వారికి 30 శాతానికిపైగా పన్ను మినహాయింపులు
న్యూడిల్లీ: దేశంలో డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించడం ప్రభుత్వ లక్ష్యమని దేశ ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ మరోసారి స్పష్టం చేశారు. మంగళవారం మీడియాతో మాట్లాడిన ఆయన దేశంలో డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించడం ద్వారా భారత్‌ను నగదు రహిత దేశంగా మార్చేందుకు ప్రభుత్వం ఎన్నో ప్రయత్నాలను చేస్తోందని తెలిపారు. ఈ క్రమంలో డిజిటల్ లావాదేవీలు జరిపిన వ్యాపారులను పన్ను మినహాయింపు ఇవ్వనున్నట్టు ప్రకటించారు. ప్రభుత్వం ప్రకటించిన తాజా మినహాయింపుల ద్వారా చిన్న వ్యాపారులకు30 శాతానికిపైగా పన్ను మినహాయింపు లభించనుందని తెలిపారు. చిన్న వ్యాపారాలకు ఈ పన్ను ప్రోత్సాహకాలను అందించండంద్వారా నగదు రహిత ఆర్థిక వ్యవస్థకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. డీమానిటైజేషన్ తరువాత ఆర్బీఐ దగ్గర ప్రస్తుతం సరిపడా నగదు నిల్వ ఉందని, ఆధార్ ఆధారిత లావాదేవీలు సుమారు 300 శాతానిపై గా పెరిగాయని జైట్లీ తలిపారు.
కాగా చిరు వ్యాపారులు, రూ.2కోట్లు కంటే ఆదాయం తక్కువగా ఉన్న వ్యాపారులు తమ వినియోగదారులను డిజిటల్ లావాదేవీల దిశగా ప్రోత్సహిస్తే వారికి పన్నులో కొంత మినహాయింపు ఉంటుందని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) సోమవారం ప్రకటించింది. ఆదాయ పన్ను చట్టం 1961లోని సెక్షన్ 44ఏడీ ప్రకారం రూ.2కోట్లు, అంతకంటే తక్కువ ఆదాయం ఉన్న వారు 8శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అయితే వ్యాపారులు 2016-17 ఆర్థిక సంవత్సరానికి గాను పూర్తిగా డిజిటల్ లావాదేవీలు జరిపితే వారికి పన్నులో కొంత రాయితీ ఇచ్చి ఆరు శాతం మాత్రమే వసూలు చేయనున్నట్లు ప్రకటించింది. ఎవరైతే నగదు లావాదేవీలు నిర్వర్తిస్తారో వారి వద్ద నుంచి యథావిధిగా 8శాతం పన్ను వసూలు చేయనున్నట్లు దీనికి సంబంధించి 2017 ఆర్థిక బిల్లులో మార్పులు చేసినట్లు సీబీడీటీ వెల్లడించిన సంగతి తెలిసిందే.