250 ర్యాలీలు, 500 ప్రెస్మీట్లు
న్యూఢిల్లీ: ఓ వైపు ప్రధాని నరేంద్రమోదీ విదేశీ పర్యటనల్లో బిజీగా ఉంటే మరోవైపు భారతీయ జనతా పార్టీ వార్షికోత్సవ సన్నాహాల్లో బిజీబిజీగా ఉంది. కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఏడాది పూర్తి అవుతున్న సందర్భంగా సంబరాలను ఘనంగా నిర్వహించేందుకు బీజేపీ సమాయత్తమవుతోంది . భారీ ఎత్తున ప్రదర్శనలు, మీడియా సమావేశాలతో హల్చల్ చేసేందుకు సిద్ధం అవుతోంది. దేశవ్యాప్తంగా దాదాపు 250 ర్యాలీలు, 500 ప్రెస్మీట్లు పెట్టి విస్తృతంగా తమ ప్రభుత్వ విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని బీజేపీ యోచిస్తోంది.
ప్రతీ రెండు లోక్సభ నియోజవర్గాల్లో ఒకటి చొప్పున ర్యాలీలు నిర్వహించాలని శ్రేణులకు ఆదేశాలు జారీ అయ్యాయి. అలాగే పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీల ఆధ్వర్యంలో మీడియా సమావేశాలకు నిర్వహణకు ఆదేశాలు అందాయి. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, పర్యావరణ మంత్రి ప్రకాష్ జవదేకర్, మరో కేంద్రమంత్రి అనంత్ కుమార్ తదితరులు ఈ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.
ఈ క్రమంలోనే జనధన్ యోజన పథకం కింద మే 9న పీఎం సురక్షా యోజన, పీఎం జీవన జ్యోతి యోజన, అటల్ పెన్షన్ యోజన్ పథకాలను ప్రారంభించటంతో పాటు, లాగే కొన్ని పుస్తకాలు, ఈ-బుక్స్ విడుదల చేయనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ సందర్భంగా భారీ బహిరంగ సభలో ప్రధాని మోదీ పాల్గొంటారని అయితే వేదిక ఇంకా ఖరారు కాలేదని పేర్కొన్నాయి.
ప్రధాని మోదీ దీనికి సంబంధించి ఇటీవల జరిగిన పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీలకు స్పష్టమైన ఆదేశాలిచ్చారు. మే 26 నుంచి 30 వరకు ఆయా నియోజకవర్గాల్లో పర్యటించి కేంద్రం చేపట్టిన కార్యక్రమాలు, పథకాలపై అవగాహన కల్పించాలని సూచించారు.