డెబిట్ కార్డుల వ్యవహారంలో కేంద్రం సీరియస్
న్యూఢిల్లీ: వివిధ బ్యాంకుల లక్షలాది డెబిట్ కార్డుల డాటా లీక్ వహారంపై కేంద్ర ప్రభుత్వం సీరియస్ గా స్పందించింది. వెంటనే దీనిపై సమగ్ర నివేదిక సమర్పించాల్సిందిగా బ్యాంకులను ఆదేశించింది. హ్యాకింగ్ పై ఆందోళన వద్దని భరోసా ఇచ్చిన కేంద్రం, బ్యాంకుల నివేదిక రాగానే చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చింది.
32 లక్షల డెబిట్ కార్డుల సెబర్ ఎటాక్ పై రిజర్వ్ బ్యాంకు ను , బ్యాంకులను వివరాలను కోరినట్టు ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ శుక్రవారం ప్రకటించారు. అలాగే సైబర్ నేరాల సమయంలో రక్షణ చర్యల వివరాలను కూడా బ్యాంకులను కోరామని విలేకరులకు తెలిపారు. సైబర్ సెక్యూరిటీ చాలా కీలకమైన విషయం.. భద్రతా ఉల్లంఘన విషయంలో బ్యాంకుల నుంచి వివరణాత్మక నివేదికలను కోరామని కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి శక్తి కాంత్ దాస్ చెప్పారు. విచారణ జరుగుతోందని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.ఈ విషయంలో వినియోగదారులు అందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన హామీ ఇచ్చారు.
కాగా దాదాపు 32 లక్షల కార్డులు డేంజర్ జోన్ లోపడ్డాయన్న వార్తలు ప్రకంపనలు పుట్టించాయి. మరోవైపు దాదాపు అన్ని బ్యాంకులు ఏటీఎం పిన్ నెంబర్లు మార్చుకోవాల్సిందిగా ముందస్తు హెచ్చరికలు జారీ చేసిన సంగతి తెలిసిందే.