అంబానీకి 1,121 కోట్ల లబ్ధి! | Anil Ambani firm got 143.7 mn euro tax waiver after Rafale deal | Sakshi
Sakshi News home page

అంబానీకి 1,121 కోట్ల లబ్ధి!

Published Sun, Apr 14 2019 3:59 AM | Last Updated on Sun, Apr 14 2019 10:17 AM

Anil Ambani firm got 143.7 mn euro tax waiver after Rafale deal - Sakshi

న్యూఢిల్లీ: ఫ్రాన్స్‌తో రఫేల్‌ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందంపై ప్రతిపక్షాల విమర్శల వేడి చల్లారకముందే రియలన్స్‌ కంపెనీకి కొత్త చిక్కు వచ్చిపడింది. అనిల్‌ అంబానీకి చెందిన రిలయన్స్‌ కమ్యూనికేషన్స్‌ అనుబంధ సంస్థ ‘రిలయన్స్‌ ఫ్లాగ్‌ అట్లాంటిక్‌ ఫ్రాన్స్‌’కు ఫ్రెంచి ప్రభుత్వం రూ.1,121.18 కోట్లు(14.37 కోట్ల యూరోల) పన్నును మినహాయించినట్లు ‘లా మాండే’ అనే ఫ్రాన్స్‌ పత్రిక ఓ కథనాన్ని ప్రచురించింది. ఫ్రాన్స్‌ నుంచి 36 రఫేల్‌ యుద్ధ విమానాల కొనుగోలుకు భారత్‌ ఒప్పందాన్ని కుదర్చుకున్న కొన్ని నెలలకే ఫ్లాగ్‌ అట్లాంటిక్‌కు ఈ మినహాయింపు లభించిందని తెలిపింది. దీంతో మోదీ ఆశీర్వాదంతోనే ఈ పన్ను మినహాయింపులు లభించాయని కాంగ్రెస్‌ దుమ్మెత్తిపోయగా,  రఫేల్‌ ఒప్పందం–రిలయన్స్‌ పన్ను మినహాయింపునకు లంకె పెట్టడం సరికాదని కేంద్రం స్పష్టం చేసింది. అనిల్‌కు చెందిన రిలయన్స్‌ డిఫెన్స్‌ సంస్థ రఫేల్‌ యుద్ధవిమానాలు తయారుచేసే డసో ఏవియేషన్‌కు భారత్‌లో ఆఫ్‌సెట్‌ భాగస్వామిగా ఉంది.

రఫేల్‌ ఒప్పందం కుదరగానే..
ఫ్లాగ్‌ అట్లాంటిక్‌ 2007–10లో రూ.468.14 కోట్ల(60 మిలియన్‌ యూరోలు) పన్నును చెల్లించాల్సి ఉన్నట్లు ఫ్రాన్స్‌ ఐటీ అధికారుల విచారణలో తేలిందని ‘లా మాండే’ కథనంలో తెలిపింది. ‘ఈ విషయమై ఫ్రెంచ్‌ అధికారులు కంపెనీకి నోటీసులు జారీచేశారు. దీంతో తాము సెటిల్మెంట్‌లో భాగంగా 56.95 కోట్లు (7.3 మిలియన్‌ యూరోలు) చెల్లిస్తామని ఫ్లాగ్‌ అట్లాంటిక్‌ సంస్థ ప్రతిపాదించింది. కానీ దీన్ని అధికారులు తిరస్కరించారు. ఈ వ్యవహారంలో మరింత లోతుగా విచారణ జరిపిన అధికారులు 2010–12 మధ్యకాలంలో మరో రూ.710 కోట్లు(91 మిలియన్‌ యూరోలు) పన్ను బకాయిలు ఉన్నట్లు గుర్తించారు.

ఈ మొత్తం రూ.1,178 కోట్లుగా తేలింది. అయితే 2015, ఏప్రిల్‌ 10న భారత ప్రధాని మోదీ అప్పటి ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్‌ హోలాండేతో 36 రఫేల్‌ ఫైటర్‌జెట్ల కోసం ఒప్పందం కుదర్చుకున్నారు. ఇది జరిగిన 6 నెలలకు అంటే.. 2015, అక్టోబర్‌లో ఫ్రాన్స్‌ అధికారులు అనూహ్యంగా రిలయన్స్‌ ప్రతిపాదించిన రూ.56.95 కోట్ల(7.3 మిలియన్‌ యూరోల) పన్ను సెటిల్మెంట్‌కు అంగీకరించారు. ఫ్లాగ్‌ అట్లాంటిక్‌కు రూ.1,121 కోట్ల లబ్ధిని చేకూర్చారు’ అని లా మాండే వెల్లడించింది. ఫ్లాగ్‌ అట్లాంటిక్‌ సంస్థకు ఫ్రాన్స్‌లో కేబుల్‌ నెట్‌వర్క్‌తో పాటు టెలికాం సేవలందించే మౌలికవసతులు ఉన్నాయని పేర్కొంది.

