Tax benefit
-
పన్ను లేకుండా ‘దోసె’స్తున్నారు!
నెలకు రూ.6 లక్షలు సంపాదిస్తున్నా ఎలాంటి పన్ను చెల్లించడం లేదు. ‘అదేంటి నెలకు రూ.6 లక్షల చొప్పున వార్షిక ఆదాయం రూ.72 లక్షలు అవుతుంది కదా. 30 శాతం ట్యాక్స్ స్లాబ్‌లోకి వస్తున్నా పన్ను చెల్లించకపోవడం ఏంటి’ అనుకుంటున్నారా? నెలకు అంతలా సంపాదిస్తుంది ప్రముఖ కంపెనీ మేనేజర్ స్థాయి ఉద్యోగో లేదా ఎగ్జిక్యూటివ్ స్థాయి ఆఫీసరో అనుకుంటే పొరపడినట్లే. ఈ సంపాదన ఓ దోసె బండి నిర్వాహకుడిది. అవునండి. వీధి వ్యాపారులు, అసంఘటిత రంగాల్లో పని చేస్తున్నవారు తాము సంపాదిస్తున్న డబ్బుపై ట్యాక్స్ చెల్లించడం లేదు. ఈమేరకు ఇటీవల నవీన్ కొప్పరం అనే వ్యక్తి తన ఎక్స్ ఖాతాలో ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. అదికాస్తా విభిన్న సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.‘మా ఇంటి పక్కన దోసె బండి నిర్వాహకుడు రోజు రూ.20,000 సంపాదిస్తాడు. నెలకు రూ.6 లక్షలు ఆదాయం ఉంటుంది. అందులో సగం వరకు ఖర్చులు తీసేసినా రూ.3 లక్షలు-రూ.3.5 లక్షలు సంపాదన. దానిపై తాను ఎలాంటి ట్యాక్స్ చెల్లించడు. అదే ఉద్యోగం చేస్తున్న వ్యక్తి నెలకు రూ.60,000 సంపాదిస్తే అందులో 10 శాతం ట్యాక్స్ చెల్లించాలి’ అని నవీన్ తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. దాంతో నెటిజన్లు విభిన్నంగా స్పందిస్తున్నారు. దేశంలో ఆదాయ వ్యత్యాసాలు, పన్ను హేతబద్ధీకరణ వంటి అంశాలపై కామెంట్లు వస్తున్నాయి.A street food dosa vendor near my home makes 20k on an average daily, totalling up to 6 lakhs a month.exclude all the expenses, he earns 3-3.5 lakhs a month.doesn’t pay single rupee in income tax.but a salaried employee earning 60k a month ends up paying 10% of his earning.— Naveen Kopparam (@naveenkopparam) November 26, 2024ఇదీ చదవండి: తగ్గుతున్న వేతనాలు.. పెరుగుతున్న ఆర్థిక ఒత్తిడి!భారత ఆర్థిక వ్యవస్థలో కీలకపాత్ర పోషిస్తున్న అనధికారిక రంగాన్ని మరింత క్రమబద్ధీకరించి అందుకు అనుగుణంగా పన్నుల పరిధిని పెంచాలని కొందరు నెటిజన్లు తెలియజేస్తున్నారు. దీనికోసం అనుసరించాల్సిన మార్గాలపై చర్చసాగాలని చెబుతున్నారు. కొందరు వైద్యులు, న్యాయవాదులు, చిన్న వ్యాపార యజమానులు.. వంటి ఇతర స్వయం ఉపాధి పొందేవారి సంపాదన పన్ను రహితంగా ఉండడంపట్ల ప్రభుత్వం స్పందించి చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. ‘డాక్టర్లు, లాయర్లు, టీ దుకాణాదారులు, గ్యారేజీ నిర్వహకులు, వాణిజ్య ప్రాంతాల్లోని ఇతర వ్యాపారుల సంగతేంటి? చాలామంది ఎలాంటి ట్యాక్స్ చెల్లించకుండా విదేశీ సెలవులకు వెళుతున్నారు. ఇళ్లు కొంటున్నారు. ఏటా కొత్త వాహనాలు కొనుగోలు చేస్తున్నారు. ఎందుకు ఇలాంటి పరిస్థితి ఉంది?’ అంటూ ఒకరు కామెంట్ చేశారు. -
స్టాక్స్‌లో లాభాలపై పన్ను ఆదా..!
రూపాయిని ఆదా చేశామంటే.. రూపాయిని సంపాదించినట్టే. ఇది ఎప్పటి నుంచో మనం వినే సామెతే. అన్ని తరాలకూ ఇది వర్తిస్తుంది. కరోనా కల్లోలం వచ్చిన తర్వాత ఇంటికే పరిమితమైన వాతావరణంలో చాలా మంది కొత్త ఇన్వెస్టర్లు ఈక్విటీల్లోకి అడుగుపెట్టారు. ఇంటి నుంచే అదనపు ఆదాయం కోసం స్టాక్స్ పెట్టుబడులను ఎంపిక చేసుకున్నారు. దీనికి నిదర్శనం సీడీఎస్ఎల్ వద్ద ఆరు నెలల్లోనే కోటి డీమ్యాట్ ఖాతాలు కొత్తగా తెరుచుకున్నాయి. కాకపోతే ఇన్వెస్టర్లు పెట్టుబడులు, విక్రయాలపైనే దృష్టి పెడుతుంటారు కానీ, పన్ను అంశాన్ని అంతగా పట్టించుకోరు. స్టాక్ మార్కెట్లో ఆర్జించే లాభాలపై పన్ను చెల్లించాలన్న అంశాన్ని ఇన్వెస్టర్లు తప్పకుండా దృష్టిలో ఉంచుకోవాలి. ఎందుకంటే ‘స్మార్ట్’గా అడుగులు వేయడం ద్వారా ఈ పన్ను భారాన్ని తగ్గించుకోవచ్చు. తద్వారా కొంత ఆదా చేసుకోవచ్చు. ఆ వివరాలే ఈ వారం ప్రాఫిట్ ప్లస్ కథనంలో.. ఇవి గమనించండి... ► ఏడాది, అంతకుమించిన పెట్టుబడులపై ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.లక్ష వరకు లాభంపై పన్ను ఉండదు. ► రూ.2 లక్షల దీర్ఘకాల మూలధన లాభం కనిపిస్తుంటే.. రెండు ఆర్థిక సంవత్సరాల్లో రెండు భాగాలుగా తీసుకోవచ్చు. ► లాభాలు ఎక్కువగా కనిపిస్తుంటే.. నష్టాలతో సర్దుబాటు చేసుకోవడం ద్వారా పన్ను తగ్గించుకోవచ్చు. ► నివాస గృహంపై ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఎల్టీసీజీ భారాన్ని దింపుకోవచ్చు. నష్టాలతో సర్దుబాటు.. 2018 ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్లో ఎల్టీసీజీ పన్నును ప్రతిపాదించారు కనుక ఆ ముందు రోజు వరకు చేసిన పెట్టుబడులకు దీర్ఘకాల మూలధన లాభాల పన్ను వర్తించదు. ‘‘నూతన నిబంధనను ప్రవేశపెట్టినప్పుడు అప్పటి వరకు ఉన్న పెట్టుబడులకు సాధారణంగా మినహాయింపునిస్తుంటారు. దీన్నే గ్రాండ్‌ఫాదరింగ్ అంటారు. కనుక 2018 జనవరి 31 నాటి వరకు చేసిన పెట్టుబడులు గ్రాండ్ ఫాదరింగ్‌కు అర్హత కలిగినవి’’ అని ఏఎంఆర్‌జీ అండ్ అసోసియేట్స్ సీఈవో గౌరవ్ మోహన్ తెలిపారు. అంటే 2018 జనవరి 31 వరకు చేసిన పెట్టుబడులకు.. కొనుగోలు తేదీగా 2018 జనవరి 31ని పరిగణిస్తుంది చట్టం. ఆ తర్వాత తేదీ నుంచి ఆర్జించిన దీర్ఘకాల మూలధన లాభాలపైనే పన్ను చెల్లించాల్సి ఉంటుంది. స్వల్పకాల మూలధన నష్టాలను.. స్వల్పకాల మూలధన లాభాలు, దీర్ఘకాల మూలధన లాభాలు రెండింటితోనూ సర్దుబాటు చేసుకోవచ్చు. అదే ఎల్టీసీఎల్ అయితే ఎల్టీసీజీతోనే సర్దుబాటు చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. వరుసగా ఎనిమిదేళ్లపాటు దీర్ఘకాల, స్వల్పకాల మూలధన నష్టాలను క్యారీ ఫార్వార్డ్ చేసుకోవాలంటే.. అందుకోసం గడువులోపు ఆదాయపన్ను రిటర్నులు దాఖలు చేసుకోవడం తప్పనిసరి. లేదంటే వాటిని భవిష్యత్తు లాభాల్లో సర్దుబాటు చేసుకునే అవకాశాన్ని కోల్పోయినట్టే. పన్ను బాధ్యత ఈక్విటీల్లో (స్టాక్స్) నేరుగా చేసిన పెట్టుబడులు లేదా మ్యూచువల్ ఫండ్స్ రూపంలో స్టాక్స్‌లో పెట్టుబడులైనా సరే.. ఏడాది, అంతకు మించి కొనసాగించిన తర్వాత విక్రయించినట్టయితే వచ్చే లాభాన్ని దీర్ఘకాలిక మూలధన లాభంగా (ఎల్టీసీజీ) ఆదాయపన్ను చట్టం పరిగణిస్తోంది. ఒకవేళ నష్టం వస్తే దాన్ని దీర్ఘకాలిక మూలధన నష్టం(ఎల్టీసీఎల్)గా చూస్తారు. అదే ఏడాది లోపు విక్రయించగా వచ్చిన లాభం స్వల్పకాల మూలధన లాభం (ఎస్టీసీజీ)గాను.. నష్టం వస్తే స్వల్పకాల మూలధన నష్టం(ఎస్టీసీఎల్)గాను పరిగణిస్తారు. ఎల్టీసీజీపై 10 శాతం పన్ను చెల్లించాలి. ఒక ఆర్థిక సంవత్సరంలో మొదటి రూ.లక్ష దీర్ఘకాల మూలధన లాభంపై పన్ను లేదు. రూ.లక్షకు మించి ఉన్న లాభంపైనే 10 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అదే ఎస్‌టీసీజీపై 15 శాతం పన్ను చెల్లించాలి. ఇందులో బేసిక్ పరిమితి అంటూ ఏదీ లేదు. అంటే ఏడాదిలోపు పెట్టుబడులపై లాభం రూ.1,000 వచ్చినా ఆ మొత్తంపై 15 శాతం పన్ను చెల్లించాల్సిందే. ఎల్టీసీజీ 2018 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చింది. కొద్ది కొద్దిగా... పన్ను ఆదా చేసుకునేందుకు మరో మార్గం.. ఒకే విడత వెనక్కి తీసేసుకోకుండా పరిమితి పాటించడం. ‘‘ఆర్థిక సంవత్సరం ముగింపు సమీపంలో షేర్లపై ఎల్టీసీజీ రూ.2లక్షలు ఉందనుకుంటే ఒకే పర్యాయం మొత్తాన్ని విక్రయించకుండా రెండు భాగాలు చేసుకుని.. ఒక భాగాన్ని నడుస్తున్న ఆర్థిక సంవత్సరంలోనూ, మరో భాగాన్ని వచ్చే ఆర్థిక సంవత్సరం ఆరంభంలో వెనక్కి తీసుకోవాలి’’ అని ట్యాక్మన్కు చెందిన వాధ్వాన్ సూచించారు. అప్పుడు పన్ను భారం సున్నా అవుతుంది. ఒకవేళ మూలధన లాభాల పన్ను గణనీయంగా ఉన్నట్టయితే.. అప్పుడు రెండు భాగాలు చేసినా కానీ చెల్లించాల్సిన పన్ను గణనీయంగా ఏమీ తగ్గదు. పన్ను ఆదా కోసం పెట్టుబడుల ఉపసంహరణను మరింత దీర్ఘకాలం పాటు వాయిదా వేయడం కూడా సరికాదు. దీనివల్ల మార్కెట్లో పరిస్థితులు మారిపోతే రిస్క్‌లో చిక్కుకున్నట్టు అవుతుంది. దీనికి మోహన్ మరో పరిష్కారాన్ని సూచించారు. ‘‘పెద్ద పోర్ట్‌ఫోలియో నిర్వహించే వారు.. ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.లక్ష దీర్ఘకాల మూలధన లాభం మినహాయింపు తర్వాత కూడా పన్ను చెల్లించాల్సిన లాభం ఉన్నట్టయితే పోర్ట్‌ఫోలియోను ఎప్పటికప్పుడు మార్చుకుంటూ వెళ్లడమే’’ అని ఏఎంఆర్‌జీ అండ్ అసోసియేట్స్ సీఈవో గౌరవ్ మోహన్ పేర్కొన్నారు. అంటే మూలధన లాభాల పన్ను రూ.లక్షకు సమీపించగానే విక్రయించడం.. తిరిగి మరుసటి రోజు కొనుగోలు చేయడం. దీనివల్ల లావాదేవీల వ్యయాలే తప్పించి మూలధన లాభాల పన్ను భారం ఉండదు. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌కూ ఇదే అమలవుతుంది. ఫండ్ యూనిట్లను కొనుగోలు చేసిన (సిప్ అయితే విడిగా ప్రతీ సిప్ కొనుగోలు చేసిన తేదీ నుంచి) నాటి నుంచి ఏడాది, ఆ తర్వాత విక్రయించగా వచ్చిన లాభంపై 10 శాతం దీర్ఘకాల మూలధన లాభాల పన్ను, ఏడాదిలోపు అయితే 15 శాతం పన్ను చెల్లించాలి. కనుక షేర్లు, ఈక్విటీ ఫండ్స్ విషయంలో పెట్టుబడి ఏడాది కాలాన్ని పూర్తి చేసుకున్న వెంటనే అందులోని మూలధన లాభాన్ని రూ.లక్ష వరకు తీసేసుకోవడం మంచి ఆలోచన అవుతుంది. కాకపోతే ఏడాది రాకుండా విక్రయిస్తే పన్ను భారం 15 శాతం అవుతుందని మర్చిపోవద్దు. అలాగే, మీ పోర్ట్ఫోలి యోలోని షేర్లు, మ్యూచువల్ ఫండ్స్‌కు అన్నింటికీ పన్ను లేని మూలధన లాభం గరిష్టంగా రూ.లక్షే అవుతుంది. ఒక్కో దానికి విడిగా రూ.లక్ష అనుకోవద్దు. ఇల్లు కొనుక్కోవడం ఈక్విటీ షేర్ల విక్రయాలపై ఎల్టీసీజీ పన్ను మినహాయింపు కోసం ఆదాయపన్ను చట్టంలోని సెక్షన్ 54ఎఫ్ కింద.. నూతన ఇల్లు కొనుగోలు లేదా నిర్మాణానికి ఆ మొత్తాన్ని వినియోగించాలి. కేవలం లాభాలే కాకుండా విక్రయం ద్వారా సమకూరిన మొత్తాన్ని నూతన ఇంటిపై వినియోగించాలి. మొదటి ఇంటికే ఇది పరిమితం. నూతన ఇల్లు కొనుగోలు అయితే ఈక్విటీ షేర్లను విక్రయించిన నాటి నుంచి రెండేళ్లలోగా చేయాలి. నూతన ఇంటి నిర్మాణం కోసం వినియోగించేట్టు అయితే మూడేళ్లలోగా చేయాలి. అంతేకాదు ఇలా చేసిన తర్వాత ఏడాది లోపు రెండో ఇల్లు కొనుగోలు చేయకూడదు లేదా మూడేళ్లలోపు రెండో ఇంటిని నిర్మించకూడదు. అలాగే మూలధన లాభాల పన్ను మినహాయింపునకు కొనుగోలు చేసిన మొదటి ఇంటిని లేదా నిర్మించుకున్న ఇంటిని మూడేళ్ల వరకు విక్రయించకూడదు. ఈ నిబంధనలను పాటించకపోతే కల్పించిన మినహాయింపులను త్యజించి పన్ను చెల్లించాల్సి ఉంటుంది. షేర్లను విక్రయించిన సంవత్సరానికి సంబంధించి ఆదాయపన్ను రిటర్నుల దాఖలు సమయం సమీపిస్తున్నట్టయితే క్యాపిటల్ గెయిన్స్ డిపాజిట్ స్కీమ్‌లో ఇన్వెస్ట్ చేసుకుని రిటర్నుల్లో పేర్కొనాలి. ఆ తర్వాత చట్టం అనుమతించిన సమయంలోపు మొదటి ఇంటిని సమకూర్చుకోవడంపై వ్యయం చేయాల్సి ఉంటుంది. షేర్లను విక్రయించడానికి ముందు ఏడాదిలోపు నూతన ఇంటిని కొనుగోలు చేసినా పన్ను మినహాయింపు కోరవచ్చు. ఈక్విటీల్లో దీర్ఘకాల మూలధన లాభాలపై పన్ను భారం వద్దనుకుంటే అందుకోసం 54ఈసీ బాండ్లలో ఇన్వెస్ట్ చేసుకోవడం ఒక ఆప్షన్. ఎక్కువ ఆదా అయితేనే ప్రయోజనం చిన్న ఇన్వెస్టర్లకు ఇంతకు ముందు పేర్కొన్న విధాలనాలతో పన్ను ఆదా చేసుకోవడం సౌకర్యంగా ఉంటుంది. మరి రూ.కోట్లలో పెట్టుబడులను నిర్వహించే వారు ఏటా రూ.లక్ష వరకే మూలధ లాభాలను పరిమితం చేసుకోవడం ఆచరణలో అసాధ్యం. కనుక వారు మొత్తం పోర్ట్‌ఫోలియోని సమీక్షించుకుని.. స్వల్పకాల నష్టాల్లో ఉన్న స్టాక్స్‌ను విక్రయించడం ద్వారా.. అటు స్వల్పకాల మూలధన లాభాలు, దీర్ఘకాల మూలధన లాభాల పన్ను భారాన్ని కొంత వరకు అయినా తగ్గించుకోవచ్చు. ‘‘ఎల్‌టీసీజీని సరిగ్గా మదింపు వేసుకోవడమే కాకుండా లాభ, నష్టాల సర్దుబాటులో భాగంగా విక్రయించిన స్టాక్స్‌ను మరుసటి రోజు మళ్లీ కొనుగోలు చేసుకోవాలి. విక్రయించిన పెట్టుబడులను మళ్లీ ఇన్వెస్ట్ చేసేందుకు సమయం తీసుకుంటే ఈ లోపు ఆ నిధులు వేరే అవసరాలకు కరిగిపోయే ప్రమాదం ఉంటుంది. ఇలా చేయడం వల్ల దీర్ఘకాల లక్ష్యాల విషయంలో రాజీపడాల్సి వస్తుంది. కాకపోతే ఇక్కడ కూడా ఒక రిస్క్ ఉంటుంది. విక్రయించిన ధరకే తిరిగి కొనుగోలు చేసకునే అవకాశం అన్ని సందర్భాల్లోనూ ఉంటుందని చెప్పడానికి లేదు. ధరల్లో గణనీయమైన వ్యత్యాసం కూడా రావచ్చు. విక్రయించిన తర్వాత స్టాక్ ధర పడిపోతే లాభమే కానీ, పెరిగిపోతేనే సమస్య. మ్యూచువల్ ఫండ్స్ అయితే విక్రయించిన మేర ఇన్వెస్టర్ బ్యాంకు ఖాతాకు చేరుకునేందుకు మూడు నుంచి ఐదు రోజుల వ్యవధి తీసుకోవచ్చు. కనుక తిరిగి ఇన్వెస్ట్ చేసే సమయానికి ధరల్లో వ్యత్యాసం వస్తే ఈ విధమైన నష్టాన్ని ఎదుర్కోవాల్సి రావచ్చు. అందుకనే ఇలా చేయడం వల్ల ఎంత మేర మూలధన లాభాల పన్ను ఆదా అవుతుందన్న అంచనాకు ముందుగానే రావాలి. కనీసం 10–20 శాతం మేర ఆదా అవుతుందనుకుంటే ధరల పరంగా రిస్క్‌ను అధిగమించే వెసులుబాటు ఉంటుంది. అంతేకానీ, కొద్ది మేర పన్ను ఆదా కోసం హోల్డింగ్స్‌ను విక్రయించడం అంతగా కలసిరాకపోవచ్చు. ఎందుకంటే స్టాక్స్ అయితే స్టాంప్ డ్యూటీ, బ్రోకరేజీ, ఎక్సే్ఛంజ్ చార్జీలు చెల్లించుకోవాలి. దీనికి ధరల్లో వ్యత్యాసం అదనం. -
పీఎఫ్ విత్ డ్రా: ఐదేళ్లుగా ఒకే చోట పని చేస్తున్నారా?
చాలా మంది ప్రైవేట్ ఉద్యోగులు వారి అవసరాల కోసం పీఎఫ్ ఖాతా నుంచి భారీ మొత్తంలో నగదు తీసుకుంటారు. అలా తీసుకున్న నగదుపై ఈపీఎఫ్ఓ పన్ను విధిస్తుంది. అయితే, కొందరికి మాత్రం ఈ పన్ను నుంచి మినహాయింపు లభిస్తుంది. అది ఎలానో ఒక ఉదాహరణ ద్వారా తెలుసుకుందాం. రమేష అనే వ్యక్తి ఒక కంపెనీలో 8 సంవత్సరాలు పనిచేశాడు. ఆ కంపెనీ అతనికి ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్) సౌకర్యాన్ని అందించింది. కొన్ని అనివార్య కారణాల వల్ల అతను మరో కంపెనీలో 14 నెలలు పనిచేశాడు. ఈ కంపెనీ అతనికి ఈపీఎఫ్ సౌకర్యం కల్పించలేదు. ఆ తర్వాత కొన్ని నెలలు కాలిగానే ఇంట్లో ఉన్నాడు. ఇంట్లో ఒత్తిడి పెరగడంతో మరో కంపెనీలో చేరాడు. ఈపీఎఫ్ సౌకర్యం ఉన్న పెద్ద కంపెనీలో 5 సంవత్సరాలు పైగా పని చేశాడు. అయితే, అతను తన అవసర నిమిత్తం మొత్తం ఒకేసారి విత్‌డ్రా చేస్తే పన్ను మినహాయింపు ఉంటుందా? అని సందేహం కలిగింది. ప్రస్తుత పీఎఫ్ నిబందనల ప్రకారం.. ఇలా అతను విత్ డ్రా చేసిన మొత్తంపై ఎటువంటి పన్ను ఉండదు. ఒక ఉద్యోగి ఒక సంస్థలో 5 ఏళ్లు అంతకన్నా ఎక్కువ సమయం పాటు పనిచేస్తే వారు పీఎఫ్ సౌకర్యం కల్పిస్తే పీఎఫ్‌ను విత్‌డ్రా చేసిన నగదుపై ఎటువంటి పన్ను చెల్లించాల్సిన పనిలేదు. 5 ఏళ్ల కన్నా తక్కువ సమయం పనిచేస్తేనే పన్ను వర్తిస్తుంది. పైన తెలిపిన ఉదాహరణలో రమేష్ 8 ఏళ్ల పాటు ఒక కంపెనీలో పనిచేశాడు. 5 ఏళ్ల కన్నా ఎక్కువగా ఒకే కంపెనీలో చేసిన అనుభవం, అన్ని ఏళ్ల పాటు నిరంతరాయంగా పీఎఫ్ కట్టాడు. కాబట్టి అతను మొదటి కంపెనీతోపాటు చివరి కంపెనీలోనూ పీఎఫ్ విత్‌డ్రా చేస్తే పన్ను మినహాయింపు పొందవచ్చు. మధ్యలో రమేష్ 14 నెలలు పనిచేసిన కంపెనీలో ఎలాగో పీఎఫ్ సౌకర్యం లేదు కాబట్టి అతను మొదటి, చివరి సంస్థలో 5 ఏళ్లకు పైగా పనిచేశాడు. అందుకని అతను విత్‌డ్రా చేసిన నగదుపై టాక్స్ ఫ్రీ లభిస్తుంది. ఎవరైనా ఏదైనా కంపెనీలో 5 ఏళ్ల కంటే తక్కువగా పనిచేస్తే పీఎఫ్ విధించే టాక్స్ చెల్లించాలి. చదవండి: ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు శుభవార్త! -
అంబానీకి 1,121 కోట్ల లబ్ధి!
న్యూఢిల్లీ: ఫ్రాన్స్‌తో రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందంపై ప్రతిపక్షాల విమర్శల వేడి చల్లారకముందే రియలన్స్ కంపెనీకి కొత్త చిక్కు వచ్చిపడింది. అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ కమ్యూనికేషన్స్ అనుబంధ సంస్థ ‘రిలయన్స్ ఫ్లాగ్ అట్లాంటిక్ ఫ్రాన్స్’కు ఫ్రెంచి ప్రభుత్వం రూ.1,121.18 కోట్లు(14.37 కోట్ల యూరోల) పన్నును మినహాయించినట్లు ‘లా మాండే’ అనే ఫ్రాన్స్ పత్రిక ఓ కథనాన్ని ప్రచురించింది. ఫ్రాన్స్ నుంచి 36 రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలుకు భారత్ ఒప్పందాన్ని కుదర్చుకున్న కొన్ని నెలలకే ఫ్లాగ్ అట్లాంటిక్‌కు ఈ మినహాయింపు లభించిందని తెలిపింది. దీంతో మోదీ ఆశీర్వాదంతోనే ఈ పన్ను మినహాయింపులు లభించాయని కాంగ్రెస్ దుమ్మెత్తిపోయగా, రఫేల్ ఒప్పందం–రిలయన్స్ పన్ను మినహాయింపునకు లంకె పెట్టడం సరికాదని కేంద్రం స్పష్టం చేసింది. అనిల్‌కు చెందిన రిలయన్స్ డిఫెన్స్ సంస్థ రఫేల్ యుద్ధవిమానాలు తయారుచేసే డసో ఏవియేషన్‌కు భారత్‌లో ఆఫ్సెట్ భాగస్వామిగా ఉంది. రఫేల్ ఒప్పందం కుదరగానే.. ఫ్లాగ్ అట్లాంటిక్ 2007–10లో రూ.468.14 కోట్ల(60 మిలియన్ యూరోలు) పన్నును చెల్లించాల్సి ఉన్నట్లు ఫ్రాన్స్ ఐటీ అధికారుల విచారణలో తేలిందని ‘లా మాండే’ కథనంలో తెలిపింది. ‘ఈ విషయమై ఫ్రెంచ్ అధికారులు కంపెనీకి నోటీసులు జారీచేశారు. దీంతో తాము సెటిల్మెంట్లో భాగంగా 56.95 కోట్లు (7.3 మిలియన్ యూరోలు) చెల్లిస్తామని ఫ్లాగ్ అట్లాంటిక్ సంస్థ ప్రతిపాదించింది. కానీ దీన్ని అధికారులు తిరస్కరించారు. ఈ వ్యవహారంలో మరింత లోతుగా విచారణ జరిపిన అధికారులు 2010–12 మధ్యకాలంలో మరో రూ.710 కోట్లు(91 మిలియన్ యూరోలు) పన్ను బకాయిలు ఉన్నట్లు గుర్తించారు. ఈ మొత్తం రూ.1,178 కోట్లుగా తేలింది. అయితే 2015, ఏప్రిల్ 10న భారత ప్రధాని మోదీ అప్పటి ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలాండేతో 36 రఫేల్ ఫైటర్జెట్ల కోసం ఒప్పందం కుదర్చుకున్నారు. ఇది జరిగిన 6 నెలలకు అంటే.. 2015, అక్టోబర్‌లో ఫ్రాన్స్ అధికారులు అనూహ్యంగా రిలయన్స్ ప్రతిపాదించిన రూ.56.95 కోట్ల(7.3 మిలియన్ యూరోల) పన్ను సెటిల్మెంట్కు అంగీకరించారు. ఫ్లాగ్ అట్లాంటిక్‌కు రూ.1,121 కోట్ల లబ్ధిని చేకూర్చారు’ అని లా మాండే వెల్లడించింది. ఫ్లాగ్ అట్లాంటిక్ సంస్థకు ఫ్రాన్స్‌లో కేబుల్ నెట్‌వర్క్‌తో పాటు టెలికాం సేవలందించే మౌలికవసతులు ఉన్నాయని పేర్కొంది. అంతా మోదీ ఆశీర్వాదమే: విపక్షాలు ఫ్రాన్స్ అధికారులు రిలయన్స్ అనుబంధ సంస్థకు రూ.1,121.18 కోట్ల లబ్ధి చేకూర్చడంపై ప్రతిపక్షాలు కేంద్ర ప్రభుత్వంపై దుమ్మెత్తిపోశాయి. ప్రధాని మోదీ ఆశీర్వాదం, అనుగ్రహం కారణంగానే రిలయన్స్‌కు ఈ పన్ను మినహాయింపు లభించిందని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సూర్జేవాలా విమర్శించారు. రఫేల్ ఒప్పందంలో మోదీ మధ్యవర్తిగా వ్యవహరించారని దుయ్యబట్టారు. తన స్నేహితుడైన పారిశ్రామికవేత్తకు లబ్ధి చేకూర్చడం కోసం మోదీ రఫేల్ ఒప్పందం ద్వారా కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని వృధా చేశారని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మండిపడ్డారు. ఆర్థిక కష్టాలతో అల్లాడుతున్న రైతులు, విద్యార్థులకు రుణాలు ఇవ్వని మోదీ ప్రభుత్వం కార్పొరేట్లకు మాత్రం దోచిపెడుతోందని సీపీఐ నేత డి.రాజా విమర్శించారు. ఈ రఫేల్ ఒప్పందాన్ని అంగీకరించలేకే మాజీ రక్షణమంత్రి, దివంగత మనోహర్ పరీకర్ తన పదవికి రాజీనామా చేశారని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ఆరోపించారు. రాజకీయ జోక్యం లేదు: ఫ్రాన్స్ రిలయన్స్ ఫ్లాగ్ అట్లాంటిక్ సంస్థకు పన్ను మినహాయింపులో ఎలాంటి రాజకీయ జోక్యం లేదని ఫ్రాన్స్ ప్రకటించింది. రిలయన్స్ అనుబంధ సంస్థ నిబంధనల మేరకు ఫ్రెంచ్ అధికారులతో సెటిల్మెంట్ చేసుకుందని తెలిపింది. ఈ ప్రక్రియ చట్టబద్ధంగా ఫ్రాన్స్ నియంత్రణ సంస్థ పర్యవేక్షణలో సాగిందని పేర్కొంది. ఈ మేరకు ఢిల్లీలోని ఫ్రాన్స్ ఎంబసీ ఓ ప్రకటనను విడుదల చేసింది. చట్టాలకు లోబడే.. ఈ వివాదంపై రిలయన్స్ కమ్యూనికేషన్స్ ప్రతినిధి స్పందిస్తూ.. ‘ఫ్రాన్స్ అధికారులు రూ.1,178 కోట్లు చెల్లించాలని మమ్మల్ని కోరడం పూర్తిగా చట్టవ్యతిరేకం. గడచిపోయిన పదేళ్ల కాలానికి గానూ ఈ మొత్తాన్ని చెల్లించాలని కోరారు. కానీ అప్పటికే రిలయన్స్ అట్లాంటిక్ సంస్థ రూ.20 కోట్ల నష్టాల్లో నడుస్తోంది. ఈ నేపథ్యంలో ఫ్రాన్స్ చట్టాలకు లోబడి రూ.56.95 కోట్లు (7.3 మిలియన్ యూరోలు) చెల్లించి సెటిల్మెంట్ చేసుకున్నాం’ అని తెలిపారు. మరోవైపు ఈ పన్ను మినహాయింపునకు, రఫేల్ ఒప్పందాన్ని ముడిపెట్టి ఊహాజనిత కథనాలు రాయడం దురదృష్టకరమని భారత రక్షణశాఖ విమర్శించింది. రఫెల్ ఒప్పందానికి, రిలయన్స్ పన్ను సెటిల్మెంట్కు సంబంధం లేదంది. -
వాణిజ్య పన్నుల శాఖ ఆల్‌టైం రికార్డు
సాక్షి, హైదరాబాద్: ఆదాయ రాబడిలో వాణిజ్య పన్నుల శాఖ ఆల్‌టైం రికార్డు సృష్టించింది. 2018–19 ఆర్థిక సంవత్సరంలో వాణిజ్య పన్నుల ఆదాయం రూ.45 వేల కోట్లు దాటిందని ఆ శాఖ వర్గాలు వెల్లడించాయి. ఒక్క మార్చిలోనే రూ.5 వేల కోట్లకుపైగా ఆదాయం సమకూరినట్టు తెలు స్తోంది. మార్చిలో ఎస్జీఎస్టీ కింద రూ.1,275 కోట్లు వచ్చింది. అయితే, ఇప్పటివరకు అత్యధికంగా ఫిబ్రవరిలో 1,041 కోట్ల ఆదాయం ఎస్జీఎస్టీ కింద రాగా, ఈ నెలలో అంతకు మించి ఆదాయం రావడం గమనార్హం. రికార్డు స్థాయిలో ఆదాయాన్ని సమకూర్చడంలో కృషి చేసిన శాఖ సిబ్బందిని, అధికారులను ఆ శాఖ ముఖ్య కార్యదర్శి సోమేశ్‌కుమార్ అభినందించారు. సమస్యలు పరిష్కరించండి: టీఎస్‌టీఈఏ వాణిజ్య పన్నుల శాఖ ఆదాయం గత ఏడాది కన్నా 20 శాతం పెరగడంపట్ల ఆ శాఖ ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. శాఖ సిబ్బంది, అధికారులు చేసిన కృషి వల్లే ఇది సాధ్యమయిందని తెలంగాణ రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగుల సంఘం (టీఎస్‌టీఈఏ) గౌరవాధ్యక్షుడు టి.వెంకటేశ్వర్లు, అధ్యక్షుడు కె.ఎం.వేణుగోపాల్ తెలిపారు. ఈ సందర్భంగా సోమవారం సచివాలయంలో శాఖ ముఖ్య కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ను కలసి అభినందనలు తెలిపారు. శాఖాపరంగా పెండింగ్‌లో ఉన్న సమస్యలు పరిష్కరించి మరింత ఆదాయం సమకూర్చేలా చేసి ఉద్యోగులు, సిబ్బందికి చేయూతనివ్వాలని వినతిపత్రం సమర్పించారు. ఇందుకు సోమేశ్‌కుమార్ సానుకూలంగా స్పందించినట్టు టీఎస్‌టీఈఏ నేతలు తెలిపారు. -
వ్యాపారులకు నాయకుడి శఠగోపం
సాక్షి, అమరావతి: గుంటూరు జిల్లా అధికార పార్టీలోని ఓ ప్రముఖ నాయకుడి అరాచకాలకు ఇది పరాకాష్ట. పల్నాడులోని ఒక నియోజకవర్గంలో ఆయన కుటుంబ సభ్యుల అక్రమాలను నిరసిస్తూ ఆ నేతకు టిక్కెట్ ఇవ్వొద్దని టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఆ కుటుంబం అవినీతిపై నియోజకవర్గంలో కథలు కథలుగా చెప్పుకుంటున్నారు. ఆ నాయకుడు బంగారం వ్యాపారికి ఫోన్ చేసి తన కుమార్తె కోసం డిజైనర్ నగలు పట్టుకురావాలని సూచించారు. ఆ వ్యాపారి కొన్ని నగలు పంపగా.. కొన్నింటిని తీసుకుని మిగతావి వెనక్కి పంపించారు. ఆ నేత తీసుకున్న నగల ఖరీదు సుమారు రూ. కోటిపైనే ఉంటుందని అంచనా. రెండ్రోజులు ఆగి తన నగలకు డబ్బులు ఇవ్వాలని వ్యాపారి ఆ నాయకుడికి ఫోన్ చేస్తే స్పందించలేదు. రెండోరోజు నగల వ్యాపారి నేరుగా ఇంటికెళ్లి అడగ్గా.. ‘ఏమయ్యా...నా కూతురు కోసం నగలు పంపించావ్. ఆ అమ్మాయికి నగలు నచ్చాయి. తీసుకుంది. ఇందులో సమస్య ఏముంది. నీకూతురైతే ఒకటీ, నాకూతురైతే ఒకటా...’అంటూ సెలవిచ్చారు. ‘అదేంటి సార్...కోటి రూపాయలు అంటూ’ ఆ వ్యాపారి బిక్కమొఖం వేశాడు. నాకు పంపిన నగలు మళ్లీ అడుగుతావంటయ్యా...వెళ్లు ...లేదంటే బావుండదంటూ ఆ నాయకుడు కసురుకున్నాడు. ఆ ఊర్లో వ్యాపారం చేస్తున్నందుకు రూ. కోటి పన్ను కట్టాల్సి వచ్చిందని సన్నిహితుల వద్ద ఘొల్లుమన్నాడు ఆ వ్యాపారి. నరసరావుపేటలో ఈ విషయం పెద్ద చర్చనీయాంశమైంది. నా స్వీట్ల డబ్బుల మాటేంటి? ఇక ఆ సదరు నాయకుడి అల్లుడు ఆస్పత్రి పెడుతూంటే దాని ఓపెనింగ్‌కు స్వీట్లు కావాలని ఓ వ్యాపారికి కబురు పంపారు. ఆ వ్యాపారి ఖరీదైన స్వీట్లు పంపించారు. బిల్లు రూ.లక్ష వరకూ అయింది. డబ్బులివ్వమని అడగ్గా...‘ఏం తమాషా చేస్తున్నావా..నెలకు రూ.10 లక్షలు వ్యాపారం చేస్తున్నావట. మర్యాదగా నెలకు రూ.లక్ష కట్టు’ అంటూ ఆ వ్యాపారిని బెదిరించారు. చివరకు బతిమలాడుకున్న స్వీటు వ్యాపారి నెలకు రూ.50 వేలు కట్టేలా మాట్లాడుకున్నాడుట. ఆందోళనలో పార్టీ శ్రేణులు ఆ కుటుంబంపై నియోజకవర్గంలోని టీడీపీ నేతలు, కార్యకర్తలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఆయన్ను నిలబెడితే ఓటమి ఖాయమని, అభ్యర్థిని మార్చాలని అధినేతపై ఎంత ఒత్తిడి తెచ్చిన ఫలితం లేకపోయింది. అతనికే టిక్కెట్ కేటాయించడంతో ఏం చేయాలో తెలియక పార్టీ శ్రేణులు గందరగోళంలో పడ్డాయి. సెట్‌టాప్ బాక్సుల పైనా పన్ను వసూలు బాధలో ఉన్న ఆ స్వీట్ వ్యాపారికి దగ్గరికి ఒక ఆటోడ్రైవర్ తన గోడు వెళ్లబోసుకున్నాడట. ‘సార్. మీకు స్వీట్లు పోయాయి. నేను సెట్‌టాప్ బాక్సులు సప్లై చేసేవాడిని. ఒక్కోదానికి రూ.300 వసూలు చేశారు నా దగ్గర. చివరకు ఆ వ్యాపారం వదిలేసుకుని ఆటో నడుపుకుంటున్నా’ అంటూ సెలవిచ్చాడు ఆటోవాలా. -
రెండో ఇంటికి రూ.2 లక్షలే
‘పన్ను’ మినహాయింపుపై కేంద్రం న్యూఢిల్లీ: రుణంపై రెండో ఇల్లు కొని, దానికి కడుతున్న వడ్డీ, వస్తున్న అద్దెల మధ్య వ్యత్యాసం (నష్టం)పై పొందుతున్న ఆదాయపు పన్ను మినహాయింపును రూ.2 లక్షలకు పరిమితం చేస్తూ తెచ్చిన నిబంధనను వెనక్కు తీసుకునే ఉద్దేశం తమకు లేదని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. కొందరు రుణంపై రెండో ఇల్లు కొన్నాక దానిని అద్దెకు ఇస్తుంటారు. బ్యాంకులకు కడుతున్న వడ్డీ కన్నా వస్తున్న అద్దె తక్కుగా ఉన్నట్లు చూపించి వాటి వ్యత్యాసాన్ని నష్టంగా పేర్కొంటారు. ఇలా ఎంత మొత్తం నష్టం వచ్చిందో అంత మొత్తానికి ఆదాయపు పన్ను మినహాయింపు లభించేది. ఇక నుంచి నష్టంగా పేర్కొన్న మొత్తంలో గరిష్టంగా రూ.2 లక్షలకు మాత్రమే పన్ను మినహాయింపు ఇస్తారు. -
వారికి 30 శాతానికిపైగా పన్ను మినహాయింపులు
న్యూడిల్లీ: దేశంలో డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించడం ప్రభుత్వ లక్ష్యమని దేశ ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ మరోసారి స్పష్టం చేశారు. మంగళవారం మీడియాతో మాట్లాడిన ఆయన దేశంలో డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించడం ద్వారా భారత్‌ను నగదు రహిత దేశంగా మార్చేందుకు ప్రభుత్వం ఎన్నో ప్రయత్నాలను చేస్తోందని తెలిపారు. ఈ క్రమంలో డిజిటల్ లావాదేవీలు జరిపిన వ్యాపారులను పన్ను మినహాయింపు ఇవ్వనున్నట్టు ప్రకటించారు. ప్రభుత్వం ప్రకటించిన తాజా మినహాయింపుల ద్వారా చిన్న వ్యాపారులకు30 శాతానికిపైగా పన్ను మినహాయింపు లభించనుందని తెలిపారు. చిన్న వ్యాపారాలకు ఈ పన్ను ప్రోత్సాహకాలను అందించండంద్వారా నగదు రహిత ఆర్థిక వ్యవస్థకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. డీమానిటైజేషన్ తరువాత ఆర్బీఐ దగ్గర ప్రస్తుతం సరిపడా నగదు నిల్వ ఉందని, ఆధార్ ఆధారిత లావాదేవీలు సుమారు 300 శాతానిపై గా పెరిగాయని జైట్లీ తలిపారు. కాగా చిరు వ్యాపారులు, రూ.2కోట్లు కంటే ఆదాయం తక్కువగా ఉన్న వ్యాపారులు తమ వినియోగదారులను డిజిటల్ లావాదేవీల దిశగా ప్రోత్సహిస్తే వారికి పన్నులో కొంత మినహాయింపు ఉంటుందని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) సోమవారం ప్రకటించింది. ఆదాయ పన్ను చట్టం 1961లోని సెక్షన్ 44ఏడీ ప్రకారం రూ.2కోట్లు, అంతకంటే తక్కువ ఆదాయం ఉన్న వారు 8శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అయితే వ్యాపారులు 2016-17 ఆర్థిక సంవత్సరానికి గాను పూర్తిగా డిజిటల్ లావాదేవీలు జరిపితే వారికి పన్నులో కొంత రాయితీ ఇచ్చి ఆరు శాతం మాత్రమే వసూలు చేయనున్నట్లు ప్రకటించింది. ఎవరైతే నగదు లావాదేవీలు నిర్వర్తిస్తారో వారి వద్ద నుంచి యథావిధిగా 8శాతం పన్ను వసూలు చేయనున్నట్లు దీనికి సంబంధించి 2017 ఆర్థిక బిల్లులో మార్పులు చేసినట్లు సీబీడీటీ వెల్లడించిన సంగతి తెలిసిందే. -
'రూ. 3 లక్షల కోట్ల దానం.. అందుకోసం కాదు'
శాన్ఫ్రాన్సిస్కో: భవిష్యత్ తరాలకు మెరుగైన వసతుల కల్పన కోసం ఫేస్బుక్ సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ ఈ కంపెనీలోని తన వాటాలో 99 శాతం షేర్లను దానం చేయాలని నిర్ణయించడంపై ప్రశంసలతో పాటు విమర్శలూ వచ్చాయి. పన్నుల నుంచి మినహాయింపులు పొందేందుకు ఈ మార్గాన్ని ఎంచుకున్నారన్న విమర్శలపై జుకర్‌బర్గ్ స్పందించారు. విరాళంగా ఇవ్వడం ద్వారా తాను కాని, తన భార్య ప్రిసిల్లా చాన్ కాని ఎలాంటి పన్ను మినహాయింపులు పొందబోమని స్పష్టం చేశారు. తమ షేర్లను అమ్మినపుడు ఇతరుల మాదిరిగా పన్నులు చెల్లిస్తామని జుకర్‌బర్గ్ తన ఫేస్బుక్ పేజీలో పోస్ట్ చేశారు. ఫేస్బుక్ మొత్తం విలువ 19.63 లక్షల కోట్లు కాగా ఇందులో జుకర్‌బర్గ్ వాటా 24 శాతం. ఇందులో 99 శాతం షేర్లను (దాదాపు రూ. 3 లక్షల కోట్లు) సమాజసేవకు వినియోగిస్తానని జుకర్‌బర్గ్ ప్రకటించిన విషయం తెలిసిందే. విద్య, మనుషుల శక్తి సామర్థ్యాలను పెంచేందుకు, వ్యాధులకు చికిత్స చేసేందుకు ఈ మొత్తాన్ని వినియోగించనున్నట్టు తెలిపారు.