బ్లాక్‌మనీ దాచారో జాగ్రత్త!
ప్రధాని మోదీ హెచ్చరిక
న్యూఢిల్లీ : నల్లధనం వెల్లడి పథకాన్ని వినియోగించుకోకుండా.. తప్పించుకోవాలని చూసే వారిపై జైలుశిక్షసహా కఠిన చర్యలు తప్పవని ప్రధాని నరేంద్రమోదీ శనివారం హెచ్చరించారు. ‘నల్లధనాన్ని దాచుకొని ప్రజలు నిద్రలేని రాత్రులెందుకు గడపాలి? సెప్టెంబర్ 30 తర్వాత 125 కోట్ల ప్రజలు ప్రశాంతంగా నిద్రపోవడం నాకు కావాలి’ అని అన్నారు. జూన్ 1న ప్రారంభమై సెప్టెంబర్ 30న ముగుస్తున్న ఈ వన్-టైమ్ సెటిల్‌మెంట్ పథకం ప్రకారం 45% పన్ను చెల్లింపుతో ప్రాసిక్యూషన్ నుంచి మినహాయింపు పొందే వీలున్న సంగతి తెలిసిందే. అఖిల భారత రత్నాలు, ఆభరణాల వాణిజ్య సమాఖ్య (జీజేఎఫ్) ఏర్పాటు చేసిన ఒక సన్మాన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ఆభరణాలు, రియల్టీ విభాగాల్లో అధికంగా నల్లధనం ఉందని, అలాంటి వ్యక్తులు 45 % పన్ను చెల్లింపుల ద్వారా ప్రశాంతంగా నిద్రపోవచ్చని సూచించారు. కాగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన పసిడి డిపాజిట్, గోల్డ్ బాండ్ల పథకాలను ప్రజలు వినియోగించుకోవాలన్నారు..
క్రీడలతో జాతీయ సమైక్యత
దేశంలో క్రీడల అభివృద్ధి వల్ల జాతీయ సమైక్యత వర్ధిల్లుతుందని ప్రధాని మోదీ అభిప్రాయపడ్డారు. ఆరోగ్యంగా ఉండేందుకు యువత క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలని పిలుపునిచ్చారు. రిలయన్స్ ఫౌండేషన్ యూత్ స్పోర్ట్స్ ఆవిష్కరణలో మోదీ మాట్లాడుతూ... ‘మనిషి సంపూర్ణ ఎదుగుదలకు క్రీడలు ఉపయోగపడడమే కాకుండా పోరాటాన్ని నేర్పుతాయి’ అని వ్యాఖ్యనించారు.
ఎక్కడ ఉందో తెలుసు: జైట్లీ
కాగా శనివారం బెంగళూరులో జరిగిన మరో కార్యక్రమంలో ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ మాట్లాడుతూ నల్లధనం ఏ రంగాల్లో దాగున్నదీ తమకు తెలుసన్నారు. ప్రభుత్వ పరిశీలన, శిక్ష వరకు రానీయకుండా ముందే జాగ్రత్తపడాలని హెచ్చరించారు.