అంతా మోదీ ఆశీర్వాదమే: విపక్షాలు
ఫ్రాన్స్‌ అధికారులు రిలయన్స్‌ అనుబంధ సంస్థకు రూ.1,121.18 కోట్ల లబ్ధి చేకూర్చడంపై ప్రతిపక్షాలు కేంద్ర ప్రభుత్వంపై దుమ్మెత్తిపోశాయి. ప్రధాని మోదీ ఆశీర్వాదం, అనుగ్రహం కారణంగానే రిలయన్స్‌కు ఈ పన్ను మినహాయింపు లభించిందని కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి రణ్‌దీప్‌ సూర్జేవాలా విమర్శించారు. రఫేల్‌ ఒప్పందంలో మోదీ మధ్యవర్తిగా వ్యవహరించారని దుయ్యబట్టారు. తన స్నేహితుడైన పారిశ్రామికవేత్తకు లబ్ధి చేకూర్చడం కోసం మోదీ రఫేల్‌ ఒప్పందం ద్వారా కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని వృధా చేశారని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మండిపడ్డారు. ఆర్థిక కష్టాలతో అల్లాడుతున్న రైతులు, విద్యార్థులకు రుణాలు ఇవ్వని మోదీ ప్రభుత్వం కార్పొరేట్లకు మాత్రం దోచిపెడుతోందని సీపీఐ నేత డి.రాజా విమర్శించారు. ఈ రఫేల్‌ ఒప్పందాన్ని అంగీకరించలేకే మాజీ రక్షణమంత్రి, దివంగత మనోహర్‌ పరీకర్‌ తన పదవికి రాజీనామా చేశారని ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌ ఆరోపించారు.

రాజకీయ జోక్యం లేదు: ఫ్రాన్స్‌
రిలయన్స్‌ ఫ్లాగ్‌ అట్లాంటిక్‌ సంస్థకు పన్ను మినహాయింపులో ఎలాంటి రాజకీయ జోక్యం లేదని ఫ్రాన్స్‌ ప్రకటించింది. రిలయన్స్‌ అనుబంధ సంస్థ నిబంధనల మేరకు ఫ్రెంచ్‌ అధికారులతో సెటిల్మెంట్‌ చేసుకుందని తెలిపింది. ఈ ప్రక్రియ చట్టబద్ధంగా ఫ్రాన్స్‌ నియంత్రణ సంస్థ పర్యవేక్షణలో సాగిందని పేర్కొంది. ఈ మేరకు ఢిల్లీలోని ఫ్రాన్స్‌ ఎంబసీ ఓ ప్రకటనను విడుదల చేసింది.

చట్టాలకు లోబడే..
ఈ వివాదంపై రిలయన్స్‌ కమ్యూనికేషన్స్‌ ప్రతినిధి స్పందిస్తూ.. ‘ఫ్రాన్స్‌ అధికారులు రూ.1,178 కోట్లు చెల్లించాలని మమ్మల్ని కోరడం పూర్తిగా చట్టవ్యతిరేకం. గడచిపోయిన పదేళ్ల కాలానికి గానూ ఈ మొత్తాన్ని చెల్లించాలని కోరారు. కానీ అప్పటికే రిలయన్స్‌ అట్లాంటిక్‌ సంస్థ రూ.20 కోట్ల నష్టాల్లో నడుస్తోంది. ఈ నేపథ్యంలో ఫ్రాన్స్‌ చట్టాలకు లోబడి రూ.56.95 కోట్లు (7.3 మిలియన్‌ యూరోలు) చెల్లించి సెటిల్మెంట్‌ చేసుకున్నాం’ అని తెలిపారు. మరోవైపు ఈ పన్ను మినహాయింపునకు, రఫేల్‌ ఒప్పందాన్ని ముడిపెట్టి ఊహాజనిత కథనాలు రాయడం దురదృష్టకరమని భారత రక్షణశాఖ విమర్శించింది. రఫెల్‌ ఒప్పందానికి, రిలయన్స్‌ పన్ను సెటిల్మెంట్‌కు సంబంధం లేదంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement