ఐటీ శాఖకు అంతంతే!
సాక్షి, హైదరాబాద్: ఐటీ శాఖకు ఈసారి బడ్జెట్‌లో తగిన ప్రాధాన్యత దక్కలేదు. నిధుల కేటాయింపు అంతంతే ఉంది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దడంలో కీలకపాత్ర పోషించాల్సిన ఐటీ శాఖకు అవసరమైన మేరకు బడ్జెట్లో నిధులు కేటాయించలేదని నిపుణులు పెదవి విరుస్తున్నారు. ఐటీ శాఖకు గతేడాది కన్నా తాజా బడ్జెట్లో కేటాయింపులు కాస్త పెరిగినా, హైదరాబాద్‌పై ఐటీ మార్క్‌ను ప్రతిబింబింపజేసే విధంగా లేవని చెబుతున్నారు. గత సంవత్సరం రూ.134 కోట్లు కేటాయించగా, ఈసారి రూ. 254 కోట్లు కేటాయించింది. రాష్ట్రంలో ఉన్న దాదాపు 1,300 సాఫ్ట్‌వేర్ కంపెనీల ద్వారా సుమారు రూ.70 వేల కోట్ల ఐటీ ఎగుమతులు జరుగుతున్నాయి.
ఐటీ దిగ్గజ కంపెనీలు రాష్ట్రంలో కార్యకలాపాలను నిర్వహిస్తున్నాయి. స్టార్టప్స్‌ను ప్రోత్సహించేందుకు ఏర్పాటు చేసిన టి-హబ్ సత్ఫలితాలను ఇవ్వడంతో రెండోదశ నిర్మాణం చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. ప్రతి ఒక్కరినీ డిజిటల్ అక్షరాస్యులుగా చే సేందుకు డిజిటల్ తెలంగాణ కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రారంభించింది. అయితే.. నిధుల కొరత కారణంగా ఆయా కార్యక్రమాలన్నీ నత్తనడకన సాగుతున్నాయి. ఇక రాజధాని నగరం హైదరాబాద్ రూపురేఖలను సమూలంగా మార్చే ఐటీఐఆర్ ప్రాజెక్ట్ గురించి బడ్జెట్‌లో కనీసం ప్రస్తావించలేదు.