నెలకు రూ.6 లక్షలు సంపాదిస్తున్నా ఎలాంటి పన్ను చెల్లించడం లేదు. ‘అదేంటి నెలకు రూ.6 లక్షల చొప్పున వార్షిక ఆదాయం రూ.72 లక్షలు అవుతుంది కదా. 30 శాతం ట్యాక్స్ స్లాబ్‌లోకి వస్తున్నా పన్ను చెల్లించకపోవడం ఏంటి’ అనుకుంటున్నారా? నెలకు అంతలా సంపాదిస్తుంది ప్రముఖ కంపెనీ మేనేజర్ స్థాయి ఉద్యోగో లేదా ఎగ్జిక్యూటివ్ స్థాయి ఆఫీసరో అనుకుంటే పొరపడినట్లే. ఈ సంపాదన ఓ దోసె బండి నిర్వాహకుడిది. అవునండి. వీధి వ్యాపారులు, అసంఘటిత రంగాల్లో పని చేస్తున్నవారు తాము సంపాదిస్తున్న డబ్బుపై ట్యాక్స్ చెల్లించడం లేదు. ఈమేరకు ఇటీవల నవీన్ కొప్పరం అనే వ్యక్తి తన ఎక్స్ ఖాతాలో ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. అదికాస్తా విభిన్న సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
‘మా ఇంటి పక్కన దోసె బండి నిర్వాహకుడు రోజు రూ.20,000 సంపాదిస్తాడు. నెలకు రూ.6 లక్షలు ఆదాయం ఉంటుంది. అందులో సగం వరకు ఖర్చులు తీసేసినా రూ.3 లక్షలు-రూ.3.5 లక్షలు సంపాదన. దానిపై తాను ఎలాంటి ట్యాక్స్ చెల్లించడు. అదే ఉద్యోగం చేస్తున్న వ్యక్తి నెలకు రూ.60,000 సంపాదిస్తే అందులో 10 శాతం ట్యాక్స్ చెల్లించాలి’ అని నవీన్ తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. దాంతో నెటిజన్లు విభిన్నంగా స్పందిస్తున్నారు. దేశంలో ఆదాయ వ్యత్యాసాలు, పన్ను హేతబద్ధీకరణ వంటి అంశాలపై కామెంట్లు వస్తున్నాయి.
A street food dosa vendor near my home makes 20k on an average daily, totalling up to 6 lakhs a month.
exclude all the expenses, he earns 3-3.5 lakhs a month.
doesn’t pay single rupee in income tax.
but a salaried employee earning 60k a month ends up paying 10% of his earning.— Naveen Kopparam (@naveenkopparam) November 26, 2024
ఇదీ చదవండి: తగ్గుతున్న వేతనాలు.. పెరుగుతున్న ఆర్థిక ఒత్తిడి!
భారత ఆర్థిక వ్యవస్థలో కీలకపాత్ర పోషిస్తున్న అనధికారిక రంగాన్ని మరింత క్రమబద్ధీకరించి అందుకు అనుగుణంగా పన్నుల పరిధిని పెంచాలని కొందరు నెటిజన్లు తెలియజేస్తున్నారు. దీనికోసం అనుసరించాల్సిన మార్గాలపై చర్చసాగాలని చెబుతున్నారు. కొందరు వైద్యులు, న్యాయవాదులు, చిన్న వ్యాపార యజమానులు.. వంటి ఇతర స్వయం ఉపాధి పొందేవారి సంపాదన పన్ను రహితంగా ఉండడంపట్ల ప్రభుత్వం స్పందించి చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. ‘డాక్టర్లు, లాయర్లు, టీ దుకాణాదారులు, గ్యారేజీ నిర్వహకులు, వాణిజ్య ప్రాంతాల్లోని ఇతర వ్యాపారుల సంగతేంటి? చాలామంది ఎలాంటి ట్యాక్స్ చెల్లించకుండా విదేశీ సెలవులకు వెళుతున్నారు. ఇళ్లు కొంటున్నారు. ఏటా కొత్త వాహనాలు కొనుగోలు చేస్తున్నారు. ఎందుకు ఇలాంటి పరిస్థితి ఉంది?’ అంటూ ఒకరు కామెంట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment