాబాద్: ఐటీ శాఖకు ఈసారి బడ్జెట్లో తగిన ప్రాధాన్యత దక్కలేదు. నిధుల కేటాయింపు అంతంతే ఉంది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దడంలో కీలకపాత్ర పోషించాల్సిన ఐటీ శాఖకు అవసరమైన మేరకు బడ్జెట్లో నిధులు కేటాయించలేదని నిపుణులు పెదవి విరుస్తున్నారు. ఐటీ శాఖకు గతేడాది కన్నా తాజా బడ్జెట్లో కేటాయింపులు కాస్త పెరిగినా, హైదరాబాద్‌పై ఐటీ మార్క్‌ను ప్రతిబింబింపజేసే విధంగా లేవని చెబుతున్నారు. గత సంవత్సరం రూ.134 కోట్లు కేటాయించగా, ఈసారి రూ. 254 కోట్లు కేటాయించింది. రాష్ట్రంలో ఉన్న దాదాపు 1,300 సాఫ్ట్వేర్ కంపెనీల ద్వారా సుమారు రూ.70 వేల కోట్ల ఐటీ ఎగుమతులు జరుగుతున్నాయి. ఐటీ దిగ్గజ కంపెనీలు రాష్ట్రంలో కార్యకలాపాలను నిర్వహిస్తున్నాయి. స్టార్టప్స్‌ను ప్రోత్సహించేందుకు ఏర్పాటు చేసిన టి-హబ్ సత్ఫలితాలను ఇవ్వడంతో రెండోదశ నిర్మాణం చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. ప్రతి ఒక్కరినీ డిజిటల్ అక్షరాస్యులుగా చే సేందుకు డిజిటల్ తెలంగాణ కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రారంభించింది. అయితే.. నిధుల కొరత కారణంగా ఆయా కార్యక్రమాలన్నీ నత్తనడకన సాగుతున్నాయి. ఇక రాజధాని నగరం హైదరాబాద్ రూపురేఖలను సమూలంగా మార్చే ఐటీఐఆర్ ప్రాజెక్ట్ గురించి బడ్జెట్లో కనీసం ప్రస్తావించలేదు.