ఎన్డీఏ ప్రభుత్వం మూడోసారి ఏర్పడిన తర్వాత జరిగిన తొలి పార్లమెంట్ సమావేశాలు బుధవారం(జులై 3)తో ముగిశాయి. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ప్రధాని మోదీ రాజ్యసభలో మాట్లాడారు. ప్రధాని మాట్లాడుతుండగా విపక్ష సభ్యులు ఆందోళన చేస్తూ సభ నుంచి వాకౌట్ చేశారు. దీంతో ప్రధాని తన ప్రసంగాన్ని కొద్దిసేపు ఆపారు.
విపక్షాల వాకౌట్‌పై ప్రధాని మోదీతో పాటు రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రతిపక్ష సభ్యులు సభా మర్యాదను విడిచి వెళ్లారన్నారు. కాసేపటి తర్వాత ప్రధాని తన ప్రసంగాన్నితిరిగి కొనసాగించారు. ప్రధాని మాట్లాడటం పూర్తయిన తర్వాత రాజ్యసభను చైర్మన్ నిరవధిక వాయిదా వేశారు. లోక్‌సభ మంగళవారమే నిరవధిక వాయిదా పడటంతో కేంద్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలిసారి జరిగిన పార్లమెంట్ ప్రత్యేక సెషన్ ముగిసినట్లయింది.
కాంగ్రెస్‌పై మళ్లీ విమర్శల దాడి..
రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై మాట్లాడుతూ ప్రధాని మరోసారి కాంగ్రెస్‌పై విమర్శల దాడి చేశారు. దాదాపు 60 ఏళ్ల తర్వాత దేశంలో పదేళ్లపాటు అధికారంలో ఉన్న పార్టీ వరుసగా మూడోసారి పవర్‌లోకి వచ్చిందన్నారు. ఇది సాధారణ విషయం కాదన్నారు. మళ్లీ తామే అధికారంలోకి రావడంతో కొందరు అసంతృప్తిగా ఉన్నారని కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
ఫలితాలు వచ్చినప్పటి నుంచి ఓ నేత తమను మూడోవంతు ప్రభుత్వం అని విమర్శిస్తున్నారని ప్రధాని అన్నారు.. ఇది నిజమేనని, తాము మరో 20 ఏళ్లు అధికారంలో ఉంటామన్నారు. తమ పాలనలో కేవలం మూడవ వంతు మాత్రమే ఇప్పటికి పూర్తయిందన్నారు.
ప్రతిపక్షాల హయాంలో రిమోట్ కంట్రోల్ పాలన నడిచిన విషయాన్ని ప్రధాని గుర్తు చేశారు. ఆర్థిక వ్యవస్థవృద్ధిలో భారత్‌ను ప్రపంచంలో పది నుంచి ఐదో స్థానానాకి తీసుకువచ్చామని, భవిష్యత్తులో మూడో స్థానానికి చేరుస్తామని ప్రధాని చెప్పారు.
మణిపూర్, నీట్‌లపై స్పందించిన ప్రధాని..
మణిపూర్, నీట్ అంశాలపై సమావేశాల తొలి రోజు నుంచి విపక్షాలు చర్చకు పట్టుపట్టడంతో ప్రధాని రాజ్యసభలో ఈ అంశాలపై స్పందించారు. మణిపూర్‌లో శాంతి స్థాపనకు ప్రభుత్వం కృషి చేస్తోందని, దీనిపై రాజకీయాలు చేయొద్దని సూచించారు.
నీట్ పరీక్ష పేపర్ లీకేజీపైనా ప్రధాని మాట్లాడారు. నీట్‌లో అక్రమాలకు పాల్పడినవారిని ప్రభుత్వం వదిలిపెట్టదన్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
సుధామూర్తికి ప్రశంసలు..
దాత, రచయిత్రి, ఇన్ఫోసిస్ ఫౌండర్ నారాయణమూర్తి సతీమణి సుధామూర్తి మంగళవారం రాజ్యసభలో చేసిన ప్రసంగంపై ప్రధాని బుధవారం సభలో ప్రశంసలు కురిపించారు.
సుధామూర్తి దేశంలో మహిళల ఆరోగ్యానికి సంబంధించి విలువైన సూచనలిచ్చారని కొనియాడారు. తమ ప్రభుత్వం గత పదేళ్లలో మహిళల కోసం ఎన్నో ఆరోగ్య, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసిందని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment